వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ

భారత విప్లవకారుడు

వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ అలియాస్ చట్టో, (1880 అక్టోబరు 31 - 1937 సెప్టెంబరు 2, మాస్కో), సాయుధ శక్తిని ఉపయోగించి భారతదేశంలో బ్రిటిష్ రాజ్‌ను పడగొట్టడానికి పనిచేసిన ప్రముఖ విప్లవకారుడు. అతను మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్లతో పొత్తులు ఏర్పరచుకున్నాడు. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఐరోపాలో భారతీయ విద్యార్థులను సమీకరించే బెర్లిన్ కమిటీలో భాగంగా ఉండేవాడు. ఆ సమయంలో జపనీయులు చేపడుతున్న చర్యలను అధ్యయనం చేసేవాడు.

వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ
వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ
జననం1880
మరణం1937 సెప్టెంబరు 2 (అని భావిస్తున్నారు)
ఇతర పేర్లుఛట్టో
జుగంతర్, ఇండియా హౌస్, బెర్లిన్ కమిటీ, సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం, హిందూ జర్మను కుట్ర, సామ్రాజ్యవాద వ్యతిరేకత
జీవిత భాగస్వామిలిజ్ రేనాల్డ్స్
భాగస్వామిఆగ్నెస్ స్మిడ్లీ
తల్లిదండ్రులు
బంధువులుసరోజినీ నాయుడు (సోదరి), హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ (తమ్ముడు)

అతను భారత ఉద్యమానికి కమ్యూనిస్టుల మద్దతును పెంపొందించడానికీ, విప్లవ ఉద్యమాలపై పని చేస్తున్న ఆసియన్ల మద్దతు సాధించడానికీ 1920లో అతను మాస్కో వెళ్ళాడు. జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ (KPD) లో చేరాడు. అతను 1930 లలో చాలా సంవత్సరాలు మాస్కోలో నివసించాడు. జోసెఫ్ స్టాలిన్ పెద్దయెత్తున చేపట్టిన ఏరివేతలో భాగంగా చట్టో, 1937 జూలైలో అరెస్టయ్యాడు. చట్టో 1937 సెప్టెంబరు 2 న అతన్ని ఉరితీసారు. ప్రముఖ రాజకీయ నాయకురాలు, కవయిత్రీ అయిన సరోజినీ నాయుడు వీరేంద్రనాథ్‌కు సోదరి.

జీవితం తొలి దశలో

మార్చు

డాక్టర్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ (ఛటర్జీ), ఒక శాస్త్రవేత్త-తత్వవేత్త, విద్యావేత్త. అతను నిజాం కళాశాలలో మాజీ ప్రిన్సిపాల్, సైన్స్ ప్రొఫెసరు. అతని భార్య వరద సుందరీ దేవి. హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కవయిత్రి, గాయకురాలు. వారి పిల్లలలో వీరేంద్రనాథ్ అందరిలోకీ పెద్ద కుమారుడు, మొత్తం ఎనిమిది మంది సంతానంలో రెండవవాడు. ఇతర సంతానంలో సరోజినీ నాయుడు, హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ కవులు, పార్లమెంటేరియన్లుగా ప్రసిద్ధి చెందారు. వారి కుమార్తె మృణాళిని (గన్ను) నేషనలిస్ట్ కార్యకర్తగా మారింది. కోల్‌కతా (కలకత్తా)లోని అనేక సమూహాలకు వీరేంద్రనాథ్‌ను పరిచయం చేసింది. [1] చిన్న కొడుకు మారిన్ వీరేంద్రనాథ్‌తో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడు.

చటోపాధ్యాయ లౌకిక, ఉదారవాద సంస్కారాన్ని పొందాడు. అతను బహుభాషావేత్త. భారతీయ భాషలలో తెలుగు, తమిళం, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్, హిందీలతోపాటు ఆంగ్లంలో నిష్ణాతుడు; తరువాత అతను ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, డచ్, రష్యన్, స్కాండినేవియన్ భాషలను కూడా నేర్చుకున్నాడు. అతను మద్రాస్ విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేట్ చేసాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. కోల్‌కతాలో, అప్పటికే అభివృద్ధి చెందిన జాతీయవాదిగా పేరుపొందిన అతని సోదరి గన్ను (మృణాళిని) ద్వారా, వీరేంద్రనాథ్‌కు బారిస్టరు, అతివాది అయిన బెజోయ్ చంద్ర ఛటర్జీ పరిచయం అయ్యాడు. చట్టో శ్రీ అరబిందో కుటుంబాన్ని, ముఖ్యంగా అరబిందో కజిన్లైన కుముదిని, సుకుమార్ మిత్రాలను కలుసుకున్నాడు; కుముదిని, విద్రోహ పత్రిక సుప్రభాత్‌కు సంపాదకురాలు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఛటోపాధ్యాయ వారందరితో సంబంధాలు కొనసాగించాడు. [2]

