వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు

(వి.వి.యల్.నరసింహారావు నుండి దారిమార్పు చెందింది)

వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు ప్రసిద్ధ కవి, పరిశోధకుడు.

వి.వి.ఎల్.నరసింహారావు
జననంవాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు
(1930-07-10)1930 జూలై 10
India చేబ్రోలు గ్రామం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2013 అక్టోబరు 8
హైదరాబాదు
మతంహిందూ
భార్య / భర్తఅనసూయ
తండ్రికోటిలింగం
తల్లివేంకట సుబ్బమ్మ

బాల్యము, విద్యాభ్యాసం మార్చు

ఇతడు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు పట్టణంలో 1930, జూలై 10వ తేదీన వాసిలి వేంకటసుబ్బమ్మ, కోటిలింగం దంపతులకు జన్మించాడు[1]. ఇతని తండ్రి ఇతని 9వయేట మరణించగా ఇతని బావ మేడూరి గోవిందాచార్యులు ఇతడిని పెంచి పెద్ద చేశాడు. కొర్నెపాటి శేషగిరిరావు వద్ద ఆంధ్రాంగ్ల విద్యలు నేర్చుకున్నాడు. చేబ్రోలులోని సూర్యదేవర నరసయ్య ఉన్నత పాఠశాలలో 1942-44ల మధ్య మాధ్యమికోన్నత విద్యను, తెనాలిలోని హైస్కూలులో 1944-47ల మధ్య ఉన్నత పాఠశాలావిద్యను కొనసాగించాడు. 1947-49 సంవత్సరాల మధ్య గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం అభిమాన విషయాలుగా ఇంటర్మీడియట్ చదివాడు. 1951-54 మధ్య మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు భాషాసాహిత్యాలు అభిమాన విషయాలుగా బి.ఎ.(ఆనర్స్) చదివాడు. 1956లో ఎం.ఎ. డిగ్రీ పుచ్చుకున్నాడు. 1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి జీరెడ్డి చెన్నారెడ్డి పర్యవేక్షణలో నన్నయ కవిత్వం: అక్షర రమ్యత అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించి పి.హెచ్.డి. పట్టాను గైకొన్నాడు.

ఉద్యోగం మార్చు

ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణుడైన తర్వాత ఇతడు 1949లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో గుమాస్తాగా చేరాడు. స్వల్పకాలంలోనే ప్రత్యేక రెవెన్యూ అధికారిగా పదోన్నతిని పొందాడు. తరువాత ఉద్యోగాన్ని వదలి మద్రాసులో బి.ఎ. కోర్సులో చేరాడు. ఎం.ఎ ఉత్తీర్ణుడైన తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి, కాకినాడ, రాజమండ్రి, చిత్తూరు, శ్రీకాకుళం, విజయవాడ ప్రభుత్వ కళాశాలలలో ఉపన్యాసకుడిగాను, తెలుగు శాఖ అధ్యక్షుడిగాను ఉద్యోగం చేశాడు. 1979లో ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొంది రాయచోటి, మాచర్లలో పనిచేశాడు. 1981 నుండి 1989 వరకు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజ్యాభిలేఖాగారములో డైరెక్టర్‌గా పనిచేశాడు. 1988 నుండి 1992 వరకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రచురణాధికారిగా పనిచేశాడు. అదే సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం తలపెట్టిన విజ్ఞానసర్వస్వ ఆంధ్రాంగ్ల సంపుటుల సంకలనకర్తగా వ్యవహరించాడు. 1992-93లో బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్యానెల్ చైర్మన్‌ పదవి నిర్వహించాడు. 1993-94లో తెలుగు అకాడెమీవారి తెలుగు పాఠ్యపుస్తకాలకు, నిఘంటువులు, ఇతర ప్రామాణిక గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు. 1994-1999ల మధ్య కేంద్ర మానవ వనరుల శాఖకు సంబంధించిన జాతీయ సార్వత్రిక విద్యాలయ రీజనల్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ సిబ్బందికి అధికార భాషారచనకు ప్రత్యేక శిక్షకుడిగా కొంతకాలం వ్యవహరించాడు. 1999-2002ల మధ్య అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ భాషానిపుణుడిగా ఉద్యోగించాడు.

