శ్రీ శివకామేశ్వరీ కల్యాణం


శ్రీ శివకామేశ్వరీ కళ్యాణం అను లలితోపాఖ్యాన గ్రంథము రచన శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు

అంటరానివారు ఎవరు?
కృతికర్త: వడ్డూరి అచ్యుతరామ కవి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): ఖండకావ్యము
ప్రచురణ: 1983
విడుదల: 1983

1967-1968 సంవత్సరంలో రచించారు ఈ గ్రంథమును 29. 11.1969 సంవత్సరంలో జన్నవాడ శ్రీ కామాక్షితాయి దివ్య క్షేత్రంలో అమ్మవారికి అంకితం చేశారు.ఈ గ్రంథం పై శ్రీ కామాక్షి మల్లికార్జున స్వామి దేవస్తానం ధర్మ కర్త్రు సంఘాద్యక్షులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ గుఱ్ఱం సుబ్బరామయ్య గారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని 18 .౦8 .1969 అందించారు. అలాగే ఈ గ్రంథం పై శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు ఆంధ్రపత్రిక తెలుగు దిన పత్రికలో గ్రంథ సమీక్ష చేశారు.

ఓం ఐమ్ హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీగణేశ శారదా గురుభ్యోనమః

శ్రీయుత జన్నవాడయన జెల్వు ఘటిల్లు పురంబు నందు గా
త్యాయని గూడి భక్త వరదాయకుడై వెలుగొందు నిత్య శో
భాయుత మల్లికార్జునుడు భక్త జనైక వశంకరుండు సు
శ్రీయు జిరాయురున్నతులు జిత్సుఖముల్ దయ నిచ్చి బ్రోచుతన్ !

 శ్రీ కామాక్షి దయాస్వరూపిణి లసచ్చిద్వహ్ని సంభూత! క్రో
 ధా కారాంకుశ దీప్త చిన్మయి సముద్యత్కోటి భానూజ్వలన్
 రాకాచంద్ర నిభానన్ శివ మహారాజ్ఞిన్ గృపా భాసురన్
 లోకేసిన్ శరణంబు వేడెద దయాలోలన్ మమున్ బ్రోవగన్ !

 రాజకళాధరాయ!నాగరాజ సుతా హృదయేశ్వరాయ! గో
 రాజ తురంగమాయ! ఫణి రాజ మనోహర భూషణాయ! నీ
 రాజిత రాజమౌళి మణిరత్న సముచ్చయ పాదుకాయ! నీ
 రేజ భవార్చితాయ! హర ! ఋగ్వినుతాయ!శివా! నమో స్తుతే !


 కమనీయ గగన గంగా తరంగ విలాస
  భాస్వజ్జటా జూట భాసు రాయ!
 మహనీయ మాణిక్య మనోహర లస
  ద్భోగీంద్ర భూషణ భూషితాయ
 కాలానలాభీల కీలోగ్ర మాలికా
  లులిత కుంతల ఫాల లోచనాయ
 శిశిర శీతల సుధాశీకర సీతాంశు
  ఖండ మండిత జటా మండలాయ !
 పాండురాంగాయ పూల విబ్రాజితాయ
 మల్లికార్జున దేవాయ మంగళాయ
 అచ్యుతార్చిత పాదాయ అవ్యయాయ
 ఓం నమ శంకరాయ మృత్యుంజయాయ!


 శ్రీ మద్యజ్ఞ పురీశ్వరి
 కామేశ్వరి కల్పవల్లి కళ్యాణమయీ
 కామేశ్వరాంకవాసిని
 కామాక్షీ కోమలాంగి గౌరీ మహేశీ !!


