మోరేశ్వర్ ప్రధాన్

బొంబాయి హైకోర్టులో న్యాయవాది మోరేశ్వర్ ప్రధాన్ . నానాచందోర్కర్ ద్వారా సాయిబాబా గొప్పతనం గురించి విని ప్రధాన్ శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు . బాబాను మొదటిసారి లిండీతోట దగ్గర దర్శించి నమస్కరించాడు . ప్రధాన్ ఆ తర్వాత పళ్ళు, పూలు తీసుకుని మసీదుకు వెళ్లి బాబాకు వాటిని సమర్పించాడు . బాబాను చూడగానే బాబా ఎంతో గొప్ప మహాత్ముడని ప్రధాన్ కు అర్ధమైంది .

ప్రధాన్ బాబాకు దక్షిణగా సమర్పించడానికి ఇరవై వెండి రూపాయి నాణాలను తనతో తీసుకుని వెళ్ళాడు . కానీ బాబాకు వాటి బదులు ఒక బంగారు నాణాన్ని దక్షిణగా యిచ్చాడు . బాబా దానిని తీసుకుని, "దీని విలువ ఎన్ని రూపాయలు ?"అన్నారు . పదిహేను రూపాయలని సమాధానం చెప్పాడు ప్రధాన్ . అప్పుడు సాయి ఆ బంగారు నాణాన్ని తిరిగి ప్రాధాన్ కు ఇచ్చి ఇరవై రూపాయి నాణాలను అడిగి దక్షిణగా తీసుకున్నారు . అలా ప్రధాన్ మొదట సమర్పించాలకున్న ఇరవై రూపాయాలనే బాబా తీసుకున్నారు . బాబాకు తన మనస్సులోని విషయాలు తెలిసిపోతాయని ప్రధాన్ కు అనుభవమైంది .

మర్నాడు ప్రధాన్ బాబాకు భిక్ష సమర్పించు కోవాలనుకున్నాడు . భిక్షకు పూర్ణపు పోళీలను వండించమని బాబా చెప్పి బాబు అనే భక్తుడిని అతిధిగా పిలువమన్నారు . "భిక్షకు నేను కూడా వస్తానులే !" అని ప్రధాన్ కు అభయమిచ్చారు సాయి . మరునాడు భిక్షకు వంటకాలు సిద్ధమయ్యాక బాబాకు ఒక ప్రత్యేకమైన కంచంలో భిక్షను వడ్డించగానే ఒక కాకి అకస్మాత్తుగా వచ్చి ఒక పోళీ తీసుకుని ఎగిరిపోయింది . బాబాయే ఆ రూపంలో వచ్చి భిక్ష స్వీకరించారని అందరికీ అర్ధమై అందరూ, "శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై " అని ఆనందంతో పెద్దగా జయకారం చేశారు, బాబా ఏ రూపంలోనైనా వచ్చి తప్పక భిక్ష స్వీకరిస్తారన్నమాట !

ఒక గురువారం రోజు అందరికీ సంతర్పణ చేయడం కోసం బాబా ఒక్కరే ఒక పెద్ద హండాలో వంట చేస్తూ ఉన్నారు . అంత వేడిగా ఉన్న హండాలోని వంటకాన్ని గరిటతో కాకుండా తమ చేతితోనే కలియబెడుతూ ఉన్నారు . అయినా వారి చేయి కొంచెం కూడా కాలలేదు . అగ్ని రూపంలోను, వేడి రూపంలోను సాయియే ఉన్నారు కదా !

