[1]తెలంగాణ రాష్ట్రనికి చెందిన యర్రమాద వెంకన్న నేతజాతీయ చేనేత దినోత్సవ రూపకర్తగా సుపరిచితులు. బ్రిటీష్ వలస సామ్రాజ్యపు దూరహంకారాన్ని ఎదిరించినందుకు చేతివేళ్ళను నరికించుకోగలిగిన త్యాగనిరతి గల చేనేత సోదరుల ఆత్మగౌరవాన్ని పునప్రతిష్టoచడానికి జరిగిన ప్రయత్నమే చేనేత దినోత్సవం. చేతి మగ్గంతో వస్త్రం తయారు చేసే చేనేత రంగానికి గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు వెంకన్న నేత చేసిన తొమ్మిది సంవత్సరాల నిరంతర ప్రయత్నమే జాతీయ చేనేత దినోత్సవంగా రూపుదిద్దుకుంది.

యర్రమాద వెంకన్న నేత జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త

జననం: జూన్ 10, 1974

జన్మస్థలం: మునుగోడు, నల్గొండ జిల్లా, తెలంగాణ, భారత దేశం.

చైర్మన్, చేనేత ప్రోత్సాహక మండలి(Handloom promotion council)[1]

వ్యవస్థాపక అధ్యక్షుడు, చేనేత వర్గాల చైతన్య వేదిక.

తల్లి: యర్రమాద లక్ష్మమ్మ తండ్రి: యర్రమాద రాములు భార్య: యర్రమాద పద్మావతి కూతుర్లు: యర్రమాద సాయి రూప నేత, యర్రమాద లహరి నేత. సోదరీమణులు: రాపోలు యాదమ్మ, కందగట్ల విజయమ్మ, గుర్రం రాణి.

ప్రస్తుత నివాసం: హైదరాబాద్, తెలంగాణ


చేనేత దినోత్సవ నేపథ్యం

2006లో ఒకరోజు నేడు టైలర్స్ డే అనే వార్తను వెంకన్న నేత చూశాడు. బట్టను కుట్టేవారికి ఒక రోజు వున్నప్పుడు బట్టను నేసే వారికి ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన వెంకన్న నేతకి వచ్చింది. అందుకు సరియైన రోజు కోసం అన్వేషించాడు. ఆగస్ట్ 7,1905న బెంగాల్ లోని కలకత్తా టౌన్ హాల్ వేదికగా జరిగిన సమావేశం వస్త్ర బహిష్కరణకు పిలుపు నిచ్చింది.అదే రోజును స్ఫూర్తిగా తీసుకోని అతను ఆగస్ట్ 7ను చేనేత దినోత్సవంగా 2006లో ప్రకటించారు. మొదట్లో వెంకన్న నేత ప్రయత్నాన్ని కుల సంఘాల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏ హోదాలో చేనేత దినోత్సవాన్ని ప్రకటించావని ప్రశ్నించారు. వెంకన్న నేత ప్రయత్నానికి అతని దగ్గరి మిత్రలు సైతం సహాకరించలేదు.ఐనా అతను ఏమాత్రం కుంగిపోలేదు. మొక్కవోని దీక్షతో అతను తన ప్రయత్నాన్ని రెట్టింపు చేశాడు. చేనేత దినోత్సవ భావజాలాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం చేశాడు. వెంకన్న నేత తన వ్యూహాత్మక ఆలోచనలు, అడుగులతో 2008 సంవత్సరం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అధికారికంగా జరిపింపజేశారు.ఆగస్టు 7 ,2008న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అప్పటి ముఖ్యమంత్రి డా. వై.యస్.రాజశేఖర రెడ్డి ,పలువురు మంత్రులు ,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వెంకన్న నేత ప్రయత్నాన్ని అభినందిస్తూ 2008లో అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ,కేంద్ర జౌళి శాఖ మంత్రి శంకర్ సింగ్ వాగేలా,లోక్ సభ లో ప్రతిపక్ష నేత ఎల్.కె.అద్వానీ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.స్.రాజశేఖర రెడ్డి ,పలువురు కేంద్ర,రాష్ట్రా మంత్రులు మరియు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు ఉత్తరాలు రాశారు

చేనేత దినోత్సవ ప్రయాణం

2009 నుండి 2011 వరకు ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవాన్ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో హ్యాండ్లూమ్ వాక్ పేరుతో అతను నిర్వహించేవారు.ఈ సాంప్రదాయాన్ని నేటికి అనేక సంస్థలు కొనసాగిస్తున్నాయి.2017 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే నెక్లెస్ రోడ్ లో చేనేత దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుంది.రాష్ట్రమంతట ప్రతి జిల్లా కేంద్రం లో హ్యాండ్లూమ్ వాక్,చేనేత ర్యాలీలు అధికారికంగా నిర్వహించవలిసిందిగా 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జౌళి మరియు చేనేత శాఖ సంచాలకులు ఐ.ఎస్.శ్రీనరేశ్ గారిని వెంకన్న నేత కోరగా సానుకూలంగా స్పందించిన చేనేత సంచాలకులు జిల్లా ఏ.డి లకు ఆదేశాలు జారీచేశారు. అప్పటినుండి నేటికి ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు.2006 నుండి వెంకన్న నేత చేస్తున్న విజ్ఞప్తులు,ప్రచారాలతో దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది.అనేక రాష్ట్రాలలో ఆగస్ట్ 7ను చేనేత దినోత్సవంగా కార్యక్రమాలు జరిపారు.పౌర సమాజం మరియు మీడియా రంగం మద్దతు తోడైంది. చేనేత దినోత్సవ చరిత్ర ,అవశ్యకతను తెలియజేస్తూ వెంకన్న నేత "స్వదేశీయం" అనే సంగీత నృత్య రూపకాన్ని ఏప్రిల్ 6,2012న రవీంద్రభారతిలో అనేకమంది ప్రజా ప్రతినిధులు,చేనేత ప్రేమికుల మధ్య ప్రదర్శించారు.దీనికి అనూహ్య స్పందన వచ్చింది.ఈ ప్రదర్శనతో చేనేత దినోత్సవ ప్రాముఖ్యత పై లోతైన చర్చ జరిగింది.ఇదే ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో తిరిగి ప్రదర్శించింది.

జాతీయ స్థాయి గుర్తింపు

చేనేత దినోత్సవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకరావాలనే తలంపుతో 2012,ఆగస్ట్ 7న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పలు రాష్టాలకు చెందిన పార్లమెంటు సభ్యులు,చేనేత కళాకారులు మరియు చేనేత ప్రేమికులు హాజరైయ్యారు.ఈ కార్యక్రమం జాతీయ నాయకులను,జాతీయ పార్టీలను మరియు జాతీయ మీడియాను ఆకర్షించింది. జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు.2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు.

భారత ప్రభుత్వ అధికారిక ప్రకటన

మే 5, 2015న ఆగస్టు 7 యొక్క చరిత్ర, నేపథ్యం వివరిస్తూ జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెంకన్న నేత ఉత్తరం రాయగా సానుకూలత వ్యక్తం చేస్తూ జులై 19న ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. వెంకన్న నేత నిరంతర విజ్ఞప్తులు, చొరవతో అనేక మంది ప్రజాప్రతినిధులు, చేనేత ప్రతినిధులు మద్దతు పలికారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మరియు కేంద్ర పాలిత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది.2015,ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి వెంకన్న నేతను కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఆహ్వానించాడు.

  1. [Venkanna Netha "యర్రమాద వెంకన్న నేత, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త"] Check |url= value (help). Venkanna Netha.