విశ్వరూపం (1936 పుస్తకం)

విశ్వరూపం, 1936 లో ప్రచురితమైన విజ్ఞానశాస్త్ర పుస్తకం. దీన్ని కాళీపట్నపు కొండయ్య రచించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ఈ పుస్తకాన్ని ప్రచురించింది. విశ్వం గురించి, గాలక్సీలు, నక్షత్రాలు, సౌర కుటుంబం, భూమి వగైరాల గురించి సాధారణ పాఠకులకు అర్థమయ్యేలా రాసిన ప్రజావిజ్ఞానశాస్త్ర (పాపులర్ సైన్సు) పుస్తకం ఇది.

విశ్వరూపం
పుస్తక ముఖచిత్రం
రచయిత(లు)కాళీపట్నపు కొండయ్య
దేశంభారతదేశం
భాషతెలుగు
శైలిఖగోళవిజ్ఞానం
ప్రచురణ కర్తఆంధ్ర విశ్వకళాపరిషత్తు
ప్రచురించిన తేది
1936
పుటలు298

విశేషాలు

మార్చు

బెనారస్ హిందూ యూనివర్సిటీలో రసాయనశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసే కాళీపట్నపు కొండయ్య ఈ పుస్తకాన్ని రచించాడు. సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడైన జేమ్సు జీన్స్ రాసిన “యూనివర్స్‌ ఎ రౌండప్” అనే గ్రంథాన్ననుసరించి తానీ పుస్తకం రాసానని రచయిత పీఠికలో చెప్పుకున్నాడు.

రచయిత ఈ పుస్తకాన్ని ఉపక్రమణం, గగనపథం, ద్రవ్యగర్భం, కాలవాహిని, విశ్వశిల్పం, నక్షత్రలోకం, ఉపసంహారం అనే ఏడు అధ్యాయాలుగా విభజించాడు. ఉపక్రమణంలో శాస్త్రాల చారిత్రికతను వివరించాడు. గగనపథంలో భూమితో మొదలుపెట్టి ఇతర గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు వగైరా విశాల విశ్వం లోని ఖగోళ స్థాయి వస్తువుల గురించి వివరించాక, ఆ వెంటనే అణువు, పరమాణువు, క్వాంటం సిద్ధాంతం వంటి సూక్ష్మ విషయాలను వివరించాడు. కాలవాహినిలో కాలనిర్ణయ విధానాన్ని వివరించాడు. విశ్వశిల్పంలో ఆదిమస్థితితో మొదలుపెట్టి, నెబ్యులాలు, నక్షత్రాలు, గ్రహాల జననం గురించి వివరించాడు. నక్షత్రలోకంలో నక్షత్రాల పుట్టుక పరిణామం గురించి వివరించాడు. ఉపసంహారంలో వేదాంత చర్చ చేసాడు.

కొండయ్య మహమ్మదీయ రాజ్యాలలో జాతీయ వికాసం అనే పుస్తకం కూడా రచించాడు.

సమీక్ష

మార్చు

1937 ఫిబ్రవరి నాటి ప్రతిభ పత్రికలో ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ, "ఈ గ్రంథము భౌతిక శాస్త్రవిషయికమైన దైనప్పటికీ ఒక విచిత్ర నవల వలే పాఠకుని భూమినుండి ఎక్కడికో లేవదీసి ఆవేశవూరితునిగా చేసి ప్రపంచపు విచిత్రములను చూపించి, విస్మయచిత్తునిగా జేస్తుంది. కంటికి కనబడే ఈ ప్రకృతియొక్క నిజలక్షణములను చూపించి ఈ ప్రపంచములోని అద్భుత కల్పన తెలియ జేస్తుంది." అని రాసింది.[1]

మూలాలు

మార్చు
  1. తెలికిచర్ల, కృష్ణమూర్తి. ప్రతిభ. Vol. 1 (4 ed.). గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. p. 393.