వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/ఐఐఐటి వారు కొత్తగా చేర్చే వ్యాసాల చెక్‌లిస్టు

ఐఐఐటి వారు తమ తెవికీ ప్రాజెక్టు ద్వారా కొత్తగా తెలుగు వికీపీడియాలో చేర్చే వ్యాసాల్లో ఏయే అంశాలు ఉండాలి అనే విషయమై ఒక చెక్‌లిస్టును ఈ పేజీలో చూడవచ్చు. ఐఐఐటి ప్రాజెక్టు వారు ప్రత్యేకంగా వాడుకరులకు శిక్షణ నిచ్చి అనువ్బాద వ్యాసాలను తయారుచేసి, అభివృద్ధి చేసి, తెవికీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచి ఆ తరువాత తెవికీలో ప్రచురించాలని సంకల్పించారు. తమ శిక్షణ సైటులో వ్యాసాలను తయారుచేసాక, వాటిని తెవికీలో ప్రచురించే ముందు ఆ వ్యాసాలను సముదాయం పరీక్షించాకే ప్రచురిస్తారు. తద్వారా అతి తక్కువ లోపాలతో వ్యాసాలను ప్రచురించవచ్చు. తెలుగు వికీపీడియా పరిమాణాన్ని, ఇక్కడ చురుగ్గా కృషిచేస్తున్న వాడుకరులనూ దృష్టిలో పెట్టుకుంటే ఈ చెక్‌లిస్టు ఆవశ్యకత అర్థమౌతుంది. కింది కారణాల వల్ల కుడా ఈ చెక్‌లిస్టు అవసరం ఉంది.

  1. ఈ వ్యాసాలను ఐఐఐటి వారు తమ మెరుగైన అనువాద పరికరం ద్వారా అనువదింపజేసారు
  2. అలా యాంత్రికంగా అనువదించిన వ్యాసాలను సుశిక్షితులైన వాడుకరుల చేత సమూలంగా దిద్దుబాట్లు చేయించారు.
  3. ఈ వాడుకరులు కొన్ని వారాల పాటు తెలుగు వికీపీడియా పద్ధతుల పైన, శైలి పైన, భాష పైన, సాంకేతికాంశాల పైన నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఉన్నారు. కాబట్టి ఈ వ్యాసాలన్నీ ఆయా వికీ సంప్రదాయాలను, శైలికీ అనుగుణంగానే ఉండాలి.
  4. పై పద్ధతుల ద్వారా తయారు చేసి ప్రచురించాలని సంకల్పించిన వేలాది వ్యాసాలను తెవికీలోని చిన్నపాటి సముదాయం తనిఖీ చెయ్యడానికి, సరిదిద్దడానికీ సమయం పడుతుంది.

పై కారణాల వల్ల ఐఐఐటీ వారు కింది చెక్‌లిస్టు ప్రకారం తమ వ్యాసాలను తయారుచేసి/మెరుగు పరచి/సరిచేసి ఆ తరువాత ప్రాజెక్టు పేజీకి అనుబంధ పేజీగా ప్రచురిస్తే, సముదాయానికి ఈ వ్యాసాలను పరీక్షించడంలో సమయం కొంత ఆదా అవుతుంది.

చెక్‌లిస్టు మార్చు

ఐఐఐటిలో తయారైన వ్యాసాన్ని తెవికీ లోని ప్రాజెక్టు పేజీకి అనుబంధ పేజీగా తీసుకువచ్చాక కింది చెక్‌లిస్టుకు అనుగుణంగా తెవికీ వారు పరిశీలించాలి.

