జ్యోతిశ్చక్రము. ఇది భగోళమున అన్నిటికిని పైన ఉండును. ఈచక్రమున ధ్రువుఁడు ఇంద్రవరుణకశ్యప ప్రముఖులతో కూడి నిత్యము ప్రదక్షిణముగ తిరుగుచు ఉండును. మఱియు దీని పుచ్ఛమున ప్రజాపతియు అగ్నీంద్ర ధర్ములును, పుచ్ఛమూలమున ధాతృవిధాతలును, కటిప్రదేశమున ఋషిసప్తకమును, ఉత్తర హనువున అగస్త్యుఁడును, అపరహనువున యముఁడును, ముఖమున అంగారకుఁడును, గుహ్యమున శనైశ్చరుఁడును, మేఢ్రమున బృహస్పతియును, పక్షమున ఆదిత్యుఁడును, నాభిని శుక్రుఁడును, చిత్తమున చంద్రుఁడును, స్తనమున అశ్వినులును, ప్రాణాపానముల బుధుఁడును, సర్వాంగములను శని కేతు గ్రహములును, రోమమున తారలును ఉండును. ఇది సర్వదేవతామయము అయిన పుండరీకాక్షుని దివ్యదేహముగా ఎఱుఁగవలయును.