విష్ణువు వేయి నామములు-801-900

విష్ణు సహస్రనామ స్తోత్రము
వేయి నామముల వివరణ
1 - 100
101 - 200
201 - 300
301 - 400
401 - 500
501 - 600
601 - 700
701 - 800
801 - 900
901 - 1000
1 - 1000 లఘు వివరణ

విష్ణు సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలలో 801 నుండి 900 వరకు నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.

కమలంపై పద్మాసనంలో కూర్చున్న విష్ణువు క్లోజప్. కవి జయదేవుడు విష్ణువుకు నమస్కరించడం, కాగితంపై గౌచే పహారీ, భక్తి చిత్రం, బేర్-బాడీ, తల వంచి, కాళ్లు, చేతులు ముడుచుకుని, జయదేవుడు ఎడమవైపు నిలబడి, పూజా సామగ్రిని పద్మాసనం ముందు ఉంచారు. అక్కడ కూర్చున్న విష్ణువు కవిని ఆశీర్వదించాడు.

విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంథం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.

వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.

కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.

విష్ణువు వేయి నామములు-801-900

మార్చు

801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.

802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు.

803) మహాహ్రద: - గొప్ప జలాశయము.

804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.

805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు.

806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు.

807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.

808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.

809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.

810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.

811) పావన: - పవిత్రీకరించువాడు.

812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.

813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.

814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు.

815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.

816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.

817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు.

818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.

819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.

820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.

821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.

822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు.

823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు.

824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.

825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.

826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.

827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.

828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.

829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.

830) అమూర్తి: - రూపము లేనివాడు.

831) అనఘ: - పాపరహితుడు.

832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.

833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.

834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.

835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.

836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.

837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.

838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు.

839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.

840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.

841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.

842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.

843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.

844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.

845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు.

846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు.

847) భారభృత్ - భారమును మోయువాడు.

848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.

849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.

850) యోగీశ: - యోగులకు ప్రభువు.

851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు.

852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.

853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.

854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు.

855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.

856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.

857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు.

858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు.

859) దండ: - దండించువాడు.

860) దమయితా - శిక్షించువాడు.

861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.

862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు.

863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు.

864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.

865) అనియమ: - నియమము లేనివాడు.

866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు.

867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు.

868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు.

869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.

870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.

871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.

872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.

873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు.

874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.

875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.

876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.

877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు.

878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు.

879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.

880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు.

881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.

882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.

883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.

884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.

885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు.

886) అనంత: - అంతము లేనివాడు.

887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు.

888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.

889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.

890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు.

891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.

892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు.

893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు.

894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు.

895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు.

896) సనాత్ - ఆది లేనివాడు.

897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.

898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు.

899) కపి: - సూర్యరూపుడు.

900) అవ్యయ: - ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.