డా. సిద్దెంకి యాదగిరి
కవిత్వం వర్ధిల్లాలి
రాళ్ళకు రక్తం అద్ది
ముక్తి మార్గంలో ముల్లకు పూలు పూయించిన
విముక్తి వీరుల అడుగు జాడల్లో
నిలిచిన అసంపూర్ణ లక్ష్యాలను
తీరని కోరికల్ని లావా దావానంలా ఎగజిమ్మడానికి
కవిత్వం వర్ధిల్లాలి!
మారన హోమపు జ్వాలలు మనసు మేఘాల్ని కరిగించి
కల్లోలాన్ని తొలకరి చేయ
కరున మథనం గావించటానికి
కవిత్వం అమ్రుత కవ్వమవ్వాలి!
అన్యాయం, అక్రమం వర్ధిల్లే చోట
తూర్పార పట్టే తీర్పు గా
అక్షరాలు సాయుధమై
అంధకారం విస్ఫోటన మవ్వడానికి
కవిత్వ వెలుగులు వెదజల్లాలి!
నిఖార్సయిన అక్షరాలు
పర్వత శిఖరంలా నిలవడ్తయి
నిబద్ధమైన పదాలు నిరసనాయుధాలై
పడిన కెరటంలా ఆదర్శం లేస్తది
సమాజాన్ని ఎత్తుకున్న సాహిత్యం
సమానత్వ జాతీయ జండాగా రెపరెపలాడంచడానికి
కవిత్వ సమరం వర్ధిల్లాలి!
మనసు మలినాన్ని అగ్ని స్నానం చేయించి
మానవాళికి శాంతి పరిమళం అద్దడానికి
కాంతి కవనమై
ప్రగతి పథమై
మనిషిని మహోన్నతంగా బతికిస్తూ
కవిత్వం కలకాలం వర్ధిల్లాలి
- డా. సిద్దెంకి యాదగిరి