వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 23వ వారం

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

సి.నారాయణరెడ్డి 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేటలో జన్మించాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో శ్రద్ధగా అనేక గ్రంథాలు చదివాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి