శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం

గ్రంథాలయం
(శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం నుండి దారిమార్పు చెందింది)

శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం (ఆంగ్లం: Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam) తెలంగాణా రాజధాని హైదరాబాదు లోని ప్రాచీన గ్రంథాలయము.[1]

ఈ గ్రంథాలయం సెప్టెంబరు 1, 1901 సంవత్సరంలో (ప్లవ నామ సంవత్సరం శ్రావణ బహుళ తదియ ఆదివారం) హైదరాబాదులోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడింది.[2] ఇది తెలంగాణా ప్రాంతంలో మొదటి గ్రంథాలయం. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు కొమర్రాజు లక్ష్మణరావు. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు నాయని వేంకట రంగారావు, రావిచెట్టు రంగారావు గార్లు. అప్పటి పాల్వంచ రాజాగారైన పార్థసారధి అప్పారావు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి.నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు, కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.

భాషానిలయ భవనం

ఈ సంస్థ ప్రథమ గౌరవ కార్యదర్శి రావిచెట్టు రంగారావు. వీరు 1910లో స్వర్గస్థులు కాగా, వీరి స్థానంలో కర్పూరం పార్థసారధి నాయుడు కార్యదర్శిగా గ్రంథాలయానికి స్వంత భవనం నిర్మించాలని సంకల్పించారు. రంగారావు సతీమణి రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనడానికి 3,000 రూపాయలు విరాళం ప్రకటించారు. దానితో ఇప్పుడు సుల్తాన్‌బజార్ లో భాషా నిలయం భవనం ఉన్న చోటనే 1910లో ఒక పెంకుటిల్లు కొని, కొన్ని మార్పులు చేసి అందులో గ్రంథాలయం నెలకొల్పడం జరిగింది.

1915 సంవత్సరంలో ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధిచెందిన మాడపాటి హనుమంతరావు పంతులు కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత పాత ఇల్లు స్థానంలో కొత్త భవనం నిర్మించడానికి దీక్ష వహించారు. నాయని వెంకట రంగారావు, కర్పూరం పార్థసారధి, నాంపల్లి గౌరీశంకర వర్మ, లాల్ జీ మేఘ్‌జీల ఆర్థిక సహాయంతో నూతన భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి ప్రఖ్యాత విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి సెప్టెంబరు 30, 1921 తేదీన ప్రారంభోత్సవం చేశారు.[3]

ఉత్సవాలు

మార్చు

ఈ భాషా నిలయం జంట నగరాలకే కాక తెలంగాణ ప్రాంతపు ఆంధ్రులందరికీ కూడలి స్థలమైనది. ఉత్సవాలు, ప్రసంగాలు, సభలు, సమావేశాలు జరుపుకోవడానికి మంచి అవకాశం కలిగింది. చక్కని హాలులో సభలు జరిగేటప్పుడు స్త్రీలకు కొంతభాగం కేటాయించవలసి వచ్చేది. అందువలన హాలులో ఒక బాల్కనీ నిర్మించి మహిళలకు ప్రత్యేక వసతి కల్పించడం జరిగింది. శ్రీ కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవంతో ప్రారంభించి క్రమేణా నన్నయ, తిక్కన, పోతన, వేమన మొదలైన మహాకవుల జయంతి ఉత్సవాలను ప్రతియేట జరుపుతూ ఉండేవారు. ప్రాచీన కవులే కాక కందుకూరి, గురజాడ, గిడుగు, కొమర్రాజు వంటి ఆధునిక భాషా సేవకుల జయంతులు, వర్ధంతులు కూడా జరుపసాగారు. ఆంధ్రదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలలో నిష్ణాతులైన పండితులను, రచయితలను, కవులను ఆహ్వానించి, సన్మానాలు చేశారు.

భాషా నిలయం స్థాపన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రజతోత్సవాలను 1927 ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి అధ్యక్షతన జరిగాయి. అప్పటి గౌరవ కార్యదర్శి బూర్గుల రామకృష్ణారావు ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచిక ప్రచురించారు.

 
తెలంగాణాలో అతి పురాతన గ్రంథాలయం కృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయ భవనం

దీని స్వర్ణోత్సవాలు 1952 సెప్టెంబరు 1వ తేదీనుండి మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచికను ప్రచురించారు.

భాషానిలయ వజ్రోత్సవాలు 1962 సంవత్సరంలో వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన జరిగిన మూడు రోజుల ఉత్సవాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక విషయాలపై చర్చలు, గోష్ఠులు జరిగాయి. వజ్రోత్సవ సంచికను ప్రచురించారు.

భాషా నిలయపు అమృతోత్సవం 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో యావదాంధ్ర దేశం నుంచి వచ్చిన అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

శతాబ్ది ఉత్సవాలు 2002 సెప్టెంబరు 16వ తేదీన భాషా నిలయం ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ గ్రంథాలయంలో సుమారు 40,000 పైగా గ్రంథాలు, పత్రికలు సేకరించబడి సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నాయి. ఈ భాషా నిలయం నేటికీ సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తూ కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నది.

మూలాలు

మార్చు
  1. "Andhra Bhasha Nilayam demolished in The Hindu". Archived from the original on 2008-03-22. Retrieved 2009-12-16.
  2. వరంగల్ ముచ్చట. "తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది..." www.warangalmucchata.com. Retrieved 14 June 2017.[permanent dead link]
  3. "మన సాంస్కృతిక కూడలి". నమస్తే తెలంగాణ. ఆగస్టు 28, 2016. Archived from the original on 28 August 2016. Retrieved 29 August 2016.