వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2009)

ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

అచ్యుత దేవ రాయలు (అచ్యుతరాయలు) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు.


శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు. ఇతడు తిరుమల, శ్రీకాళహస్తి, విజయనగరంలలో మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు. అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన అచ్యుతరాయాభ్యుదయములో వివరముగా వర్ణించాడు.


అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్దములందు విజయం సాధించాడు. శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు.


ఇతని పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించినాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది. న్యూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన మరియు సాహిత్య ఆధారాలు లభించాయి. ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన తిరుపతి లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు. కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు. అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు మరియు సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు. .....పూర్తివ్యాసం: పాతవి

2వ వారం

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లలో సంక్రాంతి అని; తమిళనాడు లో పొంగల్ అని; మహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్‌ సంక్రాంతి అని; పంజాబు,హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - అంటే ధనుర్మాసం ఆరంభం నుండే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు.

.....పూర్తివ్యాసం: పాతవి

3వ వారం

అసోం ("అస్సాం") ఈశాన్య భారతదేశము లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని డిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర మరియు మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఆంగ్ల అక్షరము T ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి మరియు చాచర్ కొండలు మరియు దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణముగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.

అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా జాతీయ వనము. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది.

అస్సామీ ఆచార వ్యవహారాలలో గమోసా కు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. గమోసాను ఎన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. బిహూ నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్ధనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు

.....పూర్తివ్యాసం: పాతవి

4వ వారం
రబటక్ శాసనం ప్రకారం కనిష్కుని కాలంలో కుషాణుల పాలనలో ఉన్న ప్రాంతం (గీత లోపల) మరియు వారి అధిపత్య ప్రభావంలో ఉన్న ప్రాంతాలు (చుక్కల గీత లోపల)
రబటక్ శాసనం ప్రకారం కనిష్కుని కాలంలో కుషాణుల పాలనలో ఉన్న ప్రాంతం (గీత లోపల) మరియు వారి అధిపత్య ప్రభావంలో ఉన్న ప్రాంతాలు (చుక్కల గీత లోపల)

కుషాణు సామ్రాజ్యం క్రీ.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లింది. దాని ప్రాభవ కాలంలో, షుమారు క్రీ.శ.250 నాటికి, ఆ సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల నుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరివాహక ప్రాంతమంతా విస్తరించింది. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు. కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోను, పర్షియా సస్సానిద్ సామ్రాజ్యంతోను, చైనాతోను రాజకీయ సంబంధాలుండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాస్కృతిక, ఆర్ధిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయ్యింది.

చైనాలో లభించిన సమాచారం ప్రకారం కుషాన్ మూలపదం గ్విషువాంగ్ (చైనా భాషలో: 貴霜) అనేది యూజీ (月氏) జాతికి చెందిన ఐదు రాజకుటుంబాలలో ఒకటి. ఇది ఒక ఇండో- యూరోపియన్ జాతి. బహుశా వీరి భాష తొచారిన్ భాషకు చెందినది కావచ్చును. వీరు క్రీ.పూ. 176 - 160 మధ్యకాలంలో జొయోగ్ను వారి దాడుల వలన మరింత పడమర దిక్కుకు వెళ్ళిఉంటారు. తరువాతి శతాబ్దంలో (క్రీ.పూ. 1వ శతాబ్దం) గ్విషాంగ్ జాతివారు తక్కిన యూజీజాతులవారిపై నాయకత్వం సాధించి, వారందరినీ ఒక బలమైన సంఘంగా రూపొందించారు. ఈ దశలో గ్విషాంగ్ నాయకుడు కుజులా కాడ్‌ఫైసిస్. ఈ గ్విషాంగ్ పదమే పాశ్చాత్య దేశాలలో కుషాన్గా వ్యవహరింపబడింది. కాని చైనాలో మాత్రం యూజీ పదం కొనసాగింది. క్రమంగా వారు తక్కిన సిథియన్ జాతులనుండి అధికారాన్ని హస్తగతం చేసుకొని దక్షిణాన గాంధార దేశం అనబడే ప్రాంతానికి విస్తరించారు. ఈ గాంధార దేశంలో ప్రస్తుత పాకిస్తాన్‌యొక్క పోతోవార్, వాయువ్య సరిహద్దు, కాబూల్ లోయ, కాందహార్ ప్రాంతాలు ఉండేవి. అలా కనిష్కులు అప్పటిలో "కాప్సియా" (ఇప్పటి కాబూల్) మరియు "పుష్కలావతి" (ఇప్పటి పెషావర్)లలో జంట రాజధానులను స్థాపించారు. .....పూర్తివ్యాసం: పాతవి

5వ వారం
ఎయిడ్స్ వ్యాధిని సూచించే ఎర్ర రిబ్బన్ చిహ్నము
ఎయిడ్స్ వ్యాధిని సూచించే ఎర్ర రిబ్బన్ చిహ్నము

ఎయిడ్స్ (AIDS) ఒక ప్రాణాంతకమయిన వ్యాధి. ఇది హెచ్ఐవి Human immunodeficiency virus (HIV) అనే వైరస్ వలన సంభవిస్తుంది. AIDS అనేది Acquired Immune Deficiency Syndrome (ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం)కు పొడి నామము. హెచ్ఐవి వైరస్ మనుషులలో రోగనిరోధక శక్తిని తగ్గించివేస్తుంది. హెచ్ఐవిలో హెచ్ అనేది హ్యూమాన్‌ని సూచిస్తుంది, అంటే ఈ వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది.

శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చునని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ చింపాంజీలకు ఎస్ఐవి(SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కం వల్ల వచ్చే జబ్బుగా పొరబడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కం కానివారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా తరువాత నిర్ధారణకు వచ్చారు.

ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు. అందుకనే వాటిని హెచ్ఐవి కాక్‌టెయిల్ అని పిలిస్తారు. అయితే హెచ్ఐవీ చాలా తొందరగా మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచేసుకుంటున్నాయి. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు. పూర్తివ్యాసం... పాతవి

6వ వారం
ఒలంపిక్ క్రీడల చిహ్నం
ఒలంపిక్ క్రీడల చిహ్నం

ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్ళకొకసారి ప్రపంచ దేశాలన్నీ పోటీపడే ప్రతిష్టాత్మక క్రీడలు. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీ.శ.393 లో నిలిపి వేసారు. మళ్ళీ క్రీ.శ. 1896లో ఏథెన్స్ లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ దాదాపు నాలుగేళ్ళకోసారి (దీనికే ఒలింపియాడ్ అని కూడా పేరు) ఈ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా, పున:ప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలకు వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలువవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనా లోని బీజింగ్ లో జరిగాయి.

రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.

క్రీడాకారుల దృష్టిలో ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించడమే అన్నిటి కంటే పెద్ద గౌరవం. ఒలింపిక్ చరిత్రలో అనేక స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. లారిస్సా లాటినినా అత్యధికంగా 9 స్వర్ణాలతో మొత్తం 18 ఒలింపిక్ పతకాలను సాధించగా 9 స్వర్ణాలు సాధించిన మరో ముగ్గురు క్రీడాకారులు కూడా ఉన్నారు. 1972లో స్విమ్మింగ్‌లో మార్క్ స్పిట్జ్ ఒకే ఒలింపిక్‌లో 7 స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఇంతవరకు వ్యక్తిగత పోటీలలో స్వర్ణం సాధించింది అభినవ్ బింద్రా.

