వాడుకరి:AshokChoppakatla/శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన

శ్రీ రాజేశ్వర శతబిల్వార్చన

             --  చొప్పకట్ల భాను               ------------------------------------                  1)

శ్రీ రుద్ర శృతి పూర్ణ నాద నుతులున్ , శ్రీ శైవ దీక్షా స్తుతుల్ , నోరారంగ జపించు కోటి జపముల్‌, నోముల్‌ , భవ స్తోత్రముల్‌ , ఆరాధ్య ప్రతిమార్చనల్ , శివపు రీ యానంద సందోహముల్ తీరుల్‌ తీరులు శైవ భక్తి పథముల్‌ దీపించు రాజేశ్వరా !

భావం -- హే రాజరాజేశ్వరా ! రుద్రమంత్ర స్వరాలు ,శివదీక్షా స్తోత్రాలు ,

నోరారా జపించే జపాలు ,నోములు ,
శివ స్తోత్రాలు , విగ్రహారాధనలు,శివ క్షేత్రపు ఆనంద సందోహాలు  .... 

ఇలా ఇవి ఎన్నో రకాలయిన శివ భక్తి మార్గాలు  ! 2 ) (అత్ర పృథివ్యాం....) ఇది మా వూరి మహేశ్వరాలయము మాకీ నేలె శీతాద్రి మా కిదియే స్వర్గము యిష్ట మందిరము మాకీదిక్కె యీశాన్యమౌ నిది సిద్దార్చిత భద్రభూమి యిదియే నిత్య ప్రదీప్తంబు మా కిదె కైలాస పురమ్మహో యనుచు నే కీర్తింతు రాజేశ్వరా !

భావం--

ఇది మా ఊరి శివాలయం ' ఈ ప్రదేశమే మాకు హిమాచలం . ఇదే మాకు స్వర్గం , ఇష్టమైన మందిరం. . మాకు ఇదే ఈశాన్య దిక్కు. ఇది సిద్ధులు ప్రతిష్టించిన దేవాలయం . నిత్యం ప్రకాశించే ఈ నేలే మాకు కైలాస పురం అంటూ నేను కీర్తిస్తాను స్వామీ! హే రాజ రాజేశ్వరా! 3 సంకల్పం ---- శతబిల్వార్చన చేయనెంచి మదిలో శంభున్ ప్రతిష్టించి నే శతరుద్రీయము లోదలంచి శుచినై శైవాత్మసంధాయినై శతపద్యాత్మక పూజ చేసేద శివా ! సర్వాంగయుక్తమ్ముగా శతమానమ్మని కావవయ్య పరమేశా ! రాజ రాజేశ్వరా ! భావం -- హే రాజ రాజేశ్వరా ! శతబిల్వాలతో నీకు అర్చన చేయాలని భావించి మనసులో నిన్ను ప్రతిష్టించాను . దీనినే శతరుద్రీయంగా భావిస్తూ , మదిలో శివత్వ భావనను అనుసంధానం చేసి సర్వార్ధ యుక్తముగా నూరు పద్యాలతో పూజ చేస్తాను . శతమానమ్మని దీవించి నన్ను కాపాడు స్వామీ ! 4 (షోడశోపచార యుక్త మానస పూజ ) జపముల్ యెన్నని చేయనయ్య కరమున్ సంధించి రుద్రాక్షలన్ తపమేచేయనసాధ్యమాయె ,భవబంధానంద బద్ధుండనై విపులోద్దీప్తహృదంతరాలయమునన్ వీక్షించి సాఖ్యమ్ముగా ఉపచారంబులు సేతునయ్య మనసే నుప్పొంగ , రాజేశ్వరా!

భావం-- హే రాజేశ్వరా ! రుద్రాక్షలను చేతబూని ఏ జపము చేయలేను . ఈ సంసార సంతోషపు బంధనాల్లో ఇరుక్కొని ఏ తపస్సూ చేయలేను . మనసు ఉప్పొంగి పొర్లగా ఆనందంతో నీకు నా హృదయాలయంలో ఉపచారాలు చేస్తాను . వాటిని స్వీకరించు స్వామీ! 5 ధ్యానం


ఇంతింతై శివుడింతయై ధరణిపై నింతై మహాలింగమై నంతై ద్వాదశ లింగ రూప విభుడై యంతైన కైలాసియై నంతై విష్ణు విధాతలే వెతుకగా నా మూల పర్యంతమం దంతై నిండె హృదంతరాలయము నన్ ధ్యానింప రాజేశ్వరా!

భావం--

 మనసులో  శివుని ధ్యానించగానే  లింగ రూపుడైన  ఈశ్వరుడు క్రమ క్రమంగా  పెరుగుతూ మహాలింగమై ,  ద్వాదశలింగ స్వరూపుడై ,   కైలాస మంతా నిండి నాడు . బ్రహ్మా విష్ణువులు వెతుకగా విశ్వమంతా నిండి సువిశాలమైన నాహృదయాలయమంతా వ్యాపించినాడు .                         6

ఆవాహనం


ఇదియే స్వాగతగీతమయ్య  ! మనసే యీశ స్తుతుల్ బాడగా మది యావాహన వేదికయ్యె యెదలో మంద్ర క్రియా శ్వాసలున్ హృదయాహ్లాదక గీతికా జయములై శృత్త్యున్నతిం గూర్చగా యెద వేద స్వరమాలపించె యెదురై యీశాన ! రాజేశ్వరా !

భావం-- హే రాజేశ్వరా ! ఇదే నీకు స్వాగత గీతం ! నా మనసు పరమేశ్వర గీతాలను పాడుతుంటే , ఆవాహనము కొరకు వేదికగా మారింది . సున్నితమైన ఉచ్చ్వాస నిశ్వాసలు హృదయాహ్లాదాన్ని కలిగిస్తూ వీనుల విందు గా జయ జయ ధ్వానాలు చేస్తున్నాయి. నా మనసే నీకు ఎదురై వేదస్వరం ఆలపిస్తుండగా నీవు ఇక్కడికి వేంచేయము స్వామీ ! 7

ఆసనం


కటువైనట్టి వృషోర్ధ్వభూమి యసలే కాదయ్య ,కాదయ్య , ను ద్భట సింహాసన శయ్యకాదు భువన బ్రహ్మండదేహుండవై యిట వేంచేయుము పార్వతీయుతుడవై యిష్టార్ధముల్గాంచ వి స్పుటమౌ నా హృదయాల యాసనమునే భూషించు, ,రాజేశ్వరా !

భావం -- ఎద్దు యొక్క కఠిన మైన ఊర్ధ్వ భాగం ఇది కాదు . డాంబికమైన సింహాసనం కూడా ఇది కాదు . భువనమంతా నిండిన బ్రహ్మాండ దేహం కలవాడివై నా కోరిక తీర్చు నట్లుగా పార్వతీ సమేతుడై ఇచ్చటికి విచ్చేయుము. నా హృదయం అనే ఆసనాన్ని అలంకరించు స్వామీ ! 8 పాద్యం


శివ పాదంబులు చిత్తమందు దలపన్ శింజానముల్‌ మోగెనే భవ పాదాబ్జములెత్తి కేల కడగన్ భాగీరథీ తోయమే స్తవమై పారెను పాదయుగ్మ విలస త్ సంధాయక ప్రీతమై శివు డభ్యాగత విష్ణువయ్యె మదిలో చిత్రమ్మె ,రాజేశ్వరా! భావం -- శివ పాదాలను మనసులో తలుచుకోగానే పరమేశ్వరుని పాదాల గజ్జెల సవ్వడి వినిపించింది . శివుడి రెండుపాదాలను ప్రేమ మీరగా చేతితో ఎత్తి కడగగానే భాగీరధీ నదీ జలమే స్తోత్రంగా ప్రవహించింది . నా మనసులో శివుడు అభ్యాగత విష్ణువైనాడు. 9 అర్ఘ్యం

ఏ హస్తమ్ము సుపుత్ర లాలనకునై యిచ్ఛన్ వినర్తిన్చెనో ఏ హస్తమ్ము భవాని చేతి బిగువై ఏడడ్గులే సాగేనో ఏ హస్తాగ్రపు శూల మెత్త జగముల్ యేకమ్ములై కుందునో ఆ హస్తమ్మున నర్ఘ్య మిచ్చెద మదిన్ హర్షించి, రాజేశ్వరా!

భావం -- ఏ చేయి పుత్రుని లాలించడానికై ఆడిందో , ఏ చేయి పార్వతీ దేవితో పాణిగ్రహణం చేసిందో ,ఏ చేతిలోని శూలం ఎత్తగానే లోకాలన్నీ ఒక్కటై వణికి పోతాయో , ఆ చేతిని మనసులో భావించి అర్ఘ్యం ఇస్తున్నాను స్వీకరించు స్వామీ ! 10 స్నానం ( అభిషేకం )

అభిషేకించెద రుద్రమూర్తినని నే ధ్యానస్థితిన్‌ జేరగా ప్రభలే నిండె మహేశ లింగ విభుడే ప్రాదుర్భవించెన్‌ మదిన్ శుభగంగాపరిషిక్తమయ్యె నెదయే శుద్ధాంతరంగమ్ముగా విభవోత్కృష్ట శివానుభూతి యిదియే ! విశ్వేశ! రాజేశ్వరా !

భావం-- శివాభిషేకం చేయాలని తలచి నేను ధ్యాన స్థితికి చేరగా అక్కడ కాంతులెన్నో నిండి లింగ స్వరూపుడైన శివుడే ఆవిర్భవించాడు. హృదయమంతా గంగానదీ జలంతో తడిసి పవిత్రమైంది . ఈ శివానుభూతియే ఒక మహా ఐశ్వర్యం! హే రాజేశ్వరా! 11 ఆచమనీయం


స్వామీ ! ఆచమనీయ పుణ్య జలమే స్పర్షించగా నామదిన్ వ్యామోహమ్ములు నీరమాయె మనసే వర్షించి నీరయ్యె యీ భూమే సర్వ జలాధిలింగ విభవోద్‌భూతమ్ముగా మారగా సోమాకల్పిత చంద్రికల్‌ గురియుచున్ శోభిల్లె రాజేశ్వరా ! భావం-- హే రాజేశ్వరా! నా మనసులో నీకు ఇవ్వాలని ఆచమనీయ జలాన్ని ముట్టుకోగానే నా వ్యామోహం అంతా నశించింది . మనసే వర్షించి నీరుగా మారి పోయింది . ఈ భూమి మహా జలలింగమై ప్రకాశించింది . సోముడి చే కల్పించ బడిన వెన్నెల అంతటా నిండి ప్రకాశించింది. . 1 2 వస్త్రం సమర్పయామి


గజ చర్మాంబరధారి కెట్టులిచటన్ కట్టింతునే బట్ట ? భా వజలింగేశ్వరు కెందుకయ్య పటముల్ వ్యర్థాంబరక్రీడలున్ సృజవస్త్రమ్ములవెందుకయ్య ?హృదయసృష్ట్యంబరాలుండ నే సృజియించిచ్చెద ! హే దిగంబరధరా !శోభిల్ల, రాజేశ్వరా! భావం--

గజచర్మధారి వైన నీకు నేను ఏ వస్త్రాలను సమర్పించాలి ? భావరూపుడవైన నీకు నేను ఏ బట్టలు ఇవ్వాలి ? ఈ వ్యర్ధమైన వస్త్రక్రీడలు నీకెందుకు ?  త్యజించ దగిన  వస్త్రాలూ నీకెందుకు ? నీకు నా హృదయంలోనే గొప్ప వస్త్రాలను సృష్టించి ఇస్తాను స్వీకరించు , హే దిగంబరధరా ! శివా !                                       13

యజ్ఞోపవీతం


హృదయోద్భూతము హృద్య పాత్ర ము శృతిప్రోక్షిప్త గ్రంథిత్రయా స్పదమై నొప్పెడు యజ్ఞ సూత్రము విధిన్‌ శాస్త్రోక్త కాలమ్ము నం దెదలో నీకు నమస్కరించి విలసద్వేదోక్తమై వేసితిన్ త్రిదళోద్భాసిత ! వేద వేద్య వినుతా ! శ్రీ రాజరాజేశ్వరా! భావం-- హృదయంలో పుట్టింది , అందమైన వస్త్రము , వేదం చే ప్రోక్షణ చేయబడింది , మూడు ముళ్ళ తో ప్రకాశించేదీ అయిన యజ్ఞోపవీతం విధిగా శాస్త్రం చెప్పిన సుముహూర్తంలో నా మనసులో నీకు నమస్కరించి వేదోక్తంగా

వేసినాను  .హే త్రిదళోద్భాసితా ! వేద వేద్య వినుతుడా ! స్వీకరించు!14

గంధం


మదిలో మల్లెలు పూచినట్లు విరులే మత్తిచ్చినట్లు ప్రభో ! యెదలో వెన్నెల కాచినట్లు పొగమంచున్ చుట్టి యున్నట్లు నీ పద సంధానము జేరి చందనమహా పంకమ్ము చర్చింప నా హృదయమ్మే హిమధామమై నిలువగా హృద్యమ్మె! రాజేశ్వరా ! భావం--

హే రాజేశ్వరా! నామదిలోనే ఉన్న నీ సన్నిధికి చేరి నీ శరీరానికి చందనాన్ని పూయగా మల్లెలు పూచినట్లు ,పూవులే మత్తును గొల్పినట్లు , ఎదనిండా చల్లని పొగ మంచు కమ్మినట్టుంది . నాహృదయమే ఒక హిమాలయమై హృద్యంగా నిలిచింది స్వామీ ! 15 నానా విధ పుష్పాణి


