రోసాలియా లోంబార్డో

రోసాలియా లోంబార్డో (13 డిసెంబర్ 1918 – 6 డిసెంబర్ 1920) [1] ఇటలీకి చెందిన రెండేళ్లు దాటని చిన్న పిల్ల. 1920 లో స్పానిష్ ఫ్లూ కారణంగా మరణించిన ఈమెను మమ్మీగా చేశారు. ఇటలీ లోని పలెర్మో నగరంలో వున్న కాపుచిన్ భూగర్భ స్మశానవాటికలో ఈ చిన్న పిల్ల మమ్మీ భద్రపరచబడింది. పలెర్మోలో అద్భుతంగా సంరక్షించబడిన మమ్మీలలో ఈమె ఒకటి. చనిపోయినట్లు కాకుండా ప్రశాంతంగా నిద్ర పోతున్నట్లు కనిపిస్తుండటంతో రోసాలియాను ''సిసిలియన్ స్లీపింగ్ బ్యూటీ" గా పిలిచేవారు. 1920 నుండి గాజు శవపేటికలో సంరక్షించబడుతున్న ఈ చిన్నారి పాప శరీరాన్ని చూడటానికి ఆసక్తితో ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు పలెర్మో నగరాన్ని సందర్శిస్తారు. వంద సంవత్సరాలకు పైగా చెక్కుచెదరని ఆమె శరీరం, పరిశోధకులను 1900 కాలం నాటి ఎంబాల్మింగ్ పద్ధతులపై దృష్టి సారించేలా చేసింది.

రోసాలియా లోంబార్డో
1982లో తీసిన రోసాలియా లోంబార్డో మమ్మీ చిత్రం
జననం(1918-12-13)1918 డిసెంబరు 13
పలెర్మో, సిసిలీ, ఇటలీ
మరణం1920 డిసెంబరు 6 (1 సంవత్సరం, 359 రోజులు)
పలెర్మో, సిసిలీ, ఇటలీ
జాతీయతఇటాలియన్
ఇతర పేర్లుసిసిలియన్ స్లీపింగ్ బ్యూటీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పలెర్మో నగరంలోని కాపుచిన్ సమాధులలో ఉన్నత ప్రమాణాలతో సంరక్షించబడిన మమ్మీ

మరణం మార్చు

రోసాలియా లోంబార్డో దక్షిణ ఇటలీలోని సిసిలీలో 1918 డిసెంబర్ 13 తేదీన జన్మించింది. తల్లి మేరియా డి కారా (1897-1966). తండ్రి మేరియో లోంబార్డో (1890-1980) ఒక మిలట్రీ ఆఫీసర్. ఆమె రెండో పుట్టినరోజుకు వారంరోజుల ముందు స్పానిష్ ఫ్లూ అంటువ్యాధి కారణంగా [2] సంభవించిన న్యూమోనియాతో మరణించింది. పాప అకాల మరణంతో తీవ్రంగా చలించిపోయిన తండ్రి, తన కుమార్తెను ఖననం చేసే ముందు ఎలాగైనా ఆమె శరీరాన్ని సంరక్షించుకోవాలనుకొన్నాడు. ఆ పనిని చేపట్టడానికి ఆనాటి ప్రముఖ ఎంబాల్మర్ అయిన అల్ఫ్రెడో సలాఫియాను సంప్రదించాడు.[3] 

సంరక్షణ మార్చు

 
ఈ రోజు కనిపించే విధంగా లోంబార్డో శరీరం.