ఇంగ్లాండులో

మార్చు

1902లో, చటోపాధ్యాయ ఇండియన్ సివిల్ సర్వీస్‌కు సిద్ధమవుతూ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. తరువాత, అతను మిడిల్ టెంపుల్‌లో న్యాయ విద్యార్థి అయ్యాడు. లండన్‌లోని 65 క్రోమ్‌వెల్ అవెన్యూలో ఉన్న శ్యామ్‌జీ కృష్ణవర్మ స్థాపించిన ఇండియా హౌస్‌కు తరచూ వెళ్ళేవాడు. అపుడు ఛటోపాధ్యాయకు VD సావర్కర్‌తో (1906 నుండి) సాన్నిహిత్యం కలిగింది. 1907లో ఛటోపాధ్యాయ, శ్యామ్‌జీ యొక్క ఇండియన్ సోషియాలజిస్ట్ సంపాదకీయ మండలిలో ఉన్నాడు. ఆగష్టులో, మేడమ్ కామా, SR రానాతో పాటు, అతను రెండవ అంతర్జాతీయ స్టుట్‌గార్ట్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాడు. అక్కడ వారు హెన్రీ హైండ్‌మాన్, కార్ల్ లైబ్‌క్‌నెచ్ట్, జీన్ జౌరెస్, రోసా లక్సెంబర్గ్, రామ్‌సే మెక్‌డొనాల్డ్ వంటి ప్రతినిధులను కలిశారు. వ్లాదిమిర్ లెనిన్ కూడా దానికి హాజరయ్యాడు. అయితే ఈ సందర్భంగా ఛటోపాధ్యాయ లెనిన్ను కలిశాడా లేదా అనేది ఖచ్చితంగా తెలియలేదు.

1908లో, "ఇండియా హౌస్"లో అతను భారతదేశానికి చెందిన అనేక మంది ముఖ్యమైన "ఆందోళనకారుల"తో పరిచయం కలిగింది. GS ఖపర్డే, లజపత్ రాయ్, హర్ దయాల్, రంభుజ్ దత్, బిపిన్ చంద్ర పాల్ లు అందులో ఉన్నారు. 1909 జూన్‌లో, ఇండియా హౌస్ సమావేశంలో, భారతదేశంలో ఆంగ్లేయుల హత్యలను VD సావర్కర్ గట్టిగా సమర్థించాడు. జూలై 1న, లండన్‌లోని ఇంపీరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో, భారత కార్యాలయంలో రాజకీయ సహాయకుడైన సర్ విలియం కర్జన్-విల్లీని, సావర్కర్‌చే తీవ్రంగా ప్రభావితుడైన మదన్ లాల్ ధింగ్రా హత్య చేసాడు. ఛటోపాధ్యాయ జులై 6న టైమ్స్‌లో సావర్కర్‌కు మద్దతుగా ఒక లేఖను ప్రచురించాడు. వెంటనే బెంచర్లు మిడిల్ టెంపుల్ లోని బెంచర్లు అతన్ని బహిష్కరించారు. 1909 నవంబరులో అతను ఉగ్ర జాతీయవాద పత్రిక తల్వార్ (ది స్వోర్డ్) కు సంపాదకత్వం వహించాడు.

1910 మేలో, కొరియన్ ద్వీపకల్పంపై యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్‌ల మధ్య ఉద్రిక్తత ఏర్పడినపుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని చటోపాధ్యాయ, భారత విప్లవ ప్రయత్నాలకు జపాన్ నుంచి సహాయం పొందే విషయం గురించి చర్చించాడు. తన అరెస్టుకు జారీ అయిన వారెంటు నుండి తప్పించుకోడానికి 1910 జూన్ 9 న, DS మాధవరావుతో కలిసి అతను, VVS అయ్యర్‌ వెంట పారిస్‌ వెళ్లాడు. ఫ్రాన్స్ చేరుకున్న తర్వాత, అతను వర్కర్స్ ఇంటర్నేషనల్ (SFIO) ఫ్రెంచ్ విభాగంలో చేరాడు.