  1. పేజీలను ఇంగ్లీషు వికీపీడియా నుండి అనువదిస్తున్నారు కాబట్టి సరైన పేజీలను ఎంచుకుని అనువదించే వీలుంది. పేజీల ఎంపికలో కింది అంశాలను పాటించండి:
    1. వ్యాసాల ఎంపికలో ఔచిత్యాన్ని, ప్రాసంగికతను/సంగతత్వాన్ని (రిలవెన్స్) పరిగణించండి.
    2. మరీ 2 కెబిలు 3 కెబిలు పరిమాణం ఉన్న పేజీలను కాకుండా కనీసం 6 కెబి పరిమాణమున్న పేజీలను ఎంచుకోండి.
    3. ఇంగ్లీషు వికీలో బొమ్మ స్థానికంగా ఎక్కించిన బొమ్మ అయితే (కామన్సులో సంబంధిత బొమ్మ లేకపోతే), ఆ బొమ్మను సంబంధిత లైసెన్సు సమాచారంతో సహా తెవికీ లోకి కూడా ఎక్కించండి.
  2. అనువాదాల విషయంలో కింది జాగ్రత్తలు తీసుకోవాలి
    1. సహజమైన భాష వాడాలి, కృతక భాష ఉండరాదు కొన్ని సూచనల కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
    2. తేదీల విషయంలో వికీపీడియా శైలిని పాటించండి
    3. సమాచారపెట్టెను కూడా అనువదించండి.
    4. అనువాదం చెయ్యని పాఠ్యాన్ని ఉంచకండి.
  3. కొత్త పేజీ అనాథ కాకూడదు. ఈ పేజీకి వేరే పేజీల నుండి లింకులు (ఇన్‌కమింగు లింకులు) ఏమీ లేకపోతే అది అనాథ వ్యాసమౌతుంది. ప్రాజెక్టు పేజీకి అనుబంధంగా ఉన్నప్పుడు లింకులు ఎలా ఇవ్వాలి అని సందేహం రావచ్చు. దానికి మార్గం ఇది: పేజీకి ఏ పేరునైతే అనుకుంటారో ఆ పేరుకు సంబంధిత పేజీల నుండి లింకులు ఇవ్వండి. ప్రస్తుతానికి అది ఎర్ర లింకుగా చూపించినప్పటికీ సందేహించనక్కరలేదు. ఎందుకంటే ఈ అనుబంధ పేజీకి అసలుపేరుకు ఎలాగూ త్వరలోనే తరలిస్తారు కాబట్టి ఆ పని చెయ్యవచ్చు. అనాథ పేజీల సంస్కరణ గురించి మరింత తెలుసుకునేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం పేజీ చూడండి.
  4. కొత్త పేజీని అగాధ పేజీ కానీయకండి. ఈ పేజీ నుండి ఇతర పేజీలకు కనీసం మూడైనా సందర్భోచితమైన వికీలింకులు ఇవ్వండి.
  5. కొత్త పేజీని కనీసం ఒక్కటైనా వర్గం లోకి (జనన మరణ వర్గాలు, సంవత్సరాల వర్గాలూ కాకుండా) చేర్చండి. సందర్భోచితమైన వర్గాన్ని ఎంచుకోండి. కొత్త వర్గాన్ని సృష్టించేముందు, సంబంధిత వర్గం ఉనికిలో లేదని నిర్థారించుకోండి. కొత్త వర్గాన్ని చేర్చినపుడు ఆ వర్గం పేజీని సృష్టించండి.
    1. వ్యక్తుల పేజీలను వారి జననం, జీవించిన ప్రాంతాలను బట్టి భౌగోళిక వర్గాలుంటాయి. అలాగే వారి వృత్తి ప్రవృత్తులను బట్టి కూడా వర్గాలుంటాయి. వారి జాతిని బట్టి కూడా వర్గాలుంటాయి. వారి నివాసస్థితిని బట్టి కూడా వర్గాలుంటాయి. మీరు సృష్టించిన పేజీని సముచితమైన వర్గాల్లోకి చేర్చండి. ఈ విషయమై కొంత సమాచారం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టును చూడవచ్చు.
    2. వ్యక్తుల పేజీలకు జనన, మరణ వర్గాలు ప్రత్యేకం. వాటిని చేర్చండి. అలాగే ఆయా సంవత్సరాలు, తేదీల పేజీల్లో వారి జనన, మరణాలను నమోదు చెయ్యండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు ప్రాజెక్టు చూడండి.
    3. ఆంగ్లవికీపీడియా నుండి అనువదించిన వ్యాసాలకు ఉన్న అనువైన ఆ వర్గాలు అంతకుముందే తెలుగులో ఉన్నవేేమో పరిశీలించి, ఉంటే వాటిని చేర్చండి.ఒకవేళ అవి లేకపోతే వాటిని చేర్చి సృష్టించండి.
  6. అంతర్వికీ లింకులివ్వండి. నేవిగేషను పట్టీలో "ఇతర భాషలు" కింద వికీపీడియాల లింకులు ఇవ్వాలి. లింకు ఎలా ఇవ్వాలో తెలుసుకునేందుకు అంతర్వికీ లింకులు చూడండి.
  7. సమాచార పెట్టె పెట్టండి.
  8. {{Authority control}} అనే మూసను చేర్చండి. వ్యక్తులు, సంస్థలు, పుస్తకాలు, ప్రదేశాలు వంటి చాలా వ్యాసాల్లో ఈ మూసను చేర్చే ఆస్కారం ఉంది. ఈ మూసను పేజీలో అడుగున చేర్చాలి. ఈ మూసను పేజీలో చేరిస్తే ఎలా కనబడుతుందో తెలుసుకునేందుకు ఉదాహరణగా టి. ఎన్. శేషన్ పేజీలో అడుగున చూడవచ్చు. ఆ వ్యక్తికి అలాంటి ఐడెంటిటీలు లేకపోతే, ఈ మూసను చేర్చినప్పటికీ ఏమీ కనబడదు. మూస పేరును చేర్చితే చాలు, పరామితులేమీ ఇవ్వనక్కర్లేదు. అయితే నేవిగేషను పట్టీ లోని "వికీడేటా అంశం" లింకు తప్పనిసరిగా ఉండాలి. ఈ లింకు లేని పక్షంలో ఈ మూసకు పరామితులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవేమీ లేకపోయినా ఉత్తమూసను పేజీలో చేర్చినప్పటికీ నష్టమేమీ లేదు. భవిష్యత్తులో వికీడేటా లింకు ఏర్పడినప్పుడు, అక్కడి పేజీలో ఐడెంటిటీ లక్షణాలను చేర్సితే ఇక్కడ ఈ మూస ఆటోమాటిగ్గా ఆ ఐడెంటిటీ లింకులను చూపిస్తుంది.
  9. ఐఐఐటి ప్రాజెక్టు ప్రతిపాదన వ్యాసాలలో ఇంతకుముందే తెవికీలో అక్షరభేదాలతో అదే వ్యాసాలు ఎక్కువుగా ఉండటానికి అవకాశం ఉంది.వీటి విషయంలో పరిశీలించి లేదని నిర్థారించుకున్న వ్యాసాలు మాత్రమే సముదాయం దృష్టికి ప్రతిపాదించాలి.