వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 28వ వారం

హనుమంతుడు

హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తారు. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా కొలవబడే ఆంజనేయుని గుడులు లేని ఊరు ఆంధ్ర ప్రదేశ్ ‌లో ఉండటం అరుదు. ఆంధ్రలోనేగాక, భారతదేశం యావత్తూ మరియు దేశవిదేశాలలోనూ హనుమంతుని దేవాలయాలు కానవస్తాయి. హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుకవచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్

బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్టింపబడడం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. హనుమంతుని వివిధ నామస్తోత్రాలు, భజనలు, పాటలు చాలా ఉన్నాయి. ....పూర్తివ్యాసం: పాతవి