ఆయన వంట చేస్తూ ఉండగా ప్రధాన్ మసీదు చేరాడు . బాబా ఎంతో ఆదరించి సంతోషంగా తమలో తామే, మనసులో శ్రీ రాం జయరాం జయజయరాం అని స్మరించు " అనే భావమొచ్చే పాట పాడుతూ ఉన్నారు . అది వినగానే ప్రధాన్ కు ఎంతో ఆనందము ,ఆశ్చర్యము కలిగాయి . ఎందుకంటే కొంతకాలం క్రితం ప్రధాన్ కులగురువైన హరిబువాగారు అతనికి ,"శ్రీరాం జయరాం జయజయరాం "అనే మంత్రముపదేశించి జపించు కోమన్నారు . కొంతకాలం అతడు శ్రద్ధగా జపం చేసుకున్నాడు . కానీ తర్వాత కొనసాగించలేదు . బాబా ఆ నామాన్ని తిరిగి జపించమని సూచించడమే గాక హరిబువా రూపంలో కూడా తామే ఉన్నామని ప్రధాన్ కు అనుభవమిచ్చారు . ప్రధాన్ పారవశ్యంతో బాబా పాదాలకు నమస్కరించాడు . బాబా సకల సాధు స్వరూపి కదా !

మొదటిసారి శిరిడీ దర్శించినపుడు ప్రధాన్ ను వారంరోజులపాటు శిరిడీలోనే ఉంచుకున్నారు సాయి . ఆ మరునాడు బాబా అతనిని బొంబాయి వెళ్ళడానికి అనుమతించారు . కానీ తీవ్రమైన గాలి ,వాన మొదలై కాలువలు పొంగే ప్రమాదమేర్పడింది .అప్పుడు బాబా ,"ఓ భగవంతుడా ,ఈ వర్షాన్ని తగ్గించు ,నా పిల్లలు యింటికి వెళ్లబోతున్నారు . వారు హాయిగా ఇళ్ళకు వెళ్ళేలా సహకరించు " అన్నారు . వెంటనే వర్షం ఆగింది . ప్రధాన్ బొంబాయికి బయలుదేరి క్షేమంగా ఇంటికి చేరాడు . అతడు ఇంటికి వెళ్ళేటప్పటికి ప్రధాన్ తల్లికి ప్రమాదంగా జబ్బు చేసి ఉంది . ప్రధాన్ తాను శిరిడీ నుంచి తీసుకెళ్ళిన ఊదీ, బాబా పాదతీర్ధము యివ్వగానే కొద్దిసేపటికి ఆమె ఆరోగ్యం మెరుగుపడింది . బాబా ఊదీ, పాదతీర్ధమూ అంత శక్తి వంతములన్నమాట .

బాబు అనే భక్తుడు బాబాకు చాలా బాగా సేవ చేసుకునేవాడు . అతడు బాబా సన్నిధిలోనే మరణించాడు . ఒకరోజు శ్రీమతి ప్రధాన్ ను భక్తులకు చూపిస్తూ బాబా, "ఈమె ఎవరో తెలుసా ? మన బాబుకు తల్లి " అన్నారు . గత జన్మలో తన భక్తుడైన బాబును ప్రధాన్ కుమారుడిగా జన్మింపజేశారు సాయి . బాబా ఈ విషయం స్పష్టంగా చెప్పారు . బాబా ఆశీర్వచనం ప్రకారం ప్రధాన్ కు ఒక కొడుకు జన్మించాడు . అతడికి 'బాబు ' అని పేరు పెట్టారు . సాయికి బాబు అంటే చాలా ఇష్టం . బాబును సాయి ఆశీస్సుల కోసం మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చినప్పుడు ఆ బిడ్డను చూచి సాయి ఎంతో సంతోషించి స్వయంగా బర్ఫీ కొని అందరికీ పంచారు . అతి మొదటి పుట్టినరోజుకు కూడా బాబా అలానే చేశారు . ఆ బాబు కోసం ఒక బంగళా కొనమని ప్రధాన్ కు సూచించారు సాయి . ప్రధాన్ బాబా ఆజ్ఞను పాటించాడు . బాబాకు ప్రధాన్ పై ఎంతటి కరుణ ! అంతేకాదు శ్రీమతి ప్రధాన్ తీసుకొచ్చిన వెండి పాదుకలను ఆశీర్వదించి ఆమెకు ప్రసాదించారు . ఒకరోజు ప్రధాన్ కు బాబా కొన్ని సైగలు చేశారు . ఆసైగల కర్ధం, "నీవు దేనికీ భయపడనవసరం లేదు . నేనెప్పుడూ నీ వెంటే ఉన్నాను "అని . అంతటి అభయమివ్వగలవారు మరెవరున్నారు ?