మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటి. వీటిలో ప్రముఖంగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది సా.శ. 78 లో ప్రారంభమైంది.[1] దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది.

వాశిష్టీపుత్ర శాతకర్ణి యొక్క వెండి నాణెం (సా.శ.160).
ముందు: రాజముఖం. అశోకుని కాలమునాటి బ్రాహ్మీలిపిలో ప్రాకృతం: శిరి శాతకనీస రానో ... వసితిపుతస.
వెనుక: ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. తెలుగు బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో.

శకము-శకనిర్ణయము

మార్చు

ఈ "శాలివాహనశక" ప్రస్తావన మొదటిగా దేవగిరి యాదవరాజు రామచంద్రుని 1272వసం. లోని ఒక ఠాణాదాన శాసనమున, తదుపరి ఆ రామచంద్రుని 1289వ సం. లోని మరొక శాసనమున ఉంది.రెండు శాసనములందును శాలివాహనశకే అను సం.సంఖ్యలు ఉన్నాయి.ఆ తరువాత విజయనగర రాజుల అనేక సంస్కృత కర్ణాట శాసనములందు శాలివాహన శకవర్ష వ్యవహారము ఉంది.ఆంధ్రశాసనము లందును ఉంది.అసలు శకము అనగా కాలమానమని అర్వాచీన వ్యవహారము.ప్రాచీన వ్యవహారము కాదు.5వ శతాబ్ది అమరకోశములో అసలు శకము అనే శబ్దములేదు.11వ శతాబ్దమునాటి వైజయంతి నిఘంటువునందు శకశబ్దము ఉంది.కాని, అందు దేశము, రాజోద్యోగి, పేడ అని అర్ధము మాత్రమే ఉంది.12వ శతాబ్దము విశ్వకోశమునందు రాజు, దేశము అని మాత్రమే అర్ధములు ఉన్నాయి.13వ శతాబ్దమునాటి నానార్ధ రత్నమాల యందు దేశము, గోమయము అని అర్ధములు ఉన్నాయి.కనుక 13వ శతాబ్దము శాసనమందలి శాలివాహనశకే అను వ్యవహారమునందు వర్షే అను పదము అధ్యాహారము. కనుక శాలివాహన శకవర్షము అనగా శాలివాహన రాజునకు, శకనృపునకు సంబంధించిన సంవత్సరమని ప్రాచీనార్ధము.అల్పాచేతరమ్ అను పాణిని సూత్రమును అనుసరించి శకశాలివాహన పదసంపుటి నిష్పన్నము కావలయును.కానీ కాలేదు. అభ్యర్హితం పూర్వంచ అను వరరుచి వార్తికమును అనుసరించి శాలివాహనశక పదసంపుటి నిష్పన్నమైనది.అనగా శకనృపునికంటె శాలివాహనరాజు అభ్యర్హుడని అర్ధము.సంహృతుడైన క్రూరశకనృపునికంటె సంహారకుడైన వీరశాలివాహనరాజు విధిగా అభ్యర్హుడు.కాబట్టి, శాలివాహన శకర్షము అనగా అభ్యర్హుడైన శాలివాహనరాజునకు, అభ్యర్హుడుకాని శకనృపునకు సంబంధించిన సంవత్సరము అని స్పష్టము.అనహా శకసంహారమూలకమైన, శాలివాహన నిర్ణీతకాలమైన సంవత్సరమని అర్ధము.గౌతమీపుత్ర శాతకర్ణి సహపానుని సంహరించిన కాలము సా.శ. 124వ సంవత్సరము. సా.శ.78వ సంవత్సరముకాదు కాబట్టి ఇతడు శకనిర్ణీతకాడు.హాలుడు ఇతనికి పూర్వుడు. ఈతని రాజ్యాంత కాలము సా.శ.78వ సంవత్సరము కాబట్టి హాలుడు కూడా శకనిర్ణేత కాడని స్పష్టము. అందువలన శాతవాహన రాజులందు శకశబ్దము శాశ్వత ముద్రపడిన శాతవాహనరాజు మాఢరీపుత్ర శివస్వాతి అని భవిష్యోత్తర పురాణమున ఉంది. అతనిదే మాఠరీపుత్ర పదబంధము.పతంజలి మహాభాష్యమునందు మాఠర కౌండిన్య న్యాయము ఉంది.కౌండిన్య నామము ఋషినామమువలె, మాఠరి శబ్దము ఋషినామము కావలెయును.

‌వనరులు

మార్చు
  1. ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము చిలుకూరి వీరభద్రరావు
  • 1979 భారతి మాసపత్రిక వ్యాసము: శాలివాహన శకము రచన: డా.కొర్లపాటి శ్రీరామమూర్తి.