ఏ లోకమ్మున చూడలేని సుమముల్ యెన్నో సమర్పించెదన్ ప్రాలేయాంబుకణార్ద్ర పుష్ప చయముల్‌ భస్మాంగరేఖాకృతుల్‌ కైలాసోర్ద్వముఖ ప్రసూనశతముల్ గంగాంబుజప్రాయముల్‌ ఆలోకించి పరిగ్రహించు హృదయాహ్లాదమ్మె , రాజేశ్వరా! భావం-- హే రాజేశ్వరా ! ఏ లోకంలో లేని పుష్పాలు నీకు ఎన్నో సమర్పిస్తాను . మంచు బిందువులతో విలసిల్లే గొప్ప పూగుత్తులు , భస్మ రేఖల ఆకారం తో ఉన్న పూలు , కైలాసం వైపు చూసే పూలు , గంగాజలపద్మాల వంటి పూలు ... ఇవన్నీ నా మనసు లో నీకు సమర్పిస్తాను . ఎంతో హృదయాహ్లాదం కలుగుతుంది . పరిగ్రహించు స్వామీ ! ( దీని లోని పూల పేర్లన్నీ పూలు కాకుండా శివ సంబంధమైనవి ఉంచడం జరిగింది ) 1 6 ధూపం


చూర్ణాకీర్ణ దశాంగ మిశ్రితమునౌ శుద్ధ ప్రధూపమ్ము సం పూర్ణ వ్యాప్తముగాగ హృద్య ముగ శంభో యంచు ఘోషించ సౌ వర్ణోద్దీప్తులు తేజరిల్లి మనసే బంగారమేకాగ నా స్వర్ణమ్మంతకు తావి యబ్బెను గదా , సత్యమ్ము !రాజేశ్వరా ! భావం--

పదిరకాల చూర్ణాలతో చేసిన శుద్ధ మైన ధూపం మనసులో అంతటా నిండగానే హృదయం సంతోషించు నట్లుగా " శంభో  "అంటూ శివనామ ఘోషలు వెలువడ్డాయి .  ఆనందంతో మనసంతా బంగారమైంది  ఈధూపం వలన నా బంగారం వంటి మనసుకు తావి అబ్బింది స్వామీ . రాజేశ్వరా!        1 7

దీపం


దీపంబెవ్వడు జాపు లోకములకున్ దీపంబు తానెవ్వడున్ దీపింపన్ గల సూర్య చంద్రు లెవడున్‌ దీప్తాగ్ని యెవ్వండహో దీపోద్భాసక మూలశక్తియుతుడై దీపించు నెవ్వండు నా దీపాదిత్యుని ముందు దీపమిడితిన్ దీపింప , రాజేశ్వరా! భావం-- ఎవడు సమస్త లోకాలకు కాంతిని ఇచ్చేవాడో , ఆ కాంతియే తానైనవాడు ఎవడో , ఉజ్వలంగా ప్రకాశించే సూర్యుడు , చంద్రుడు ,అగ్ని కూడా తానే అయిన వాడు ఎవడో , ప్రకాశానికే మూల కారణం అయి ఎవడు ప్రకాశిస్తున్నాడో ఆ కాంతి స్వరూపుడి ముందు దీపం ఉంచుతున్నాను హే రాజేశ్వరా! 1 8 నైవేద్యం సమర్పయామి


పలు భోజ్యంబుల నూహ జేసితినయా భక్షించవయ్యా శివా ! పులిహోరల్ పరమాన్నముల్‌ దధి వడలు బూరెల్ సిరల్ లడ్డులున్ తొలుతన్ నీవది యెంగిలించగ సుధాతుల్య ప్రసాదమ్ముగా తలవన్‌ చిత్తము శుద్ధమయ్యె , శివ యుక్తమ్మయ్యె !రాజేశ్వరా! భావం-- హే రాజేశ్వరా! ఎన్నో భోజన పదార్దాలను ఊహ లో సిద్ధం చేశాను . పులిహొరలు , పరమాన్నాలూ , పెరుగు వడలు , బూరెలు , సిరలు , లడ్డూలు భక్షించండి . తొలుత నీవు ఎంగిలి చేయగా మాకు అమృత తుల్యమైన ప్రసాదం అవుతుంది . ఇలా భావించగానే శివునితో మమేకమై చిత్తమంతా శుద్ధమవుతుంది . 19 హారతి


తారా చంద్ర ఖగోళ కాంతిచయముల్ తామై ప్రభల్ గూర్చగా ధారాశుద్ధములైన మానస కృతుల్

తత్త్వజ్ఞులే మెచ్చగా

శ్రీరాగశృతి గూర్చి మంగళ మహాశ్రీ కైశికీ గీతులన్ తారాహారతి నిత్తునయ్య జగమంతా వెల్గ ,రాజేశ్వరా !

భావం--

నక్షత్రాలు , చంద్రుడు ,ఖగోళములు వీటి సమూహాలు తామే కాంతి పుంజాలు కూర్చగా , ధారా శుద్ధితో మనసులో జనించిన కృతులను తత్త్వజ్ఞులు మెచ్చునట్లు శుభకరమైన శృతిని గూర్చి మంగళ మహా శ్రీ రాగ గీతుల తో జగమంతా ప్రకాశించేలా ఆలపిస్తాను . హే రాజేశ్వరా! 20 ఆత్మ ప్రదక్షిణ నమస్కారం


ఏ మంత్రమ్ములు యే క్రియల్‌ తెలియ నే నేరీతి హృద్యమ్ముగా శ్రీ మంతమ్మగు నాత్మవైభవమహా శ్రీ లింగమే నిల్పుచు స్తోమంబౌ హృదయాంతరంగప్రణతుల్ స్తోత్రించుచున్ విశ్వసం క్షేమంబున్‌ మదికోరి వేడెతినయా , శ్రీ రాజరాజేశ్వరా! భావం--

నేను మంత్రాలు  , క్రియలు తెలియని వాడిని .  హృదయానందాన్ని కలిగించి మహావైభవం తో ఒప్పారే ఆత్మ లింగాన్ని మనసులో నిలిపి ,

సకల లోక కళ్యాణాన్ని కోరుతూ, స్తుతి రూపమైన నమస్కారాలు సమర్పిస్తున్నాను స్వామీ , హే రాజేశ్వరా! 21 శ్రీ రాజేశ్వర పాద పద్మ యుగళీ చింతా మృతానందమున్‌ శ్రీ రాజేశ్వర లింగ పూజనవిధిన్‌ సేవామహాభాగ్యమున్ శ్రీ రాజేశ్వర నామవైభవకథా ప్రీత్యున్నతాసక్తియున్ శ్రీ రాజేశ్వర ! చాలు చాలు నిదియే ! చింతింప ,రాజేశ్వరా! భావం -- శ్రీ రాజేశ్వరుడి పాద పద్మాలను గురించిన ఆలోచన అనే అమృత ము,...

శ్రీ రాజేశ్వరుడి లింగ పూజ చేసే మహా భాగ్యం, ...

శ్రీరాజేశ్వర వైభవాన్ని కీర్తించే గొప్ప ఆసక్తి .... ఇవి నాకు చాలునయ్యా రాజేశ్వరా! 22) కలయే కంటిని నిద్రలో హర హరా ! కాంతుల్విరాజిల్లగా యిల యెంతో సుఖవంతమై , హసితమై ,యెంతోమహౌజ్వల్యమై ఫలవంతమ్ములునైన కోరికలతో భాసిల్లె సర్వమ్ము నే తలచే స్వప్నము సత్యమై నిలుపరాదా ? స్వామి ! రాజేశ్వరా! భావం-- హే రాజేశ్వరా! నేనొక కలగన్నాను . ఆ కలలో ప్రపంచమంతా సుఖంగా , ఆనందంగా నవ్వుతూ , కోరికలన్నీ తీరిన సంతోషంతో కాంతులు విరాజిల్లుతూ కనిపించింది . నా ఈ కల నిజమే అవును గాక అని దీవించు స్వామీ !

2 3 )

శివలింగమ్మును జూడ దివ్య మగు కాశీ ధామ విశ్వేశుడై శివ గోకర్ణ పురేశుడైన భవుడై శ్రీ కాళహస్తీశుడై భువి రామేశ్వరుడై చిదంబర పురీ భూ మధ్య శూన్యాత్ముడై దివియైనొప్పు హిమాద్రిపై యమర నాథేశుండు ,రాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వరా ! శివ లింగమును చూడగా కాశీ విశ్వేశ్వరుడై , మంగళకరుడైన గోకర్ణ క్షేత్ర మహేశ్వరుడై , శ్రీ కాళ హస్తీశ్వరుడై , భూలోకంలో వెలిసిన రామేశ్వరుడై భూమికి గరిమనాభి వంటి చిదంబరం లో వెలిసిన శూన్య స్వరూపుడైన నటరాజై , స్వర్గం వంటి హిమాలయం పై వెలిసిన అమరనాథేశ్వరుడై ఆ మహేశ్వరుడే కనిపిస్తున్నాడు 24 ) ప్రాభాతమ్మున నిద్రలేచి ఉదయద్‌భాను ప్రభాబింబమున్ నా భాగ్యమ్మున గంటినంచు మదిలో నానంద రూపున్ శివున్ నే భావించి పవిత్ర ధర్మ జలమున్‌ నిత్యాభిషేకమ్ముగా శోభా యుక్తము గాగ యిచ్చెద శివా శుద్దాత్మ ! రాజేశ్వరా! భావం -- సుప్రభాత కాలంలో నిద్ర లేచి ఉదయించే సూర్య బింబాన్ని చూస్తూ నా అదృష్టం గా భావించి. ఇదే శివ స్వరూపమని తలచి పవిత్రమైన ధర్మ జలాన్ని నిత్యాభిషేకంగా మహా వైభవం విలసిల్లేలా సమర్పిస్తాను , హే రాజేశ్వరా! 25) కనులన్ మూసి కనంగలే రనిమిశుల్ కాంక్షించి యైనన్‌ మదిన్‌ కనులన్ మూసియు కాంతురయ్య నరులున్‌ కామ్యార్ధ సంభావ్యులై మనసంతన్‌ కనులైనవేళ మదిలో మాహేశ్వరుండే స్వయం జనితుండై చరియించు సంతసముతో సత్యమ్ము , రాజేశ్వరా! భావం -- హే రాజేశ్వరా ! రెప్పపాటులేనివారైన దేవతలు కళ్ళు మూసి చూడలేరు . కానీ మానవులు కళ్ళను మూసి కూడా తాము కోరిన దానిని చూడ గలుగుతారు . శివుని దర్శించాలని కోరుకొని మనసంతా కళ్ళు చేసుకొని చూడగా శివుడే స్వయం గా ఉద్భవించి మదిలో ఆనందం గా సంచరిస్తాడు. 26 లింగేశున్ స్పృశియించి శంభు దలపన్ లీనమ్మునై భక్తితో నంగాంగమ్మును పుల్కరించె , వివశానందాంబుధిన్‌ తేలి, యు త్తుంగాగ్రమ్మును జేరి సంతసము నన్ దూర్‌ ధ్వ స్థితిన్ బొందగా గంగాంభః పరిషిక్తమయ్యె మది , గంగానాథ !రాజేశ్వరా ! భావం--- హేమహేశ్వరా ! శివలింగాన్ని స్పర్షించగానే హృదయం శివునిలో తీనమై శరీరమంతా పులకరించింది . వివశంతో ఆనందసంద్రంలో తేలిపోయింది . నా మనసు హిమాలయాన్ని చేరి ఉత్కృష్ట స్థితిని చేరింది. గంగాజలంతో మనసంతా తడిసిపోయింది . 27) నీ యర్ధాంగి కుడిన్‌ వసింప ఎడమన్ నీపుత్రుడున్‌ సిద్ధల క్ష్మీయుక్తుండయి కోర్కె దీర్చగ మహా క్షేమమ్మె యిచ్చోట నిన్ "ఓయన్నా "యని పిల్చువేళ గళ మందోంకారమే నిండ నా కాయమ్మే శివధామమై నిలుచుటే ఖాయమ్ము !రాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వారా ! నీ అర్ధాంగియైన పార్వతీ దేవి కుడి వైపు ఉండగా ఎడమ వైపు నీ పుత్రుడు లక్ష్మీ గణపతి భక్తుల కోరికలు తీరుస్తుండగా అంతా క్షేమంగా ఉన్నారు. నిన్ను ఓ యన్నా ! అని ఆర్తితో పిలువగా నాగళంలో ఓంకారం వెలువడింది.ఇ ముని వలె నిల్చి నిన్ను ధ్యానించగా మాయ చేసినట్లుగా నాశరీరమే శివ స్థానమై నిలుస్తుంది. ! 28) చాళుక్యాధిపు రాజరాజుమది యే స్వప్నమ్ము భాసించెనో వేళాభాగ్యమొ వింతగా గ్రహపతుల్ వేంచేసిరో యేమొ ?లేం బాళేశాలయ ధామమొప్పె భువిపై బ్రాహ్మణ్య సంస్తూయమై బోళాశంకర ! ధన్యవాదములు !, శంభో !రాజరాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వరా! చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుడికి యే కల వచ్చిందో ఏమో ? ఏవేళ గ్రహాలన్నీ ఆశ్చర్యకరంగా కలిసి వచ్చాయో ఏమో  ?,బ్రాహ్మణస్తుతి పాత్రమైన వేములవాడ గ్రామం ఇక్కడ వెలుగొందింది . ధన్యవాదాలు స్వామీ ! 29 ) సుఖ సంపత్తులు గోరనయ్య భువిలో సుఖ్యాతులన్‌ గోర నే మఖముల్ చేయగలేను యాగ ఫలమే మాశించగా లేను యే శిఖలన్‌ శీర్శము నందు జుట్టి తపముల్ జేయంగ లేను ప్రభో ! ఒక కోర్కెన్‌ సరి కోరలేను కతమేమోనయ్య ! రాజేశ్వరా! భావం -- నేను ఈ భూమిపై యే సుఖాలను , సంతోషాలనూ కోరటం లేదు . యే కీర్తిని కోరటం లేదు . యే యాగాలను చేయడం లేదు యాగ ఫలితాన్నీ కోరటం లేదు . తలకు శిఖలను దాల్చి తపస్సు చేయలేను . ఒక్క కోరిక కూడా కోర లేక పోతున్నాను . ఎందుకో తెలియదు స్వామీ ! హే రాజేశ్వరా! 30 ) కలలో జూచిన చాలు పుణ్య మొసగే గంభీర శీతాద్రులున్‌ పలుచోట్లన్ సెలయేటి సుందర ఝరుల్ భాగీరథీ తోయముల్‌ తెలిమంచుల్ వెలిగప్పు శృంగ చయముల్‌ దీపించు శుక్లాభ్రముల్ ఇల కైలాస మిదే యనంగ నిజమే ! ఈశాన ! రాజేశ్వరా! భావం- హే రాజేశ్వరా! ఒకసారి కలలో చూచినా చాలు ఎ

