విజ్ఞానజ్యోతి
విజ్ఞానజ్యోతి లిఖిత పత్రిక. ఇది రెండునెలలకొకసారి వెలువడెడిది. తొలి సంచిక 1969, సెప్టెంబరు 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవము నాడు ఆవిష్కరించబడింది. రాజమండ్రి నుండి వెలువడినది. రాజమహేంద్రవర కేంద్రోపాధ్యాయ సంఘము తరఫున ఈ పత్రిక వెలువడింది. ఈ పత్రికకు యం.వి.నారాయణాచార్య ప్రధాన సంపాదకుడు. సంపాదక వర్గంలో యం.వి.కృష్ణయ్య, యస్.ఎ.పద్మనాభం, వి.బి.సుబ్రహ్మణ్యం, కె.సావిత్రి ఉన్నారు. గోవిందలూరి సత్యనారాయణ ఈ పత్రిక లేఖకుడు.
ఈ పత్రికలో కథానికలు, కార్టూనులు, జోకులు, గేయాలు,వ్యాసాలు బాతాఖూనీ, చలనచిత్రజ్యోతి, బాలజ్యోతి వంటి శీర్షికలు, ఎర్రగులాబీ, విజయవిలాసం మొదలైన సీరియళ్లు, శ్రీశ్రీ లిమట్రిక్కులు వంటి రచనలు ప్రచురింపబడ్డాయి. ఇంకా సంస్కృత, హిందీ, ఆంగ్ల విభాగాలలో కూడా రచనలు ప్రచురింపబడ్డాయి. ఈ పత్రిక ప్రతిసంచికను ఒక్కొక్కరిచే ఆవిష్కరించడం ప్రత్యేకత. ఈ పత్రిక బాలలకు కథల పోటీ నిర్వహించి గెలుపొందిన కథలను ప్రచురించింది.
అభినందనలు
మార్చుఈ పత్రిక ఆరంభసంచికలో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి అభినందిస్తూ వ్రాసిన పద్యాలు:
లోకవైచిత్రికి విశాల లోచనంబు
భావసువ్యక్తకు మృదు స్వాదుగీతి
లలిత వాగ్దేవతా ఫాల తిలక రచన
పురుడు లేనిది పత్రిక పుట్టువనగ
కృతకమగు కత్తిరింపుల లతలవోలె
నచ్చుపడినట్టి పత్రికలవి తనర్చు
ప్రకృతి సుందరములు వ్రాతపత్రికలివి
వనలతల వంటి వనుట జ్ఞాపకమొనర్తు
ఒక్క విజ్ఞానసుజ్యోతి యుదయమైన
సుప్రభాతము నేడు భాషాప్రబంధ
సాంద్రమై యొప్పునో రాణ్మహేంద్ర నగరి!
దీప్తి మద్వాణి నాశీర్వదింప గదవె!