అల్ఫ్రెడో సలాఫియా కృషితో 24 గంటల వ్యవధిలోనే రోసాలియా శరీరం క్షీణించిపోకుండా మమ్మీగా మార్చబడింది. తదనంతరం ఆ మమ్మీని 1920 డిసెంబర్ 8 తేదీన పలెర్మో నగరంలోని కాపుచిన్ భూగర్భ స్మశానవాటికకు తరలించారు. ఈ అరుదైన స్మశానవాటికలో 16వ శతాబ్దం నుండి 8000 కు పైగా శవాలను, 1250 కు పైగా మమ్మీలను భద్రపరుస్తున్నారు. కాపుచిన్ స్మశానవాటికకు తరలించబడిన చిట్ట చివరి శవాలలో ఈమె ఒకటి. ఆ నాటినుండి నేటివరకు, సుమారు వంద సంవత్సరాలకు పైగా ఈ చిన్నారి పాప శరీరాన్ని ఇక్కడ గాజు శవపేటికలో భద్రంగా ఉంచి సంరక్షిస్తున్నారు. ఆమె తల మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన శరీరం దుప్పటితో కప్పబడి ఉంటుంది. ఆమె ఇప్పటికీ, చనిపోయినట్లుగా కాక సజీవంగా, నిద్రపోతున్నట్లుగా కనిపిస్తుంది. స్లీపింగ్ బ్యూటీగా ప్రసిద్ధి చెందింది. నిజానికి సజీవత ఉట్టిపడేటట్లుగా ఆమె మమ్మీని రూపొందించిన ఘనత సలాఫియాకు చెందుతుంది. అతని అద్భుతమైన ఎంబాలింగ్ టెక్నిక్ 21 వ శతాబ్దం వరకు రోసాలియా మమ్మీని మంచి స్థితిలో వుంచగలిగింది. 2008 జులై నెలలో ఆమె శరీరంపై చేసిన ఎక్స్-కిరణాల అధ్యయనంలో కూడా అన్ని అవయవాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని తేలింది.[4]

అయితే 2009 నాటి నేషనల్ జియోగ్రాఫిక్ ఛాయాచిత్రం, రోసాలియా లోంబార్డో మమ్మీ కుళ్ళిపోయే తొలి సంకేతాలను చూపించడం మొదలుపెట్టిందని తెలిపింది. ముఖ్యంగా చర్మం రంగు పాలిపోవటాన్ని ఎత్తి చూపింది. [5] దానితో ఈ సమస్యను పరిష్కరించడానికి, పాప మమ్మీని మిగిలిన సమాధులకు దూరంగా, మరింత పొడి ప్రదేశానికి తరలించారు. క్షీణతను నివారించడం కోసం పాప శవపేటికను నైట్రోజన్ వాయువుతో నింపిన మరో గాజు కంపార్టుమెంటులో ఉంచి గాలి చొరబడకుండా సీలు వేశారు. [6] ప్రస్తుతం దీనిని కాపుచిన్ సమాధులకు దూరంగా ఒక ప్రార్థనా మందిరం మధ్యలో, పాలరాయి పీఠంపై గల గాజు శవపేటికలో భద్రపరచడం జరిగింది. ఇక్కడ వున్న వందలాది మమ్మీలలో పాప శరీరాన్ని అతి ముఖ్యమైనదిగా భావించి ఉన్నత ప్రమాణాలతో సంరక్షిస్తున్నారు. 2010 డిసెంబరులో, నిపుణులు రోసాలియా శరీరాన్ని సిటి స్కాన్‌ పరికరంతో పూర్తిగా అధ్యయనం చేసి, ఆమె శరీర సంరక్షణ స్థాయిని సవివరంగా విశ్లేషించారు. దాని ప్రకారం పాప శరీరంలోని గుండె, గర్భాశయం (Uterus), రెండు కిడ్నీలు, కండరాలు చక్కగా సంరక్షించబడ్డాయని వెల్లడైంది.[7] ఆమె మెదడు, కాలేయం (Liver),ప్లీహం (Spleen), క్లోమం (Pancreas) భాగాలు కొద్దిమేరకు కుచించుకుపోయినప్పటికీ అవి తమ ఆకారాన్ని మాత్రం కోల్పోలేదు. [7]మొత్తం మీద రోసాలియా బాహ్యరూపంతో పాటు, అంతర్గత అవయవాలు అద్భుతంగా సంరక్షించబడ్డాయని తేలింది.