పుణ్యం కలిగించే  హిమాలయాలు ,  చాలా చోట్ల ప్రవహించే సెలయేటి ధారలుగల  గంగానదీ జలాలు    , లేలేత మంచుతో తడిసిన  పర్వత శృంగాలు ,  తెల్లని మేఘాలతో  విలసిల్లే ఈ హిమాద్రి  నిజంగా  భూమిపై వెలసిన కైలాసమే స్వామీ !                                   31)

కలలోనైన భయమ్ము గొల్పు గిరులున్‌ గంగాఝరీ ఘోషలున్‌ పలుచోట్లన్ పడి రాలు కొండ చరియల్ వర్ష ప్రఘాతమ్ములున్ చలిలో యేల చరింతువో ?హిమ గిరీశా ! మా పురింజేరి మా కొలువై నిల్చి సుఖించుమా ! ప్రియముతో కోరంగ , రాజేశ్వరా! భావం -- హే రాజేశ్వరా! కలలో కూడా భయం కలిగించే ఎత్తైన హిమాలయ పర్వతాలు , ఎగిసి పడే గంగా జల ధారలు , విరిగిపడే కొండచరియలూ, ఘోరమైన వర్శపాతం , భయంకరమైన చలి .. వీటిలో ఎలా నివసిస్తావయ్యా ? మా కోరికపై మావద్దకు వచ్చి ఇక్కడ సుఖంగా ఉండు ఈవరం మాకు ప్రసాదించు స్వామీ ! 32) శివ నాట్యాద్భుత కేళివేళ డమరున్‌ చే దాల్చి మ్రోయించగా భువన వ్యాప్తములయ్యె వర్ణచయముల్ పూర్ణప్రదీప్తంబులై కవనోద్భూత వరమ్ములయ్యె శృతు లున్ కావ్యమ్ములున్ శాస్త్రముల్ స్తవముల్‌ నీకివి వాజ్మయ ప్రణతులే సత్యమ్ము ,రాజేశ్వరా ! భావం-- శివుడు అద్భుతంగా నాట్యం చేసేవేళ చేతితో డమరును మోగించగా కాంతివంతంగా అక్షరాలు ఉద్భవించి భువనమంతా వ్యాపించాయి . సకల వేదాలు , కావ్యాలు , శాస్త్రాలు కవుల చేతి వరాలుగా ఉద్భవించాయి . ఈ వాజ్మయ మంతా నీకు స్తుతి రూపమే స్వామీ ! హే రాజేశ్వరా ! 3 3) ఏ శైలమ్ము తరించెనో ?శివపదమ్మే యద్రి యర్చించెనో ? యే శైవాచల దివ్య యోగ బలమో ? యే పర్వత ప్రార్ధ్యమో ? యే శైవస్తుతి పాత్రమైన గిరియో ఈ మూర్తినందించగా యీశానాలయ రాజలింగ కృతియయ్యేనయ్య రాజేశ్వరా ! భావం-- ఏ పర్వతం నీ సేవకై తరించిందో ? ఏ అద్రి నిన్ను పూజించిందో  ? ఏశైవాచలం యొక్క దివ్యయోగ బలమో ఏమో ? ఏ నగము నిన్ను పార్థించిందో ? ఏ గిరి నీ సేవకు పాత్రమైందో యేమో , అదియే నీ శిలామూర్తిని అందించగా ఇక్కడ రాజ లింగమై వెలిసింది ,హే రాజేశ్వరా ! 3 4 ) కేదారేశ్వరు జూచితిన్ హిమగిరీ కైవల్య ధామంబునన్ వేదేశున్ భజియించినాను మనసా విశ్వేశు కాశీపురిన్ యేదేశంబు చరించి చూచిన శివా యేకాగ్రతన్ వీడకన్ మోదమ్మౌ హృదయాంతరాళ పదమే మోక్షమ్ము ,రాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వరా ! పవిత్రమైన మోక్ష దాయకమైన హిమగిరిపై కేదారేశ్వరుని దర్శించాను . కాశీ పురిలో వేద స్వరూపుడైన విశ్వేశ్వరుని దర్శించినాను . ఎక్కడికి వెళ్ళినా ఏకాగ్ర చిత్తం తో నిన్ను చూడగలిగితే చాలు ! అదే మోక్షం ! 35 ఎందెందున్‌ మరి జూడ నందున శివుండేవుండు సర్వాత్ముడై డెందమ్మందు నభమ్మునందు కదలాడే జీవి నిర్జీవులం దిందందే గలడంచుచెప్ప తరమే ! ఈశాన తత్త్వమ్మనే యందంబైన శివత్వ భావన యిదయ్యా ! రాజరాజేశ్వరా !

భావం -- ఎక్కడ సరిచూచినా శివుడే సర్వాంతర్యామియై ఉన్నాడు. మనసులలో ,ఆకాశంలో నూ మరి వాడే ఉన్నాడు! కదిలే జీవుల్లో , జీవం లేని వాటిలో నూ ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు , అక్కడే ఉన్నాడు అంటూ చెప్పడం కష్టం ! ఆయన అంతటా ఉన్నాడు. ఈ ఈశ్వర తత్త్వమే ఒక అందమైన గొప్ప భావన 3 6) భాగ్యమ్మే విలసిల్లనీ సిరులతో వర్ధిల్లనీ నిత్యమున్ భోగ్యమ్మైన సుఖానుభోగ చయ ముల్ భోగించనీ దివ్య వై రాగ్యమ్మున్ వడి యన్ని వీడి యతిగా రాజిల్లనీ కాని స ద్యోగ్యమ్మైన శివార్చనన్‌ విడనయా , యోగేశ !రాజేశ్వరా ! భావం-- ఎన్ని సిరి సంపదలు అయినా రానీ , నిత్యం ఎన్నో సుఖాలను అనుభవించనీ , దివ్యమైన వైరాగ్యం లో పడి పోయి యతీశ్వరుడిగా మారినప్పటికీ మహాయోగమైన శివార్చన మాత్రం విడిచి పెట్టను స్వామీ , హే రాజేశ్వరా! 3 7) కాంచన్‌ జాలును కన్నులార వరదున్‌ కాలస్వరూపున్ శివున్ ప్రాంచద్ భూష మహేశ లింగ విభవ భ్రాజున్ భవానీ వశున్‌ పంచాస్య స్తుత పానవట్టము పయిన్‌ ప్రార్థించి ' శంభో శివా యంచున్ జేర్చుము ఫాలభాగమదియున్‌ యాగమ్మె రాజేశ్వరా!

భావం--

వరములను ఇచ్చే వాడిని , కాల స్వరూపుడైన శివుని    , పార్వతీదేవికి వశమైన వాడిని కనులార చూస్తేనే చాలు !

పంచ తత్త్వాలతో విలసిల్లే పానవట్టం పై నుదుటిని చేర్చి " హే శంభో హే శివా !"అంటూ పార్థిస్తే చాలు అదే ఒక మహా శివయాగం !3 8) ప్రళయాగ్నుల్‌ దెస విస్తరిల్ల భువన బ్రహ్మండ భాండమ్ములే జలయుక్తమ్ములు గాగ భీషణ గతిన్‌ జ్వాలాయమానమ్ముగా కలికాలాంతపు శైవతాండవ మహా కాళుండవేయైన మం గళ రూపమ్మునె గాంతునయ్య మనసే కాంక్షించ రాజేశ్వరా ! భావం -- దిక్కులన్నీ ప్రళయ కాలాగ్నులతో నిండి భువనాలు అనే బ్రహ్మాండ భాండాలన్నీ జల మయం కాగా , భయంకరంగా కలికాలం అంతమయ్యే సమయాన నీవుశివ తాండవం చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు మంగళ స్వరూపుడుగానే కనిపిస్తావు స్వామీ , హేరాజేశ్వరా ! 39) రాజుల్ వోయిరి రాజ్యముల్‌ గత చరిత్రా లేఖ్యమై పోయెనే! రాజ శ్యామల రత్నకాంతి విలస ద్రాజన్యమైనట్టి యా తేజోవంతపు రాజ లింగము మహా దేవాధివాసంబులున్‌ రాజిల్లేను తదాది నుండి ఘనమై రాజాధిరాజేశ్వరా !

భావం -- హే రాజేశ్వరా! రాజులూ ,రాజ్యాలూ అంతరించాయి . ఇవి గతచరిత్రలో రాయబడ్డ రాతలుగా మారి పోయాయి . మహా నీలమణి కాంతులతో విలసిల్లే ప్రకాశ వంత మైన రాజేశ్వర లింగమూ మరియూ శివాలయం మాత్రం ఆనాటి నుండి ఈనాటి వరకూ ఘనంగా విలసిల్లుతూనే ఉన్నాయి. 40) విన్నానయ్య మహేశ సూత్రచయ ముల్ విన్నాను శైవోక్తులన్‌ విన్నా నే దశకంఠ రావణ కృతుల్ వింటిన్‌ మహిమ్న స్తుతుల్ విన్నానిచ్చట నాదిశంకర నుతుల్‌ విన్నాను రుద్ర శృతుల్ విన్నా నా చెవులార శంభుని కథల్‌ విశ్వేశ! రాజేశ్వరా ! భావం--- మహేశ్వర సూత్రాలను విన్నాను . శివోక్తులను ఎన్నిటినో విన్నాను . రావణ రచితమైన కృతులను విన్నాను . మహిమ్నుడు రచించిన స్తోత్రాలను కూడా విన్నాను . ఆది శంకరాచార్య రచించిన నుతులను విన్నాను. రుద్ర వేదాలనూ నాచెవులారగా విన్నాను హే రాజేశ్వరా! 41 భస్మంబయ్యెను మన్మధుండు భువన ప్రాయోజనాకాంక్షతో భస్మంబాయెను విస్మరించి తననే భస్మాసురేంద్రుండు తా భస్మంబౌనట లోకమెల్ల ప్రళయ ప్రాయక్రియావేళ నీ భస్మాభీష్టత ఇందుకేమొ కదయా భస్మాంగ రాజేశ్వరా ! భావం --- జగత్ శ్రేయస్సుకై మన్మథుడు భస్మమైనాడు . తనను తాను మరిచి పోయి భస్మాసురుడూ భస్మం అయ్యాడు. ప్రళయ కాలం లో లోకమంతా భస్మం అవుతుందట ' నీకు భస్మం అంటే ఇష్టం అందుకే కాబోలు , హే రాజేశ్వరా! 4 2 ) శివలింగార్చన జేసి ధన్యులయిరే సిద్దుల్ మహాయోగులున్‌ దివిజేంద్రుల్ దివిజుల్ విధాతయు మహా దిక్పాలకుల్‌ దైత్యులున్ శివ ! నీ యర్చన సేయు భాగ్యమునకై శీర్షమ్మునన్ రాతగా కవియై రాయవలెన్‌ విధాతయె మహత్కావ్యమ్ము రాజేశ్వరా! భావం --- శివ లింగార్చన చేసి ఎందరో సిద్ధులు, యోగులు , ఇంద్రుడు , బ్రహ్మది దేవతలు , దిక్పాలకులు రాక్షసులు కూడా ధన్యులైనారు . నీ పూజా భాగ్యం కావాలంటే విధా త యే ఒక కవిగా మారి కావ్యం రాసినట్లుగా పవిత్రమైన తలరాత రాయాలి ! 4 3 ) పరమేశుంగన నెందుకయ్య తపముల్‌ భారక్రియాటోపముల్‌ స్థిరమై డెందము నందుచూడు మదిలో సిద్ధప్రదేహుండునై పరకోశాంతర భాసమానవిభుడై భస్మప్రదీప్తుండునై సిరులిచ్చే వర శైవమూర్తి యెదుటే సిద్ధించు ,రాజేశ్వరా ! భావం-- హే రాజేశ్వరా! ఈశ్వరుని చూడడానికై తపస్సు చేయడం ఎందుకు? భారమైన డాంబికపు పనులు చేయడం ఎందుకు ? ఏకాగ్రతతో మనసులో చూస్తే చాలు , సిద్ధమైన దేహం కల వాడై , ఉత్కృష్టమైన పంచ కోశాలలో ప్రకాశించే వాడై, భస్మం తో విలసిల్లే శరీరం కలవాడై ఐశ్వర్య ప్రదాత అయిన శివుడే కళ్ళ ముందు నిలుస్తాడు. 44 ) తేలేనయ్య సువర్ణ పుష్ప తతులన్‌ తేలేను స్వర్భోగముల్‌ లేలేగల్ వడి తాగు స్తన్య సుధలన్‌ తేలేను గోక్షీరముల్‌ తేలేనెట్టి మహాప్రసాదచయముల్ తేలేను దధ్యన్నముల్ తేలేనంచు మదిన్‌ గణించక శివా దీవించు రాజేశ్వరా! భావం-- హే రాజేశ్వరా ! ఎంతో గొప్ప పూలను తేలేను . ఏ రథాలను , మహా భోగాలను కూడా తేలేను . లేగలు తాగాల్సిన అమృత తుల్యమైన పాలను తేలేను . గొప్ప వైన ప్రసాదాలు దధ్యోదనములు సైతం తేలేను . వీటిని తేలేదని మనసులో భావించకు హే పరమేశ్వరా ! 45 . కాంచన్‌ జాలును కన్నులార వరదున్‌ కామేశు రాజేశ్వరున్‌ కాంచే మంచు కనుంగవల్ తెరుచుచున్ కన్మూయుచున్ తల్చు చున్ కాంచేరయ్య మహేశ లింగవిభవున్ కాంక్షించి నీ భక్తుడున్ కాంచీ భూత పు పానవట్ట శిలపై కైలాస రాజేశ్వరా! భావం... శ్రీ రాజేశ్వరుని చూడడానికి ఎందరో భక్తులు వస్తున్నారు. కన్నులు తెరిచి ఆ పరమేశ్వర లింగాన్ని చూసి కన్నులను మూసి మనసులో భావన చేస్తున్నారు . కాంచీ భూతమైన పానవట్టం పై ఆ శివలింగాన్ని దర్మించి నమస్కరిస్తున్నారు. 4 6 ) గళమంతా గరళమ్ము నిండ మరి నీ కంఠాన సర్పావళుల్‌ ప్రళయాగ్నుల్ కురిపింప రుద్రభువి నీ పాదాలు నర్తించగా దళితోద్గాత్ర పిశాచ యుక్తులగు బేతాళాదులందున్న , మం గళమూర్తీ యని పిల్చువేళ నరులన్ కాపాడు రాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వరా! నీ గళమంతా గరళం నిండినప్పటికీ , నీ కంఠం చుట్టూ ఉన్న సర్పాలు ప్రళయాగ్నిని కురిపిస్తున్నా , రుద్ర భూమి లో నీ పాదాలు నర్తిస్తున్నా, దెబ్బ తిన్న దేహాలు గల పిశాచాలు బేతాళాదుల మధ్యలో ఉన్నప్పటికీ నీ భక్తులు హే మంగళ మూర్తీ శివా అని పిలువగా తక్షణమే వారిని కాపాడు స్వామీ ! 47) ఏదైవమ్ము సృజించెనో ?హిత మతుల్ యే తీరు యోచించిరో? వాదద్వంద్వము లేని యట్టి సుగతిన్‌ భాసించు తత్త్వద్యుతిన్ నాదోపాసక తత్త్వ సాధక శివ న్యాసంబునై నొప్పగా వేదార్థామల శైవలింగమమరెన్ విశ్వేశ! రాజేశ్వరా ! భావం-- హే రాజేశ్వరా! ఏ దైవం సృష్టించిందో ఏమో ? సమాజ శ్రేయస్సును కోరే వారు ఏ తీరుగా ఆలోచించారో ఏమో ? వాదవివాదాలకు ఆతీతంగా ఉన్న , నాదోపాసకుల సాధకమైన ,మంగళ కరమైన , మహా ప్రకాశ వంత మైన మరియు వేదాలలో వర్ణించినటువంటి పవిత్రమైన శివలింగం మా కోసం అవతరించింది. 48 ) కైలాసమ్మతి దూరమే ! తనువుతో కైవల్యమున్ చేరమే ! బోలా శంకర సన్నిధానమున శంభో యంచు ప్రార్థింపగా లీలా ప్రాయముగాదె ఈశ్వరకృపన్‌ లింగార్చనా భాగ్యమై ప్రాలేయాచల శైవభూమి యెదుటే భాసించు , రాజేశ్వరా!

భావం -- హే రాజేశ్వరా! కైలాసం చాలా దూరంలోనే ఉంటుంది . శరీరంతో కైవల్యం చేరడం కాని పనియే  ! కానీ ,బోలా శంకరుడి సన్నిధానంలో కేవలం "శంభో 'అంటూ ప్రార్థించడం చాలా సులభం. ఆ పిలుపే లింగార్చనతో సమానం . ఆ ప్రార్ధన వలన ఈశ్వర కృప అలవోకగా లభిస్తుంది. ఉన్నత మైన కైలాస దేవాలయం మదిలోనే భాసిస్తుంది ! 49 ) ప్రాత: కాలపు గంట మోగె గుడిలో ప్రాభాత భూపాలమై స్రోతస్సుల్‌ ప్రవహించ సాగె యెదలో శ్రోత్రామృత ప్రాయమై జ్యోతిర్లింగ మహేశ రూప మెదలో చోద్యంబుగా దోచె నా చేతస్సంతయు నిండ నీవె గదరా శ్రీ రాజరాజేశ్వరా !

భావం -- హే రాజేశ్వరా! సుప్రభాత వేళ గుడిలో గంట మోగగానే నా మనసులో ఆహ్లాదకరమైన భూపాలరాగం వినిపించింది . ఎదలో అమృత తుల్యమైన నదులు ప్రవహించాయి . ఆశ్చర్యకరంగా జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్న మహేశ్వరుడే మదిలో భాసించాడు . నా చిత్తమంతా నీవే ఉన్నావు కదా స్వామీ ! 50 ) జలలింగమ్ముగ జంబుకేశ్వరుడునై జ్వాలాగ్నిలింగమ్ముగా వెలుగే శ్రీ యరుణాచలేశ్వరుడునై వేంచేసె నీశుండు భూ స్థలలింగమ్ముగ కంచియందు వెలసెన్ సర్వేశ్వరుండై మహా శిల రూపమ్మగు వాయులింగ విభుడే శ్రీ కాళహస్తీశుడై ఇలనాకాశపు లింగమయ్యె నటరాజే పంచ తత్త్వమ్ములౌ పలురూపమ్మలు నీవెకాద ? యెద సంభావింప రాజేశ్వరా ! భావం-- జలలింగ స్వరూపంతో జంబు కేశ్వర స్వామిగా , అగ్ని లింగ స్వరూపం తో అరుణాచలేశ్వరుడుగా , పృధ్వీ లింగ స్వరూపంతో కంచి పరమేశ్వరుడుగా , వాయు లింగ స్వరూపంతో శ్రీ కాళ హస్తీశ్వరుడిగా , ఆకాశలింగ స్వరూపంతో నటరాజ స్వామిగా పంచ భూత రూపం లో ఉన్నది నీవే స్వామీ , హే రాజరాజేశ్వరా ! 51) శివభక్తుండొక దానవుండు పదియౌ శీర్షాల ఘోషిల్లగా శివ నాట్యాద్భుత భవ్య సంస్కృత పద శ్రీ కాంతు లొప్పారె , యా కవి సాధించిన కీర్తి యెల్ల మరి గంగన్ గల్సె ఏకైక దో శవికారంబున చిత్రమైన చరితే, సత్యమ్ము ,రాజేశ్వరా! భావం -- శివ భక్తుడు అయిన దశ కంఠ రావణుడు సంస్కృత పద భూయిష్టంగా శివ తాండవ స్తోత్రం రచించాడు . చిత్రమైన సంగతి ఏమిటంటే ఒకే ఒక్క దోష కారణంగా అతని గొప్పతనమంతా నీట గలిసి పోయి దుర్మార్గుడుగా చరిత్ర లో నిలిచి పోయాడు . 52) అన్నా ! వీరిని గావుమన్న , ఉదరాయాస ప్రదగ్దాంగులై యున్నారాకలి రాజ్యమేలు ప్రభువుల్ ప్రోచ్ఛిష్ట భోజ్యార్థులై కన్నావో మరి లేవొ గాని శివ ! నీ కారుణ్య వర్శమ్ము నం దన్నార్తుండొకడైన లేని జగమే యాశింతు ,రాజేశ్వరా! భావం--- ఓ రాజన్నా ! ఆకలి బాధలతో ఉన్న వారు, ఆకలి రాజ్యానికే రాజులై ఇతరులు తినగా విడిచిన ఆహారం కోసం ఆశించే దీనులు ఉన్నారు. నీవు చూసినావో లేదో గాని , నీ దయ అనే వర్శం లో అందరూ తడిసి పోవాలి . పేదవాడు లేని జగత్తు కావాలి స్వామీ! 53 ) పరమోత్కృష్ట మహేశ్వరుం డెవరని ప్రశ్నించ మౌనీంద్రులున్‌ పరమేశుండు గిరీశుడే జగతిలో బ్రహ్మాండ దైవంబుగా వర తత్త్వార్థవిదుల్ సురుల్ సుర రిపుల్‌ పారంబు చింతించిరే ! తరమే బ్రహ్మకునైన నీశ్వర మహత్త్వం బెన్న రాజేశ్వరా! భావం -- అందరికన్నా గొప్ప దైవం ఎవరని మునీశ్వరులు ప్రశ్నించగా తత్వార్థవేత్త లైన పండితులు , సురులు ,అసురులనూ శివుడే సకల బ్రహ్మాండ దైవంగా భావించి నారు . ఈశ్వర తత్త్వం పూర్తి తెలియాలంటే బ్రహ్మ కు కూడా సాధ్యం కాదు కదా , హే రాజేశ్వరా !54 ) ఉదయాత్పూర్వమె నిద్రలేచి ఎదలో ఉత్తుంగ పూర్వాద్రిపై హృదయాదిత్య శివత్వ వైభవ రుచుల్‌ హృద్యమ్ముగా గాంచి నే నుదకమ్మిచ్చితి శైవ భావ హృదయమ్ముద్వేగమై నొప్పగా మది యందేదొ మహానుభూతి శివమై మత్తిల్లె ,రాజేశ్వరా ! భావం -- ఉదయ కాలం కంటే ముందే నిద్ర లేచి మనసు అనే ఎత్తైన హిమాద్రి పై శివ కాంతులతో తేజరిల్లే సూర్య కాంతులను చూసి శివ భావనతో హృదయం ఉద్వేగాన్ని పొందింది. మదిలో గొప్ప శివానుభూతి గాడమైన తన్మయత్వాన్ని కలిగించింది , హే రాజేశ్వరా ! 55 చిరు చీమన్ పరికింప చిత్రమగు నాశీర్శమ్ము లానేత్రముల్ సరి నిండే ఉద రాగ్ని భాండములహో సంచార సామ్రాజ్యముల్ స్థిరమై సాగెడు నైకమత్య పటిమన్ దీటైన సంకేతముల్‌ పరమాహేశ్వర సృష్టి చిత్రమిదియే భావింప , రాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వరా! చిన్న చీమను పరికించినా చాలు ,ఈశ్వర కృప అర్థమవుతుంది . చిన్న తలలు, చిన్న నేత్రాలు , చిన్నవైన ఉదరాలు , అవి నిర్మించుకున్న మహా సామ్రాజ్యాలు , స్థిరంగా సాగే వాటి ఐకమత్య పటిమ , విచిత్రమైన సంకేత భాష .. ఇలా ఆలోచిస్తే మహేశ్వరుడి చిత్రమైన సృష్టియే ఇది అని తెలుస్తుంది  ! 5 6) నీవే దిక్కని నమ్మి యుంటి నిచటే! నీ యాజ్ఞలేకున్నచో చావైనన్ దరి రాదు కుట్టుటకునై జంకించు చీమైన తా నేవేళైన శివాజ్ఞ లేక స్వయమై యే కార్యమున్ కాదు నీ సేవల్‌ జేయట కానతీయుము ప్రభో ! శ్రీ రాజరాజేశ్వరా! భావం -- హే రాజ రాజేశ్వరా ! నీవే దిక్కు అని నమ్మి ఇక్కడ ఉన్నాను . శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా ! నీ ఆజ్ఞ లేనిదే ఏ పనీ జరగదు . అందుకే నీ సేవ చేయడానికై ఆజ్ఞ ఇవ్వండి స్వామీ ! హే రాజరాజేశ్వరా ! 57) కనులారన్‌ గన రండి , యీశ్వర మహా కళ్యాణ కాలమ్మునన్ వినువీధుల్ సరినిండు సంబరములున్ , వీక్షించు భక్తావళుల్ , వినసొంపైన మృదంగ వాద్య గతులున్‌ , విప్ర స్వరోద్ఘోషలున్ మనసే మంగళ వేదికాస్థలముగా మారేను, రాజేశ్వరా ! ---

రండి !శివ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూడండి ! ఇక్కడి వీధులన్నీ సంతోషాలతో నిండిపోయాయి . ఆ నంద సంద్రమైన భక్తులతో , వినసంపైన మృదంగ వాద్య స్వరాలతో , బ్రాహ్మణుల వేద ఘోషలతో ఇక్కడ ఎంతో ఉల్లాసంగా ఉంది . మీ మనసంతా మంగళమయమైన కళ్యాణ వేదికా స్థలంగా మారుతుంది . రండి ! 58) ఒకగా నొక్క కుటుంబ బాధ్యతను మే మోపంగలేమే ప్రభూ ! సకలాలోకన విశ్వపాలనమహో సాధ్యమ్ము నీ కాయె ,యే సుకముల్ కష్టములేవి లేని జడతన్ సృష్టిస్థితుల్ గూర్చు నా యక సామర్ధ్యము నీకు జూడ ఘనమయ్యా , రాజ రాజేశ్వరా ! భావం -- కేవలం ఒక్క కుటుంబాన్ని భరించడమే కష్టం . విశాలమైన

సమస్త విశ్వాన్ని పాలించడం నీకే సాధ్యం అవుతుంది .

ఔనులే, సుఖాలు దుఃఖాలు లేని జడమైన భావంతో నీవు మాత్రమే సృష్టి స్థితులను కూర్చగలుగుతావు , స్వామీ ! 5 9 ) కైలాసమ్ము మదిన్ గనంగ భువిపై కైవల్య ధామమ్మునై లీలా ప్రాయమునై విరాజిత హిమశ్రీ యుక్త శృంగాగ్రమై ప్రాలేయాచలపుణ్యధామ పదమై బ్రహ్మండసంసేవ్యమై

ఆలోకింప శివాద్రి కంట నిలిచెన్ హర్శమ్మె  , రాజేశ్వరా!

భావం -- హే రాజేశ్వరా !

కైలాస పర్వతాన్ని మదిలో ధ్యానించగానే  భూమిపై మోక్షగిరి యై ,   మదిలో  లీలగా కనిపిస్తున్నదై , స్వర్ణ కాంతులతో పర్వతాగ్రం పై ప్రకాశిస్తున్నదై , హిమాలయ పుణ్యధామమై ,  అందరిచే పూజించబడే ప్రదేశమైన ఆ పవిత్రమైన శివాద్రి  నాకన్నుల ముందు నిలిచింది.

60 ) ఆ దేవాలయ గోపురప్రభలపై యా శైవ ధామమ్ము పై వేద ప్రస్తుత రుద్ర మంత్ర రుచలే విన్‌ వీధి ఘోషింపగా నాదోపాసక దివ్య భూసుర గణానంద స్వరో త్కల్పితా స్వాద ప్రస్తుత వేదభూమి ఇదియే సర్వేశ !రాజేశ్వరా! భావం -- ఆ దేవాలయపు గోపుర కాంతులపై ఆ గ్రామపు గగన భాగంలో ..... చలనం కలిగించేవైన , దివ్యమైన బ్రాహ్మణ గళాల నుండి ఆనందంగా వెలువడే అనంత మైన వేద స్వర నాదాలు ఆకాశమంతా నిండినాయి . ఇది వేద ఘోష మార్మోగే పవిత్ర భూమి !

