కోలిన్ మెకంజీ

(మెకంజీ నుండి దారిమార్పు చెందింది)

కల్నల్ కోలిన్ మెకంజీ (ఆంగ్లం: Colonel Colin Mackenzie) (1754 - 1821) ప్రముఖ ఆంగ్లేయ అధికారి, భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్.

కోలిన్ మెకంజీ.
Colin Mackenzie

1797లో అమరావతి పట్టణం దర్శించిన కోలిన్ మెకంజీ అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ . దీనితో అమరావతి చరిత్ర అంతర్జాతీయం ప్రసిద్ధిచెందినది.

మెకంజీ జననము 1754 వ సంవత్సరము. స్కాట్ లాండులో. మరణము: 1821 వ సంవత్సరంలో కలకత్తాలో. మెకంజీ 1810 వ సంవత్సరంలో మద్రాసు సర్యేయర్ జనరల్గా నియమింపబడ్డాడు. ఇతను తన కాలంలో సుమారు 1560 తాళ పత్ర గ్రంథాలను సేకరించాడు. ఇంకా పురాతన నాణేలు, పురాతన వస్తువులు సేకరించాడు. చరిత్రకు సంబంధిన వస్తువులను అనేకం సేకరించాడు. ప్రపంచ చరిత్రలో ఇన్ని చారిత్రిక వస్తువులను సేకరించిన వారు మరొకరు లేరు. మెకంజీ మరణానంతరము సి.పి.బ్రౌన్ అన్నింటికి శుద్ద ప్రతులు రాయించారు. వాటినే మెకంజీ కైపీయత్తులూ అంటున్నారు.

మెకంజీ కృషి వల్లె అమరావతి లోని బౌద్ద స్థూపము వెల్లడయింది. 1792 లో మెకంజి, స్థానికి జమీందారు, అనాటి అమరావతి పాలకుడైన వెంకటాద్రి నాయుడుని కలుసుకొని వివరాలు సేకరించి ప్రచురించాడు. అమారావతి చెందిన పాల రాతి పలకలను వెంకటాద్రి నాయుడు తన భవన నిర్మాణానికి సున్నం తయారు చేయడానికి ఉపయోగిస్తుంటే అడ్డు పడి వాటి ప్రాధాన్యతను జమీందారుకు వివరించి, ఒప్పించి, ఆపించి, వాటి రక్షణకు పూను కున్నాడు. అప్పటి వరకు మిగిలి వున్న పలకలను వాటిపై వున్న శిల్ప కళల ఆధారంగా మొత్తం మహా చైతన్య రూపాన్ని చిత్రించ గలిగాడు. ఆ విధంగా అమరావతి స్తూపం ఆకారం మనం ఇప్పుడు చూడ గలుగుతున్నాము. కాని ఆ శిలా పలకాలలో అధిక భాగం బద్రపరచ డానికి లండన్ లోని ప్రదర్శన శాలకు తరలించ బడ్డాయి.

ఇటు వంటి పురావస్తు సామాగ్రిని సేకరించుటకు బొర్రయ్య అనే ఆతన్ని జీతమిచ్చి నియమించు కొని అనేక వివరాలు సేకరించాడు. ఇతను సేకరించిన వస్తువులను, తాళ పత్ర గ్రంథాలను మద్రాసులోని ప్రాచ్యలిఖిత బాండాగారంలో భద్ర పరిచారు. అవి ఈ నాటికి ప్రదర్శనకు సిద్దంగా వున్నాయి

మరికొంత సమాచారం

మార్చు

మెకంజీ స్కాట్లండుకు పడమరగా వున్న లూయీ అనే ద్వీపంలోని స్టార్నొవే అన్న గ్రామంలో సా.శ. 1754లో జన్మించాడు. తండ్రి మర్దొక్ మెకంజీ. తల్లి బార్బరా మెకంజీ. తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ తన గ్రామంలో పోస్టు మాస్టరుగా వుండేవాడు.