ఎంబాల్మింగ్ టెక్నిక్ మార్చు

 
ఆల్ఫ్రెడో సలాఫియా

ఆ రోజులలో ప్రొఫెసర్ ఆల్ఫ్రెడో సలాఫియా (1869-1933) ప్రసిద్ధ ఎంబాల్మింగ్ నిపుణుడుగా ఇటలీలోనే కాక, యూరప్, అమెరికా దేశాలలో కూడా గొప్ప ఖ్యాతి పొందాడు. తన అద్భుతమైన ఎంబాలింగ్ టెక్నిక్ తో మమ్మీలను సజీవత ఉట్టిపడేటట్లుగా గొప్ప కళాఖండాలుగా సృష్టించేవాడు. సలాఫియా, ఎంబామింగ్ పదార్ధం (మరణించినవారి రక్తాన్ని భర్తీ చేసే పదార్ధం) కోసం ఒక విజయవంతమైన రసాయనిక ఫార్ములాని కనిపెట్టగలిగాడు. మృత శరీరాలను మమ్మీలుగా రూపొందించడానికి అతను రూపొందించిన సింగిల్ పాయింట్ ఇంజెక్షన్ విధానం చాలా సరళంగా ఉంటుంది. సాధారణ ఎంబాల్మింగ్ విధానాల మాదిరిగా అంతర్గత అవయవాలను తొలగించడం, ఆ ఖాళీలను నేట్రన్ లవణాలతో భర్తీచేయడం, తరువాత మృత శరీరాన్ని ఆరబెట్టడం వంటి పద్ధతులు ఏమీ అవలంబించకుండా సలాఫియా మృత శరీరంలో ఒక చిన్న కన్నం పెట్టి ఒక ప్రత్యేక ద్రావణాన్ని ఇంజెక్ట్ చేసి మమ్మీగా సృష్టిస్తాడు. సాధారణంగా ఆధునిక ఎంబాల్మింగ్‌లో ఉపయోగించే ఇతర విధానాలు, బ్లడ్ డ్రైనేజీ, కావిటీ ట్రీట్‌మెంటు, అదనపు ఇంజెక్షన్లు చేయడాలు వంటివి ఇతని విధానంలో చాలా వరకు అనవసరమైనవిగా భావిస్తారు. అయితే సలాఫియా 1933లో మరణించడంతో అతనుపయోగించిన టెక్నిక్ ఆ తరువాత మరెవరికీ తెలియకుండా పోయింది. అప్పటి నుండి మృత దేహాన్ని సంరక్షించడానికి అతను ఉపయోగించిన అత్యుత్తమ పద్దతులపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. అయినా అతనుపయోగించి టెక్నిక్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

అయితే 2007 సెప్టెంబరులో కాపూచిన్ కాటాకాంబ్స్ క్యూరేటర్ అయిన పియోంబినో మస్కాలికి, సలాఫియా స్వదస్తూరితో రాసుకొన్న రాతప్రతి కాకతాళీయంగా దొరికింది. అందులో రహస్య ఫార్మూలా వెల్లడవడంతో అతను రోసాలియాను మమ్మీగా మార్చడానికి ఏమేం పదార్ధాలు ఉపయోగించాడో ప్రపంచానికి వెల్లడయ్యింది. [8] ప్రొఫెసర్ సలాఫియా ఎంబాల్మింగ్ సూత్రాన్ని "మొత్తం 7 లీటర్ల ద్రావణం. అందులో గ్లిజరిన్ ఒక పాలు, జింక్ సల్ఫేట్, జింక్ క్లోరైడ్‌లతో సంతృప్తీకరించబడిన ఫార్మాలిన్ ఒక పాలు, సాలిసిలిక్ ఆమ్లంతో సంతృప్తీకరించబడిన ఆల్కహాల్ ద్రావణం ఒక పాలు" గా వర్ణించబడింది. ఈ ఎంబాల్మింగ్ రసాయనిక ద్రావణాన్ని ఒక సింగిల్ పాయింట్ ఇంజెక్షన్ ద్వారా ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టి ఆమె రక్తాన్ని పూర్తిగా భర్తీ చేసాడు. దీనిని చాలా వరకు తొడ ధమనిలోకి గురుత్వాకర్షణ ఇంజెక్టర్ ద్వారా పంపించడం జరిగింది. [1] [9] డిస్కవరీ న్యూస్‌కు చెందిన రోసెల్లా లోరెంజి తెలియచేసినదాని ప్రకారం సలాఫియా, ఫార్మాలిన్‌ను బాక్టీరియా నాశనం చేయడానికి ఉపయోగించారని, గ్లిజరిన్‌ను శరీరం ఎక్కువ తేమను కోల్పోకుండా నివారించడానికి ఉపయోగించారని, మాంసం లోపలి ఫంగస్‌ను తొలగించడానికి సాలిసిలిక్ ఆమ్లంను, శరీరాన్ని ఆరబెట్టడానికి ఆల్కహాల్ ద్రావణంను, శరీరం స్టిఫ్ (బిరుసు)గా ఉండడానికి జింక్ లవణాలను ఉపయోగించాడని తెలుస్తున్నది. ముఖ్యంగా జింక్ లవణాలు పాప బుగ్గలను, నాసికా కుహరాలను లోపలికి మూసుకుపోకుండా మంత్రం వేసినట్లు నిరోధించాయి. ఇతరత్రా స్థానిక శుష్క వాతావరణం, పాప ముఖాన్ని ఈథర్‌లో కరిగించిన పారాఫిన్‌తో అనువర్తించిన అంశాలు కూడా పాప శరీర సంరక్షణకు దోహదం చేశాయి.