  61)

ఇది నా కోరిక తీర్చవయ్య సరి వేరే కోరికన్ లేదు నా యెద నిండా మరి నీవె నిండ నితరమ్మేనెట్లు వాంఛింతు నీ పదసంసేవయు నీశ్వరార్చన కళా ప్రావీణ్యతన్ గూర్చు సం పదయే చాలును చాలునయ్య నదియే భాగ్యమ్ము ,రాజేశ్వరా! భావం ... హే రాజేశ్వరా! నాకోరిక ఇదిగో విను . నా మదిలో మాత్రం యే ఇతర కోరికలు లేవు. నీవు నా హృదయం అంతా నిండగా ఇతర కోరికలన్నీ దండగే  ! నీ పాదాలు సేవించడం , మరియు శివార్చన అనే కళలో ప్రావీణ్యత్వం కలిగే ఐశ్వర్యం ఒక్కటి చాలు అదే మహా భాగ్యం ! 62) చిత్రమ్మే శివ పాన వట్టము మహా చిత్రమ్ము నీ లింగమే చిత్రమ్మచ్చటి శూన్య భావనలు సచ్చిత్రోక్తి చారిత్రముల్ చిత్రమ్మే భవదీయ రూప విధమే చిత్రమ్ము నీలీలలున్ చిత్రమ్మౌ శివభక్తి సాధనలివే, చింతింప ,రాజేశ్వరా ! భావం--

నీ దివ్య లింగపు పాన వట్టము ఎంతో చిత్రమైంది. దాని  శూన్య భావన  చిత్రమైనది. దీనికి సంబంధించిన చరిత్ర చిత్రమైంది . శివా ! నీ రూపం చిత్రమైంది. నీ లీలలు చిత్రమైనవి . శివ భక్తి సాధనలన్నీ చిత్రమైనవే .

హే రాజేశ్వరా! 63 శివ నామామృత సేవనమ్మున మహా చింతాగ్ని చల్లారు ఈ భవబంధమ్ములు భగ్నమౌను హృదయ ప్రక్షాళనమ్మౌను సం భవమై నిల్చును చిత్త వృత్తి యవరోధా భ్యాస యోగమ్ము యోగమ్ము నీ స్తవమే చేయ క్షణమ్ము చాలు మనసే శాంతించు రాజేశ్వరా!

'శివనామం ' అనే అమృతాన్ని సేవిస్తే మనసులో దుఃఖాలన్నీ తొలగిపోతాయి . సంసార బంధనాల నుండి విముక్తుడౌతాడు . హృదయ ప్రక్షాళన జరుగుతుంది. కష్ట సాధ్యమైన యోగులు సాధించే మన స్సంధాన యోగ స్థితి కలుగుతుంది . ఒక క్షణం నిన్ను స్తోత్రం చేస్తే చాలు ! మనసంతా శాంతి నిండి పోతుంది ! 64 ) కుడికర్ణంబున బుస్సుమంటు ఫణియే కూర్మిన్ శిరస్సూప , ఆ యెడమన్ ఘీంకృత హాసముల్‌ నెరపి విఘ్నేశుండు నర్తింప , ఈ సడులే సందడి సేయువేళ వినుమా ! " సాంబా !శివా "యంచు యే

కడనో  జెప్పెడి దీనమైన వెతలా కర్ణించి, రాజేశ్వరా!

భావం -- హే రాజేశ్వరా! స్వామీ ! నీ కుడివైపు ఉన్న పాము పడగెత్తి ప్రేమతో బుసలు కొడుతుంటే , ఎడమ వైపు ఘీంకార శబ్దాలతో గజవదనుడు నాట్యం చేస్తుంటే ఈ శబ్దాలే సందడి చేస్తుండగా , "సాంబా శివా " అని పిలుస్తూ ఏ చివరనో ఉన్న దీనులైన భక్తుల వెతలను ఆలకించు స్వామీ !శత బిల్వార్చన


65) ధ్యానింతున్ వరయోగ సుందర శివున్ ధ్యానస్థితీ వైభవున్ ధ్యానింతున్ గజచర్మ వస్త్ర నియతున్ దర్భాసనాధిష్ఠితున్ ధ్యానింతున్ శివ రుద్ర వేద వినుతున్ దాక్షిణ్య సంశోభితున్ ధ్యానింతున్ పర మోక్ష సాధనకునై తత్త్వజ్ఞ !రాజేశ్వరా! భావం... హే రాజేశ్వరా! యోగ సౌందర్యంతో ప్రకాశించే వాడివి ,ధ్యానం అనే వైభవంతో విలసిల్లేవాడివి , నియమంగా గజచర్మాన్ని ధరించే వాడివి ,దర్భాసనంపై అధిష్టించిన వాడివి ,రుద్రవేదంచే స్తుతించబడే వాడివి , దయాగుణంచే ప్రకాశించేవాడివి అయిన నిన్ను ఉత్కృష్టమైన మోక్షం కోసం ధ్యానిస్తాను!శత బిల్వార్చన


66) ఏకన్నుల్‌ తడియారి దైన్య జలమున్ ఈ నేల వర్షించునో ఏ కన్నుల్‌ మితిలేని దుర్భరగతిన్ హీన స్థితిన్ జూచునో యేకన్నుల్ దరి జూపు చేతికొరకై ఏ రీతి నర్థించునో ఆ కన్నుల్‌ సరినింపు బాష్పజలమే హర్షించ , రాజేశ్వరా ! భావం-- హే రాజేశ్వరా ! ఏకన్నులు తడి ఆరి పోయి దైన్యంగా కన్నీళ్ళు కారుస్తున్నాయో , ఏ కళ్ళు తీవ్రమైన వ్యథచే హీనములై చూస్తున్నాయో , ఏకన్నులు ఆసరా ఇచ్చే చేతి కోసం ఎదిరి చూస్తున్నాయో , ఆ కళ్ళలో బాష్ప జలాలను నింపు స్వామీ !శత బిల్వార్చన 6 7 ) నానా రాజ సమూహముల్ హిత మతుల్ నానా యతీంద్రోత్తముల్ ఈ నేలన్ దిరుగాడిరయ్య దివిజుల్ ఈశానుడున్ సిద్ధులున్ తానై వచ్చి తరించె ధర్మ జలమున్ దర్శించి దేవేంద్రుడే నేనిచ్చోట చరింప నీదు కృపయే నిక్కమ్ము , రాజేశ్వరా! భావం --- హే రాజేశ్వరా ! ఎందరో రాజులు , గొప్పసమాజ హితాభిలాషులు , యతులు , దేవతలు , పరమేశ్వరుడు సిద్ధులు.. ఈనేలపై తిరుగాడినారు. దేవేంద్రుడు తానుగా వచ్చి ఇక్కడ ధర్మ కుండాన్ని దర్శించి స్నానం చేసి పవిత్రుడైనాడు .అలాంటి ఈ ప్రదేశంలో నేను చరించ డానికి కారణం నీ కృపయే స్వామీ ! 68)

పరకైలాస పురాద్రి శృంగసమమై

భాను ప్రభాక్షేత్రమై 

వర గౌరీశ విరించి విష్ణు పదమై భక్తాళి సమ్మోదమై ధరణిన్ స్వర్గసమమ్మునై పరమ భక్త్యానంద సోపానమై ధర రాజేశ్వర ధామమైన యిట నిన్ ధ్యానింతు రాజేశ్వరా !

భావం ... హే రాజేశ్వరా!

ఉత్కృష్టమైన కైలాస  గిరిశిఖరంతో సమానమైన  , భాస్కర క్షేత్రంగా సుప్రసిద్ధమైన , బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడియున్నదైన , అదృష్టాన్ని కలిగించేటిదైన , భూలోక స్వర్గమైన , భక్తులకు ఆనంద సముద్రం వంటిదైన ఈ ప్రదేశం శ్రీ రాజరాజేశ్వర పురం . ఇక్కడే నిన్ను ధ్యానిస్తాను స్వామీ !69)

రాజన్నాయని ప్రేమ మీర పిలిచే రన్నా మదిన్ ప్రేమతో రాజేశాలయ రాజలింగ విభునే

ప్రార్థించి సద్భక్తి తో

తేజో రూప మహేశునేహృదయ మందే నిల్పి యేకాగ్రతన్ పూజల్‌ సేతురు భక్తకోటు లదియే పుణ్యమ్ము ,రాజేశ్వరా !

భావం -- హే రాజేశ్వరా ! ఎందరో భక్తులు ' రాజన్నా 'అంటూ ప్రేమతో భక్తితో పిలుస్తున్నారు . రాజేశ్వరాలయంలో ఉన్న రాజలింగని తేజో రూపాన్ని మదిలో నిలిపి కీర్తించి ఆ ఆనందాన్ని పొందినా చాలు , ఎంతో పుణ్యం వస్తుంది ! 70 అంభోజాసన కేశవాదివినుతా భ్యర్చా స్వరూపమ్మునౌ గంభీరాత్మక దివ్యలింగము పయిన్ గంగానదీతుల్యమౌ కుంభాపూరిత ధర్మకుండజలమున్‌ కూర్మిన్ మహాభక్తితో శంభో శంకర ! యంచు నిచ్చెద శివా ! సర్వేశ ! రాజేశ్వరా!

భావం-- హే రాజేశ్వరా ! బ్రహ్మా విష్ణు మొదలైనవారు పూజించే , గంభీర రూపంతో ప్రకాశించే నీ దివ్య లింగం పైన గంగా నదితో సమానమైన ధర్మ గుండం యొక్క జలాన్ని ప్రేమతో శంభో శంకరా ! అంటూ సమర్పిస్తాను స్వామీ ! 71)

రంగుల్‌ వేసెను పూల కెవ్వడు మహారణ్యాల కెవ్వండు యే గంగన్‌ ప్రేమగ తెచ్చి పోసె హితమున్‌ గావించ లోకమ్ముకున్ సాంగోపాంగములన్ని గూర్చి ఎవడీ సర్వంబు సృష్టించె యే భంగిన్ జూసిన అద్భుతమ్మె గదయా భవ్యాంగ ,రాజేశ్వరా!

భావం -- హే రాజేశ్వరా! అందమైన పూలకు రంగులు వేసేది ఎవరు ?మహారణ్యాలకు నీటిని తెచ్చిపోసేది ఎవరు ? ఈ లోకంలో అన్నింటినీ ఏర్చి కూర్చి సృష్టించేవాడు ఆ పరమేశ్వరుడే !అతని సృష్టి ఏది చూసినా ఆశ్చర్యంగానే గోచరిస్తుంది ! 72 కరుణన్ జూపెడు గ్రామ దేవతలు తా కామింతురే మద్యమున్‌ ? అరుణార్ద్రాయిత మాంస పిండ రుధిరమ్మాశింతురే క్రూరతన్ ? వరముల్‌ వో సెడి తల్లి మూగ పసుల ప్రాణంబులన్‌గోరునా ? సురతత్త్వంబిది కాదు సూక్ష్మ ఫణితిన్ జూడంగ, ! రాజేశ్వరా ! భావం -- దయామయ స్వరూపులైన గ్రామ దేవతలు మద్యాన్ని ఇష్టపడతారా ? ఎర్రటి పిండపు రక్తమోడే మాంసాన్ని ఆరగిస్తారా ? అన్ని ప్రాణులకు వరాలిచ్చే తల్లి మూగ జీవుల ప్రాణాలను తీయడానికి కోరుకొంటుందా ? ఆలోచించి చూస్తే ఇది దేవతల తత్త్వం కాదని తెలుస్తుంది , హే రాజేశ్వరా! 7 3) చిర సంతోషపు భాగ్యమున్ స్థిర మహా చిత్త ప్రశాంతస్థితిన్ వరసంతానపు యోగమున్‌ సుఖ జగద్ వార్తా కలాపమ్ము శం కర నామామృత సేవనమ్ము సుమతిన్ కర్తవ్యతా వ్యగ్రతన్ పరమేశా ! నిను గోర యిట్టి వరముల్‌ వర్షించు రాజేశ్వరా! భావం .. హే రాజేశ్వరా! చాలా కాలం నిలిచే సంతోషం అనే అదృష్టం , స్థిరమైన మానసిక ప్రశాంతత , గొప్ప సంతానయోగ్యత , శుభమైన వార్తలు మాట్లాడుకోవడం , శివ నామామృత సేవన , మంచి ఆలోచన , చేసే పనిలో ఏకాగ్రత , నిన్ను ఆశ్రయించిన వారికి ఈ వరాలను వర్షించు స్వామీ ! 74 నీ రూపంబది యేమిటో ? సరి కనన్‌ నీమోము తీరెట్టిదో ? ఘోర వ్యక్తమొ ? శాంతి యుక్తమొ ? మహా క్రోధాగ్ని సంసక్తమో ? పారన్ జూడుము నా విశుద్ధ హృదిలో పద్మాసనస్ధున్‌ ప్రభున్

శ్రీ రాజిల్లెడు నీ స్వరూపమదియే చింతించ రాజేశ్వరా !

భావం-- హే రాజేశ్వరా! నీరూపం ఘోరమైనదా ? శాంతియుతంగా ఉంటుందా ? క్రోధాగ్నితో రక్తవర్ణంతో ఉంటుందా ? తెలుసుకోవాలంటే శుద్ధమైన నా మనసులోకి తొంగిచూడు .అక్కడ పద్మాసనంలోని ప్రభువు దర్శన మిస్తాడు. కాంతులు వెదజల్లే ఆ రూపం నీదే స్వామీ ! 7 5) తను వెల్లన్‌ కుదరంగ గూర్చి నిజ సంతాన ప్రలోభమ్ములన్ మనసంతన్ సరిజేర్చి లోకవిధిగా మాయావిమోహమ్ముగా కనుసౌభాగ్య మిదంచు నేర్పరచి సత్ కామ్యార్థమే యన్న నీ

ఘనమౌ సృష్టి ప్రణాళికల్‌ వరములే కామేశ ! రాజేశ్వరా !