పారిస్‌లో

మార్చు

అయ్యర్ భారతదేశానికి తిరిగి వచ్చి పాండిచ్చేరిలో స్థిరపడ్డాడు. అక్కడ అతను పారిస్‌లో పరిచయమైన మేడమ్ భికైజీ కామాతో పరిచయాన్ని కొనసాగిస్తూనే ధర్మ వార్తాపత్రికను, తమిళంలో అనేక రాజకీయ కరపత్రాలనూ ప్రచురించాడు. పారిస్‌లో ఉండగా చట్టో, మరికొందరు విప్లవకారులతో కలిసి 25 ర్యూ డి పోంథియులో ఆమెతో ఉండేవాడు. బందే మాతరం పత్రిక ప్రచురణలో ఆమెకు సహాయంగా ఉండేవారు. ఆ పత్రిక 1911 ఏప్రిల్ సంచికలో నాసిక్, కోల్‌కతాలో ఆగ్రహావేశాలను ప్రశంసిస్తూ "అత్యంత హింసాత్మకంగా జరిగినవాటిలో ఇదొకటి" అని రాసింది. [3] ఇంకా "పెద్దమనుషులతో మనం పెద్దమనుషులుగానే ఉంటాం. కానీ పోకిరీలతో, దుష్టులతో కాదు. (. . . ) మా స్నేహితులు బెంగాలీలు కూడా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. వారి కృషికి ధన్యవాదాలు. వారి ఆయుధాలు చిరకాలం ఉంటాయి." [3]

1912 ఫిబ్రవరిలో తిరునెల్వేలి కుట్ర కేసుకు సంబంధించి, మేడమ్ భికైజీ కామా ఈ రాజకీయ హత్యలు భగవద్గీత బోధనలకు అనుగుణంగా ఉన్నాయని చూపుతూ ఒక కథనాన్ని ప్రచురించింది.

వివాహం, కుటుంబం

మార్చు

1912లో ఛటోపాధ్యాయ మిస్ రేనాల్డ్స్ అనే ఐరిష్ కాథలిక్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అతను అన్యమతస్థుడు అయినందున, అతని మతం మార్చడానికి ఆమె అనేక ప్రయత్ంబాలు చేసింది. అతను అన్ని ప్రయత్నాలనూ తిరస్కరించాడు. ఆమె అతనిని పెళ్ళి చేసుకోవడానికి పోప్ నుండి ప్రత్యేక వితరణను తీసుకు వచ్చింది. వేడుక తర్వాత ఆమె, పెళ్ళి షరతుగా తమకు పుట్టే పిల్లలను క్యాథలిక్‌గా పెంచాలని చెప్పింది. వారు గొడవపడి విడిపోయారు. ఆమె ఏదో రహస్య ఆంగ్ల కాన్వెంట్‌లో సన్యాసినిగా మారింది. అతను పెళ్ళిని రద్దు చేసుకునేందుకు సంవత్సరాల పాటు ప్రయత్నించాడు. [4] ఛటోపాధ్యాయ 1914 ఏప్రిల్‌లో తదుపరి విప్లవ కార్యకలాపాల కోసం బెర్లిన్‌ వెళ్లాడు. అక్కడ అతనికి ఆగ్నెస్ స్మెడ్లీతో పరిచయమైంది. వాళ్ళు చట్టబద్ధంగా పెళ్ళి చేసుకోనప్పటికీ, ఆమె అతని పేరును పెట్టుకుంది. అతని భార్యగా గుర్తింపు పొందింది. ఈ సంబంధం ఎనిమిదేళ్లు కొనసాగింది. ఆగ్నెస్ 1928లో తన ప్రసిద్ధ నవల డాటర్ ఆఫ్ ఎర్త్‌ రాసింది. ఆ సంవత్సరంలోనే వారు విడిపోయారు. [4] అతను ఆమెను ప్రేమించాడనేది నిజం. కానీ, స్త్రీల పట్ల ఆసక్తి లేని అతనికి ఆమె పట్ల ప్రేమ ఎందుకు కలిగిందనేది ఆమెకు గానీ, అతని గురించి తెలిసిన వారికి గానీ అర్థం కాలేదు. ఆ తరువాత ఆమె చైనా వెళ్ళింది. అక్కడ సోవియట్ గూఢచారి అయిన రిచర్డ్ సోర్జ్‌తో సంబంధం కలుపుకుంది.

