రాజశేఖరుడు(కవి)

భారతీయ కవి

రాజశేఖరుడు సా.శ. 8వ శతాబ్ధానికి చెందిన కవి, నాటకకారుడు, అలంకారికుడు, రాజగురువు. ఆయన క్రీస్తు శకం 880-925 మధ్యకాలంలో జీవించారు. కనౌజ్ రాజులు మహేంద్రపాల, మహీపాలుర ఆస్థానంలో ఉన్నాడు.[1] ఆయన సంస్కృత భాషలో రాసిన కావ్యమీమాంస అనే కావ్యశాస్త్ర గ్రంథం చాలా ప్రసిద్ధమైనది.

జీవిత సంగ్రహం

మార్చు

రాజశేఖరుడు మాహారాష్ట్రకు చెందినవాడని పలువురు చరిత్రకారులు చెబుతారు. కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలించిన మహేంద్రపాలుడు, మహీపాలుడుల ఆస్థానాల్లో పనిచేశారు ఆయన. మహేంద్రపాలునికి విద్యాగురువు అయిన రాజశేఖరుడు, తరువాతి రాజు మహేంద్రపాలుని కొడుకు మహీపలుని ఆస్థాన కవిగా గౌరవింపబడ్డారు. ఆయన భార్య అవంతిసుందరి చౌహాన అనే క్షత్రియ వంశానికి చెందినవారు. ఆమెకు కూడా సంస్కృతం, ప్రాకృతం భాషల్లో మంచి పాండిత్యం ఉండేది. ఆమె అభిప్రాయాలను తన పుస్తకాల్లో ఎన్నో చొట్ల ఉటంకించారు రాజశేఖరుడు. అవంతిసుందరి రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యంగా గ్రహించాలని సూచించేవారు. ఆ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు ఒకచోటి వివరించారు రాజశేఖరుడు. స్వతహాగా భాషపై మంచి పట్టు ఉన్న భార్య అవంతిసుందరి అభిప్రాయాలను ఎంతో గౌరవించేవారు ఆయన.[1]

కావ్యమీమాంస గ్రంధ రచన, ప్రాశస్త్యం

మార్చు

కావ్యమీమాంస ఒక కావ్యశాస్త్ర గ్రంథం. ఇందులో 18 అధ్యాయాలున్నాయి. ఈ గ్రంథంలో కావ్యపురుషుడు అనే పాత్రను సృష్టించి దాని ద్వారా కవుల దినచర్య, కవి గోష్ఠులు, రాజులుకు కవులకు మధ్య ఉండే బంధం, రాజ సభలు గురించి వివరించారు. ఈ గ్రంథంలోని 18 అధ్యాయాలైన కావ్యపురుషుని ఉత్పత్తి, అష్టాదశవిధ కావ్యవిద్యలను కావ్యపురుషుడు అష్టాదశ శిష్యులకు ఉపదేశించడం, వాటి మీద ఆ శిష్యులు గ్రంథాలు రాయటం, కావ్యభేదాలు, సాహిత్య విద్యా అనే పెళ్ళికూతురును అతను వివాహమాడటం, కవి భేదాలు, కావ్య హేతువులు, భాష, శైలి, కావ్యయోనులు, కవి దినచర్య, కావ్యార్థాహరణోపాయాలు, కవి సమయాలు, కవి రహస్యాలు, పూర్వవృత్తి, అలంకార సిద్ధాంత సమీక్ష, ఉత్తరవర్తి కవుల కవితా సమీక్ష కోసం తీసుకోవలసిన విషయాలు వంటివాటిని శాస్త్రీయ పద్ధతిలో ఈ పుస్తకంలో వివరించారు రాజశేఖరుడు. అర్ధాపహరణ కవులకు తప్పనిసరి అయిన 32 విధానాలను తెలిపారు ఆయన. వాటిని అర్థాపహరణ ఉపాయాలు అని అంటారు. ఆయన కవి సమయచర్చను కూడా చర్చించారు. అప్పటికే స్థాపించబడిన రస, అలంకార, గుణ, రీతి, ధ్వని సిద్ధాంతలను ఈ గ్రంథంలో సమీక్షించారు ఆయన. ఈ విషయాలను చర్చించడంతో ఈ గ్రంథం కొత్త మార్గాన్ని ఎంచుకున్న అలంకార గ్రంథంగా పరిగణించారు పండితులు.[1]

రచనాశైలి

మార్చు

రాజశేఖరుని సంప్రదాయాన్ని నిర్ణయించడంలో విమర్శకులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అలంకారవాది అనీ, కొందరు రసవాదీ అని అంటారు. ఆయన రచనలపై రుద్రటుని కావ్యాలంకార ప్రభావం కనిపిస్తుంది మనకు. సామాసాలు, అనుప్రాసల రీతులకు ఆధారాలను నిర్ణయించారు ఆయన. కావ్యమీమాంసను పరిశీలిస్తే ఆయన అలంకారాలను, రీతులను కావ్యానికి ఉపయోగపడే వస్తువులుగా గ్రహించాఅరే తప్ప, కావ్యానికి ఆత్మగా స్వీకరించలేదని అర్ధమవుతుంది. ఆయన ధ్వని సంప్రదాయాన్ని ఎక్కడా స్పష్టంగా వివరించలేదు. ధ్వనిని కూడా కావ్యాత్మగా ఆయన ఉపయోగించలేదు. ఎస్.కె.డే ప్రకారం కావ్యానికి ఆత్మగా రీతిని అంగీకరించారనీ, ఆయన రస సంప్రదాయానికి చెందినవారని అంటారు. రాజశేఖరుడు రాసిన కావ్యమీమంసలోని రచనా శైలిని తరువాత క్షేమేంద్ర, భోజ, హేమచంద్ర, వాగ్భట, కేశవమిత్రుడు వంటి అలంకారికులు గ్రహించి అనుసరించారు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 ముదిగంటి, గోపాలరెడ్డి; ముదిగంటి, సుజాతరెడ్డి (1986). సంస్కృత సాహిత్య చరిత్ర. హైదరాబాద్: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.