భావం ...

హే రాజేశ్వరా! లోకంలోని ప్రాణుల అన్ని శరీర భాగాలను సృష్టికి అనుకూలంగా కుదిరించి , మనసులో సంతానకాంక్షను ఏర్పాటుచేసి  , జననం కలిగించడం ఒక అదృష్టం గాభావించేలా చేశావు ఇదే కామ్యార్థ ధర్మం అంటూ చేసిన ఘనమైన నీ సృష్టి ప్రణాళికలన్నీ వరములే స్వామీ !

76) రాజ శ్యామల రత్నకాంతి విలసద్రా జేశ సేవకై ఏ జన్మంబుననైన ఈశ్వరపదంబే నేను చింతింతు నీ పూజాభాగ్యమునొంద పుణ్యపురిలో పుట్టంగ చాలయ్య శ్రీ రాజేశాలయ రాజరాజపురికే రాజైన రాజేశ్వరా! భావం-- ఉత్కృష్టమైన శ్యామల వర్ణనకు రత్న కాంతులతో ప్రకాశించే రాజేశ్వర లింగార్చన ప్రతి జన్మలోను చేయాలని కోరుకుంటాను ఎంతో అదృష్టం ఉంటే గాని పొందగలిగే ఈ గ్రామపు జన్మ మహాభాగ్యం ఈ శివధామానికి రాజైన రాజేశ్వరా ! ఇది నాకు చాలు స్వామీ ! 7 7) శివ భస్మంబు ధరించు వేళ తనువే చిద్రూప కైలాసమై శివ పంచాక్షరి నే పఠింపగ మహా శ్రీ రుద్రమై వెల్వడెన్ శివతత్త్వంబు మధించి చూడ శివుడే సిద్ధించె చిత్రమ్ము నన్ శివుడే నేనని యాత్మ నెంచితి గదా ! శ్రీ రాజరాజేశ్వరా! భావం-- శివ భస్మాన్ని ధరించగానే శరీర మంతా కైలాసంగా భాసించింది . శివ తత్తాన్ని మధించగా . శివుడే మదిలో ప్రత్యక్ష మైనాడు . శివ పంచాక్షరి పఠించగా అది రుద్ర మంత్రమై వెలువడింది నేను "శివోహం " అంటూ

శివుడే నేను గా భావించాను  స్వామీ!

78 శివ ! నీ భావము నూహసేయ యెదలో చింతాగ్ని చల్లారె నా భవ మోహమ్ము విలుప్తమై యతి గతిన్ భావమ్ములుప్పొంగె మో క్షవశానందముడెందమందు తిరమై షట్‌చక్రనాడీ గతిన్ పవనాంధఃపరిబద్ధమయ్యె మదియే భాసించె ,రాజేశ్వరా! భావం .. హే శివా !మనసు లో నిన్ను ఊహించుకోగానే బాధ అనే అగ్ని చల్లారి పోయింది . సంసార మోహం నశించి , ఒక సర్వ సంగ పరిత్యాగయైన యోగి వంటి భావనలు ఉప్పొంగాయి . మోక్షానందం నిండి స్థిరమై పోయి షట్‌ చక్రనాడులన్ని వాయువు ను బంధించ బడ గా మదిలో అంతా శివమే నిండి పోయింది . హే రాజేశ్వరా! 79 ) ఏ ప్రాణమ్మున కేది యోగ్యతనువో యే జీవి కేబీజమో యే ప్రారంభము నెట్లు కూర్చవలెనో యేయంత మేరీతియో ? యే ప్రాధాన్యత నెట్లు చేర్చవలెనో యే బుద్ధికే సిద్ధియో? ఈ ప్రావీణ్యత యీశ్వరాద్భుత విధమ్మే కాదె ! రాజేశ్వరా! భావం -- హే రాజేశ్వరా! ఏ ప్రాణానికి సరైన శరీరం ఏదో , ఏ జీవికి ఏది బీజమో ,ప్రారంభం ఎలా ఉండాలో ,అంతం ఎలా ఉండాలో , ఏ అంశానికి ప్రాధాన్యత కూర్చాలో ,ఏ బుద్ధికి ఏది సిద్ధిస్తుందో ... ఇదంతా ఈశ్వరుడి అద్భుత సృష్టి విధానమే స్వామీ ! 8 0) ప్రామాణ్యంబుగ ఊర్ధ్వ భాగమమరెన్ భాసించు శైవాంశగా నా మధ్యాంతర కక్ష్యలోన వెలసెన్ నారాయణాంశమ్ముగా ఆమూలమ్ము విధాతృనంశ నిలిచెన్ ఔజ్వల్యపీఠమ్ముగా త్రైమూర్త్యాత్మక రుద్రలింగమిదియే త్రైగుణ్య రాజేశ్వరా! భావం --- హే రాజేశ్వరా! నీశివ లింగం యొక్క ఊర్ధ్వభాగం ఈశ్వరాంశ గా మధ్య భాగం నారాయణాంశగా విశ్వ పీఠం వంటి మూల భాగం బ్రహ్మ దేవుడి ఆంశగా నిలిచాయి . . త్రిమూర్త్యాత్మకమైన లింగ స్వరూపం ఇదే స్వామీ ! 8 1) కలయే కంటి మహేశ్వరా ! నిదురలో ,కైలాస ధామమ్మునన్ కొలువైనట్టి ప్రశాంతమూర్తి శశిరేఖోద్భాసియై శంభుడే విలసత్ పుత్రవిలాస హాసరతుడై విశ్వేశ్వరీ యుక్తుడై ఇలలో నిల్చిన తీరుదోచె ,మనసే యింపాయె ,రాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వరా! నేను ఒక కల కన్నాను .ఆ కలలో కైలాసం లోని పరమేశ్వరుడు తలపై చంద్ర రేఖతో ప్రకాశిస్తుంటే పుత్రుడైన వినాయకుడు విలాసంగా నవ్వుతుంటే భార్య తో పాటు సంతోషం గా ఉన్న ఆ విశ్వేశ్వరుడే దర్శనమిచ్చాడు . నామనసు కు ఎంతో ఉల్లాసం కలిగింది స్వామీ ! 8 2) మనసే స్వల్పము మోహరంజితము కామ్యార్థాధిసంలగ్నమై ఘనమైనట్టి జగత్ ప్రభావ విభవున్ గంభీరభావోజ్వలున్ కనలేదయ్య , మహేశ్వరా ! పర మహాకాయప్రవేశమ్ముచే యనునిత్యమ్ము తరించవచ్చును శివోహమ్మంచు రాజేశ్వరా ! భావం --- హే రాజేశ్వరా! నా మనసు స్వల్పమైనది. కోరికల మోహంతో కూడియున్నది . ఎంతో గంభీరభావం కలిగిన , సమస్త విశ్వాన్ని ప్రభావితం చేయగల ఆ విశ్వేశ్వరుని మామూలుగా చూడ లేనిది …కానీ 'శివోహం " అంటూ శివునిలో పరకాయ ప్రవేశం చేసి ప్రతిరోజూ శివుడుగా తాను తరించ వచ్చు స్వామీ ! 8 3 ) పుత్రున్‌ గోరుచు భక్త కోటులిలలో పున్నామ భీతాత్ములై చిత్రమ్మైన విధమ్ముగా వృషభమున్ చేబట్టి సంతాన సన్ మాత్రాలోచన జేసి భక్తి యుతులై మాహేశ్వరాయంచు నీ యాత్రాకామన జేసి వచ్చెదరయా యాచించ , రాజేశ్వరా ! భావం.... హే రాజేశ్వరా! పున్నామ నరక భయం కలిగిన , పుత్రులు లేని నీ భక్తులు చిత్రంగా వృషభాన్ని చేతి తో పట్టి మంచి సంతానాన్ని కలిగించమని కోరుతూ 'మహేశ్వరా ' అంటూ ప్రార్థిస్తూ ప్రదక్షిణ చేస్తారు. దీనికై వేములవాడ యాత్ర కై కోరి కోరి వస్తారు స్వామీ ! 8 4) స్వామీ !కన్నులముందు కాంచదగు నీ సద్రూపమున్ జూడకన్ యేమేమో తలపోసి లోకమున తామేజెప్పు సత్యమ్ముగా నామాటే సరియంచు పల్కెదరు దుర్నాస్తీక పాషండులున్‌ నీ మూలమ్మును గాంచరంధ కుమతుల్ నిక్కమ్ము , రాజేశ్వరా! భావం... హే రాజేశ్వరా! ఎదురుగానే ఉన్న నీ నిజరూపాన్ని చూడలేని పాషండులైన నాస్తికులు తమ బుద్ధికి తోచిన విశయం చెప్పుతూ అదే సత్యమని భావిస్తారు. నీ మూల స్వరూపాన్ని చూడ లేని అంధులు వారు !శతబిల్వార్చన

85) ఎన్నో నోములు నోయుచున్ మనసులో ఎన్నో నుతుల్‌ సేయు చున్ కన్నీరై ప్రవహించ కోర్కెల సిరుల్ కన్ గాంచి నైరాశ్యతన్ నిన్నే నమ్మిరి దీనభక్తు లిచటన్ నీవే కృపన్ జూడరా ! వున్నా నేనని ఊరడించు గద రా , ఓ రాజరాజేశ్వరా ! భావం --- హే రాజేశ్వరా! ఎందరో భక్తులు ఎన్నో నోములు నోస్తూ, మనసులో ప్రార్థిస్తూ కోరికలన్నీ కన్నీరుగా మారుతుంటే నిరాశగా నిలిచారు. నీవు కృపతో చూసి , నేనున్నానని ఊరడించి కరుణించు స్వామీ! 86) కలదే కారణమేమి లేక గలిగే కార్యమ్ము యీ సృష్టిలో ! జలముల్ మేఘుడు దెచ్చి ఈడె యవి యీశాన ప్రతీర్ధమ్ములే  ! ఫలముల్ వృక్షము లీయవే ధరణి పై భవ్యప్రసాదమ్మదే ఇలలో నీశ్వర తత్వమన్న యిదియే యీ తీరు , రాజేశ్వరా!


భావం -- హే రాజేశ్వరా !

ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది . అది ఈశ్వర తత్వమే ! ఎక్కడో ఉన్న నీటిని మేఘుడు తెచ్చి ఇస్తున్నాడు. ఆ నీరు శివ తీర్థమే ! వృక్షాలు ఫలాలు ఇస్తున్నాయి . ఇది శంకర ప్రసాదమే !ఈశ్వర తత్త్వం ఇలాగే ఉంటుంది !

87 ) అత్యుత్సాహపు మూషికమ్మును కనన్‌ ఆవేశమొందే ఫణుల్‌ సత్యమ్మే గద సర్పరాజును గనన్ సాగున్ మయూరుండు నౌ చిత్యమ్మే వృషభమ్ముగాంచ ఘనమై సింహమ్ము గర్జించగా ప్రత్యర్ధుల్గల ఇంటిపెద్దవుగదా భావింప రాజేశ్వరా! భావం-- హే రాజేశ్వరా! ఎదురుగా

అత్యుత్సాహంతో ఉన్న ఎలుక, దాన్ని చూసి ఆవేశం తో తల ఊపే సర్పం , సర్పాన్ని చూచి కదిలే నెమలి  , పక్కనే వృషభం , దాన్ని చూసి గర్జించే సింహం ..

ఇలా ఎందరో ప్రత్యర్ధులన్న ఇంటి పెద్దగా నిన్ను భావిస్తున్నాను స్వామీ ! 88 స్వామీ!! నీ శుభకీర్తనల్‌ శివపురీ సంధానయోగ్యమ్ములున్ ప్రామాణ్యంబుగ పారమేష్ఠ్య విబుధుల్ పాడేటి సంగీతముల్ కామార్తిన్‌ శివసూత్ర చిత్రికలనే కల్పించి కీర్తించగా కామేశా ! అది శాంతి పూర్ణ శివ సత్కావ్యమ్మె' రాజేశ్వరా!

భావం -- హే రాజేశ్వరా! మంగళకరమైన నీ కీర్తనలు మోక్ష సాధకాలు . ఎంతో ప్రామాణికంగా పండితులు పరమేశ్వరుని తత్వంగురించి పాడే సంగీత కృతులు . శివ సూత్రాలను కీర్తించి పాడగా అది అద్భుతమైనశాంతి రసంతో కూడుకొన్న శివ కావ్యమే స్వామీ !89 )

దైవ ద్రోహులు ధర్మ వంచకులునై దౌర్జన్యులై హన్యులై శైవ ప్రార్థన చేయగోరి యసురుల్ శౌచ క్రియా హీనులై నీవే దిక్కని నిన్ను జేరి ఘనులై నిన్నెట్లు మెప్పించిరో?

దేవా ! నీ దయ అంతు చిక్కని దయా ,   దేవేశ ,రాజేశ్వరా !

