వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 52వ వారం

హిందూ మతం లోని దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు - భారతి, సరస్వతి, శారద, హంస వాహిని, జగతీ ఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మ చారిణి, బుద్ధి ధాత్రి, వరదాయిని, క్షుద్ర ఘంట, భువనేశ్వరి. ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి. బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు.

ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"

ఆదిలాబాదు జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది. తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి