వఝల రాధాకృష్ణశాస్త్ర్రి 🔘

VAJAALA RADHA KRISHNA SHASTRI 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 ,వేములవాడ క్షేత్ర పురోహితులు, వేద,శాస్త్ర్ర పండితులు.

కీర్తిశేషులు వఝల రాధాక్రిష్ణ శాస్త్రి గారు.(1899-1982) వేములవాడ క్షేత్రం లో, వఝల నరసయ్య ,రాజేశ్వరి దంపతుల ‌రెండవ కుమారుడుగా జన్మించినారు.వారి వంశమునకు చెందిన వఝల బాయమ్మ,మృత్యుంజయం దంపతులకు సంతతి లేకపోవుటచే వారికి దత్తపుత్రునిగా వెళ్ళడం జరిగింది. శ్రీమతి కిష్టబాయమ్మ గారు వారి ధర్మపత్ని. వఝల రాధాకృష్ణ శాస్త్ర్రి గారు సంస్కృత, వేద శాస్త్ర్రములను ,పురాణములను అభ్యసించి పాండిత్యమును సంపాదించినారు.వేములవాడ క్షేత్రంలో దైవ సంబంధ ఉత్సవ నిర్ణయములలో నిర్వహణలలో సాధికార ధర్మనిర్ణయ కర్తగా ముఖ్యపాత్ర వహించేవారు. పర్వదిన,ముహూర్త నిర్ణయములలో ధర్మశాస్త్ర్రబద్దమైన ఆచరణ తెలుపుటకు వారినే సంప్రదించేవారు.క్షేత్రంలో తొలిసారి శివకళ్యాణోత్సవ నిర్వహణకు ,విధాన నిర్ణయంలో వారి పాత్ర మరిచిపోలేనిది. ఆలయ ఉత్సవ సందర్భాలలో పురాణప్రవచనములు, శ్రీరాజరాజేశ్వర స్వామివారి చతుష్కాల పూజలు ప్రత్యేక ఉత్సవాలలో విశేష కర్తృత్వము నిర్వహించి స్వామివారి కృపకు పాత్రమైనారు. ఆలయంలో మహన్యాస పారాయణములు, ఉపనిషత్ పారాయణములు, ఆయన నిరంతర బాధ్యతలు. తొలినాళ్ళనుంచి ఆలయంలో శివకళ్యాణోత్సవ కర్తృత్వాన్ని చేపట్టి నాలుగు దశాబ్దాలు తనకుగల రాజరాజేశ్వరస్వామివారి పై భక్తిని చాటుకున్నారు ప్రధాన మహామంటప పునర్నిర్మాణ సమయంలో స్వామివారి పురాతన గర్భాలయ పరిరక్షణకై ఉద్యమించి గర్భాలయమునకు ఎలాంటి హాని కలుగకుండా తీవ్రంగా వాదించి,పుష్పగిరి పీఠాధిపతులను ఒప్పించి కాపాడినారు. జగద్గురువులు శృంగేరీ,పుష్పగిరి,కంచి పరమాచార్యులచే విశిష్డ శాస్త్రపండితులుగా సత్కరింపబడినారు. వేద శాస్త్ర్రముల ప్రతులను ముందుతరాలకోసం భద్రపరచడానికి అహర్నిశలు రాయటం వలన యాభై ఐదు సంవత్సరాల వయసులోనే దృష్టిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ వారి ధర్మపత్ని శ్రీమతి కిష్టబాయమ్మ గారి సహాయంతో చరమాంకం వరకు శ్రీరాజరాజేశ్వరస్వామివారి నిశీపూజలో భక్తిప్రపత్తులతో పాల్గొని కృతార్థులైనారు. క్షేత్రంలోని పండితులచే శిష్టజనులచే శాస్త్రులవారూ! అని సహ వేద పండితులచే భీష్మపితామహా అని ఆత్మీయంగా పిలిపించుకునేవారు. కీర్తిశేషులు రాధాకృష్ణ శాస్త్ర్రి గారు ,,శ్రీమతి కిష్టబాయమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. 