భావం-- హే రాజేశ్వరా ! రాక్షసులు దైవ ద్రోహులు , ధర్మ వంచన చేసేవారూ , దుర్మార్గులూ , చంపదగినవారు ! శుచీ శుభ్రత లేక శైవ ప్రార్థనలు చేసి నీవే దిక్కంటూ నిన్ను ఎలా మెప్పించారో తెలియదు స్వామీ! నీ దయ ఎవరికీ అంతుచిక్కని దయా సముద్రమే ! 90). కన్నుల్‌ మూసి దలంచగా మనసులో కన్నాను నీరూప మా పన్నార్తుండగు రాజలింగ విభుడే ప్రత్యక్షమైనట్లుగా యెన్నో జన్మల పున్నెమంత యెదురై యీరీతి కన్మించె రా జన్నా ! నిన్నెద నమ్మినాను యిదియే చాలయ్య  ! రాజేశ్వరా ! భావం-- హే రాజేశ్వరా! కన్నులు మూసి మనసులో నీరూపాన్ని చూడగా దేవాలయ అంతర్భాగం లోని గర్భ గుడి , అక్కడే నీరూపం కళ్ళలో కనిపించాయి . ఎన్నో జన్మల పుణ్యం అంతా ఇలా దర్శించేలా చేసింది. నిన్నే నమ్మి యున్నాను హే స్వామీ ! 9 1 ) సురులున్ బ్రహ్మ మురారులున్ మునులు నిన్ స్తోత్రించి పూజింతురే సరిలేడెవ్వడు నీకటంచు నసురుల్ శక్తిన్ నినర్చింతురే యరులే లేని మహేశ్వరుండ విలలో నాదర్శ దైవమ్ము నీ వరిషడ్వర్గము తుంచవయ్య భువి యే హర్షింప , రాజేశ్వరా ! భావం-- హే రాజేశ్వరా! దేవతలూ

బ్రహ్మా విష్ణువు   , మునులూ నిన్ను  పూజిస్తారు . నీతో సమానం వేరెవరూ లేరంటూ రాక్షసులు సైతం నిన్ను పూజిస్తారు.
శత్రవులు అసలే లేని పరమేశ్వరు డవు నీవు . మిమ్మల్ని పీడించే అరిషడ్వర్గాల ను తుంచు స్వామీ !9 2

కనులున్మీలన జేసి శ్వాసగతులన్‌ కాంక్షన్ నిబర్హించి సన్ మునివృత్తిన్‌ గమియించి ఊర్ధ్వ ముఖుడై ముక్తిక్రియాలోలుడై తనువెల్లన్‌ తగ విస్మరించి మనసున్ తత్వ స్థితిన్ జేర్చినన్ కన వచ్చు న్‌ క్షణ కాల మందె శివునే కాంక్షించి , రాజేశ్వరా! భావం హే రాజేశ్వరా! మునిలా కళ్ళు మూసుకొని , శ్వాసను బంధించి , ఊర్ధ్వముఖుడై , ముక్తిని భావిస్తూ , తనను తాను మరిచి మనసును శివునితో అనుసంధానం చేస్తే ఒక్క క్షణం లోనే ఆపర మేశ్వరుని దర్శించ వచ్చు ! 9 3) పరిశుద్ధాంతరమై ప్రమోద ఘనమై ప్రామాణ్య శీతోష్ణమై చిర సౌఖ్యప్రదమై మృదూలలితమై చిత్రాన్నమై హృద్యమై పరమోచ్ఛిష్టమునై మహారుచిరమై భవ్యాన్నమై నీ స్పృషన్ హర నైవేద్య ప్రసాదమయ్యె మనసే హర్షించె రాజేశ్వరా ! భావం ... హే రాజేశ్వరా !

పరిశుద్ధమైంది , సంతోషాన్ని కలిగించేది ,సరియైన శీతోష్ణస్థితి కలిగినది , చిరకాలం సుఖం కలిగించేది  ,మృదువైనది , లలితమైనది , చిత్రమైనది , హృదయానికి నచ్చేది  ,ఈశ్వరునికి అన్నభూతమైనది , కాంతివంతమైనది  ,పక్వాన్నమైనది , నీ స్పర్శచే  అది ప్రసాదం కాగానే నా మనసు ఎంతో సంతోషించింది స్వామీ !

94 ) రాజేశున్ రమణీయ రూపలసితున్ రత్నోజ్వల శ్రీ యుతున్ రాజచ్చంద్ర కళావతంస మకుటున్ లాస్య ప్రియున్ లాలసున్ భ్రాజిష్ణున్ భవ భవ్య కాంతి విభవున్ భవ్యున్ భవున్ శాంభ వున్ పూజల్‌ సేయుట పూర్వ జన్మఫల సత్పుణ్యమ్మె ! రాజేశ్వరా! భావం--- రాజేశ్వరుని , అందమైన రూపంతో వెలసిల్లేవాడిని ,రత్నపు కాంతులతో ప్రకాశించే వాడిని, తలపై చంద్రరేఖ కలిగినవాడిని , నాట్యంపై ఆసక్తి కలవాడిని, మహాతేజంతో , వెలుగొందే వాడిని , భవ రూపుని , శాంభవుని పూజించుట పూర్వజన్మ సుకృతమే !, హే రాజేశ్వరా! 95) గంటల్‌ మోగ ఉమా మహేశ్వర మహా కళ్యాణ కాలమ్మునన్ గంటల్ మోగె శివాలయాంతర లసద్ గర్భ ప్రకోష్టమ్ముపై గంటల్‌ మోగె వృషాధిరాజ కటిపై కాత్యాయనీ వేణిపై గంటై మోగెను నాదు గుండె లయగా ఘల్మంచు, రాజేశ్వరా! భావం - హే రాజేశ్వరా! శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవపు వేళ గంటలు మోగగానే శివాలయాంతరంలోని గర్భగుడిలో గంటలు మోగినాయి . శివుడి వాహనమైన వృషభం నడుముకున్న గంటలూ ఆనందంతో మోగినాయి . పార్వతీ దేవి జడకుచ్చులకున్న గంటలూ మోగినాయి . నాగుండె కూడా గంటానాదంలా లయబద్ధంగా ఘల్లుమంటూ మోగింది.96) లేదయ్యా జగమంత జూచి వెతుకన్ లేదింత చిత్రాకృతిన్ లేదే యింత మహత్త్వయుక్త ప్రతిమన్ లేదింత చిత్ర స్థితిన్

ఏదో భావన జేసి చూడ మరి యింకేదో స్ఫురింపన్‌ దగున్

కాదే ఇట్టి మహేశలింగ సమమున్‌ కాదేది ,రాజేశ్వరా ! భావం --- హే రాజేశ్వరా! ఇంత గొప్ప చిత్రమైన లింగ స్వరూపం జగమంతా చూసినా దొరకదు . ఇంతటి మహత్వం కల ప్రతిమ ఎక్కడా లేదు . ఇంతటి కాంతీ ఎక్కడా లేదు . ఒకటి చూస్తూ మరొక్కటి ధ్యానించే ఈ అనన్య స్థితి మరో చోట లభ్యం కాదు. మహేశ్వర లింగం తో సమానమైనది మరింకేదీ లేదు. 97 ) హరునే గాంచితి కన్నులార యెదలో హర్షమ్ము నుప్పొంగ శ్రీ కరమౌ పృథ్వి కణమ్ము నందు ఘన మౌ గంగాది తో యమ్ము నన్ వర వైశ్వానర తేజ మందు విచరత్ వాయు స్థలమ్మందు నం బర రూప స్థిర శూన్య మందు శివునే భావించి రాజేశ్వరా!

భావం ... హే రాజేశ్వరా ! మనసులో సంతోషం ఉప్పొంగగా ఈ ప్రపంచంలో మహా శివుని దర్శించాను, పృథ్వి కణం లో , గంగాజలం లో , అగ్ని తేజస్సు నందు , ఆకాశ రూప శూన్య ముందు శివునే నేను దర్శించాను స్వామీ ! 98) గౌరీ పుత్రుడి హాస్యమున్ భయదమౌ కౌటిల్యతా నేత్రమున్ శూర ప్రోద్ధత రుద్ర తాండవ గతిన్ శుద్ధ ప్రశాంత స్థితిన్ వారాహీ కమనీయ నేత్రకరుణన్‌ భవ్యాద్భుత సృష్టియున్ శ్రీ రాజాశ్రిత రాగ భావరసముల్‌ శ్రీ లొప్పు రాజేశ్వరా! భావం ... హే రాజేశ్వరా! గౌరీ పుత్రుడి హాస్య రసం , నీ మూడో నేత్రపు భయానక రసం , వీర రసాన్ని తెలిపే నీ రుద్ర తాండవ గతీ , శాంత రసాన్ని ప్రకటించే నీ ప్రశాంతస్థితీ , కరుణ రసాన్ని జాలువారే వారాహీ దేవి నేత్రాలు , అద్భుత రసాన్ని దర్శింప జేసే పరమేశ్వర సృష్టి తీరూ , ఇలా నీ రాగ భావ రసాలన్నీ గొప్ప కాంతులతో తేజరిల్లుతుంటాయి స్వామీ ! 99) కలలో గంటి మహేశ్వరా ! నిను మహా కైలాసమైనట్టి వే ములవాడన్ కొలువైన లింగ విభుగా ముక్తి ప్రదే యుండుగా తలచే కోర్కెను దీర్చునట్టి విలసత్కారుణ్య భావాబ్ధిగా ఇలలో మాకొక ఇంటి పెద్దగ కనన్ ఇంపయ్యె , రాజేశ్వరా! భావం -- మహా కైలాసమైన వేములవాడలో కొలువున్న లింగస్వరూపుడిగా ,ముక్తి ప్రదాతగా ,తలచే కోరికను తీర్చే కరుణామూర్తిగా , మా ఇంటిపెద్దగా నాకు కలలోకి వచ్చావు .ఇది నాకు సంతోషాన్ని కలిగించింది ,హేరాజేశ్వరా !శత బిల్వార్చన 100 ) శతబిల్వార్చన చేయనెంచి మదిలో శంభున్ ప్రతిష్టించి నే శతరుద్రీయముగా దలంచి శుచినై శైవాత్మసంధాయినై శతపద్యాత్మక పూజ చేసితి శివా ! సర్వాంగ యుక్తమ్ముగా శతమానమ్మని కావవయ్య పరమేశా ! రాజ రాజేశ్వరా ! భావం -- హే రాజేశ్వరా ! శతబిల్వాలతో నీకు అర్చన చేయాలని సంకల్పించి మనసులో నిన్ను ప్రతిష్టించాను . దీనినే శతరుద్రీయంగా భావిస్తూ , మదిలో శివభావనను అనుసంధానం చేసి సర్వాంగ యుక్తముగా పద్యాలతో శతబిల్వార్చన చేశాను . శతమానమ్మని దీవించి కాపాడు స్వామీ ! 10 1 ) బీజావాపన చేసినావు ఎద లో బిల్వ ప్రవృక్షమ్మునే తేజోవంతమునై చిగిర్చె దళముల్ దేశీయ పద్యమ్ము లై రాజశ్యామల రాజలింగచరితల్‌ రమ్యంబుగా కూర్చి నే రాజేశార్చన జేయ నా హృదయమే రంజిల్లె రాజేశ్వరా! భావం - హే రాజేశ్వరా ! నా మనసులో నీవు బిల్వవృక్షపు బీజాన్ని నాటినావు . ఆ వృక్షానికి దేశీయ పద్యాలు అనే బిల్వాలు తేజోవంతంగా చిగిర్చాయి. మేలైన శ్యామలవర్ణంతో ప్రకాశించే రాజేశ్వర లింగ వైభవాన్ని స్తోత్రిస్తూ అర్చన చేయగా నా హృదయం ఎంతో ఆనందంతో నిండిపోయింది స్వామీ ! 10 2 రమ్యంబైన సువర్ణలింగప్రతిమన్‌రత్నాల భూషించి ఓ

హర్మ్యం బందు భజించు కన్న ఘనమై యర్చించ యోచించుచున్
రమ్యంబైన మృడంగలింగ మొకటిన్ లక్షించి సేవించగా
సామ్యంబౌనె? శివేతరార్చన మెటన్‌ ? సౌఖ్యంబె ?రాజేశ్వరా !

భావం--- హే రాజేశ్వరా! అందమైన సువర్ణ లింగాన్ని ఎంతో వైభవం గల మహా భవనం లో నిన్ను పూజించేకన్నా , మట్టి తో శివలింగాన్ని చేసి నదీ తీరంలో పూజించడం గొప్పది . ఈ అర్చన తో సమానమైనది ఏదీ లేదు . 103 శ్రవణీయప్రణవాక్షరార్ధయుతమౌ శబ్దశృతీ మాత్రమౌ భవసూత్రాంతర సర్వశాస్త్ర కలిత బ్రహ్మాండ భాష్యమ్మునౌ స్తవనీయ శృతిసారభూత ఘనమౌ తద్రూప వర్ణమ్మునౌ శివ పంచాక్షరి నే పఠించెద శివా సిద్ధించ ,రాజేశ్వరా! భావం ... అందరూ వినదగిన

 ప్రణవాక్షర ప్రయోజనం కలదై , వేద స్వరమే తానుగా కలదై '  శివ సూత్రాలతో కూడియుండి సర్వ శాస్త్రములకూ బ్రహ్మాండమైన భాష్యరూపమైనదై ,   స్తుతిపాత్రమైన వేద సారమై   , పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిపాదించే  అక్షర రూప మహామంత్రమైన శివ పంచాక్షరిని   సిద్ధిని పొందడానికై నేను పఠిస్తాను , హే రాజేశ్వరా!104 )

