షిరిడీలో బాబా విగ్రహాన్ని ఎప్పుడూ ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఆయనకు ప్రతిరోజూ పూజ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజూ నాలుగు పూటలా ఆయనకు హారతులిస్తారు, సేవలు చేస్తారు. శిరిడీలో అన్ని పండుగలూ కులమత భేదాలు లేకుండా ఎంతో వేడుకగా జరుగుతాయి. శిరిడీలో అలా చేస్తారు గనుక మనమూ మన ఇంట్లో బాబాను అలంకరించి పూజిస్తాము. హారతులు చేస్తాము. పండుగ రోజులలో సత్సంగం చేసుకుంటాము. ఇవన్నీ శిరిడీలో ఒక సాంప్రదాయంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ శిరిడీలో మొట్టమొదట ప్రారంభించిన భక్తురాలు రాధాకృష్ణా ఆయీ.

రాధాకృష్ణా ఆయీ అసలుపేరు సుందరీబాయి క్షీర సాగర్. ఆమె నిరంతరం 'రాధాకృష్ణ ' అనే నామం జపిస్తూ ఉండడం వల్ల ఆమెను అందరూ రాధాకృష్ణ ఆయీ అని పిలిచేవారు. ఆమె వితంతువు. ఆమె తన సమయమంతా ఆధ్యాత్మికంగా జీవించాలని నిర్ణయించుకుని చక్కగా సాధన చేసుకునేది. నిరంతరం ఒక కృష్ణ విగ్రహానికి అన్ని సేవలూ చేస్తూ రోజంతా గడిపేది. ఆమె చక్కటి గొంతుతో ఎన్నో భజనలు, కీర్తనలు గానం చేస్తూ ఉండేది. ఆమెకు నానా చందోర్కర్ ద్వారా బాబా గురించి తెలిసింది. వెంటనే 1905 లో పండరీపురం నుంచి అతనితో కలిసి శిరిడీ చేరింది. మొదటిసారి బాబాను దర్శించగానే ఆయన సామాన్యులు కారని, శ్రీ కృష్ణుని ప్రతిరూపమేనని తెలుసుకున్నది. ఆమె తన జీవితాంతమూ సాయి సేవలో గడిపింది. కులమత భేదాలు లేకుండా అందరినీ ఎంతో ఆదరించేది. ప్రతి సంవత్సరమూ శిరిడీలో ద్వారకామాయిలో కృష్ణాష్టమి పండుగను ఎంతో వేడుకగా చేసేది. అప్పటి నుండి కృష్ణాష్టమి జరపడం శిరిడీలో ఆచారమైంది.

రాధాకృష్ణా ఆయీ ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. నిరంతరమూ తీవ్ర సాధనలోను, సేవలోను తన సమయమంతా గడిపేది. బాబా కొంతమంది భక్తులను ఆమె ఇంట్లో ఉండమని పంపేవారు. ఆమె వారిలో బాబా పట్ల శ్రద్ధ పెంచి ఎంతో సేవ చేయించేది. బాబా తిరిగే శిరిడీ వీధులను, మసీదును శుభ్రంగా చిమ్మేది. ధుని వల్ల మసిబారిన గోడలను శుభ్రం చేసేది. చావడి ముందు చక్కగా ముగ్గుతో అలంకరించేది. ఆమె భక్తికి మెచ్చి బాబా ఆమెకు ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక రొట్టె కూర పంపేవారు. అది మాత్రమే ఆమె భుజించేది. ఆమె ఇంటిని బాబా 'శాల ' అని పిలిచేవారు. ఆమె నిండా ముసుగు కప్పుకుని బయటకు వచ్చేది. ఎప్పుడూ తెల్లటి వస్త్రాలనే ధరించేది. అవి కూడా బాబా ప్రసాదించినవే. రోజు విడిచి రోజు బాబా చావడికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఆమె మసీదుకు వచ్చి దానిని శుభ్రం చేసేది. ఆ తర్వాత మసీదు మెట్ల మీద ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించేది.

బాబా ప్రతిరోజూ లెండీకి వెళ్లి వస్తుండేవారు. ఆ మార్గమంతా పూల లతలు పందిరిలా ప్రాకించింది. భక్తులందరూ ఆమెకు సహకరించారు. కొంతకాలానికి అది చక్కటి పూలపందిరి క్రింద ఎండ తగలని చక్కటి బాట అయింది. బాబా లెండీకి ఎండలో వెళ్ళకుండా అలా ఆమె చక్కగా ఏర్పాటు చేసింది. బాబా ఆ బాట మీదే లెండీకి నడిచేవారు. అంతేకాదు, బాబాకు అందరు భక్తులూ కలిసి సామూహికంగా పూజ చేసుకోవడం, నాలుగు హారతులూ పాడుకోవడం, చావడి ఉత్సవం చేసుకోవడం ఒక సాంప్రదాయంగా జరుపుకునేలా మొట్టమొదట ప్రారభించినది రాధాకృష్ణా ఆయీ. అంతేకాదు, సమర్ధ సద్గురువైన సాయిబాబాను మహారాజులా అలంకరించి, రాజలాంఛనాలతో సేవించుకునే పద్ధతిని ప్రవేశపెట్టినది ఆమే. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ భక్తులు సాయి సంస్ధానానికి సమకూర్చేలా ఆమె ప్రోత్సహించింది. అలా భక్తులు బాబాను చక్కగా సేవించుకునేలా ప్రోత్సహించేది రాధాకృష్ణ ఆయీ. ఆమె 9 సంవత్సరాలు శిరిడీలో సాయి సేవలో గడిపింది.

రాధాకృష్ణా ఆయీ తన స్నేహితురాలైన బిక్కూ బాయికి బాబా గురించి తెలిపి, ఆయనను ఆమెకూడా దర్శించుకునేలా, శిరిడీలో ఉండేలా ప్రోత్సహించింది. రాధాకృష్ణా ఆయీతో పాటు బిక్కూబాయి, కాశీబాయి మొ ॥ న స్త్రీలు కూడా సాయిని భక్తి శ్రద్ధలతో సేవించుకున్నారు.