రచనలు మార్చు

పద్యకావ్యాలు మార్చు

  1. ఆనందభిక్షువు - విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతుల ప్రశంసలు పొందిన గ్రంథం
  2. అంతర్వాణి

విమర్శ గ్రంథాలు మార్చు

  1. నన్నయ కవిత్వం: అక్షరరమ్యత (సిద్ధాంత గ్రంథం)
  2. వసుచరిత్ర తత్త్వం
  3. వినరాసుమతి

నవలలు మార్చు

  1. రాగబంధాలు

కథలు మార్చు

  1. అడుసుత్రొక్కనేల కాలుకడుగనేల[2]
  2. అభినవ కవిత
  3. జీవనవరాలు
  4. తమసోమా
  5. భక్తమార్కాండేయ
  6. విషాదకోణార్క
  7. మమత
  8. కొడిగట్టినదీపం

నాటకాలు, నాటికలు మార్చు

  1. ప్రతిమ (భాస నాటకానువాదం)
  2. దూతవాక్యం (భాస నాటకానువాదం)
  3. నిషాపురం
  4. నాగబసివి
  5. గమ్యం
  6. ధర్మఖడ్గం
  7. శుక్రశాపం
  8. విద్యారణ్యవీక్షణం
  9. కుతుబ్‌షా దర్బార్

చరిత్ర, పరిశోధన మార్చు

  1. కృష్ణాతీరంలో వర్ధిల్లిన తెలుగు సంస్కృతి
  2. చిలకమర్తి లక్ష్మీనరసింహం (మోనోగ్రాఫ్)
  3. Chilakamarti Lakshmi Narasimham (Monograph)
  4. Swami Sri Veerabrahmendra (ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురణ)

వ్యాఖ్యానాలు మార్చు

  1. కాళీమకుట కందములు
  2. వీరకాళికాంబాశతకం

సంపాదకత్వం మార్చు

  1. ఉదయనోదయము
  2. తారకబ్రహ్మరాజీయము
  3. కవిచింతామణి
  4. యోగసక్తాపరిణయాము
  5. భార్గవపురాణము[3]
  6. ఆర్షకుటుంబము
  7. నహుష్(హిందీనాటకము)
  8. అకారాది అమర నిఘంటువు

అనువాదాలు మార్చు

  1. నరనారాయణీయము (ఆంగ్ల మూలం: గట్టు నారాయణ)
  2. ఆదర్శనాయకత్వము గీతామార్గము (ఆంగ్ల మూలం: గట్టు నారాయణ)
  3. స్వేచ్ఛావలంబనము (ఆంగ్ల మూలం: గట్టు నారాయణ)

పరిష్కరణ మార్చు

  1. విశ్వకర్మ వాజ్మయసూచిక[4]

సామాజిక రంగం మార్చు

ఇతడు కడప జిల్లా కందిమల్లయ్యపురం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠానికి 1992 నుండి మరణించే వరకు ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. 1996 నుండి మరణించేవరకు విశ్వబ్రాహ్మణ ధర్మపీఠానికి సభాపతిగా వ్యవహరించాడు. ఆ ధర్మపీఠం తరఫున మాస సభలు, వార్షిక సభలు, రజతోత్సవ సభ మొదలైనవి నిర్వహించాడు. ఆ సంస్థ తరఫున ప్రణవవేది అనే మాసపత్రికను నడిపాడు.

సత్కారాలు మార్చు

ఇతడు అనేక సత్కారాలు, పురస్కారాలు పొందాడు. వాటిలో ఎన్నదగినవి:

  • 2001లో తెనాలి రుద్రకవి సాహిత్యపీఠం వారి రజత కిరీట పురస్కారం
  • గుంటూరులో అప్పటి సాంకేతిక విద్యాశాఖామంత్రి చేతులమీదుగా సువర్ణ గండపెండేర పురస్కారం

బిరుదము మార్చు

  • సాహిత్యబ్రహ్మ

మరణం మార్చు

ఇతడు తన 81వ యేట హైదరాబాదులో 2013, అక్టోబరు 8వ తేదీ కన్నుమూశాడు.

మూలాలు మార్చు

  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2012-09-01). విశ్వబ్రాహ్మణ సర్వస్వము విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రథమ భాగము) (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 157–161.
  2. వి.వి.ఎల్., నరసింహారావు (1955-12-28). "అడుసుత్రొక్కనేల కాలుకడుగనేల". ఆంధ్ర సచిత్రవారపత్రిక: 50–53. Archived from the original on 2016-03-10. Retrieved 10 February 2015.
  3. బహిరి, పామనాయకుడు (1986-03-01). భార్గవపురాణము (1 ed.). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయ పరిశోధనాలయం. Retrieved 10 February 2015.
  4. కాకుమాను, రంగయ్య (1998-05-01). విశ్వకర్మ వాజ్మయ సూచిక (1 ed.). కర్నూలు: గాయత్రి ప్రచురణలు. Retrieved 10 February 2015.