1 వఝల సాంబశివశర్మ, మృత్యుంజయం అను పెర్లు గల ఇద్దరు కుమారులు, శ్రీమతి వసంత అని పేరుగల కుమార్తె . వారి పెద్ద కుమారుడు వఝల సాంబశివశర్మ కుమారుడు రాధాకృష్ణ శాస్త్ర్రి గారి మనవడు వఝల శివకుమార్ చూపు కోల్పోయినప్పటినుంచి తన భుజాన్ని ఆసరాగా అందిస్తూ దైనందిన వ్యవహారాలలో సేవచేసేవాడు. అంతేకాక వారివద్ద స్మార్త పూజా విధులను కూడా అభ్యసించాడు. వారి స్మారకంగా 2010 నుండి 2015 వరకు ప్రతి జ్యేష్ట శుద్ధ ఏకాదశి రోజున వారి పౌత్రుడు వఝల శివకుమార్, అత్యంత శ్రద్ధా భక్తులతో, తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధులైన వేదపండితులు సలక్షణ ఘనాపాటి శ్రీమాన్ కొడిచెర్ల పాండు రంగాచార్యుల వారికి, వేదమూర్తులు శ్రీ చిట్టి హనుమచ్ఛాస్త్రి ( భద్రాద్రి దేవస్థానం)గారికి, వేద స్వరూపులు‌, బ్రహ్మశ్రీ దుద్దిల్ల మనోహర శర్మ అవధాని గారికి, వేదగాయత్రి, వేద సరస్వతీ స్వరూపులు బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారికి, వేదవిద్యాసాధకులు బోధకులు ఉపాసకులు బ్రహ్మశ్రీ కేదారనాథ శాస్త్రి గారి వంటి మరెందరో వేదవిద్వన్మణులకు సగౌరవంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ కళా మండపంలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ రాధా కృష్ణ శాస్త్రి స్మారక విశిష్ట వేదపండిత సత్కార కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేదవిదుల సమక్షంలో వఝల వారి వంశ పురోహితులు బ్రహ్మశ్రీ చంద్రగిరి శరత్ శర్మ గారి పర్యవేక్షణలో వ్యాఖ్యాన నిర్వహణలో నిర్వహిస్తూ బ్రహ్మశ్రీ వఝల రాధాకృష్ణ శాస్త్రి గారి మహదాశయాలకు సార్థకతను కూర్చుతున్నారు. వారి మార్గంలోనే శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి సేవలో కృతార్థులవుతున్నారు. 🙏. 🙏 🙏 🙏 🙏 🙏

2. బ్రహ్మశ్రీ వఝల సాంబశివశర్మ గారు.🔘 Sri.VAJJALA SAMBA SHIVA SHARMA. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ఆయన గళం విప్పితే రమణీయం కమనీయం . మాట్లాడినా భజన చేస్తూ వ్యాఖ్యానించినా, హార్మోనియం మెట్ల మీద స్వరాలను నర్తింప చేస్తూ విభిన్న శైలిలో హరికథా గానం చేసినా అది రసరమ్యం. ప్రహతంగా, స్వచ్ఛందంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో నిత్య సుప్రభాత గాయకులుగా , నిద్రిస్తున్న నా ప్రపంచం కోసం కదిలి రమ్మని స్వామి వారికి మేలుకొలుపులు పాడి తన చరమాంకం వరకు స్వామి సేవలో కృతార్థులైన సార్ధక జన్ముడు బ్రహ్మశ్రీ వఝల సాంబశివశర్మ గారు. రాధేశ్యాం రామాయణం హరికథా ప్రవాచకులుగా తెలంగాణలోని పలు పట్టణాలలో క్షేత్రాలలో ఆయన బహు ప్రసిద్ధులు. ప్రతి సంవత్సరం నెల రోజులు ధర్మపురి క్షేత్రంలో రామాయణ ప్రవచనంచేసి 1954 లో అసంఖ్యాక భక్త బృందం చే దివ్య పట్టాభిషేక సత్కారాలు పొందిన విద్వత్ శిరోమణి ఆయన. గణేశ నవరాత్రులు, శ్రీరామ అ నవమి ఉత్సవాల సందర్భంలో బోధన్ కామారెడ్డి నిజామాబాద్ వరంగల్ సిరిసిల్ల వంటి ఎన్నో పట్టణాలలో ఉత్తర భారతీయ ఫణితిలో హరికథా గానం చేసి విశేష సన్మానాలు పొంది గౌరవింప బడిన నవ్య హరికథా విద్వాంసులు.