జర్మనీలో

మార్చు

జర్మనీలో ఉడగా తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అతను, 1914 ఏప్రిల్‌లో సాక్సే- అన్‌హాల్ట్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక భాషాశాస్త్రంలో విద్యార్థిగా చేరాడు. చటోపాధ్యాయ డాక్టర్ అభినాష్ భట్టాచార్య (అలియాస్ భట్టా) ను, మరికొందరు జాతీయవాద భారతీయ విద్యార్థులనూ కలిశాడు. ఛట్టో సన్నిహితుడని ప్రభావశీలురైన సభ్యులకు బాగా తెలుసు. 1914 సెప్టెంబరు ప్రారంభంలో వారు "జర్మన్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా" సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విల్హెల్మ్ II సోదరుడు వారిని స్వాగతించాడు. భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టడంలో జర్మనీ సహాయం కోసం భారతీయులు, జర్మన్లు ఒక ఒప్పందంపై సంతకం చేశారు. జర్మన్ విదేశాంగ కార్యాలయంలో మధ్యప్రాచ్య వ్యవహారాలలో నిపుణుడైన బారన్ మాక్స్ వాన్ ఒపెన్‌హీమ్ సహాయంతో, ఛటోపాధ్యాయ ముప్పై ఒక్క జర్మన్ విశ్వవిద్యాలయాలలోని భారతీయ విద్యార్థులకు అసోసియేషన్ భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలియజేశాడు. అతను బెర్లిన్ కమిటీకి కొత్త సభ్యులను కనుగొనడంలో కూడా సహాయం చేశాడు. [5]

దాని మొదటి సభ్యులలో ఛటోపాధ్యాయ, భట్టా, డాక్టర్ మోరేశ్వర్ గోవిందరావు ప్రభాకర్ (కొలోన్), డాక్టర్ అబ్దుల్ హఫీజ్ (లీప్‌జిగ్), సి. పద్మనాభన్ పిళ్లై (జూరిచ్), డాక్టర్ జ్ఞానేంద్ర దాస్‌గుప్తా (జూరిచ్), ధీరేన్ సర్కార్, నరైన్ ఎస్. మరాఠే, విష్ణు సుక్తాంకర్, గోపాల్ పరాంజపే, కరాండికర్, శ్రీష్ చంద్ర సేన్, సతీష్ చంద్ర రే, సాంబశివ రావు, దాదాచాంజీ కెర్సాస్ప్, మన్సూర్ అహ్మద్, సిద్ధిక్ ఉన్నారు. ఆ తరువాత చేరిన విప్లవకారుల్లో హర్ దయాల్, తారక్ నాథ్ దాస్, మొహమ్మద్ బర్కతుల్లా, భూపేంద్రనాథ్ దత్తా, ఎ. రామన్ పిళ్ళై (ఎఆర్ పిళ్లై), చంద్రకాంత చక్రవర్తి, ఎంపి తిరుమల్ ఆచార్య, హేరంబాలాల్ గుప్తా, జోధ్ సింగ్ మహాజన్, జితేన్ లాహిరిజన్, బెర్లిన్‌కు త్వరలో దారితీసిన ఇతర ప్రముఖ విప్లవకారులు. సత్యేన్ సేన్, విష్ణు గణేష్ పింగ్లే లు ఉన్నారు.[6] [7] [8]

1914 సెప్టెంబరు 2 న, సర్కార్, మరాఠే జర్మన్ రాయబారి వాన్ బెర్న్‌స్టోర్ఫ్‌కు ఒక సందేశం తీసుకుని వాషింగ్టన్ DCకి వెళ్ళారు. అతను, స్టీమర్‌లను ఏర్పాటు చేయమని, ఆయుధాలు, మందుగుండు సామగ్రినీ భారతదేశ తూర్పు తీరానికి పంపమనీ తన మిలిటరీ అటాచ్ అయిన వాన్ పాపెన్‌ను ఆదేశించాడు. 1914 నవంబరు 20 న చటోపాధ్యాయ, సత్యేన్ సేన్, VG పింగ్లే, కర్తార్ సింగ్‌లను కోల్‌కతాకు, బాఘా జతిన్ కు ఒక నివేదికను ఇచ్చి, పంపాడు. బాఘా జతిన్, పింగ్లే కర్తార్ సింగ్ ల ద్వారా రాష్ బిహారీ బోస్‌కు, ప్రతిపాదిత సాయుధ తిరుగుబాటు కోసం సన్నాహాలను వేగవంతం చేయమని కోరుతూ ఒక సూచనను పంపాడు. [9] 1915లో, చటోపాధ్యాయ స్విట్జర్లాండ్‌లో మహేంద్ర ప్రతాప్‌ని కలిసి, కైజర్ వ్యక్తిగత ఆహ్వానం గురించి చెప్పాడు. అతను బ్రిటిషు ఏజెంటు డొనాల్డ్ గుల్లిక్‌కు పట్టుబడ్డాడు. అతను చటోపాధ్యాయను చంపడానికి ప్రయత్నించాడు.

