రత్తాలు-రాంబాబు

రత్తాలు-రాంబాబు రాచకొండ విశ్వనాథశాస్త్రి రచించిన నవల. మార్క్సిజాన్ని అమితంగా ఇష్టపడే రావిశాస్త్రి, ఈ నవలని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో (1975-77) జైలు జీవితం గడుపుతూ రాశారు.

సంక్షిప్త నవల

మార్చు

అనగనగా ఓ రత్తాలు. శృంగవరపు కోట పక్కనున్న ఓ పల్లెటూళ్ళో ఉండే పెళ్ళికాని పిల్ల. తల్లీ తండ్రీ చనిపోతే, పెద్దమ్మ జాగ్రత్తగా పెంచుతుంది. ఈమె బొత్తిగా అమాయకురాలు. అందగత్తె రత్తాలుకు ఎన్నో పెళ్ళి సంబంధాలు వస్తూ ఉంటాయి. కారణం చెప్పీ, చెప్పకుండానూ వాటిని తిరగ్గొట్టేస్తూ ఉంటుంది పెద్దమ్మ. తన ఈడు వాళ్ళు అప్పుడే పిల్లలని ఎత్తుతూ ఉండడంతో తనకింక పెళ్ళి కాదేమో అన్న బెంగ మొదలవుతుంది రత్తాలుకి. అప్పుడు వస్తాడు, పట్నం నుంచి వాళ్ళ దూరపు బంధువు సింహాచలం. మాంచి నిఖార్సైన పూలరంగడు. రత్తాలుని పెళ్ళి చేసుకుంటానని అడుగుతాడు. పెద్దమ్మ ఉలకదు పలకదు. కార్యసాధకుడు సింహాచలం. రత్తాలుతో స్నేహం చేసి, పట్నంలో తనెంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడో, పెళ్ళాం పిల్లల్ని ఎంత బాగా చూసుకోగలడో వర్ణించి చెప్పి, ఓ రాత్రి వేళ రత్తాలుని లేవదీసుకు పోతాడు.

అయితే, సింహాచలం అంత మంచివాడు కాదు. అందగత్తె రత్తాలుని పట్నంలో పేరుమోసిన నరసమ్మ కంపెనీకి వెయ్యి రూపాయలకి అమ్మేస్తాడు. తను అమ్ముడుపోయిన విషయం రత్తాలుకి తెలియదు. అది సింహాచలం బంధువుల ఇల్లు అనుకుంటుంది. దానికితోడు, నరసమ్మ కూడా రత్తాలు మీద ఎంతో ఆదరం చూపిస్తుంది. నరసమ్మ కంపెనీలో ఉండే అమ్మాయిల్లో చురుకైనదీ, తెలివైనదీ ముత్యాలు. 'అప్పా' అంటూ మాట కలిపి రత్తాలుకి దగ్గర అవుతుంది. రత్తాలు చెడి నరసమ్మ ఇంటికి రాలేదనీ, మోసపోయి వచ్చిందనీ గ్రహిస్తుంది. మంచి మనసున్న ముత్యాలు నరసమ్మకి అనుమానం రాకుండా ఏదో ఒకటి చేసి, రత్తాలుని ఆ రొంపి నుంచి బయటికి పంపాలి అనుకుంటుంది. కానీ అదంత సులువైన పని కాదు. నరసమ్మ ఒకప్పుడు పోలీసుల మనిషి. ఓ ఎస్సై గారి ఇలాకా. ఆ ఎస్సై గారు కాలం చేశాక కూడా పోలీసులతో సంబంధాలు కొనసాగిస్తోంది. 'గంగరాజెడ్డు' (హెడ్ కానిస్టేబుల్ గంగరాజు) కి నరసమ్మ మీద తగని మక్కువ. కౌన్సిలర్లు, ప్లీడర్లు, ఆఫీసర్లు ఇలా అందరితోనూ సత్సంబంధాలు నెరపుతూ కంపెనీని నడుపుకు వస్తూ ఉంటుంది నరసమ్మ.