.....పూర్తివ్యాసం: పాతవి

7వ వారం
అనిల్ కుంబ్లే
అనిల్ కుంబ్లే

భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే (కన్నడ:ಅನಿಲ್‌ ರಾಧಾಕೃಷ್ಣ ಕುಂಬ್ಳೆ). 1970 అక్టోబర్ 17కర్ణాటక లోని బెంగుళూరు లో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మనదేశం తరఫున టెస్ట్ క్రికెట్ లోనూ, వన్డే క్రికెట్ లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అనిల్ కుంబ్లే. 2007 నవంబర్ 8 న అతనికి టెస్ట్ క్రికెట్ నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగించబడినది. మొదటగా పాకిస్తాన్ తో స్వదేశంలో జర్గే 3 టెస్టుల సీరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. 1990 లో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించి 603 టెస్ట్ వికెట్లను, 337 వన్డే వికెట్లను పడగొట్టాడు. బంతిని బాగా స్పిన్ చేయలేడని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆస్ట్రేలియా కు చెందిన షేన్ వార్న్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో లెగ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు, స్పిన్నర్లలో షేన్ వార్న్, శ్రీలంక కు చెందిన ముత్తయ్య మురళీధరన్ ల తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. 2008, జనవరి 17 నాడు టెస్ట్ క్రికెట్‌లో 600వ వికెట్టును సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించినాడు. టెస్ట్ క్రికెట్ లో అతని యొక్క అత్యంత ప్రముఖ సంఘటన ఒకే ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లను సాధించడం. ఇంగ్లాండ్ కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ కావడం గమనార్హం. అతని యొక్క సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. తనకు ఎంతో ప్రీతిపాత్రమైన ఢిల్లీ ఫిరీజ్‌షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి 2008, నవంబర్ 2న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

టెస్ట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాధించిన వారిలో ఇంగ్లాండు కు చెందిన జిమ్‌లేకర్ తర్వాత అనిల్ కుంబ్లే రెండో బౌలర్. 1999 లో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ఢిల్లీ లో పాకిస్తాన్ తో జర్గిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే ఈ ఘనతను సాధించాడు. కాని ఈ టెస్ట్ లో పాకిస్తాన్ కు చెందిన వకార్ యూనిస్ ను రెండు ఇన్నింగ్సులలోనూ ఒక్కసారి కూడా ఔట్ చేయలేడు. అతని వికెట్టును కూడా సాధించి ఉంటే ఒకే టెస్ట్ మ్యాచ్ లో ప్రత్యర్థికి చెందిన మొత్తం 11 బ్యాట్స్‌మెన్ లను ఔట్ చేసిన అరుదైన ఘనతను అనిల్ కుంబ్లే సొంతం చేసుకునేవాడు. ఆ ఇనింగ్సులో 9 వికెట్లను తీసిన తర్వాత అతని సహ బౌలర్ అయిన జవగళ్ శ్రీనాథ్ అనిక్ కుంబ్లే కు 10 వికెట్లు దక్కాలనే నెపంతో అతను వికెట్టు సాధించడానికి ప్రయత్నించలేడనే వాదన ఉంది. అనిల్ కుంబ్లే ఈ అరుదైన రికార్డు సాధించిన తర్వాత బెంగుళూరు లోని ఒక ప్రధాన కూడలికి అతని పేరు పెట్టారు.

.....పూర్తివ్యాసం: పాతవి

8వ వారం
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ. 1953, అక్టోబర్ 1 న తొలుత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డపుడు కర్నూలు, రాష్ట్ర రాజాధానిగా ఉండేది. 1956, నవంబర్ 1న రాజధాని హైదరాబాదు కు మార్చబడింది.

ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసాడు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసాడు.ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాష్ట్రములో 23 జిల్లాలు కలవు. హైదరాబాదు, రాష్ట్ర రాజధాని మరియు అతి పెద్ద నగరము. ఇతర ముఖ్య నగరాలు విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి,కర్నూలు, కడప, వరంగల్లు, గుంటూరు. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహిస్తూ కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయుటకు తోడ్పడుతున్నాయి. .....పూర్తివ్యాసం: పాతవి

9వ వారం
గంగానది మరియు దాని ఉపనదుల మ్యాపు
గంగానది మరియు దాని ఉపనదుల మ్యాపు

గంగా నది భారతదేశం, మరియు బంగ్లాదేశ్ లలో ప్రధానమైన నదుల్లో ఒకటి. భారతదేశం ఆర్ధిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.

గంగా నది మొత్తం పొడవు షుమారు 2,510 కి.మీ.(1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉన్నది. ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier)లో భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది.అక్కడినుండి దీనిని "గంగ" అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది.

హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తారు.

మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందికీ ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్ధిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, చుట్టుప్రక్కల కాలుష్యాన్ని విడుదలచేసే అనేక పరిశ్రమలు ఉండడం వలన, గంగానదీ జలాలు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి. కాన్పూరు వంటి నగరాలలోని రసాయనిక పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, ఇందుకు ఒక ముఖ్య కారణం. అందుకు తోడు ప్రజల గృహాలనుండి వెలువడే మురుగునీరు రోజూ 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తున్నాయని అంచనా. ఈ పరిస్థితిని నివారించడానికి అడపా దడపా కొన్ని చర్యలు తీసుకొన్నారు గాని ఫలితాలు చాలా కొద్ది స్థాయిలో ఉన్నాయి. .....పూర్తివ్యాసం: పాతవి

10వ వారం

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

కొందరు దసరా వేషాలు లేదా పగటి వేషాలు ధరిస్తారు. పాఠశాల ఉపాద్యాయులు విద్యార్ధులను వెంట పెట్టుకొని అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. విద్యార్ధులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు.


మైసూరు, కలకత్తా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా దసరా ఉత్సవాలు జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ....పూర్తివ్యాసం: పాతవి

11వ వారం

మకరందము పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్తాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.


అనేక రకాల చక్కెరపదార్థాల సమ్మిశ్రమమే తేనె. ఇందులో 38 శాతం ఫ్రక్టోజ్, 31 శాతం గ్లూకోజ్, ఒక శాతం సుక్రోజ్, 17 శాతం నీరు, 9 శాతం ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17 శాతం బూడిద ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్చిందాని చూస్తే - కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు, అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనెపట్టులోకి చేరతాయి. అవి అక్కడ అనేకసార్లు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.


తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. ....పూర్తివ్యాసం: పాతవి

12వ వారం

గోను, 2007 జూన్‌లో సంభవించిన ఒక తుఫాన్. ఇది ఒక "సూపర్ సైక్లోనిక్ స్టార్మ్". అరేబియా సముద్రంలో నమోదైన తుఫాన్‌లన్నింటికంటే ఇది అత్యంత ఉధృతమైనదిగా గుర్తించారు. ఉత్తరాన హిందూమహా సముద్రంలో సంభవించిన అతిపెద్ద తుఫాన్‌కు ఇది ఇంచుమించు సమానంగా ఉంది. జూన్ 1న అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో చిన్న అల్పపీడన ద్రోణిగా ఇది ప్రారంభమైంది. ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి దిశ అనుకూలంగా ఉండడంతో ఇది జూన్ 3 నాటికి ఉధృతంగా, 240 km/h (150 mph) గాలి వేగంతో బలపడింది. జూన్ 5వ తారీఖున ఇది ఒమన్ తూర్పు తీరాన్ని (రాస్ అల్ హద్ వద్ద) తాకింది. అరేబియన్ పెనిన్సులాలో ఇంత పెద్ద తుఫాన్ ఇంతకు ముందు నమోదు కాలేదు. ఈ ప్రాంతంలో అల్ప పీడనాలు బలహీనంగా ఉంటాయి. అవికూడా త్వరగా చెదరిపోతాయి. సంకీర్ణ తుఫాన్ హెచ్చరిక కేంద్రం (JTWC) దీనిని 02 శ్రేణి తుఫాన్‌గా వర్గీకరించి హెచ్చరికలు జారీ చేసింది. JTWC వారు మూడు సంవత్సరాలకు సరిపడా తుఫాన్ పేర్ల జాబితానొకదానిని తయారుగా ఉంచుతారు. క్రమంలో ఒక్కో తుఫాన్‌కు ఒక్కోపేరు పెడతారు. ఒకసారి వాడిన పేరును మరోసారి వాడరు.


జూన్ 6న ఇది ఉత్తర వాయువ్యదిశగా ప్రయాణించింది. అప్పుడు సముద్రంలోని అలల బలం దీనికి వ్యతిరేక దిశలో ఉండడంవలన తుఫాన్ తీవ్రత బాగా మందగించింది. వాతావరణ శాఖ దీనిని సామాన్యమైన "ఉష్ణమండల తుఫాన్" గా వర్గీకరించింది. తీవ్రమైన గాలులు, అధిక వర్షపాతం కలిగే అవకాశం ఉన్నందున విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని ఒమన్ జాతీయ రక్షణా వ్వవస్థ గుర్తించింది. అందువలన వీలయినంత వరకు నష్టాన్ని నివారించడానికి, అనంతర సహాయ చర్యలు చేపట్టడానికీ పెద్దయెత్తున సన్నాహాలు చేశారు. పోలీసు, మిలిటరీ, పారామిలిటరీ, వైద్య, మునిసిపాలిటీ, విద్యుత్, నీటి సరఫరా విభాగాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకొన్నారు.