స్టార్నొవేలోని బడిలో చదువు సాగించాడు కాలిన్ మెకంజీ. గణితంపట్ల ఆసక్తి ఎక్కువగా వుండేది. కొంతకాలం స్టార్నొవేలోనే పన్నులు వసూలు చేయు ఆఫీసులో గుమస్తాగా పనిచేశాడు మెకంజీ జాన్ నేపియర్ అను సంపన్నుడు మెకంజీని తనకు సహాయకుడుగా వేసుకొన్నాడు. నేపియర్ పూర్వీకులలో గొప్పవాడైన జాన్ నేపియర్ చరిత్ర వ్రాయుటకు కావలసిన ఆధారాలన్నీ సేకరించాడు. జాన్ నేపియర్ గణిత శాస్త్రమునకు చాలా అవసరమైన "సంవర్గమానములు" లోగరిథమ్స్ కనిపెట్టాడు. విషయ సేకరణలో మెకంజీ అతనికి బాగా తోడ్పడినాడు. అప్పుడే భారతీయ గణిత శాస్త్ర విషయం తెలుసుకున్నాడు.

నేపియర్ చనిపోయిన తర్వాత మెకంజీ 1782 లో మదరాసుకు వచ్చాడు. ఈస్టిండియా కంపెనీ వారు ఇతనికి ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగమిచ్చారు. నేపియర్ అల్లుడు శామ్యూయల్ జాన్‌స్టన్ అపుడు మధురలో కంపెనీ ఉద్యోగిగా వుండేవాడు. జాన్‌స్టన్ కోరికమేరకు మధురలో కొంతకాలం ఉన్నాడు. అచటి పండితులతో స్నేహం చేసి భారతదేశ చరిత్రకు కావలసిన కొంత సామగ్రిని సంపాదించాడు.

ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగి కావున కంపెనీ వారి సైన్యంతాపాటు దిండిగల్లు, కోయంబత్తూరు మున్నగు చోట్ల పనిచేశాడు. 1784-90 సం.ల మధ్య సర్కారు - రాయలసీమ ప్రాంతాలలో పనిచేశాడు. నెల్లూరు నుండి తూర్పు కనుమల ద్వారా రాయలసీమ ప్రాంతానికి రహదారి మార్గాల నమూనాలతో దేశపటాలు తయారు చేశాడు. కొంతకాలం గుంటూరు ప్రాంతంలో పనిచేశాడు. తన పనిని ఎంతో శ్రద్ధతో, తెలివితేటలతో చేసినందుకు మెచ్చుకొన్న కంపెనీవారు మెకంజీని గుంటూరు సీమ సర్వే చేయుటకు 1790లో అధికారిగా నియమించారు. 1792 లో టిప్పు సుల్తాన్ యొక్క శ్రీరంగపట్నంపై కారల్ వాలిస్ దాడి చేశాడు. అప్పుడు మెకంజీ కంపెనీ సైన్యపు ఇంజనీర్ గా పనిచేశాడు. కారన్ వాలిస్, మెకంజీని దత్త మండలాల (నేటి రాయలసీమ) తో పాటు నెల్లూరు సీమ సర్వే చేయుటకు నియమించాడు. రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన దేశపటాన్ని, నైసర్గిక పటాన్ని మొట్ట మొదట తయారు చేసిన వాడు మెకంజీ.

ఈ సర్వే పనులలో భాగంగా దేశమంతా సంచారం చేశాడు. సుందరమైన దేవాలయాలను చూచాడు. శాసనాలపట్ల ఆసక్తిని మరింత పెంచుకొన్నాడు. ఆ కాలంలోనే ఏలూరులో వుండిన కావలి వెంకట సుబ్బయ్యగారి కుమారులతో మెకంజీకి పరిచయం కలిగింది. వారు వెంకట నారాయణ, వెంకట బొర్రయ్య, వెంకట రామస్వామి, సీతయ్యగార్లు. వీరిలో బొర్రయ్య గొప్ప తెలివితేటలు గలవాడు. మెకంజీ యువకుడైన బొర్రయ్య సహాయంతో తెలుగు, కన్నడ శాసనాలలోని విషయాలను తెలుసుకొన్నాడు. గ్రామ చరిత్రలను వ్రాయుటకు, తాళపత్ర గ్రంథాలను సేకరించుటకు చరిత్ర కుపయోగించు నాణెములను సేకరించుటకు బొర్రయ్యకు వేతన మిచ్చి వినియోగించుకొన్నాడు. బొర్రయ్య 27 ఏళ్ళ ప్రాయంలోనే చనిపోయాడు. ఆ వయస్సులోనే బొర్రయ్య చాలా విషయాలు సేకరించాడు. బొర్రయ్య తమ్ముడు లక్ష్మయ్య మెకంజీకి సహాయకుడయ్యాడు.

