వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 07వ వారం

ఉత్తర ధ్రువం

ఉత్తరార్ధగోళంలో, భూమి భ్రమణాక్షం దాని ఉపరితలాన్ని కలిసే బిందువును ఉత్తర ధ్రువం అంటారు. దీన్ని భౌగోళిక ఉత్తర ధ్రువం అని, భూమి ఉత్తర ధ్రువం అనీ కూడా అంటారు. ఉత్తర ధ్రువం భూగోళంపై ఉత్తర కొనన ఉన్న బిందువు. ఇది దక్షిణ ధ్రువానికి సరిగ్గా అవతలి వైపున ఉంది. జియోడెటిక్ అక్షాంశం 90 ° ఉత్తరంను, అలాగే నిజమైన ఉత్తరం దిశనూ ఇది నిర్వచిస్తుంది. ఉత్తర ధ్రువం దగ్గర నుండి ఎటు చూసినా ఆ దిశలన్నీ దక్షిణమే; రేఖాంశాలన్నీ అక్కడ కలుస్తాయి, కాబట్టి, ఉత్తర ధ్రువ రేఖాంశం ఏది అంటే, ఏదైనా చెప్పవచ్చు. అక్షాంశ వృత్తాల వెంట, అపసవ్య దిశ తూర్పు, సవ్యదిశ పడమర అవుతాయి. ఉత్తర ధ్రువం ఉత్తర అర్ధగోళానికి మధ్యన ఉంది. దీనికి అత్యంత సమీపంలో ఉన్న నేల, గ్రీన్లాండ్ ఉత్తర తీరానికి 700 కి.మీ. దూరంలో నున్న కాఫెక్లుబ్బెన్ ద్వీపం అని అంటారు. అయితే, కొన్ని సెమీ శాశ్వత కంకర గుట్టలు ఇంకొంచెం దగ్గర లోనే ఉంటాయి. కెనడాలో, నూనావట్ లోని క్విక్తాలుక్ ప్రాంతంలోని అలెర్ట్, ధ్రువం నుండి అత్యంత దగ్గరలో మానవ నివాస స్థలం. ఇది ధ్రువం నుండి 817 కి.మీ. దూరంలో ఉంది. దక్షిణ ధ్రువం ఖండంలోని నేల ప్రాంతంలో ఉండగా, ఉత్తర ధ్రువం మాత్రం ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఇక్కడి నీళ్ళు దాదాపుగా శాశ్వతంగా సముద్రపు మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ మంచు కూడా కదులుతూ ఉంటుంది. ఉత్తర ధ్రువం వద్ద సముద్రం లోతు 4,261 మీటర్లని 2007 లో రష్యన్ మీర్ సబ్మెర్సిబుల్ కొలిచింది. 1958 లో USS నాటిలస్ కొలిచినపుడు ఇది 4,087 మీటర్లుంది.
(ఇంకా…)