ఒమన్ తీరప్రాంతాన్ని తాకడానికి 7 గంటలు ముందునుండీ తుఫాను ప్రభావం ఒమన్ తీరప్రాంతంపై కనిపించింది. ఈదురుగాలులు, అధిక వర్షపాతం సంభవించాయి. కొన్ని ప్రాంతాలలో 610 మి.మీ.వరకు వర్షపాతం నమోదయ్యింది. తీరాన రహదారులన్నీ జలమయమైపోయాయి. స్తంభాలు కూలి పోవడం వలన టెలిఫోను, విద్యుత్ సదుపాయాలు కొన్ని చోట్ల తీవ్రంగా స్తంభించాయి. కాని దేశంలో అత్యధిక ప్రాంతంలో ఈ సౌకర్యాలు కొనసాగాయి. జూన్ 5న మొట్టమొదట తుఫాను ప్రభావం మసీరా దీవిమీదా, షర్కియా ప్రాంతంలోనూ అధికంగా ఉంది. ఇక్కడి ముఖ్యపట్టణమైన సూర్, చుట్టుప్రక్కల రాస్ అల్ హద్ వంటి గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. కొంత సమయం వీటికి మస్కట్ నగరంతో దాదాపు పూర్తిగా సంబంధం లేకుండా జరిగింది. ....పూర్తివ్యాసం: పాతవి

13వ వారం
అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4న వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. భీమవరంలో మిషన్ హైస్కూలులో, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో, కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో, విశాఖపట్నంలో, నర్సాపురంలో ఇతని చదువు సాగింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలో ఉన్నది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవి పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.


చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, స్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు. ....పూర్తివ్యాసం: పాతవి

14వ వారం

కాంచీపురం లేదా కంచి, తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దేశమంతటా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేదాంతాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉన్నది. 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం కాంచీపురం జనాభా 152,984.


మధ్య యుగములలో చైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్ధం నుండి 9వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. అప్పటి కాలంలో కాంచీపురం విద్యాబోధనలో కాశి అంత ప్రాముఖ్యం పొందింది. క్రీ.పూ.రెండవ శతాబ్ధంలో పతంజలి వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉన్నది. మణిమెక్కళ్ అనే తమిళ కవి, పెరుమపంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. పల్లవుల తరువాత కంచిని చోళులు పదవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత విజయ నగర రాజులు 14 నుండి 17 శతాబ్ధం వరకు పరిపాలించారు. తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్ కు ఒక హారాన్ని బహుకరించాడని దానిని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థ స్థలం. ...పూర్తివ్యాసం: పాతవి

15వ వారం

గోల్కొండ ఒక శిధిలమయిన కోట మరియు నగరము. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. 1143 కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలిస్తూ ఉండేవారు. 200 సంవత్సరముల తరువాత వారినుండి బహమనీ సుల్తాను వశము చేసుకున్నాడని కధనం. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1364-1512) ఉండేది, కానీ 1512 తరువాత సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడినది. గోల్కొండ అధికారులు, సైన్యం, పాలకుల కుటుంబాలు నివసించేటంత పెద్దగా ఉండేది. అక్కడ మసీదులు మరియు కోటల శిధిలాలు కూడా ఉంటాయి. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687 లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములొనే ఔరంగజేబు, కోటను నాశనంచేసి, శిధిలాలను మిగిల్చాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి గాను ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్ద కోహినూరు వజ్రము కూడా ఇక్కడినుండే వచ్చినదని చెబుతూ ఉంటారు. గోల్కొండలోని గనుల నుండి వచ్చిన ధనము నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పాలించారు.


గోల్కొండ నాలుగు వేర్వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడ కలిగి ఉంది. కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది. ...పూర్తివ్యాసం: పాతవి

16వ వారం

మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు.

కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.


ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.


కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు. ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది. ...పూర్తివ్యాసం: పాతవి

17వ వారం

బాక్టీరియా ఏకకణ సూక్ష్మజీవులు. ఇవి కొన్ని మైక్రోమీటర్ల పొడవు కలిగి, అసాధారణమయిన నిర్మాణాత్మక వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. బాక్టీరియా సర్వాంతర్యాములు, ఎలాంటి వాతావరణంలో నయినా మనం వీటిని కనుగొనవచ్చు. సాధారణంగా ఒక గ్రాము మట్టిలో 40 మిలియన్, ఒక మిల్లీ లీటరు నీటిలో ఒక మిలియన్ బాక్టీరియా కణాలుంటాయి. లెక్క కడితే ప్రపంచంలో మొత్తం 5 నొనిలియన్ (5×1030) బాక్టీరియా కణాలుంటాయి. సగానికి పైగా బాక్టీరియా ఇంకా కారక్టరైజ్ చేయబడలేదు మరియు చాలా కొన్ని జాతులను మాత్రం ప్రస్తుతానికి ప్రయోగశాలలో వర్ధనం ద్వారా పెంచవచ్చు. బాక్టీరియాల అధ్యయనాన్ని 'బాక్టీరియాలజీ' అంటారు. విట్టాకర్ ఐదు రాజ్యాల వర్గీకరణలో వీటిని మొనీరా రాజ్యంలో చేర్చడం జరిగింది. లీవెన్ హాక్ సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మొదటిసారిగా బాక్టీరియాను కనుక్కొన్నాడు.

మానవుని శరీరంపైన, లోపల కలిపితే మొత్తం మానవ కణాల సంఖ్యకన్నా బాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువ. చాలా శాతం బాక్టీరియాలు చర్మంపైన మరియు జీర్ణనాళంలోనూ నివసిస్తాయి. ఇందులో అత్యధిక శాతం బాక్టీరియా మానవునికి ఎలాంటి హనీ కలగజేయవు, కొన్ని మానవులలో ఇమ్మూనిటికి రక్షణ కల్పిస్తాయి, ఇంకొన్ని హానికారక బాక్టీరియాలు. హానికారక బాక్టీరియాల వల్ల కలిగే అంటువ్యాధులలో కలరా, సిఫిలిస్, ఆంథ్రాక్స్, కుష్టు(లెప్రసీ), క్షయ వ్యాధులు ప్రాణాంతకమైనవి.


బాక్టీరియా అన్ని రకాల ఆవాసాలలో వ్యాపించి ఉన్నాయి. ఇవి మృత్తిక, నీరు, వాతావరణం, జీవుల దేహాలలో లేదా దేహాలపైన విస్తరించి ఉన్నాయి. వివిధరకాల ఆహారాలు, వాటి ఉత్పాదితాలపైన పెరుగుతాయి. అతిశీతల, అత్యోష్ణ మరియు జలాభావ పరిస్థితులను కూడా తట్టుకొని బాక్టీరియా జీవిస్తాయి. కొన్ని బాక్టీరియా మొక్కల, జంతువుల దేహాలలో పరాన్నజీవులుగా లేదా సహజీవులుగా జీవిస్తున్నాయి. ...పూర్తివ్యాసం: పాతవి

18వ వారం

చింపాంజీ, హోమినిడే కుటుంబానికి చెందిన జంతువు. నిటారుగా నిలబడక చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తుంది. "చింపాంజీ" అనే పదాన్ని రెండు వేరువేరు కోతి జాతుల జంతువులకు వాడుతారు. వీటిలో ఒకటి పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో నివసించేది. రెండవ జాతి చింపాంజీలు కాంగో పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఆ జాతి సాధారణ నామం బొనొబో. శాస్త్రీయ నామం Pan paniscus. ఆఫ్రికాలో ఈ రెండు జాతుల చింపాజీల నివాస స్థలాలకు కాంగో నది సరిహద్దుగా ఉంటున్నది. చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు, మానవులు - వీరంతా హోమినిడే అనే జీవ కుటుంబానికి చెందిన జంతువులు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం. సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రిందట కాంగో నది ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని speciation అంటారు


అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. టార్జాన్ చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ. 1960లో జేన్ గూడాల్ అనే శాస్త్రవేత్త టాంజానియా గోంబె నేషనల్ పార్క్ అడవులలో సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారనే అభిప్రాయం అంతకుముందు ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. ...పూర్తివ్యాసం: పాతవి

19వ వారం

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందలకు పైగా చిత్రాలలో అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.

ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన జన్మించాడు. మచిలీపట్నము హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.

వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. .....పూర్తివ్యాసం: పాతవి

20వ వారం

కర్నూలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. 1953 నుండి 1956 నవంబర్ 1 వరకు ఈ పట్టణం ఆంధ్ర రాష్ట్రం రాజధాని గా కొనసాగింది. శ్రీశైలం - నాగార్జునసాగర్ ప్రాంతంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రం బాగా పెద్దది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలో తుంగభద్రానదీ తీరంలో ఉంది. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది.


ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది. బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది. ....పూర్తివ్యాసం: పాతవి

21వ వారం

చిదంబరం తమిళనాడు లోని కడలూరు జిల్లాకు చెందిన మునిసిపాలిటీ మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు చెన్నై కి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది. ఇక్కడ పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజు గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నది. శైవులకు దేవాలయం లేదా తమిళం లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. ఈ ఆలయం 'విరాట్ హృదయ పద్మ స్థలం' అంటే కమలం వంటి విశ్వపు గుండెలో ఉన్నదని ప్రతీతి. పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు. బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడిలో స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు: (1) సంపూర్ణ రూపం - నటరాజు రూపంలోని స్వామి (2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్ (3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం

చిదంబరంలో శివుడు తన దేవేరి శక్తి లేదా శివకామినితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు ....పూర్తివ్యాసం: పాతవి

22వ వారం

యుద్ధకాండ, రామాయణం కావ్యంలో ఆరవ విభాగము. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో యుద్ధ కాండ ఆరవ కాండము. ఇందులో 131 సర్గలు ఉన్నాయి.


పేరుకు తగినట్లుగా యుద్ధకాండ సుదీర్ఘమైన కధా విభాగం అధిక భాగం యుద్ధ వర్ణనే ఉంది. సుందర కాండలో హనుమంతుడు సీత జాడ తెలిసికొని రామునికి చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు - రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేవలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, విభీషణ శరణాగతి, సాగరమునకు వారధి నిర్మించుట, రామ లక్ష్మణ సుగ్రీవులకు జయ ఘోషతో యుద్ధము ఆరంభం కావడం, రామలక్ష్మణుల మూర్ఛ, నాగపాశ విమోచన, అనేక రాక్షస వీరుల మరణం, కుంభకర్ణుని మరణం, హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చి వానర సేనను, తరువాత లక్ష్మణుని కాపాడడం, కుంభ, నికుంభ, ఇంద్రజిత్తుల మరణం, ఆదిత్య హృదయం స్తోత్రం, రామరావణ యుద్ధం, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. అనంతరం రామాయణ కధా ఫలశృతి ఉన్నది.


ఈ కాండములో అనేక భాగాలు - ముఖ్యంగా నాగపాశ విమోచన, హనుమ ఓషధి పర్వతాన్ని తీసుకు రావడం, ఆదిత్య హృదయం, రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం వంటి భాగాలు పారాయణ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది.

....పూర్తివ్యాసం: పాతవి

23వ వారం


మహా సముద్రం లేదా మహాసాగరం, భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు వెయ్యికి 35 వంతులు (3.5%). మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా ఐదు వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియుదక్షిణ మహాసముద్రం. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక దీనిని ప్రపంచ మహాసముద్రం అని చెప్పవచ్చును

మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను సముద్రాలు, సింధుశాఖలు అని అంటారు. అధికంగా అక్కడి భూభాగం లేదా దేశం లేదా ప్రాంతం బట్టి ఈ సముద్రాల, సింధుశాఖల పేర్లు ఉంటాయి. కొన్ని జలాశయాలు పూర్తిగా భూమిచే చుట్టబడి ఉంటాయి. (అంటే ఇతర సముద్రాలతో కలసి ఉండవు). కాస్పియన్ సముద్రం, అరల్ సముద్రం, గ్రేట్ సాల్ట్ లేక్ ఈ కోవలోకి వస్తాయి. నిజానికి ఇవి పెద్ద ఉప్పునీటి సరస్సులే గాని సముద్రాలు కాదు. భౌగోళికంగా మహాసముద్రం అంటే భూగోళంపై నీటితో కప్పబడిన "సముద్రపు అడుగు". (ఓషియానిక్ క్రస్ట్).

మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మొత్తం ఘన పరిమాణం షుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. సరాసరి లోతు 3,790 మీటర్లు పురాతన కాలంనుండీ మానవుడు సముద్రాలపై ప్రయాణిస్తున్నప్పటికీ సముద్రాల నీటి అడుగుకు వెళ్ళడం ఇటీవల కాలంలోనే సాధ్యమయ్యింది. ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్. ఇది పసఫిక్ మహాసముద్రంలో ఉత్తర మెరియానా దీవులు ప్రాంతంలో ఉంది. దీని అత్యధిక లోతు 10,923 మీటర్లు (35,838 అడుగులు). ఇప్పటికీ సముద్రాంతరతలం చాలావరకు అన్వేషించబడలేదు.

....పూర్తివ్యాసం: పాతవి

24వ వారం

ఫుట్‌బాల్, ఒక జట్టు క్రీడ. దీని అసలు పేరు అసోషియేషన్ ఫుట్‌బాల్. ఇందులో జట్టుకు 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ప్రపంచంలో అతి విరివిగా అడబడే ఆట ఇది దీర్ఘచతురస్రాకార మైదానాలలో ఈ ఆట ఆడుతారు. మైదానానికి ఇరు చివర్ల లక్ష్యాలుంటాయి (గోల్ పోస్టులు). బంతిని లక్ష్యానికి చేర్చి స్కోరు చెయ్యడం ఆట ప్రధాన లక్ష్యం. బంతిని చేతితో తాకు హక్కు గోలుకీపరుకు మాత్రమే వుంటుంది. మిగిలిన ఆటగాళ్ళందరూ, బంతిని కాలితో తన్నడం, తలతో కొట్టడం, లేక ఛాతీతో నియంత్రించడం చేస్తుంటారు. నియంత్రిత సమయం లో ఎక్కువ సార్లు లక్ష్యాన్ని ఛేధించిన జట్టు విజేత. ఇరు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడడం, లేక అధిక సమయంలోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.

అత్యున్నత స్థాయిలో జరుగు ఆటలలో సగటున రెండు మాడు గోలులు మాత్రమే చేయబడతాయి. ఆట నియమాల ప్రకారం ఆటగాళ్ళందరి స్థానాలు నియంత్రించబడి లేవు. గోలి తప్పు మిగిలిన ఆటగాళ్ళు మైదానంలో యదేఛ్చగా తిరగవచ్చు. కాని కాల గమనంతో ఫుట్‌బాలులో చాలా స్థితులు రూపుదిద్దుకున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు రకాల స్థితులున్నాయి: స్ట్రైకర్లు, ముందు వరుస వారు, (గోలులు చేయడం వీరి ప్రత్యేకత); రక్షకులు (వీరు ప్రత్యర్ధులు గోలు చేయకుండా చూడాలి); మరియు మైదాన మధ్యులు, బంతిని తమ జట్టు అధీనంలో వుంచడం, దానిని గోలు చేయవలసిన ముందువరుస వారికి అందించడం వీరి కర్తవ్యం. వీరిని గోలీ నుండి గుర్తించడానికి మైదానఆటవారు (అవుట్ ఫీల్డర్స్) గా సంబోధిస్తారు. ఆడువారు ఆడు చోటు ప్రకారం, ఈ స్థితులని ఇంకా విభజించి సంబోధించడం జరుగుతుంది. ఉదా- ఎడమ రక్షకులు, కుడి రక్షకులు వగైరా. పది మంది మైదాన ఆటవారిని ఏ విధానంగా నైనా అమర్చడం జరుగుతుంది. ప్రతి వరుసలో ఎంత మంది ఆటవారు వున్నదీ, జట్టు ఆడు తీరును రూపు దిద్దుతుంది. ఎక్కువ మంది ముందువరుస వారు, తక్కువ రక్షకులు వున్నప్పుడు, గోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టు ఆడుతున్నవారు.


ఆధికారిక ఆట నియమాలు పదిహేడు వున్నవి. ఇవే ఆట యొక్క అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తాయి. పిల్లలు మహిళలకోసం వీటిని అప్పుడప్పుడూ స్వల్పంగా మార్చడం జరుగుతుంది. ఈ పదిహేడు నియమాలతో బాటు అనేక IFAB నిర్దేశాలు ఆటని నియంత్రిస్తాయి. ఆట నియమాలను ఫీఫా ప్రచురించినప్పటికీ అవి IFAB పర్యవేక్షణలోనే వున్నాయి. ....పూర్తివ్యాసం: పాతవి

25వ వారం

కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి.

బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు అకుంఠిత దీక్షతో పనిచేసాడు. ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది.

వీరేశలింగం సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు. 130కి పైగా గ్రంధాలు రాసాడు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు. ....పూర్తివ్యాసం: పాతవి

26వ వారం

కేరళ భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. కేరళ ఉత్తర ప్రాంతం మౌర్య సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. 14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవుల తో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళ ప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు పొందినారు. లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంధంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి.

1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1949 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. దీనికి ముందే 1947లో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇ.ఎమ్.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే ఇది మొదటిది.

మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. కేరళ జంతు సంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని జంతు సంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది. ....పూర్తివ్యాసం: పాతవి

27వ వారం
చైనా మహాకుడ్యం.
చైనా మహాకుడ్యం.

ప్రాచీన, మధ్యయుగపు మరియు నేటి ఏడు ప్రపంచవింతలలో ఒకటిగా పరిగణింపబడుతూ, చూపరులకు ఆశ్చర్యచకితులను చేసే చైనా లో గల అతి పొడవైన కుడ్య నిర్మాణమే ఈ చైనా మహా కుడ్యము. దీని పొడవు 6,508 కి.మీ. లేదా 4,000 మైళ్ళు. నిజానికి ఇదో గోడల సమూహము. క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో ప్రారంభించబడి, క్రీ.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి "క్విన్ షీ హువాంగ్" చే క్రీ.పూ. 220 - 200 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణానికి కారణం చైనా ఉత్తర సరిహద్దుల నుంచి దండయాత్రలను అరికట్టుట. ఆధునిక కాలంలో కనిపించే గోడ 'మింగ్ వంశ' కాలంలో నిర్మింపబడింది.

క్రీ.పూ. 7వ శతాబ్దకాలంలో చైనీయులకు ఈ కుడ్యనిర్మాణ సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్-రాజ్య యుద్ధకాలమైన క్రీ.పూ.5వ శతాబ్దం నుండి క్రీ.పూ. 221 వరకు, "క్వి", "యాన్", మరియు "ఝావో" రాజ్యాలమధ్య, వారి వారి సరిహద్దులను కాపాడుకోవడానికి కోటలకు గోడవలె పటిష్ఠ శత్రు దుర్భేద్య కుడ్యాలను నిర్మించారు

ఈ కుడ్యానికి చెందిన బీజింగ్ ఉత్తర ప్రాంతం, మరమ్మత్తులు పునర్నిర్మాణాలకు నోచుకొని, పర్యాటకుల కేంద్రంగా విరాజిల్లుచున్నది. దీని ఇతర ప్రాంతాలు కుడ్యశిథిలాలతో, గ్రామ ఆటస్థలములుగానూ వీటి ఇటుకలు రాళ్ళు పల్లెవాసుల ఇండ్ల కట్టడాలకు దురుపయోగమౌతున్నవి. ఈ కుడ్యపు అనేక భాగాలునూ దురుపయోగం పాలౌతున్నవి. వీటి గూర్చి సరైన చర్యలు తీసుకోవడం లేదు. మరీ ముఖ్యంగా లోపలి ప్రాంతాలలో దీనిపై సరైన నిఘాలేదు.

రాబోవు 20 సంవత్సరాలలో 'గాన్సూ' రాష్ట్రంలోని ఈ కుడ్యభాగం 60 కి.మీ. కంటే ఎక్కువ భాగం అంతరించిపోయే ప్రమాదముంది. దీనికి కారణాలు దుమ్ము తుఫానులు మరియు ఇసుక తుఫానులు. ఈ ప్రాంతాలలో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు కుదించుకుపోయింది. ఈ కుడ్యాల ఆకృతులూ తమ ఆకర్షణను కోల్పోతున్నాయి.

ఈ కుడ్యం దగ్గరి భూకక్ష్య మరియు చంద్రుడి నుండి చూస్తే కనిపిస్తుందా........ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అపోలో 11 నుండి వీక్షిస్తూ ఏమి చెప్పాడు ........ ....పూర్తివ్యాసం: పాతవి

28వ వారం
హనుమంతుడు

హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తారు. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా కొలవబడే ఆంజనేయుని గుడులు లేని ఊరు ఆంధ్ర ప్రదేశ్ ‌లో ఉండటం అరుదు. ఆంధ్రలోనేగాక, భారతదేశం యావత్తూ మరియు దేశవిదేశాలలోనూ హనుమంతుని దేవాలయాలు కానవస్తాయి. హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుకవచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్

బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్టింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. హనుమంతుని వివిధ నామస్తోత్రాలు, భజనలు, పాటలు చాలా ఉన్నాయి. ....పూర్తివ్యాసం: పాతవి

29వ వారం
నిండు పూతతో ఉన్న మామిడి చెట్టు.
అందంగా కోయబడ్డ మామిడి పండు (ఎడమ). మామిడి నిలువుకోత (కుడి).

మామిడి (Mango) : అనకార్డియేసి కుటుంబానికి చెందిన మామిడికి, 25-30 మిలియన్ సంవత్సరాల పూర్వీకం, నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. దీని జన్మస్థలం దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు బర్మా. ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. గరిష్ట ఎత్తు 120 అడుగులు, ముప్పై(30)అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. పుష్పించడం పూర్తి ఐన తరవాత కాయలు రూపు దిద్దుకొని మూడు(3)నుండి ఆరు(6)మాసాలలో పక్వానికి వస్తాయి. ప్రపంచం మొత్తం 38.7 లక్ష హెక్టేర్లలో సాగుబడి వుండగా అందులో భారత్ 16 లక్షల హెక్టార్లలో సాగుబడి చేస్తోంది.

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితులలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరీబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%)చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా కొన్నిజాతుల పండు కొంచంపుల్లగా ఉంటుంది. కొన్ని పండ్లు పీచు, ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకర లాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు(ఊరగాయలు), చట్నీ, ఆమ్‌చూర్, మామిడి తాండ్ర లు తయారు చేస్తారు. మామిడి రసాన్ని బాటిల్స్, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ, ఐస్‌క్రీం, ఫ్రూట్‌సలాడ్ ఇంకా అనేక నోరూరించే రకాలు.

భారతీయ సంప్రదాయంలో మామిడి ఆకులు తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణంతోటే ప్రారంభం ఔతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. మామిడి రకాలు బంగినపల్లి, నీలం, రుమానియా, మల్గోవా, చిలక ముక్కు, షోలాపూరి, అల్ఫాన్సా, కలెక్టరు, ఇమాంపసంద్, ఇంకా . . . . . ....పూర్తివ్యాసం: పాతవి

30వ వారం
1971 భారత్ పాక్ యుద్దంలో పాల్గొన్న ఐ.ఎన్.ఎస్. విక్రాంత్.

భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం (ఇండియన్ నేవీ) 55,000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.

5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారతదేశంలో కీస్తు పూర్వం, 2300లో ప్రస్తుత గుజరాత్‌లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడినది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో 'నవాధ్యక్ష' (నౌకల నిర్వాహకుడు) పేరుతో నదీజలాల వినియోగం గురించి నిర్దేశించాడు. చుట్టూ ఉన్న దేశాలతో రాకపోకలకు, పలు రకార సంస్కృతులకు ఈ జలదారులు ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో మౌర్య, శాతవాహన, చోళ, విజయనగర, కళింగ, మరాఠా మరియు మొఘల్ సామ్రాజ్యాల నౌకా వ్యవస్థలు పేరెన్నికగన్నవి.

బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నపుడు ది బ్రిటీష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా , వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ (INS) గా పేరు పెట్టారు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

31వ వారం
చార్లీ చాప్లిన్

చార్లీ చాప్లిన్ ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఒక హాస్య నటుడు. ఒక విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత , చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.

ప్రధానంగా హాస్య నటుడైనా హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని , ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్ , క్లౌనింగ్, మైమింగ్ , బర్లెస్క్, పేరడీ, శ్లాప్‌స్టిక్ - వీటన్నిటిని అతడు మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకరటింకర నడక - ఇవీ అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశద్రిమ్మరి. ఇవాళ ఇక్కడ వుంటాదు, రేపు మరో చోట. అతడికి ఊరూ పేరూ లేదు. అన్ని ఊర్లూ అతనివే , అన్ని పేర్లూ అతనివే.

అతని అజరామర కీర్తికి అధార చిత్రాలలో ఒకటి 1921 నాటి " కిడ్ " . దానిలో అనాథ బాలుడుగా జాకీ కూగన్, అతడిని సాకి చివరికి అసలు తల్లికి అప్పగించవలసి వచ్చిన పెంపుడు తండ్రిగా చాప్లిన్‌ల నటన చిరస్మరణీయమైనది. ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో (1940) తీసిన గ్రేట్ డిక్టేటర్‍లో చాప్లిన్ హిట్లర్‍ను అద్భుతంగా సెటైర్ చేశాడు. కాని కేవలం సెటై‍ర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుడిని విముక్తుడిని చేయగల ఆశావాదాన్ని పురికొల్పే ప్రయత్నం చేశాడు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

32వ వారం

గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉన్నది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. చక్కని బీచిలు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంధాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆప్రాంత అనే పేరు కూడా వాడబడింది.


1498లో వాస్కో డ గామా కేరళ లో కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండ్లాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకొనలేదు. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.


పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉన్నది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి. గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల ఎర్రనేల. లోపలి నదీతీరాలలో నల్లరేగడి నేల ఉన్నది. గోవా, కర్ణాటక సరిహద్దులలో మోలెమ్, అన్‌మోడ్ల మధ్యనున్న శిలలు భారత ఉపఖండంలోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

33వ వారం


ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - మార్చి 4, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధున్ని నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.


షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

34వ వారం

చతుర్వేదాలు హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు (ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య) అనీ కూడా అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదానికి నిగమము (అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము) అని కూడా పేరుంది.

మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి. (1) ఋగ్వేదము (2) యజుర్వేదము (3) సామవేదము (4) అధర్వణవేదము. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే.

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు. అవి -

  1. మంత్ర సంహిత:ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేదసంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. యజుర్వేదసంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది.
  2. బ్రాహ్మణము: సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది.
  3. ఆరణ్యకము: అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి.
  4. ఉపనిషత్తులు - ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో 108 ముఖ్యమైనవి.

యజ్ఞ నిర్వహణలో నలుగురు పురోహితులుంటారు. (1) హోత: ఋగ్వేదంలోని స్తోత్రాలను పఠించేవాడు. (2) అధ్వర్యుడు: యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యధావిధిగా నిర్వహించేవాడు. (3) ఉద్గాత: సామగీతాలను గానం చేసేవాడు. (4) బ్రహ్మ: అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని పర్యవేక్షించేవాడు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

35వ వారం

వర్షం లేదా వాన ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది మరియు ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై, ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. ఆ అవపాతము వర్షముగా కురుస్తుంది. వర్షము పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తి చేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాస క్రియలో ఆవిరిగా వాతావరణంలోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా యేర్పడతాయి. సాధారంగా వర్షాన్ని అవపాత పరిమాణం మరియు అవపాతానికి కారణం అన్న రెండు అంశాలతో వర్గీకరిస్తారు.

అవపాతం, అందునా వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాల ఉపయోగకరమైనది. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ అతివృష్టి, అనావృష్టి రెండూ పంటలకు ముప్పును కలుగజేస్తాయి. అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. భారతీయ వ్యవసాయ రంగము వర్షంపై భారీగా ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా పత్తి, వరి, నూనెదినుసులు మరియు ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది దేశ ఆర్ధికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

36వ వారం

భారతీయ రైల్వేలు, భారతదేశపు ఒక ప్రభుత్వరంగ సంస్థ. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదహారు లక్షలు) కలిగి వున్న సంస్థగా రికార్డుని నెలకొల్పింది. రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. ఈ మార్గాల మొత్తం నిడివి సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు) ఉన్నది. సం.2002 నాటికి రైల్వేల వద్ద 2,16,717 వాగన్లు, 39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు ఉన్నాయి. భారత రైల్వే ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతూండగా అందులో 8,702 పాసెంజర్ రైళ్ళు.


భారత దేశంలో 1851 ఏప్రిల్ 16న మొదటిసారి రైలు పట్టాలకెక్కింది. రూర్కీలో కట్టుబడి సామాగ్రిని మోసేందుకు దాన్ని వాడారు. కొన్నేళ్ళ తరువాత, 1853 ఏప్రిల్ 16బాంబే లోని బోరి నందర్, ఠాణాల మధ్య -34 కి.మీ.దూరం - మొట్టమొదటి ప్రయాణీకుల రైలును నడిపారు. సం.1947 (స్వాతంత్ర్యం వచ్చే) నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు ఉండేవి. సం.1951లో ఈ సంస్థలన్నింటినీ విలీనం చేయడంతో భారతీయ రైల్వే ప్రపంచంలో అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు అవసరమైన రైళ్ళను నడుపుతోంది.


మొత్తం రైలు మార్గము సుమారు 108,706 కి.మీ.(67,547 మైళ్ళు). ఈ మార్గాలను వేగం అధారముగా (75 కి.మీ/గం నుండి 160కి.మీ/గం లేదా 47 మైళ్ళు/గం నుండి 99 మైళ్ళు/గం) విభజించారు. భారతీయ రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే వెడల్పైనది – 4  అడుగులు 8½  అంగుళాలు (1,435 మిల్లీ మీటర్లు)); మీటర్ గేజ్; మరియు నారో గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే తక్కువ). భారత దేశములో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్. సుమారు 86,526 కీ.మీ (53,765 మైళ్ళు)ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం కలదు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ (1,000 మీ.మీ. (3.28 ft) రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారో గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడం చాలా కష్టం. మొత్తం నారో గేజ్ రైలు మార్గం 3,651 కీ.మీ (2,269 మైళ్ళు). ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

37వ వారం

ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 1949, జూలై 8న కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి ఇప్పటివరకు మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. పోటీచేసిన ప్రతీసారి విజయం సాధించడం ఆయన ప్రత్యేకత. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయంసాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందినాడు. వెనువెంటనే ముఖ్యమంత్రులు మారినప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. ఆ తరువాత చాలా కాలం పాటు అధికారం దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం వారి విజయానికి బాటలు పరిచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారికి దక్కింది. ఆయన సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో దుర్మరణం పాలయ్యారు.


వై.యస్.రాజశేఖర్ రెడ్డి జులై 8, 1949 లో పులివెందులకు దగ్గర్లోగల జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా అక్కడే సాగింది. గుల్బార్గా విశ్వవిద్యాలయం నుంచి మెడిసిన్ లో పట్టా పుచ్చుకున్నారు. స్విమ్స్ కళాశాల, తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందినారు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

38వ వారం

చిక్‌మగళూరు (కన్నడ:ಚಿಕ್ಕಮಗಳೂರು) భారతదేశం లోని కర్ణాటక) రాష్ట్రం లోని ఒక జిల్లా మరియు పట్టణం. భారతదేశం లోనే మొట్టమొదటిగా చిక్‌మగళూరులో కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణులలో తుంగ మరియు భద్ర నదులు పుడుతున్నాయి. ఈ జిల్లాలోనే ఉన్న ముల్లాయనగిరి పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి మరియు కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకుల నేత్రాలకు విందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం ఈ జిల్లాలో ఉన్న శృంగేరిలో ఉన్నది. ఆ తరువాతి కాలంలో భారతీ కృష్ణ తీర్థ స్వామిచే తన ముందు పీఠాధిపతి అయిన విద్యాశంకర స్వామి స్మారక నిమిత్తం నిర్మించబడిన విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరిలో ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు అమృతపురలో నిర్మించిన హొయసల దేవాలయం ఈ జిల్లాలోనే ఉన్నది. వన్యప్రాణి సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు ఈ జిల్లాలో ఉన్న కుద్రేముఖ్ జాతీయ వనం, భద్ర అభయారణ్యం దర్శించి తీరవలసిందే.

జిల్లాకి చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాష లో చిన్న కూతురు ఊరు అని అర్థం (చిక్క=చిన్న, మగ=కూతురు, ఊరు=ఊరు). సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు.

బాబా బుడన్ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి.మీ దూరం లో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉన్నది. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతొ హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. కుద్రేముఖ్ జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 95 km నైఋతి దిశలో ఉన్నది. కన్నడ భాషలో కుద్రే=గుర్రం ముఖ్=ముఖం. ఈ పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్ పర్వతకేంద్రం లో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ఉన్నది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కి.మీ. ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్ లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్ లో ఉన్న కుద్రేముఖ్ ఉక్కు కర్మాగారం లో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

39వ వారం

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు మొదలగు పేర్లు కల భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని కలిగిఉంది. సముద్రతీరానికి సమీపములో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న భట్టిప్రోలు ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖమైన క్రీ.పూ. 4-3 శతాబ్దాల నాటి స్తూపం కలిగి ఉంది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు లాంటి మహనీయులు ఇక్కడ దర్శించారని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ. 130 ప్రాంతంలో టాలమీ వర్ణించిన జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రస్థానమైన పిటిండ్ర నగరం భట్టిప్రోలేననే అభిప్రాయం చరిత్రకారులలో బలంగా ఉంది. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన జైన కవి నయనసేనాని వ్రాసిన ధర్మామృత' కావ్యములోని క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిన కథలో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. శాసనముల ఆధారముగా భట్టిప్రోలు ప్రాంతాన్ని కుబేరకుడు అనే రాజు పాలించాడు.