తరమే నాల్గు ముఖమ్ములున్న విధికిన్ తత్త్వమ్ము బోధించినన్ తరమే షణ్ముఖ వర్యు కైన పలు శాస్త్రార్ధమ్ములన్ బల్కినన్ తరమేనా దశ కంఠుకైన ఘన వేద వ్యాఖ్య గావించినన్ తరమే వేయి ముఖమ్ములున్న శివతత్త్వం బెన్న రాజేశ్వరా! భావం .... హే రాజేశ్వరా! నాలుగు ముఖాలు ఉన్న బ్రహ్మదేవుడు తత్వమంతా బోధించినా , షణ్ముఖుడు అయిన కుమారస్వామి ఎన్నో శాస్త్రాలు వివరించినా , పది కంఠాలున్న రావణుడు ఎన్నో వేదాలు వ్యాఖ్యానించినా ..... ఎన్ని ముఖాలు ఉన్నా సరే , శివ తత్వం పూర్తిగా తెలుసుకోవడం వివరించడం ఎవరికీ సాధ్యం కాదు ! 1 05 భానుండే దినమందు చూపు జగమున్‌ భాస్వత్ ఖగోళమ్ము ఆ స్థానం బున్ తను జేరి చంద్రువెలుగున్‌ సారించు రాత్రంతయున్ ధ్యానంబున్ తగజేసి చూడు ఎద నత్యానంద బ్రహ్మంబు నా స్థానంబౌను శివత్వ భావమయమై సత్యమ్ము ,రాజేశ్వరా ! భావం ... హే రాజేశ్వరా ! సూర్యుడు పగలంతా కాంతి తో లోకాన్ని చూపుతున్నాడు. చంద్రుడు రాత్రంతో వెలుగు నిస్తున్నాడు. సరిగ్గా ధ్యాన స్థితి తో మనసులో చూడగా అంతా శివభావమయమైన పరబ్రహ్మ తత్త్వమే గోచరిస్తుంది. 106) ఆశాపాశము భగ్నమామె , మది యందావేదనల్‌ వీడె , యా వేశాగ్నుల్ చల చల్ల బారె , మది ను ద్వేగమ్ము నీరయ్యె ఆ కాశమ్మందు విలీనమయ్యె నవివేక ధ్యాంతమేఘమ్ము హే ఈశా ! నిన్ను దలంచ నిర్మల మన స్సే నిల్చు , రాజేశ్వరా ! భావం-- హే పరమేశ్వరా! నిన్ను తలచగానే ఆశలన్నీ తొలగి పోయాయి . మదిలోని ఆవేదన అంతా వీడి పోయింది. . ఆవేశాగ్నులు చల్లబడిపోయినాయి . నా అజ్ఞానమనే చీకటిమేఘం ఆకాశంలో విలీనమైంది . నిన్ను తలచుకోగానే మనస్సంతా నిర్మలమై నిలుస్తుంది. 107 ) స్వామీ నిన్ను దలంచ నాదు మనసే స్వర్గాదులన్ దాటి సత్ శ్రీ మోక్షమ్మున సంగమించ ఘనమౌ యోగస్థితిన్ జేరి యే మేమో యూహల దేలియాడి ఖగమై మేఘూలయ శ్రేణిపై కామేశున్ గని కోర్కెలేని సుగతిన్ కామించె రాజేశ్వరా! భావం .... హే రాజేశ్వరా ! నిన్ను తలచ గానే నా మనసు స్వర్గలోకాదులను అధిగమించి మోక్ష స్థానాన్ని స్పర్షించాలని భావించింది . ఒక గొప్ప యోగ స్థితిని చేరుకొంది. పక్షిలా యేవో ఊహలమేఘాలపై తేలియాడింది. మహాశివుని తాను దర్శించి కోరికలు లేని ఉత్తమగతిని కోరుకుంటుంది స్వామీ ! 108) ఏ వేళో హృదయాంతరంగ పృథివిన్ యీభక్తి వర్షించెనో శైవోద్బీజము పల్లవించి వరమై శైవోజ్వలత్ కాండమై భావోద్దీప్త విశాఖమై భవ సుధా చింతా ఫలోపేతమై శైవోత్తుంగ సువృక్ష మయ్యె ఘనమై శైలేశ ! రాజేశ్వరా! భావం , ... ఏ సుముహూర్తంలోనో నా హృదయం అనే క్షేత్రంలో శివ సంబంధమైన బీజం పడింది .భక్తివర్షంతో తడిసి అది పల్లవించింది . శైవ కాంతిగల కాండం ఏర్పడింది . భావాలు విస్తరించి శాఖలుగా మారాయి . దానినిండా శివామృతఫలాలు నిండి మహా శైవ వృక్షంగా ఎదిగింది స్వామీ ! 109) అన్నార్తుల్‌ ,క్షుభితాంతరంగ సహిత ,వ్యత్యస్త భాగ్యాన్వితుల్ ఎన్నో కష్టములెన్నొ దుఃఖముల వెన్నో ఓర్చి నిర్లిప్తతన్ కన్నీరున్ కురిపింపసాగిరి ప్రభో కారుణ్యతన్ జూపి యా పన్నార్తుండను పేరు నిల్పుకొను దేవా ,రాజ రాజేశ్వరా! భావం --- హే రాజేశ్వరా! అన్నం కోసం తపించే వారు , ఆకలితో బాధ పడే వారు , దురదృష్టవంతులు , ఎన్నో కష్టాలకు దుఃఖాలకు ఓర్చి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు . నీవు ఆపద్బాంధవుడన్న పేరు నిలబెట్టుకో దేవా ! రాజేశ్వరా! 110)

'హర ' 'యంచు 'న్ గుడివెట్టి విష్ణువును తామర్చింప శ్రీ వైష్ణవుల్‌ హర శబ్దాంత్యము కొమ్ము బెట్టి హరునే యర్చింతురే శైవులున్ పర భేదంబులవెందుకయ్య తుదియౌ పారమ్యతన్ జూడగా పరమేశుంగన భేద భావన వృధా!

భావింప , రాజేశ్వరా!

భావం ... హే రాజేశ్వరా! 'హర ' అనే పదం చివర గుడి పెట్టి హరిగా నిన్ను వైష్ణవులు అర్చిస్తారు. హర అనే పదం చివర అక్షరానికి కొమ్ము ఇచ్చి హరుడిగా శైవులు నిన్నుఅర్చిస్తారు. సరిగ్గా గమనిస్తే ఈ భేద భావాలు అవసరం లేదు . పరమేశ్వరుని చూడడానికై ఇలాంటి భేద భావాలు పనికి రావు స్వామీ ! 11 1 తరులందున్ గిరులందు నిర్ఝర జలాంతర్‌ గుప్త తేజమ్ములన్ విరులందున్ సిరులందు సుందర కళా విన్యాస వర్ణమ్ములన్‌ నరులందున్ సురులందు సృష్టి లయలన్‌ బ్రహ్మండ గోళమ్ములన్ హరుడే తానట నిల్చెనయ్య జగమే హర్శించ రాజేశ్వరా! భావం ... హే రాజేశ్వరా! వృక్షాలలో పర్వతాలలో నరీ ప్రవాహాలలో నిబిడమై ఉండే తేజస్సు నందు , పూలయందు , ఐశ్వర్యమందుండే అందమైన కళాత్మకమైన వర్ణ కాంతులందు , మానవునిలో , దేవతలలోని సృష్టి యందు , స్థితిలయల యందు , బ్రహ్మండ మందలి సకల ఖగోళముల యందు ప్రపంచ శ్రేయస్సు కోసం శివుడే నిండి యున్నాడు. 11 2 పదముల్ పద్మ దళమ్ములై విరిసె నా పద్యార్చనా భాగ్యమై హృదయాహ్లాదక వాక్యముల్ త్రిదళ వత్ హృద్బిల్వ పత్రమ్ములై కదలాడే శివ భావనల్ హిమగిరీ గంగా సరిద్ధారయై మదిలో నిన్నభిషిక్తు జేసెద శివా ! మాహేశ రాజేశ్వరా! భావం -- నేను చేసే శివార్చన కోసం నా రచనలోని పదములన్నీ పద్మ దళములై విరిసినాయి . హృదయాహ్లాదాన్ని కలిగించే వాక్యాలన్నీ బిల్వ పత్రాలైనాయి . ఎదలోని శివ సంబంధ భావనలన్నీ గంగా జలధారలై వాటితో నిన్ను అభిషేకం చేస్తాను శివా ! హే రాజేశ్వరా! 11 3 కనవయ్యా హృదయాలయాంతర లసద్ గర్భప్రపీఠమ్మునన్‌ కనులన్ మూసి కనంగ చాలునచటే కామేశ్వరీ సంయుతున్ మనసంతన్ కనులైన వేళ మదిలో మాహేశ్వరుండే స్వయం జనితుండై చరియించు సంతసముతో సత్యమ్ము రాజేశ్వరా! భావం .... నీ హృదయం అనే గర్భాలయ పీఠంపై నీ కన్నులను మూసి చూడు !మనసంతా కళ్ళు చేసుకొని చూస్తే పార్వతీయుక్తుడైన మహేశ్వరుడే స్వయంగా ఉద్భవించి ఆనందంగా అక్కడ సంచరిస్తాడు . 11 4 జోడై వచ్చెడు పెద్ద సేవ లెదుటన్‌ జూడన్‌ మహద్భాగ్యమే రేడైనన్ సరి కాడు వైభవముతో శ్రీ కాంతులొప్పారగా తోడైవచ్చు రమారమేశులకునై తోడైన గౌరీశులున్ నీడై నిల్తురుగాక మాకు వెలుగై నిత్యమ్ము రాజేశ్వరా! భావం -- రెండు పెద్ద సేవలను ఎదురుగా ఉండి చూడడం ఒక మహా భాగ్యమే ! ఏ రాజుకు కూడా ఇంతటి వైభవం లేదు . లక్ష్మీ నారాయణ లకు తోడై వచ్చిన పార్వతీ పరమేశ్వరులు నిత్యం మాకు నీడగా నిలిచిఉందురు గాక 1 15 పూజానంద మనస్కులున్ శివ మతుల్ పుణ్యార్థులున్‌ నీకు స ద్యోజాతాదుల నర్చ చేసెడు మహా దోర్దండ వేదజ్ఞులున్ రోజూ నిన్నెద నమ్మి గొల్చెడు సతీ రూపాంగులున్‌ భ 1క్తితో రాజన్నాయని ప్రేమమీర కొలువన్ రక్షించు రాజేశ్వరా ! భావం--- శివ పూజతో సంతోషించేవారు , శివ పరమైన చింతనే చేయువారు , పుణ్యార్ధులూ నిన్ను మంత్రాలతో పూజించే వారు , మహా వేద వేత్తలు, ప్రతిరోజూ నిన్నేనమ్మిన పార్వతీ స్వరూపులైన వారు నిన్ను "రాజన్నా " అని పిలుచుచు అర్చన చేయగా వారిని కాపాడు ,హే రాజేశ్వరా!

1 16 శివ భావమ్ములనూహసేయ తనువున్ చిత్తమ్మునుప్పొంగగా హవనమ్మైన విధమ్ముదోచెను మనో హర్షాగ్ని సంభూతమై స్తవ పత్రాంచిత బిల్వరాజతరువే తానీ వరంబివ్వ నే నవ పద్యాత్మక బిల్వ పత్రముల నిన్నర్చింతు , రాజేశ్వరా! భావం... హే రాజేశ్వరా! శివసంబంధమైన ఆలోచన చేయగానే నా తనువూ మనస్సూ ఉప్పొంగిపోయాయి . మనసులో మహా యాగమే జరిగినట్టు అనిపించింది .అక్కడ పుట్టిన సంతోషం అనే అగ్ని నుండి బిల్వవృక్షం ఒకటి సముద్భవించింది . అది తనకు తానే నాకు వరం ఇచ్చింది . ఆ వరం వల్ల

నేను  ఆ యీ నూతనమైన పద్యబిల్వాలతో  నిన్ను అర్చిస్తాను స్వామీ !

117 స్వామీ!! నీ శుభకీర్తనల్‌ శివపురీ సంధానయోగ్యమ్ములున్ ప్రామాణ్యంబుగ పారమేష్ఠ్య విబుధుల్ పాడేటి సంగీతముల్ కామార్తిన్‌ శివసూత్ర చిత్రికలనే కల్పించి కీర్తించగా కామేశా ! అది శాంతి పూర్ణ శివ సత్కావ్యమ్మె' రాజేశ్వరా!

భావం -- హే రాజేశ్వరా! మంగళకరమైన నీ కీర్తనలు మోక్ష సాధకాలు . ఎంతో ప్రామాణికంగా పండితులు పరమేశ్వరుని తత్వంగురించి పాడే సంగీత కృతులు . శివ సూత్రాలను కీర్తించి పాడగా అది అద్భుతమైనశాంతి రసంతో కూడుకొన్న శివ కావ్యమే స్వామీ !118 రాజేశా ! రమణీయ కాంతి గరిమన్ , రాజన్య రమ్యాకృతిన్ రాజ శ్యామల కోమలాంగ వినుతోల్లాస ప్రకాశ ద్యుతిన్‌ ఓజోదర్పగభీర భావ ప్రకట ప్రోత్కర్ష కోద్దీప్తియున్ రాజాఖ్యానక నామమున్ నుతుల రాజిల్లేను రాజేశ్వరా ! భావం -- హే రాజేశా | గొప్ప రమణీయ మైన కాంతితో , అత్యున్నత మైన ఆకారంతో , ఎంత గానో స్తుతించదగిన శ్యామల వర్ణ కాంతులతో ప్రకాశించే లింగ రూపం తో, గంభీర భావంతో విలసిల్లే "రాజన్న "అనే పేరుతో నీవు గొప్పగా ప్రకాశించుతున్నావు. హేరాజేశ్వరా!

119 రెండైనట్టి కరమ్ము లిచ్చితివయా రెండైన శ్రోత్రమ్ములున్‌ రెండై నిల్చు పదమ్ములున్‌ కనుటకై రెండైన కండ్లిచ్చి యా రెండో మాటయె లేని గుండె గుడియే రేడైన నీదేనయా రండో శంకర, వెండి కొండ ఇదియే రావయ్య రాజేశ్వరా ! భావం .... హే రాజేశ్వరా! రెండు చేతులు , రెండు కళ్ళు , రెండు పాదాలు , రెండు చెవులు ఉంటూ గుండె మాత్రం ఒక్కటే ఉంది అది మారాజైన నీ దేవాలయమే (రెండోది యేదీ అవసరం లేదు ) ఇది నీ వెండి కొండ అయిన కైలాసమే ! రావయ్యా ఇక్కడికి , హేమహేశ్వరా !

120) శ్రీ మచ్ఛంకర లింగ దర్శన మహో ! చిత్తమ్ము భాసిల్లగా నా మేనంతయు పుల్కరించె మది యానందాబ్ది నుప్పొంగె నా వ్యామోహమ్ము నశించె శైవ మయ దివ్య జ్యోతి దీపించె ఈ ధామమ్మే శివ దీప్తమయ్యె సురనాథా,రాజరాజేశ్వరా ! భావం ... శ్రీ రాజేశ్వర దివ్య లింగం మనసు లో భావించగానే నా శరీరం అంతా పులకరించింది. హృదయం లో ఆనందం అనే సముద్రం ఉప్పొంగింది . నా వ్యామోహం అంతా నశించ గా శివ జ్యోతి ప్రకాశించింది. ఈ స్థానమే శివ ధామమై ప్రకాశించింది .


చొప్పకట్ల భాను కృత శ్రీ రాజరాజేశ్వర శతబిల్వార్చన

    సంపూర్ణమ్