విప్లవ ద్రిమ్మరి

మార్చు

ఇండో-జర్మన్ జిమ్మెర్‌మాన్ ప్రణాళిక విఫలమవడంతో, 1917లో చటోపాధ్యాయ స్టాక్‌హోమ్‌లో ఇండిస్కా నేషనల్ కమిట్టీన్ పేరుతో కొత్త స్వతంత్ర కమిటీ బ్యూరోను ప్రారంభించాడు. అప్పటి నుండి, ఐరోపాలో భారత జాతీయవాదానికి చట్టబద్ధమైన ప్రతినిధి ఎవరు అన్నదానిపై ఈ స్టాక్‌హోమ్ సంస్థ, బెర్లిన్ కమిటీలోని మిగిలిన భాగాలతో పోరాడింది. [5] 1918లో, అతను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ మొదటి ప్రధాన కార్యదర్శి అయిన రష్యా నాయకులు ట్రోయినోవ్స్కీ, ఏంజెలికా బాలబనోవాను సంప్రదించాడు. డిసెంబరులో, అతను బెర్లిన్ కమిటీని రద్దు చేశాడు. 1919 మేలో బెర్లిన్‌లో భారతీయ విప్లవకారుల రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. 1920 నవంబరులో భారతదేశంలో విప్లవాత్మక జాతీయవాద ఉద్యమానికి ప్రత్యేకంగా ఆర్థిక, రాజకీయ మద్దతు కోసం వెతుకుతున్నప్పుడు, చటోపాధ్యాయను MN రాయ్ ( మిఖాయిల్ బోరోడిన్ ఆమోదంతో) ప్రోత్సహించారు.

వీరేంద్రనాథ్ ఆగ్నెస్ స్మెడ్లీతో కలిసి మాస్కో వెళ్ళాడు. వారు సహచరులుగా మారారు. 1928 వరకు ఇద్దరూ కలిసి జీవించారు. ఆమె ప్రభావంతో ఛటోపాధ్యాయ, మాస్కోలో ఎంఎన్ రాయ్ సాధించిన ప్రభావవంతమైన స్థానాన్ని తానూ పొందాలని కోరుకున్నాడు. మరుసటి సంవత్సరం, భూపేంద్ర నాథ్ దత్తా, పాండురంగ్ ఖాన్కోజేతో కలిసి అతను లెనిన్‌ను కలుసుకున్నాడు. మే నుండి సెప్టెంబరు వరకు, అతను మాస్కోలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ మూడవ కాంగ్రెస్ యొక్క ఇండియన్ కమిటీకి హాజరయ్యాడు. చటోపాధ్యాయ తన జపాన్‌ ప్రతినిధి అయిన రాష్ బిహారీ బోస్‌తో కలిసి 1921 డిసెంబరులో బెర్లిన్‌లో ఇండియన్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను స్థాపించాడు.

శిబ్‌నారాయణ్ రే ప్రకారం, రాయ్, చటోపాధ్యాయలు ఆగ్నెస్‌కు ప్రత్యర్థులు: "రాయ్ అతని తెలివితేటలను, శక్తినీ మెచ్చుకున్నందున అతనితో కలిసి పనిచేయడానికి ఇష్టపడేవాడు. (... ) 1926 ప్రారంభంలో చట్టో రాయ్‌తో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు." [10]

రాయ్ చెప్పిన మీదట, సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్‌ను ప్రారంభించేందుకు ఐరోపాలో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించడంలో విల్లీ ముంజెన్‌బర్గ్ చట్టోను తన అనుచరుడిగా తీసుకున్నాడు. 1927 జనవరిలో రాయ్ చైనాకు వెళ్లే సందర్భంగా, చట్టో రాయ్‌కి ఇలా వ్రాశాడు - "నేను చేయాల్సింది ఇంకా ఏదైనా ఉందని మీరు భావిస్తే...". 1927 ఆగష్టు 26 న, అతను చైనా నుండి మాస్కో తిరిగి వచ్చిన తర్వాత, భారతదేశం, జర్మనీలోని కమ్యూనిస్ట్ పార్టీలలో ప్రవేశం పొందేందుకు "నేరుగా" తనకు సహాయం చేయవలసిందిగా కోరుతూ రాయ్‌కి రాసాడు. రాయ్ ఇచ్చిన సలహా మేరకు చట్టో, జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ (KPD)లో చేరాడు. [11]

