శ్రీ పంచలింగ క్షేత్ర దర్శనం

            శ్రీ  పంచలింగ క్షేత్ర దర్శనం అనే గ్రంధాన్ని రచించిన గ్రంథ కర్త " చరిత్ర విద్యాధర " తురగా కృష్ణమూర్తి, బి.ఏ., శ్రీ మార్ఖండేయ మృకండేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఖండవల్లి గురించి వివరాలు ఈ మున్నుడిలో చదవండి.  సత్యసాయి - విస్సా నిలయం
          ఈ ప్రాచీన గ్రంధం త్వరలో పునర్ముద్రణ చేయబడుతోంది. శ్రీ తురగా కృష్ణకుమార్ గారు ఈ మహత్కర్యానికి పూనుకున్నారు. ఈ మహాయజ్ఞంలో మా విస్సా నిలయం ఉడతా పాత్ర పోషిస్తున్నది.  ఈ దిగువ మున్నుడిలో పేర్కొన్న వివరాలు ఈ ప్రాచీన గ్రంథ పిడిఎఫ్ రూపంలో లింక్ ఇవ్వబడినది. 
                                                                       
                                                                      ***  మున్నుడి  ***
             హిందూ ధర్మ శాస్త్ర ప్రకారము ప్రతి గ్రామములోను శివ కేశవుల ఆలయములుండుట సాంప్రదాయము. ఆ గ్రామము శైవ ప్రాధాన్యము కలిగి యున్న శివుడు క్షేత్రజ్ఞు డై శివుడు  క్షేత్రపాలకుడుగా నుండును . అది వైష్ణవ  ప్రాధాన్యం కలిగినదైన కేశవుడు క్షేత్రజ్ఞుడై శివుడు క్షేత్రపాలకుడై ఉండును. ఇట్లు శివకేశవులొకరినొకరు జంటవీడక గ్రామములందు నెలవు లేర్పరచుకొని సదా భక్తజనములకారాధ్య దేవతలై నెగడుచుందురు. గ్రామమును కాపాడుచు పొలమేరలయందు గ్రామ దేవత నుప్రతిష్టయై  యుండును. దీనికి భిన్నముగ నే గ్రామము యుండదు.
            
             ఆ సంప్రదాయానుసారమే  "ఉత్తరేశ్వరపురమని" ప్రాచీన కాలము నుండి పిలువబడుచున్న నేటి "ఖండవల్లి " గ్రామమున నాది నుండియు శ్రీ మార్ఖండేశ్వర మహాదేవుడు శ్రీ జనార్ధనవల్లభుడు  నెలవులేర్పర్చుకుని  క్షేత్రజ్ఞ క్షేత్రపాలక స్థానములందుండి పూజలనందు కొనుచున్నారు. శ్రీ మార్ఖండేశ్వర మహాదేవునకు తోడు "ఉత్తరేశ్వర మహాదేవుడు" సరి సామంతుడై నిలిచి ఆరాధనలందుకొనుచున్నారు. ఈ ప్రకారము క్రీ.శ. 1800 సంవత్సరము వరకు అనగా నేటికి సుమారు 700  సంవత్సరముల క్రిందటి వరకు నవిచ్ఛిన్నముగ కొనసాగుచు వచ్చినది. గోదావరి మండలము కాకతీయపాలన లోనికి వచ్చిన తర్వాత గూడ నీ ఉత్తరేశ్వర పురమా మువ్వురకు నునికిపట్టై విరాజిల్లినది. గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారు గ్రామ పొలిమేర సీమను నెలకొనియుండి గ్రామరక్షణ గావించుచు ప్రజల పూజలందుకొనుచు వచ్చుచున్నది. 
            కాలక్రమేణ గ్రామ నైసర్గిస్వరూపము మారి, అనేక మార్పులు సంభవించినవి. గ్రామస్థితములై యున్న శ్రీ జనార్ధనవల్లభుని ఆలయము శ్రీ ఉత్తరేశ్వర మహాదేవుని ఆలయములు శిధిలములై పోవుట సంభవించినది. 
                                                      