మమ్మీపై ఊహాగానాలు మార్చు

రోసాలియా మమ్మీ యొక్క కనురెప్పలు కదలడంపై అనేక ఊహాగానాలు రేకెత్తడంతో ఈ మమ్మీ మరింతగా పాపులర్ అయ్యింది. మరణించిన పాప యొక్క కళ్ళు, రోజులో అనేకసార్లు మూసుకొంటూ తెరుచుకుంటున్నాయని, దానికి స్పందనగానే చెక్కు చెదరని ఆమె నీలి రంగు కనుపాపలు కూడా బయటకు కనిపిస్తున్నాయని. [10] అనేక ఊహాగానాలు రేగాయి. ఆమె ఆత్మ ఆమె శరీరంలోకి తిరిగి వస్తోందని వదంతులు వ్యాపించాయి. పాప కనురెప్పలు కదలడంపై రేగిన ఊహాగానాలకు ప్రతిస్పందిస్తూ, కాపుచిన్ క్యూరేటర్ అయిన పియోంబినో మస్కాలి-ఈ దృగ్విషయాన్ని కాంతి వలన కలిగే ఒక ఆప్టికల్ భ్రాంతిగా పేర్కొన్నారు. దీనిని వివరిస్తూ పక్క కిటికీల ద్వారా ఫిల్టర్ అయ్యి ప్రసరిస్తున్న కాంతి, శవపేటిక యొక్క గాజు మీద కొంత కోణంలో పడినపుడు అది కలిగించే దృష్టి భ్రాంతి (optical illusion) వలన ఇలా కనిపిస్తుందని, పగటిపూట ఇది మారుతూ వుంటుందని .... పాప కళ్ళు పూర్తిగా మూసివేయబడలేదని, నిజానికి అవి ఎప్పుడూ మూసుకోవడం జరగలేదని తెలిపారు. [8]

రిఫరెన్సులు మార్చు

  • Dario Piombino-Mascali, 2009. Il Maestro del Sonno Eterno. Presentazione di Arthur C. Aufderheide. Prefazione di Albert R. Zink. Edizioni La Zisa, Palermo.
  • Multidetector CT investigation of the mummy of Rosalia Lombardo (1918–1920), Annals of anatomy, Official Journal of the Anatomischer Anzeiger, Vol 195, May 2013

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Panzer, Stephanie; Gill-Frerking, Heather; Rosendahl, Wilfried; Zink, Albert R.; Piombino-Mascali, Dario (2013). "Multidetector CT investigation of the mummy of Rosalia Lombardo (1918–1920)". Annals of Anatomy. 195 (5): 401–408. doi:10.1016/j.aanat.2013.03.009.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-04-12. Retrieved 2020-10-05.
  3. National Geographic. February 2009. p. 124.
  4. National Geographic. February 2009. p. 150.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-28. Retrieved 2020-10-05.
  6. "The Girl in the Glass Casket". National Geographic Channel. Archived from the original on 20 October 2012. Retrieved 24 April 2011.
  7. 7.0 7.1 Stephanie, Panzer; Albert, R Zink; Heather, Gill-Frerking; Dario, Piombino-Mascali (2013). "Multidetector CT investigation of the mummy of Rosalia Lombardo (1918–1920)". Annals of anatomy, Official Journal of the Anatomischer Anzeiger. 195. Retrieved 6 October 2020.
  8. 8.0 8.1 Rossella Lorenzi (20 June 2014). "Why Does This Mummy Appear To Open And Close Her Eyes?". io9. Discovery News. Retrieved 16 July 2018.
  9. "Why Does This Child Mummy Appear to Open And Close Her Eyes?". ScienceAlert. 22 September 2014. Archived from the original on 17 జూలై 2018. Retrieved 16 July 2018.
  10. Reuben Westmaas (16 October 2017). "This Mummified Two-Year-Old Appears to Blink Every Day". Curiosity.com. Archived from the original on 17 జూలై 2018. Retrieved 16 July 2018.