సంస్కృతాంధ్ర హిందీ భాషా పండితులు ఆదర్శ అధ్యాపకులు. మంటప హనుమాన్ భజన మండలిని స్థాపించి మూడు దశాబ్దాలు తన సంకీర్తనలతో రాజరాజేశ్వర స్వామి వారికి, శ్రీరామచంద్రమూర్తికి, జగన్మాత లకు స్వర్ణ నీరాజనాలు సమర్పించి అశేష భక్త సమాజానికి ముక్తి మార్గ నిర్దేశం చేసిన ధన్యజీవి. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్ర వైభవం పై లక్ష్మీ గణపతి, శ్రీ రాజరాజేశ్వరీ దేవి, క్షేత్రస్థ దేవాది దేవతలపై వేలాది కీర్తనలు రచించి స్వరకల్పన చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో అట్టి నిత్య భగవన్నామ సంకీర్తనలను తన సుమధుర గంభీర శ్రావ్య స్వరంతో ప్రతి నిత్యము ఆలపించి తరించిన భాగవతోత్తమ్ముడు ఆయన. 20-07-1914 తేదీన వఝల రాధాకృష్ణ శాస్త్రి, కిష్టబాయమ్మ దంపతులకు జన్మించి.. సంస్కృతం హిందీ ఉర్దూ భాషలలో అనర్గళ పాండిత్యాన్ని సొంతం చేసుకున్నారు. నిజాం నిరంకుశ ప్రభుత్వంపై , రజాకార్ల ఉద్యమానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో చురుకైన పాత్ర పోషించినారు. ఆనాటి యువతరాన్ని సమీకరించి, వ్యాయామంలో శిక్షణనిచ్చి, ప్రోత్సహించి సంసిద్ధం చేసి ఎన్నో నిరసన పోరాటాలలో పాల్గొన్న సమరయోధుడు సాంబశివ శర్మగారు. 1953 లో కోటి సుల్తాన్ బజార్ వేదిక పై ఆయన ఆలపించిన "హిల్ గయా తఖ్త్ సుల్తానీ‌" పాట ట సభను ఉత్తేజితం చేసింది. 1939 లో పీవీ నరసింహారావు గారి నాయకత్వంలో సాగుతున్న స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో వేములవాడ లో తొలితరం కాంగ్రెస్ తొలి సభ్యుడిగా చేరి తన దేశభక్తిని చాటుతూ గాంధీ టోపీ ఖద్దరు ధోవతి కండువా వాస్కో టు ఆహారంగా ధరించి జీవితపు చివరి దశ వరకు గాంధేయవాదిగా జీవితాన్ని గఱపిన మహనీయుడు. కుల వివక్ష, జాతీయ సంస్కరణలు, భారత స్వాతంత్ర్య పోరాటం, ఆదర్శ వివాహాలు, వంటి ఎన్నో సందేశాలతో పలు వేదికలపై నాటకాలు ప్రదర్శించి స్వాతంత్ర పోరాటేచ్ఛను రగిల్చిన సమరయోధుడు సాంబశివశర్మ. 1935-1952 మధ్యకాలంలో(40వ దశకం లో)వేములవాడ తొలితరం రంగస్థల నటుడుగా,నాటకాల నిర్వహణలో ప్రదర్శనల్లో భాగమై రంగస్థలం కళాకారుడుగా ప్రాచుర్యం పొందినారు. మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ గారితో వేములవాడ ప్రాంతంలో రంగస్థల వైభవాన్ని ప్రదీప్తింప చేసిన కళాకారులు శ్రీ వఝల సాంబశివశర్మ గారు. ప్రతాప రామయ్య, కేశన్నగారి రామయ్య,సాంబకవి, వంటి వారితో తొలి స్త్రీ పాత్రధారిగా సత్య భామ ఊర్వశి రుక్మిణి వంటి గొప్ప పాత్రలకు జీవం పోసి ఆకట్టుకొని రసజ్ఞుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న రంగస్థల నటుడు. ఎన్నో భారతీయ సంస్కృతికి సంబంధించిన వ్యాసములు ప్రముఖ దిన పత్రికల ప్రత్యేక అనుబంధాలలో ప్రచురింపబడి ' సంస్కృతి - సంప్రదాయం' పేర సంకలనం చెయ్యబడి మన్ననలకు పాత్రమైనాయి. కీ.శే.డా.సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులతో వేములవాడ పట్టణంలో తొలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థాపించడం కోసం ఉద్యమించారు. ఆ రోజుల్లో దాని నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వు వెలువడేలా తేజ్ నారాయణ్ వంటి రాష్ట్ర స్థాయి అధికారులపై‌ ఒత్తిడి తెచ్చి సాధించిన సాధకుడు. బ్రాహ్మణ కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసి వీధుల పాలు చేస్తున్న ఆనాటి 'మామ్ లా' గుత్తేదారు వ్యవస్థలను నిరసిస్తూ ఈ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్వహణను ప్రభుత్వపరం అయ్యేలా 'అమానీ' కోసం విశేష కృషి సలిపిన దార్శనికుడు శర్మ గారు. శ్రీ రాజరాజేశ్వర నామ సంకీర్తనలు, రాజన్న భక్తి పాటలు, శ్రీ గణపతిం భజే, శ్రీ రాజరాజేశ్వర నామ సంకీర్తనామృతం, మంగళహారతులు, మరియు సంస్కృతి సంప్రదాయం వ్యాస సంకలనం వంటి గ్రంధాలను వెలువరించి అశేష జనం అభిమానాన్ని చూరగొన్నారు. 2008వ సంవత్సరం ఆషాడ బహుళ ఏకాదశి రోజు శివసాయుజ్యం పొందారు. 2009-2015 వరకు వారి పేర శ్రీభాష్యం విజయసారథి, దోర్బల విశ్వనాథ శర్మ, కోవెల సుప్రసన్నాచార్య, అష్టకాల నరసింహ రామశర్మ , అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి వంటి ఎందరో పండితులకు విశిష్ట ఆధ్యాత్మిక సేవా పురస్కారాలు అందిస్తూ ప్రేరణాస్రోత మైన వారి ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • బ్రహ్మశ్రీ వఝల సాంబశివశర్మ గారి జననం..20-07-1914* *జననం: కరీంనగర్ జిల్లా వేములవాడ క్షేత్రం లో...*
  • తల్లిదండ్రులు*
  • బ్రహ్మశ్రీ వఝల రాధాకృష్ణ శాస్త్రి , శ్రీమతి కిష్టబాయమ్మ‌ గారలు*
  • వ్యక్తి గత జీవిత వివరాలు*
  • తెలుగు పండితులు*, *హిందీ, సంస్కృత భాషల్లో అనర్గళ పాండిత్యం*.
  • భారత స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితులయ్యారు*.
  • తొలి తరం కాంగ్రేసు వాదిగా..సమాజంలో స్వాతంత్ర ఉద్యమ భావాల, ఆదర్శ భావాల వ్యాప్తికి కృషి సలిపారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమ‌ంలో పాల్గొన్న యోధుడు.*
  • ఆదర్శ భావాలు, సంఘం సంస్కరణాభిలాష , సామాజిక చింతన కలిగిన కార్యకర్తగా గణుతికెక్కినారు*.
  • తెలంగాణా ప్రాంత రంగస్థల ఉద్యమంలో మధురకవి మామిడిపల్లి సాంబశివ శర్మ గారితో 1935-1952 వరకూ కృషి సలిపినారు*.
  • సాంఘిక, పౌరాణిక నాటకాల్లో రాణించిన నటుడు.*
  • స్త్రీ, పురుష పాత్రలనూ‌ అద్భుతంగా పోషించి,పలు నాటకాలకు దర్శకత్వం వహించి రంగస్థలంపై తన బహుముఖీన ప్రతిభను చాటారు*.
  • హరికథకులుగా విఖ్యాతమైనారు*
  • రాధేశ్యాం రామాయణ‌ ప్రవాచకులుగా ఉత్తర భారత శైలిలో‌ హిందీ భాషలో వేలాది హరికథాగానాలు చేసి, సిరిసిల్ల,ధర్మపురి, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, యాదగిరి క్షేత్రాలలో బహు సత్కారాలు పొందిన విద్వాంసులు*.
  • స్వర్గీయ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, జువ్వాడి చొక్కారావు, కే.వీ. నరసింహారావు వంటి వారి సాహచర్యంలో కాంగ్రేసు వాదిగా ఖ్యాతి పొందారు*.
  • వేములవాడ క్షేత్రంలో తన 16వ ఏట నుండి సుప్రభాత సేవలో, ఆలయ నిత్య భజనా సేవలో వేలాది కీర్తనలు రచించి గానం చేసి తరించిన భక్తవరేణ్యుడు.*
  • మంటప హనుమాన్ భక్త సమాజాన్ని, *శ్రీ రాజరాజేశ్వర నాటక సమాజాన్ని, *శ్రీ రాజరాజేశ్వర నిత్య నామసంకీర్తనా మండలిని, *శ్రీ రాజరాజేశ్వర ధార్మిక సేవా సమితులను స్థాపించి తన సేవలను అందించి సార్థకతను పొందినారు.*