అనగనగా ఓ రాంబాబు. మాంచి తెలివైన వాడు. అతనికి ఉన్నలోపం అల్లా ఒక్కటే, తండ్రి లేకపోవడం. తండ్రి, తల్లిని మోసం చేశాడు. ఆమె గర్భవతి అయ్యాక తెలియదు పొమ్మన్నాడు. ఆవిడ కోర్టుకెక్కి కేసు ఓడిపోయింది. స్కూల్ మేస్టారు ఉద్యోగం చేస్తూ కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఎమ్మే పాసైన రాంబాబుకి ఇన్కంటాక్స్ కమిషనర్ గారబ్బాయి కృష్ణతో స్నేహం. ఐఏఎస్ పరీక్షలకి వెడుతున్న కృష్ణ, రాంబాబు చేత కూడా ఆ పరీక్ష రాయిస్తాడు. రాంబాబుకి తనకన్నా ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మకం కృష్ణకి. క్లాస్మేట్ వసంతని ప్రేమించిన రాంబాబు, ఆమెని చూడడం కోసం కృష్ణ ఊరు వస్తాడు. ఆ ఊళ్లోనే నరసమ్మ కంపెనీ ఉంది. రత్తాలుని పట్నం తీసుకు రాక మునుపే, సింహాచలం ఏం చేశాడంటే - బంగారప్ప కంపెనీ నుంచి ఐదొందలు 'అడ్మాన్సు' తీసేసుకుని, జల్సా చేసేశాడు. ఇప్పుడు, తెచ్చిన 'సరుకు' తనది అన్నది బంగారప్ప వాదన. రత్తాలుకి అనారోగ్యం చేస్తే, ఆమెని రిక్షాలో ఆస్పత్రికి తీసుకెడుతుంది ముత్యాలు. బంగారప్ప రౌడీలు దారికాసి, రత్తాలుని ఎత్తుకు పోబోతూ ఉండగా రాంబాబు ఆమెని రక్షిస్తాడు. రౌడీలని తప్పించుకుని ఆస్పత్రికి వెడతారు రత్తాలు, ముత్యాలు.

అదే రాత్రి, 'చిన్మా' నుంచి తిరిగి వస్తున్న ముత్యాలు, రత్తాలు ల కంట పడతాడు రాంబాబు. నడిరోడ్డుమీద జ్వరంతో అపస్మారకంలో పడి ఉంటాడు. అతన్ని కంపెనీకి, అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్ళి సేవలు చేస్తారు ముత్యాలు, రత్తాలు. తనకి తెలియకుండానే రాంబాబుతో ప్రేమలో పడిపోతుంది రత్తాలు. గాలి మేడలు కట్టుకోవద్దని అప్పని హెచ్చరిస్తూ ఉంటుంది ముత్యాలు. కోటీశ్వరుడు 'పిచ్చి' జోగులుకి ముత్యాలు అంటే పిచ్చి. ఆమెకి నెలజీతం ఇస్తూ ఉంటాడు. మరోపక్క, యువకుడైన 'రిక్షా' జోగులు ముత్యాలుని ప్రేమిస్తాడు. ఎప్పటికైనా ఆమె నరసమ్మ చెరనుంచి బయటికి రాగలిగితే, ఆమెని పెళ్ళి చేసుకోవాలి అన్నది అతని కల. రిక్షా జోగులు అంటే ముత్యాలుకీ ఇష్టమే. వీళ్ళందరి కథలూ ఏ తీరం చేరాయన్నదే 'రత్తాలు-రాంబాబు' నవల.

అంకితం

మార్చు

రీసర్చికి విశాఖ చేరి “వీర కమ్యూనిస్టు”గా మారి ఫాక్టరీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పాయాడు – అతనే వాసిరెడ్డి వెంకటప్పయ్య. అతనితోపాటు మరణించింది N.S. ప్రకాశరావు. వాళ్ళని గుర్తుంచుకోడానికని రావిశాస్త్రి “రత్తాలు-రాంబాబు” నవలని వాళ్ళిద్దరికీ అంకిత మిచ్చాడు.[1]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-11-03. Retrieved 2017-09-22.