1927లో, KPD భారతీయ భాషల విభాగానికి అధిపతిగా పని చేస్తున్నప్పుడు చట్టో, జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్ యొక్క బ్రస్సెల్స్ సమావేశానికి వెళ్లాడు. ఛటోపాధ్యాయ దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అతని తమ్ముడు హరీన్ అతనిని, ఆగ్నెస్‌నీ కలవడానికి ఆ సంవత్సరం బెర్లిన్ వెళ్ళాడు. జవహర్‌లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యాడని తెలుసుకున్న ఛటోపాధ్యాయ, బ్రిటిషు సామ్రాజ్యవాదం నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందే దిశగా మరింత విప్లవాత్మక కార్యక్రమం చేపట్టేందుకు పార్టీని విభజించమని కోరాడు - కానీ అది ఫలించలేదు.

1930 నుండి 1932 వరకు, చటోపాధ్యాయ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్ర వామపక్ష వాదం దిశగా అడుగువేయడం గురించి కొమింటెర్న్ (కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్) పత్రిక అయిన ఇన్‌ప్రెకోర్ లో 28 వ్యాసాలను ప్రచురించాడు. 1931 - 1933 మధ్య మాస్కోలో నివసించే కాలంలో చటోపాధ్యాయ, హిట్లర్ వ్యతిరేక కార్యకలాపాలు, పాశ్చాత్య శక్తుల నుండి ఆసియా విముక్తి, భారతదేశ స్వాతంత్ర్యం, చైనీస్ విప్లవంలో జపాన్ జోక్యాన్ని సమర్థించడం కొనసాగించాడు. తన కొరియన్, జపనీస్, చైనీస్ స్నేహితులలో జౌ ఎన్‌లై కూడా ఉన్నాడు. ఆనాటికి జౌ ఎన్‌లై, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు కాబోయే ప్రధాన మంత్రి.

ఆగ్నెస్ అతనిని చివరిసారిగా చూసినది 1933లో. దాని గురించి ఆమె తరువాత ఇలా జ్ఞాపకం చేసుకుంది:

"అతను మొత్తం ఒక జాతి అనుభవిస్తున్న విషాదాన్ని మూర్తీభవించాడు. అతను ఇంగ్లాండు లోనో అమెరికా లోనో జన్మించి ఉన్నట్లయితే, అతని సామర్థ్యానికి అతను తన కాలపు గొప్ప నాయకులలో ఒకడై ఉండేవాడని నేను అనుకున్నాను... అతనికి వయసు మీద పడుతోంది, శరీరం సన్నగా, బలహీనంగా ఉంది, జుట్టు వేగంగా తెల్లబడుతోంది. భారతదేశానికి తిరిగి వెళ్ళాలనే కోరిక అతన్ని వెంటాడింది. అయితే బ్రిటిష్ వారు అతని చితాభస్మాన్ని తప్ప, అతన్ని నమ్మే పరిస్థితి లేదు." [12]

అంత్య దశ

మార్చు

1934 జనవరి-ఫిబ్రవరిలో చట్టో, క్రుప్స్కాయా (లెనిన్ భార్య) లు లేఖలు రాసుకున్నారు. 1934 మార్చి 18 న అతను వ్లాదిమిర్ లెనిన్ జ్ఞాపకాల గురించి ప్రసంగించాడు. [13] అతను 1935 సెప్టెంబర్ 9 న కొమింటర్న్ సెక్రటరీ-జనరల్ అయిన జార్జి డిమిత్రోవ్‌కి ఇలా వ్రాశాడు: "మూడు సంవత్సరాలుగా నేను కమింటర్న్‌లో క్రియాశీల పనికి దూరంగా ఉండాల్సి వచ్చింది." క్లెమెన్స్ పామే దత్ ( రజనీ పామే దత్ సోదరుడు), లెనిన్‌గ్రాడ్‌లోని అకాడమీ ఆఫ్ సైన్స్ ఎథ్నోగ్రఫీ విభాగంలో 1936/37లో చివరిసారిగా చట్టోను చూసినట్లు చెప్పాడు. [14]

స్టాలిన్ చేపట్టిన ఏరివేతలో భాగంగా 1937 జూలై 15 న ఛటోపాధ్యాయ అరెస్టయ్యాడు. స్టాలిన్, మోలటోవ్, వోరోషిలోవ్, జ్దానోవ్, కగనోవిచ్ లు 1937 ఆగస్టు 31న సంతకం చేసిన 185 మంది చంపాల్సిన వ్యక్తుల జాబితాలో అతని పేరు కనిపించింది. [15] USSR యొక్క సుప్రీం కోర్టు లోని మిలిటరీ కొలీజియం 1937 సెప్టెంబరు 2 న మరణశిక్షను విధించింది. అదే రోజున చట్టోను ఉరితీశారు.