            అందున్న మూలవిరాట్టులు శ్రీ మార్ఖండేశ్వర దేవర ఆలయమునకు తరలింపబడి, ఆశ్రయభాగ్యము నందినవి. శ్రీ ఉత్తరేశ్వర మహాదేవుడు తదాది నామపరివర్తనమంది జనవాడుకలో శ్రీ మృకండేశ్వర మహాదేవునిగ ప్రసిద్ధిగనీనాడు శ్రీ మార్ఖండేశ్వర మహాదేవుని సరి సామంతునిగా నిలిచి, ఉచిత స్థానము నలంకరించినాడు. అభేద వ్యవసాయమున శ్రీ జనార్దనవల్లభుడు వారిరువుర సన్నిధానమున వారి ఆలయప్రాంగణమున నెలకొని యొక వింత సాంప్రదాయమును కల్పించినాడు.
            ఈ విధముగ నూరిలో గల క్షేత్రపాలకుడు శ్రీ జనార్ధనవల్లభుడు పరాశ్రయుడగుటతో గ్రామములో విష్ణ్వాలయము లేని పరిస్థితి యేర్పడినది. ఈ విపర్యాసమునకు స్థానికులు వగచి సంపన్న గృహస్థులు మంత్రిరావువారిని ప్రోత్సహించి శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయము నిర్మింపజేసి, అందు స్వామిని ప్రతిష్టింపజేసి, అంగరంగ వైభవముల కల్యాణాదిక ఉత్సవములకు వలయు యేర్పాటుజేసి సాంప్రదాయ రక్షణ గావించినారు.  శ్రీ వేణుగోపాలస్వామి ఆవిర్భావ సంబంధమగు యొక ఇతిహాసం పెద్దల వలన విననగుచున్నది. దాని నిప్పట్టున వివరించుట టప్రస్తుతము. గాన దానిని వివరింపక విడిచిపుచ్చుచున్నాను.
       
            కాకతీయవీరరుద్రుని సేనానులు సోమయాజులు రుద్రదేవుడు, ఇందులూరి అన్నలదేవుడు, చాళుక్య ఇందు శేఖరుడు " ఖండవల్లి " నామాంతరమున బరగుచున్న " ఉత్తరేశ్వరపురము "ను తమ గురువు వద్దనాచార్యులకు గురుదక్షిణగా దానమిచ్చి క్రీ. శ. 1289  - 90 వ సంవత్సరమున వ్రాయించిన శాసనములీ గ్రామమున లభ్యములై, గ్రామా పూర్వచరిత్రను విశదీకరించుచున్నవి.
          శ్రీ మృకండేశ్వర లింగముతో బాటు మరి మూడు లింగమూర్తులు శ్రీ మార్కండేశ్వరస్వామి ఆలయములో జేరుటతో నీ గ్రామము " పంచలింగ క్షేత్రమునా ప్రసిద్ధికెక్కినది. ఇట్టి విశేషమేచ్చటను గానరాదు అధిక మహిమోన్నతులు గల యీ "పంచలింగక్షేత్ర చరిత్ర" ను భక్తజనులు కందిచ్చుఉత్తమ లక్ష్యముతో రాజవంశాలంకారులు, వదాన్యులు, ఉదాత్తచరిత్రులు, భక్త శిఖామణులు నగు  శ్రీ భూపతిరాజుచివరహాలరాజు గారు వారి మిత్రులు శ్రీ వత్సవాయి వెంకట రాయపరాజుగారి  ప్రోత్సాహమున "చరిత్ర విద్యాధర " శ్రీ తురగాకృష్ణమూర్తి, బి. ఏ ., గారిచే వెలువరింపజేసి  తమ పితృపాదులు శ్రీ ఆంజనేయ రాజు వారి సతీమణి రాఘవయ్యమగార్లకు కృతి నిప్పించి ధన్యతగాంచిరి. వారాలకు శ్రీ మార్ఖండేశ్వర మృకండేశ్వర మహాదేవు డాయు రారోగ్యభోగభాగ్యముల నొసంగి సదా రక్షించుగాత.     
                                                                                                                            ఇట్లు,
 ఖండవల్లి                                                                                                       విన్నవించు బుధజన విధేయుడు,

ది. 22 -12-88 } M. ఆదినారాయణ, E . O.

                                                                                                          శ్రీ మార్ఖండేయ మృకండేశ్వర స్వామివార్ల దేవస్ఠానం.