కాలగర్భంలో కలిసిపోయిన భట్టిప్రోలు బౌద్ధ స్తూప ప్రాశస్త్యం క్రీ. శ. 1870 నుండి వెలుగులోనికి రాసాగింది. బాస్వెల్ (1870), వాల్టర్ ఎలియట్ (1871), నారిస్ (1872, రాబర్ట్ సెవెల్ (1882), అలెగ్జాండర్ రే (1892), బుహ్లర్ (1894), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1969) మొదలగువారి కృషివల్ల అమూల్యమైన చారిత్రక నిక్షేపాలు బయల్పడ్డాయి. లంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్తూపము, కోట గోడలు కనపడ్డాయి. 1700 చదరపు గజాలు స్తూప ఆవరణ, 148 అడుగుల మేధి వ్యాసం, 32 అడుగుల అండం వ్యాసం, 40 అడుగుల ఎత్తు, 8 అడుగుల విశాలమైన ప్రదక్షిణాపథం, 45 X 30 X 8 సె.మీ పరిమాణముగల ఇటుకలతో కట్టబడిన స్తూపం బయల్పడింది. భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉన్నది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రముగుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.

భట్టిప్రోలు స్తూపం నిర్మాణం విశిష్టమైనది. ఇందు ఆయక స్థంభములు ప్రధానమైన ప్రత్యేకతలు. చక్రాకార స్తూపనిర్మాణము భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జున కొండ స్తూపములలో పరిణితి చెందింది. చక్రాకార వైశిష్ట్యం ఏమిటంటే, స్తూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం మరియు ధర్మభావ వ్యక్తీకరణల మేళవింపు. చక్రాకార స్తూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

40వ వారం

బేతాళ కథలు, చందమామ మాసపత్రికలో చాలాకాలంగా ప్రచురితమవుతున్న ఒక జనప్రియ శీర్షిక. గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. అసలు బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.


ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది. ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని ఓ కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చారు. అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబడింది.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

41వ వారం

విద్య, అనగా బోధన, మరియు నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యసనల సమీకరణము. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర్-జ్ఞానాన్ని ప్రసాదించి వుంటుంది. దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.


విద్యావిధానాలు, విద్య మరియు శిక్షణ లను ఇవ్వడానికి స్థాపించబడ్డాయి. ఇవి ప్రధానంగా పిల్లలు మరియు యువకుల కొరకు స్థాపించబడ్డాయి. పిల్లలకు యువకులకు, బోధనాంశాలను నిర్ధారించి, వారి విద్యాఫలితాలను, వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతాయి. వీటి వలన పిల్లలు, ఏమి నేర్చుకోవాలి?, ఎలా నేర్చుకోవాలి?, ఎందుకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలు సంధించుకొనేలా జాగ్రత్తలు తీసుకొని, వారికి విద్యా బోధన ఇవ్వబడుతుంది. బోధనా వృత్తి, ఇందుకు సర్వదా సహాయపడుతూ, పిల్లలలోని అన్ని రంగాల అభివృద్ధికొరకు సహాయపడుతూ, వారికి మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. ఈ బోధనా వృత్తి, విద్యా బోధన, బోధనాంశాలు, మూల్యాంకనము మొదలగు అంశాలపై ఆధారపడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

విద్య యొక్క చరిత్ర, ప్రాచీన కాలంనుండీ మనకు లభిస్తున్నది. ప్రాచీన కాలంలో, పర్ణశాలలు, కుటీరాలు ఋషుల ఆశ్రమాలు, ఆశ్రమ కేంద్రాలు విద్యాభ్యాసం కొరకు కేంద్రాలుగా విలసిల్లేవి. ఈ కేంద్రాలలో సకల శాస్త్రాలూ బోధింపబడేవి. ఉదాహరణకు: ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, రాజనీతి, భాష, యుద్ధవిద్యలు, సంస్కృతి, చదరంగం, కుస్తీ, విలువిద్య, భూగోళం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రము మున్నగునవి నేర్పేవారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలోని తీవ్ర సమస్యలలో ప్రధానమైనది నిరక్షరాస్యత. ఈ నిరక్షరాస్యతకు మూలం అవిద్య. దీన్ని రూపుమాపుటకు సరైన సాధనం మరియు మార్గం 'విద్య'. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

42వ వారం

ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడినది. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.

ప్రముఖ పాత్రికేయుడైన ఎ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. 1975 డిసెంబర్ 17హైదరాబాదు లో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.

సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్టమైన సమాచార సేకరణ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్యమైన తెరవెనుక కారణాలు కాగా, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనిపించే కార్టూన్లు, పేజీలో వార్తల అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు. పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. గుజరాత్ భూకంపం, హిందూ మహాసముద్రం సునామి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.


భాష విషయంలో ఈనాడు తెలుగు పత్రికలలో ఒక ఒరవడి సృష్టింది. ఈనాడు, సహజమైన, సులభమైన భాషలో వార్తలను అందించింది. తెలుగు భాష కొరకు ఆదివారం పుస్తకంలో ప్రత్యేక శిర్షికలను ఈనాడు అందిస్తూ ఉంది. మామూలుగా దినపత్రికలు అందించే కథలు, కథానికలే కాక, భాష విస్తృతికి దోహదం చేసే శీర్షికలను ప్రచురించింది. వాటిలో కొన్ని: తెలుగులో తెలుగెంత, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక, మాటలు, మార్పులు మొదలైనవి. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

43వ వారం

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. బావా ఎప్పుడు వచ్చితీవు.., చెల్లియో చెల్లకో.., జెండాపై కపిరాజు.. వంటి పద్యాల ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు.


దివాకర్ల తిరుపతి శాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది. మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది. వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు. ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.


వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

44వ వారం

జమ్మూ & కాశ్మీరు రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి - జమ్ము ప్రాంతం ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం; కాశ్మీరు లోయ కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు; లడఖ్ హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం. - కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు.

భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది. భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని "పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు" అని భారతదేశం వ్యవహరిస్తుంది.

వ్యవసాయం, పశువుల పెంపకం జమ్ము-కాశ్మీరు ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. పరిశ్రమలు ప్రస్తుతం చాలా కొద్ది, కాని క్రమంగా, వేగంగా వృద్ధిపొందుతున్నాయి. 1989కు ముందు (సాయుధపోరాటం పెచ్చుపెరగకముందు) పర్యాటకరంగం జమ్ము-కాశ్మీరు ఆర్ధిక వ్యవస్థలో కీలకమైనదిగా ఉండేది. తీవ్రవాదం వల్ల ఈ రంగం బాగా దెబ్బతిన్నది. అయినా జమ్ము, లడఖ్‌లు పర్యాటకులను ఇప్పటికీ బాగా ఆకర్షిస్తున్నాయి. ఇంకా కాశ్మీరు కుంకుమ పువ్వు కూడా ప్రసిద్ధం. ఇందులో ఎక్కువభాగం ఎగుమతి జరుగుతున్నది.

కాశ్మీరు సహజీవన సంస్కృతివల్ల అన్ని మతాలు ఇరుగుపొరుగులో వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం - ఇవి కాశ్మీరీలు అంతా కలసి పంచుకొనే సాంప్రదాయాలు. ఆడ, మగల దుస్తులు రంగులమయం. కాశ్మీరు కవిత్వం, జానపదనృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. వత్తల్ ప్రాంతంలో మగవారు చేసే "దుమ్హల్" నృత్యం, ఆడువారు చేసే "రోఫ్" నృత్యం బాగా పేరుపొందాయి. కాశ్మీరులో ఇస్లాంమతాచరణలో సూఫీవిధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షీణ ఆసియాలోని ఇస్లాంమతాచారాలకంటె కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

45వ వారం

భారత గణతంత్ర రాజ్యము నూటపది కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తి] ఆవిర్భవించినది.

దక్షణాసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చినది.


మధ్య ప్రదేశ్‌ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. ఇదే క్రీ.పూ.26 వశతాబ్దం మరియు క్రీ.పూ.20వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు.


రెండవ సహస్రాబ్ది మధ్యలో, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

46వ వారం

బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

47వ వారం

హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ (Hepadnaviridae) కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్‌లలో ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్నవాళ్లు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3-5% వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది


హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌-బి 'పాజిటివ్‌' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు. అంటే హెపటైటిస్‌-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం! ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

కామెర్లు తగ్గిన ఆర్నెల్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్‌ హెపటైటిస్‌గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. వీళ్లను అన్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్లినా హెపటైటిస్‌-బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్రానిక్‌ హెపటైటిస్‌ బాధితుల్లో ఓ 40 శాతం మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి ఎప్పుడైనా తీవ్రమైన లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైన స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

48వ వారం

ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.

ఘంటసాల గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణగారు మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఘంటసాల భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. 1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు. ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.