1938 జూలై 10 న, చటోపాధ్యాయ బావమరిది A.C.N నంబియార్,  చట్టో అరెస్టు గురించి నెహ్రూకి వ్రాసాడు. ఛటోపాధ్యాయ భవితవ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని నెహ్రూ జూలై 21న బదులిచ్చాడు.

మూల్యాంకనం

మార్చు

జేమ్స్ కాంప్‌బెల్ కెర్ రాసిన పొలిటికల్ ట్రబుల్ ఇన్ ఇండియా: 1907–1917 పుస్తకంలో చటోపాధ్యాయ గురించి చర్చించాడు. అందులో చట్టో పాత్రకు, చర్యలకూ సంబంధించిన తక్కువ ఆకర్షణీయమైన అంశాలను వివరించాడు.

అతని సమర్ధవంతమైన నాయకత్వం, పదునైన తెలివితేటలు, నిష్కపటమైన భావోద్వేగాలకు గాను MN రాయ్, డా. అభినాష్ భట్టాచార్య వంటి సహచరులు అతన్ని గాఢంగా మెచ్చుకున్నాడు. 

దశాబ్దాల తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో చట్టో గురించి ఇలా వ్రాశాడు:

భారతదేశంలోని ప్రసిద్ధ కుటుంబానికి చెందిన వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. చట్టోగా ప్రసిద్ధి చెందిన అతను చాలా సమర్థుడు, చాలా సంతోషకరమైన వ్యక్తి. చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండేవి కావు. అతని వేసుకున్న బట్టలు అధ్వాన్నంగా ఉండేవి. భోజనం కోసం డబ్బులు వెతుక్కోవాల్సి వచ్చేది, కానీ తన హాస్యచతురతనూ, అన్నీ తేలికగా తీసుకునే తత్వాన్నీ అతను ఎప్పటికీ వదులుకోలేదు. నేను ఇంగ్లండ్‌లో చదువుకునే రోజుల్లో అతను నాకంటే కొన్ని సంవత్సరాలు సీనియర్‌. నేను హారోలో ఉన్నప్పుడు అతను ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నాడు. అప్పటి నుండి అతను భారతదేశానికి తిరిగి రాలేదు. కొన్నిసార్లు ఇంటిపై బెంగ పడిపోయినపుడు వచ్చేయాలని అనుకునేవాడు. అతని ఇంటి-బంధాలన్నీ చాలా కాలం క్రితమే తెగిపోయాయి. అతను భారతదేశానికి వస్తే అతను సంతోషంగా, కలివిడిగా ఉండలేక పోవచ్చని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఎంత కాలం గడిచినా, ఇంటి మీది ప్రేమ లాగుతూనే ఉంటుంది. మజ్జినీ అన్నట్లుగా, ఏ బహిష్కృతుడూ తన జాతి లక్షణాల నుండి దూరం కాలేడు, ఆ ఆత్మపరితాపాన్ని తప్పించుకోలేడు.. . నేను కలిసిన కొద్దిమందిలో, మేధోపరంగా నన్ను ఆకట్టుకున్న వ్యక్తులు వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ, ఎంఎన్ రాయ్‌లు మాత్రమే. చట్టో మామూలు కమ్యూనిస్టు కాదు, కానీ కమ్యూనిస్టత్వం వైపు మొగ్గు చూపాడు. [16]

చటోపాధ్యాయ వంశీకులు ఇప్పటికీ కోల్‌కతాలో ఉన్నారు. 