1810 లో మెకంజీ మదరాసు ప్రాంత సర్వేయర్ జనరల్ గా నియమింపబడినాడు. 1811-15 లో జావా ద్వీప ఆక్రమణకు వెళ్ళిన సైన్యంలోని ఇంజనీర్లకు అధికారిగా వెళ్ళాడు.

1816లో భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్ గా నియమింపబడినాడు.

1793 నుండి 1816 వరకు దక్షిణ భారతదేశంలో ఉద్యోగం చేసినపుడు మెకంజీ తాళపత్ర గ్రంథాలు, వ్రాతప్రతులు 1560 వరకు సేకరించాడు. ఇవికాక అతని సేకరణలో ప్రధానమైనవి. 1) స్థానిక చరిత్రలు : 2070 2) శాసన పాఠాలు : 8076 3) దేశ పటాలు : 79 4) బొమ్మలు : 2630 (డ్రాయింగ్స్) 5) నాణెములు : 6218 6) శిల్ప చిత్రాలు : 106 7) పురాతన వస్తువులు : 40

మెకంజీ గురించి చెప్పేటప్పుడు బొర్రయ్యను మరవలేము. కంపెని కొలువు కోసం బొర్రయ్య మచిలీపట్నంలో హిందూస్థాని, పర్షియన్, ఆంగ్ల భాషలను బాగా నేర్చుకున్నాడు. జైనుల వృత్తాంతం, మొఘలుల తర్వాత కర్ణాటక మందలి సంఘటనలు అను రచనలను ఆంగ్లంలో చేశాడు. మెకంజీ బొర్రయ్య నెంతగానో ఆదరించాడు. తన ఆస్తిలో కొంత భాగం బొర్రయ్యకు చెందునట్లు వీలునామా వ్రాశాడు. బొర్రయ్య తమ్ముడు కావలి వెంకట రామస్వామి మొట్టమొదటిసారి దక్కన్ కవుల జీవిత చరిత్రలు వ్రాశాడు. తెలుగు కవుల జీవిత చరిత్రలను గ్రంథస్థం చేసిన వారిలో మొదటి వాడాయన.

మెకంజీ సొంత పైకం 15 వేల రూపాయలు ఖర్చుచేసి తాళపత్రాలు, శాసనాలు, నాణెములు మున్నగువాటిని సేకరించాడు. మెకంజీ సేకరణలను అతని మరణానంతరం కంపెని పరంగా వారన్ హేస్టింగ్స్ 10 వేల డాలర్లకు కొన్నాడు.

మెకంజీ కృషి వల్లనే అమరావతిలో బౌద్ధ స్థూపమున్న విషయం వెల్లడైంది. 1792లో అమరావతిని దర్శించిన మెకంజీ వెంకటాద్రి నాయుడు గారిని కలుసుకొని, అమరావతి స్థూపము యొక్క వర్ణనము ఏషియాటిక్ సొసైటీ వారి సంపుటాలలో ప్రచురించాడు. హైందవ విజ్ఞాన మందిరానికి కావలి బొర్రయ్య అను మహాద్వారము నాకు లభించెనని మెకంజీ వ్రాశాడు.

వారన్ హేస్టింగ్స్ సంస్కృతం, అరబ్బి, పారసీ, జపనీస్, బర్మీస్ భాషలలోని తాళ గ్రంథాలను, శిల్పాలు, నాణెములు మున్నగు వాటిని ఇంగ్లాండుకు పంపాడు. దక్షిణ భారత దేశ భాషలలోని స్థానిక చరిత్రలు, తాళ పత్రాలు మున్నగునవి 5, 31255 ఇవన్నీ మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో భద్ర పరచబడినాయి. దాదాపు 40 ఏళ్ళు మన చరిత్రకు కావలసిన వస్తు సామగ్రిని సేకరించినవారు మరొకరు లేరు. మెకంజీ 1821లో కలకత్తాలో చనిపోయాడు. నలభై ఏళ్ళ తర్వాత మెకంజీ సేకరించిన కైఫీయత్తులలో చాలవాటికి శుద్ధ ప్రతులు వ్రాయించి ఆ గ్రంథాలను మన కిచ్చిన మరో మహనీయుడు సి.పి.బ్రౌన్.

మూలాలు

మార్చు
  • W. C. Mackenzie: Colonel Colin Mackenzie, first Surveyor-General of India. Edinburgh: W&R Chambers, 1952

బయటి లింకులు

మార్చు