రఘువీర్ పురందరే

రఘువీర్ పురందరే బొంబాయిలో ఒక పేద గుమాస్తా . అతడి జీతం చాలా తక్కువ . అందులోనే పెద్ద కుటుంబాన్ని నిర్వహించు కునేవాడు పురందరే . దాసగణు చెప్పిన హరికథల ద్వారా బాబా సద్గురువని తెలుసుకుని ఆయనను సాధ్యమైనంత త్వరగా దర్శించాలని పురందరే తపించాడు . ఒకరోజు రాత్రి కలలో బాబా కనిపించి అతనిని శిరిడీ రమ్మని పిలిచారు . తన పసిబిడ్డకు ఎంత జబ్బుగా ఉన్నా భయపడకుండా బాబాపై విశ్వాసంతో పురందరే ఆ మరురోజే తన భార్యను, తల్లిని తీసుకుని శిరిడీ దర్శించాడు . బాబా అతనిని రాధాకృష్ణ ఆయీ ఇంట్లో ఉండమన్నారు . ఆమె ప్రోత్సాహంతో శిరిడీలో ఎంతో సేవ చేసుకున్నాడు పురందరే . పురందరే బిడ్డకు శిరిడీ వచ్చిన మూడవ రోజుకే జబ్బు తగ్గింది . బాబా పురందరే 13 రోజులు శిరిడీలోనే ఉంచేశారు . " పురందరేకు, నాకు ఎన్నో జన్మలుగా సంబంధముంది . ఇతనిని నేనెప్పుడూ మరచిపోను . యితడు లేకుండా నేనెప్పుడూ ఏమీ తినను "అన్నారు బాబా .

పురందరే విష్ణుమూర్తిని పూజించేవాడు . అతడిని ఆ ఉపాసననే కొనసాగించమన్నారు బాబా . బాబా తరచుగా పురందరేను రూ . 2 /-లు దక్షిణ అడుగుతూ ఉండేవారు . ఒకసారి బాబా, "నేనడిగినది రూపాయి కాసులు కావు - నిష్ఠ, సబూరీ 'అన్నారు . పురందరే వాతినీ సమర్పించాడు . బాబా ఎప్పుడూ అతన్ని వెంటనే ఉంటానని అభయమిచ్చి ఆశీర్వదించారు . బాబాకు మనం కూడా నిష్ఠ (శ్రద్ధ ), సబూరీ (ఓరిమి ) లను దక్షిణగా సమర్పించడానికి ప్రయత్నిస్తే మనకూ ఆయన రక్షణ ఎప్పుడూ ఉంటుంది .

బాబా తమ భక్తుడైన పురందరేను మాత్రమే గాక అతని కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉండేవారు . ఒకసారి పురందరే భార్యకు దాదర్ లో ఉండగా ప్రమాదంగా జబ్బు చేసింది . అప్పుడు బాబా వారింటి దగ్గర ఉన్న దత్తమందిరం దగ్గర ప్రత్యక్షమై ఆమెకు ఊదీ, తీర్ధము ఇవ్వమన్నారు . అలా చేయగానే ఆమె ఆరోగ్యవంతురాలైంది . మనం బాబాను సేవిస్తే ఆయన మననే గాక మన కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటారన్నమాట!

ఒకసారి పురందరే తల్లి కోరిక మీద కుటుంబసమేతంగా నాసిక్ క్షేత్రానికి బయలుదేరి బాబా ఆశెస్సులు తీసుకున్నాడు . బాబా, "అక్కడ ఒకరోజు గడిపి ఇంటికి వెళ్ళండి "అన్నారు . కాని నాసిక్ చేరగానే అతని తమ్మునికి కలరా వచ్చింది . అతని తల్లి వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని ఎంతగా తొందరపెట్టినా పురందరే మాత్రం బాబా మాటపై విశ్వాసంతో ఒకరోజు తరువాతే ఇంటికి బయలుదేరాడు . అతని తమ్మునికి త్వరలోనే జబ్బు తగ్గిపోయింది . బాబా ఇలా అతనికి ఎన్నో అనుభవాలిచ్చి అతని భక్తి విశ్వాసాలను దృఢపరచారు .

పురందరేకు కోపం ఎక్కువ . బాబా అతనితో, "నీవు ఎవ్వరితోనైనా తగవులాడితే నాకు బాధ కలుగుతుంది . ఎవరినైనా తిట్టినా ఓర్పుగా ఉండు . ఒకటి, రెండు మాటలతో సమాధానం చెప్పు . లేదా అక్కడి నుండి తప్పుకో . తగవును పెంచుకోకూడదు "అన్నారు . మనము ఎవరితోనైనా తగవుపడితే బాబాకు ఇష్టం లేదన్నమాట .

బాబాకు ఒకసారి భక్తులు ఒక పల్లకీని పార్సెల్ చేసి పంపారు . దానిని మూడు నెలల వరకూ అసలు తెరవడానికే ఒప్పుకోలేదు . ఒకసారి పురందరే బాబా వద్దంటున్నా వినకుండా దానిని విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు . ఆ రోజు జరిగే చావడి ఉత్సవంలో బాబాను అందులో ఊరేగింపుగా తీసుకెళ్లాలని అతని సంకల్పం . బాబా అందుకు అస్సలు ఒప్పుకోలేదు . చివరకు భక్తుల బలవంతం మీద తమ పాదుకలను మాత్రం అందులో ఉంచి ఊరేగించడానికి అంగీకరించారు బాబా . అలా ఆ రోజు నుండి 'చావడి ఉత్సవం ' 'పల్లకీ ఉత్సవం 'గా మారింది . బాబా మాత్రం పాదచారియై ఊరేగింపుతో పాటు చావడి చేరారు . ఆ తర్వాత ద్వారకామాయిలో ఆ పల్లకీని భద్రపరచడానికి ఒక గదిని స్వయంగా నిర్మించాడు పురందరే . ఈనాటికీ పల్లకీని ఆ గదిలోనే ఉంచుతారు.

బాబా మహాసమాధి చెందిన తర్వాత అతనికి దర్శనమిచ్చి కాకా దీక్షిత్ తో కలిసి సంస్ధానంలో సేవ చేయమని ఆదేశించారు . అలాగే కాకా దీక్షిత్ కు కూడా దర్శనమిచ్చి పురందరేకు సహకరించమని ఆదేశించారు . వారిద్దరూ కలిసి సంస్ధానంలో సేవ చేసారు . పురందరే బాబా సంస్ధానానికి ఉపకోశాధికారిగా పనిచేశాడు . అలా అతనికి నిరంతర సేవ ప్రసాదించారు బాబా.