ఇతర మీడియాలో ప్రాతినిధ్యం

మార్చు

చట్టో గ్రేట్ బ్రిటన్, భారతదేశాల్లో విప్లవకారుడిగా ప్రసిద్ధి చెందాడు. సోమర్సెట్ మామ్ రాసిన చిన్న కథ, "గియులియా లజారి;"లో "చంద్రలాల్" పాత్రకు ప్రేరణ చట్టోయేనని భావిస్తారు. ఎనిమిది సంవత్సరాల పాటు చట్టోతో సంబంధం ఉన్న అమెరికన్ రచయిత ఆగ్నెస్ స్మెడ్లీ, తన నవల డాటర్ ఆఫ్ ఎర్త్‌లోని ఆనంద పాత్రకు అతన్నే మోడల్‌గా తీసుకుంది. బెర్లిన్‌లోని భారతీయ విప్లవకారుడు, ACN నంబియార్, చట్టో సోదరి సుహాసినిని పెళ్ళి చేసుకున్నాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. Ker, James Campbell (1960). Political Trouble in India 1907-1917. Calcutta: S.Ghatack from Indian Editions. pp. 181–2. Retrieved 2020-09-04.
 2. Political Trouble in India, James Campbell Ker, 1917, repr. 1973, pp. 198–199
 3. 3.0 3.1 Ker, pp. 201–202
 4. 4.0 4.1 Agnes Smedley: Battle Hymn of China, p. 12
 5. 5.0 5.1 Liebau, Heike (2019). ""Unternehmungen und Aufwiegelungen": Das Berliner Indische Unabhängigkeitskomitee in den Akten des Politischen Archivs des Auswärtigen Amts (1914–1920)". MIDA Archival Reflexicon: 4–5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 6. Ker, p. 265;
 7. Indian Revolutionaries Abroad, by A. C. Bose, pp. 82–98
 8. Europé bharatiya biplaber sadhana by Abhinash Bhattacharya, pp. 99–125
 9. Bimanbihari Majumdar, Militant Nationalism in India, 1966, p. 167
 10. Sibnarayan Ray, In Freedom's Quest: Life of M. N. Roy, Vol. II, p. 235; Vol. III (Part 1), p. 17
 11. Sibnarayan Ray, In Freedom's Quest: Life of M. N. Roy, Vol. II, p. 235; Vol. III (Part 1), p 17
 12. China Correspondent, 1943
 13. Documents of the History of Communist Party of India, Vol.1
 14. Letter from Clemens Palme Dutt to Muzaffar Ahmed, 1937
 15. "Stalin's shooting lists" Archived 2015-04-13 at the Wayback Machine, Stalin Documents-Russia website
 16. An Autobiography, by Jawaharlal Nehru, Bombay, 1962
 • పొలిటికల్ ట్రబుల్ ఇన్ ఇండియా: 1907–1917, ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, జేమ్స్ కాంప్‌బెల్ కెర్, 1917, ప్రతినిధి. 1973
 • యూరోప్ భారతీయ బైప్లాబర్ సాధన, డాక్టర్ అబినాష్ చంద్ర భట్టాచార్య, 2వ ఎడిషన్, 1978
 • బహిర్భారతే భారతేర్ ముక్తిప్రయాస్, డాక్టర్ అబినాష్ చంద్ర భట్టాచార్య, 1962
 • డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ, ed. SP సేన్, వాల్యూమ్. I, "ఛటర్జీ బీరేంద్ర నాథ్", 272–4
 • చట్టో: ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ యాంటీ-ఇంపీరియలిస్ట్ ఇన్ యూరోప్, బై నిరోడ్ కె. బారువా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2004
 • ఆదిత్య సిన్హా, "నిరోదా కె. బారువా యొక్క చట్టో సమీక్ష", హిందూస్తాన్ టైమ్స్, న్యూ ఢిల్లీ, 14 ఆగస్టు 2004
 • పృథ్వీంద్ర ముఖర్జీ (PhD థీసిస్, ప్యారిస్ సోర్బోన్ యూనివర్సిటీ), 1986 ద్వారా లెస్ ఆరిజిన్స్ ఇంటెలెక్చుయెల్స్ డు మూవ్‌మెంట్ డి'ఇండిపెండెన్స్ డి ఎల్'ఇండే (1893–1918)
 • ఇన్ ఫ్రీడంస్ క్వెస్ట్: లైఫ్ ఆఫ్ MN రాయ్, వాల్యూమ్. II, III (పార్ట్ 1), సిబ్నారాయణ్ రే ద్వారా
 • అబ్రాడ్ ఇండియన్ రివల్యూషనరీస్, AC బోస్, పాట్నా, 1971
 • ఆగ్నెస్ స్మెడ్లీ: ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ యాన్ అమెరికన్ రాడికల్, బై జానిస్ R. మాకిన్నన్, స్టీఫెన్ R. మాకిన్నన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1988