1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారు మ్రోగింది. తరువాత విడుదలయిన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. 1955లో విడుదలయిన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

49వ వారం

ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె అయిన ఇందిరాగాంధీ నవంబరు 19, 1917న జన్మించింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాష్ట్రపతిచేత ఎన్నిక చేయబడింది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. ఉన్నత రాజకీయ కుటుంబంలో సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు ఉత్తర ప్రదేశ్)లోని మొఘల్ సరాయ్ లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. 4 విడతలుగా మొత్తం సుమారు 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానిగా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు అక్టోబరు 31, 1984న బలైంది.

1966 జనవరిలో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇందిర 1977 వరకు పదవిలో కొనసాగినది. అత్యవసరపరిస్థితి అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో పాటు తను స్వయంగా రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఓడిపోయింది. 1980లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయపథంవఇపు నడిపించి మూడేళ్ళ విరామానంతరం మళ్ళీ ప్రధానమంత్రి పదవిని చేపట్టింది.

ఇందిర తరువాత కూడా ఆమె కుటుంబ సభ్యులు రాజకీయంగా ప్రముఖ పదవులు అలంకరించారు. ఇందిరాగాంధీ మరణం వెంటనే ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజీవ్ భార్య సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిని పొంది ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతోంది. సోనియాతో పాటు సోనియా కుమారుడు రాహుల్ గాంధీ, ఇందిర మరో కోడలు మేనకాగాంధీ, మేనక కుమారుడు వరుణ్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

50వ వారం

భారతీయ సంప్రదాయంలోని అన్ని కళలలాగే కర్నాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి [1] [2]. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల మరియు పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంధాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో,ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు ,భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పబడింది. రామాయణ,భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతి లో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు." “ (వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారద: తాలజ్ఞ2ప్రయాసేన మోక్షమార్గమ్ నియచ్ఛతి). ”

నేటి కర్ణాటక సంగీతానికి స్వరరాగతాళములే ఆధారములని ,ప్రాచీన గ్రంధాలైన శిలప్పాధికారం మరియు భరతుని నాట్యశాస్త్రంలో వివరించబడింది.

క్రీ.శ 12వ శతాబ్దం వరకూ భారతదేశమంతటా ఒకే రకమైన సాంప్రదాయ సంగీతం ప్రాచుర్యంలో ఉండేది. తరువాత ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు టర్కీ, మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం పరిపాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వీరు క్రీ.శ. 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు పరిపాలించారు. వీరి కాలంలో ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయ సంగీతం పర్షియన్ కళలచే విపరీతంగా ప్రభావితమైంది. 14 వశతాబ్దం వచ్చే సరికి ఈ సాంప్రదాయ సంగీతం, హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతం అని రెండుగా చీలిపోయాయి. 18 శతాబ్దం నుంచీ, 20 వ శతాబ్దం వరకూ ఈ సంగీతాన్ని మైసూర్ మహారాజులు, ట్రావెంకూర్ మహరాజులు ఎక్కువగా ఆదరించి పోషించారు. వేంకటమఖి మేళకర్త రాగాల వర్గీకరణ పద్ధతిని కనుగొని, దానిని తన సంస్కృత గ్రంధం, "చతుర్దండి ప్రకాశిక"లో పొందు పరిచాడు. నేడు వాడుకలో నున్న సంపూర్ణ మేళకర్త రాగాల పట్టికను తయారు చేసింది గోవిందాచార్య. ట్రావెంకూర్ మరియు మైసూర్ రాజులు ,సంగీతకర్తలే కాక, వీణ, రుద్రవీణ, వేణువు, వయొలిన్, ఘటం, మృదంగం వంటి వాయిద్యాలలో నిష్ణాతులు. వారి ఆస్థాన సంగీత విద్వాంసులలో పేరెన్నిక గన్నవారు వీణా శేషన్న (1852 - 1926) మరియు వీణా సుబ్బన్న (1861 - 1939) లు.

స్వాతంత్ర్యానంతరం ,కర్ణాటక సంగీతం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. గాయకులు సభల్లో పాడేవారు. శ్రోతలు టిక్కెట్లు కొనుక్కొని వినేవారు.అలా మద్రాసు కర్ణాటక సంగీత కేంద్ర బిందువుగా వెలసింది. ప్రస్తుతం ఈ సంగీతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకోదగ్గ స్థాయిలో దక్షిణ భారతీయులు నివసిస్తూ ఉంటే అక్కడ కూడా ఇది తప్పక వారి జీవనంలో భాగంగా ఉంటుంది. ప్రతీ యేటా చెన్నై లో డిసెంబరు మరియు జనవరి మధ్యలో జరిగే కర్ణాటక సంగీత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలలనుంచీ కళాకారులు విశేషంగా హాజరవుతారు. .ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

51వ వారం

అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం)గా విభజిస్తారు.

క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 - పాత రాతి యుగము - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది. క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము కాలంలో చిన్న పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.

1953 డిసెంబరు‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టు లు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.

కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇంకా....పూర్తివ్యాసం పాతవి

52వ వారం

ముచ్చివోలు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలానికి చెందిన అతి పెద్ద పంచాయితీలలో ఒకటి. శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుంచి ఆం.ప్ర.రా.రో.ర.సం. బస్సులలో సుమారు 30 నిమిషాలలో ఈ గ్రామానికి చేరుకొనవచ్చును. గ్రామ దేవత బైకమ్మ. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకీ విద్యావంతుల గ్రామంగా దీనికి పేరుంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. అంగన్ వాడీ నుంచి పదవ తరగతి వరకూ విద్యా సౌకర్యం ఉంది. మూడు ప్రధాన ఆలయాలు, మూడు చిన్న ఆలయాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి మొదలైన పండుగలే కాక పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, బైకమ్మ సంతర్పణ ఘనంగా నిర్వహిస్తారు.

గ్రామానికి ప్రధాన గ్రామదేవత బైకమ్మ. ప్రతి యేటా వూరి చెరువుగట్టుపై ప్రతిష్టించబడిన ఈ దేవతకు భక్తి శ్రద్ధలతో సంతర్పణ జరుపుతారు. ఈ సంధర్భంగా గ్రామస్థులు చిన్న-పెద్ద, పేద-ధనిక, కుల-మత బేధాలు లేకుండా చెరువు గట్టునే సహపంక్తి భోజనం చేస్తారు. ఎక్కువ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. రైతులు వరి మరియు వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. ఆవులు, బర్రెల పెంపకం ద్వారా పాలు అమ్మి గ్రామస్తులు చెప్పుకోదగిన ఆదాయాన్ని గడిస్తుంటారు.

గ్రామము నందు ఒక అంగన్‌వాడీ కేంద్రం, ఒక ప్రాథమిక పాఠశాల కలవు. ప్రక్క గ్రామాలైన మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికే వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. కళాశాల చదువుకు మాత్రం ఎవరైనా ప్రక్కనే ఉన్న శ్రీకాళహస్తికి వెళ్ళాల్సిందే. అక్షరాస్యాతా శాతం 75%. ఇక్కడి నుంచి చాలామంది ఇంజనీర్లుగా (ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో ఐ.టి) బెంగుళూరు, మరియు అమెరికాలలో పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇంకా బోధన, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, మీడియా, టెలికాం, న్యాయ శాస్త్రం మొదలైన అన్ని రంగాలలోనూ ఈ ఊరి వారు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఊరి ప్రజలకు ఇది గర్వకారణం.

ప్రతి యేటా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పాండురంగ స్వామి భక్తబృందం దీని నిర్వహణా భాద్యతలు చేపడుతుంది. ఈ భక్త బృందం లోని సభ్యులందరూ తప్పనిసరిగా ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ పండరి భజన లో పాల్గొంటారు. కొన్ని గ్రామాల్లో కోలాటం కూడా ప్రదర్శిస్తారు. చుట్టుపక్కల గ్రామాలనించి కూడా ప్రజలు వచ్చి ఈ ఉత్సవాలను తిలకించడం విశేషం.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

53వ వారం

గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగానూ నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కుటుంబంతో సహా చెన్నైలో నివసిస్తున్నారు.

గొల్లపూడి మారుతీ రావు ఏప్రిల్ 14, 1939ఆంధ్రప్రదేశ్  విజయనగరం లో ఒక మద్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో మరో ఎడిషన్ ప్రారంభించారు. అక్కడ ఆయన సంపాదక వర్గంలో పనిచేశాడు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికయ్యి హైదరాబాద్ కు మారాడు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశాడు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పోంది సంబల్‌పూర్ వెళ్లాడు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. తరువాత ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమాలో రంగప్రవేశం చేశాడు.

మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954 డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవాడు.మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగినది. సి.నారాయణ రెడ్డి కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రిగారు ఉపాధ్యాయులు.మారుతీరావు ను ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సంధర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి


ఇవి కూడా చూడండి

మార్చు