తల్లీ ! అవధరింపుము తొల్లి నైమిశారణ్యమున దీర్ఘ సత్ర యాగమొనర్చు ఋషి పుంగవులెల్లరు యాగ కార్య కలాపానంతరము పవిత్ర కార్యంబుల కాలము గడుపువారై పురాణ శ్రవణంబ పేక్షించి నిఖిల పురాణ పారాయణ వ్యాఖ్యాన కళా దురీణుండగు సూత మహర్షిని గాంచి యిట్లనిరి ..పౌరాణిక శిరోమణీ! దక్షాధ్వరంబున సతీ దేవి తండ్రి చే నవమానింపబడి యోగ శక్తి పరిత్యక్త దేహయై యనంతరమేమయ్యే ? ఆమె వృత్తాంతము వివరింపవే యని, సతీవియోగ దుఃఖతప్త హృదయుండగు శంకరుండే విధంబున ప్రవర్తించే ? నెందేగే ?, మాకొక్క సందియము ఉంది. అదేమన లలితాంబ ఎవ్వరు?పార్వతి యన నెవ్వరు?శ్రీ మహావిష్ణువు పరమేశ్వరునకు కన్యా దానమిచ్చిన సంఘటన ఎట్టిది? పార్వతీ కళ్యాణ గాథకు, కామేశ్వరీ కామేశ్వరుల పరిణయంబునకు కథా విధానము లెట్టివి ?పార్వతి కళ్యాణ గాథకు కామేశ్వరీ కామేశ్వరుల పరిణయంబునకు కథా విధానము లేట్టివి? ఆ పురాణ దంపతుల దివ్య లీలలు వివరంబుగా విన దలతుము వచింపుడని ప్రార్థించిన యా సూత మహర్షి శౌనకాది మహర్షుల కిట్లనియె. ఓ మహాశయులారా! అతి రహస్యము అవాజ్మానస గోచరము వాగాతీతమునగు మహా మాయా శక్తి విచిత్ర చరిత్ర యభివర్ణింప గోరితిరి ఇది నావంటి వానికి శక్యమా?

 దేవీ మహిమలు లీలలు
 భావింప వచింప వశమే? బ్రహ్మాదులకున్ !
 నావంటి వాని తరమె?
దేవముని ప్రవరులార ధీవరులారా !

అని పలికి యా జగన్మాత లలితా పరమేశ్వరీ పాదారవిందములు ధ్యానించుచు ముకుళీకృత కరకమలుండై కనుల నానంద బాష్పములు జలజలరాల పరవసుండై సూతుండా జగన్మాత నిట్లని వినుతించె.

శా. శ్రీ కామాక్షీ క్రుపాకరి శుభకరీ శ్రీ రాజరాజేశ్వరీ!
 లోకాధీశ్వరి శాంకరీ వర కృపా లోకేక్షణా శాంభావీ
 రాకాచంద్ర సహస్ర సుందరీ లసద్రంమ్యాననా పావనా!
 ఓ కళ్యాణ గుణాలయా!భగవతీ! ఓడ్యాణ పీటస్తితా !

ఉ. చారు సువర్ణ చక్రమున జంద్రకళా కమనీయ మూర్తివై
 శారదా భార్గవీ సతులు జామరముల్ వెస వీచుచుండ, బా
 లారమణీ మనోహర కలస్వన నందితలైన తల్లి సౌ
 కారిణి సర్వదేవ నుత కల్పలతా మహేశ్వరీ!
 

అని అనేక విధముల నా జగన్మాత లలితా పరమేశ్వరిని రాజరాజేశ్వరీ మహా రాజ్యలక్ష్మిని సర్వ జగదీస్వరిని సంస్తుతు లోనర్చి దేవీ కృపా సంవర్ధిత వాగ్వైభవుండయి యా జగజ్జననీ దివ్య కళ్యాణ చరిత్ర నిట్లు చెప్పా దొడంగె. తొల్లి పట్టసాచల క్షేత్ర మాహాత్మ్యము వివరించుచు ప్రహ్లాదునకు, దత్తాత్రేయుల వారిచే చెప్పబడిన దక్షయజ్ఞ వృత్తాంతము, సతీ దేవి దేహ త్యాగము, రుద్ర తేజోద్భవుడగు వీరభద్రుని వీర విహారము, దక్ష శిరచ్చేదము, సుర గర్వభంగము జరిగించిన యనంతరము దేవముని ప్రార్దితుడై వీరభద్రుడు లింగాకారము ధరించుట భద్రకాళి యావిర్భవించి వీరభద్రుని సన్నిధిని వసించి భక్త రక్షణ గావించుట మున్నగు వృత్తాంతములు వివరించి వీరభద్రుని పట్ట సాయుధముచే నంతకు పూర్వము దేవకూటమని పిలువబడు నా యద్రిరాజము పట్టసాద్రియని పట్టసాచల మనియు (నేటి పట్టిసీమ) ప్రముఖ శివ క్షేత్రమై విరాజిల్లు ఆ క్షేత్ర చరితము వివరించితిని గదా! ఈ శివ కామేశ్వరీ కళ్యాణములో 1) శ్రీ గౌరీ కళ్యాణము శ్రీ లలితా కళ్యాణ వివరములు 2) ప్రాణ రహిత సతీ దేహమును విష్ణువు ఖండ ఖండము లోనర్చుట అవి దేవీ పీఠములగుట 3) అష్టాదశ పీఠములు 4) సతీ దేవి మేనకా హిమవంతులకు పుత్రికగా పుట్టుట 5) అంబికా స్తవము 6) తారకాసురుని బాధలు దేవతలు విష్ణువునకు విన్నవించుట 7) ఈశ్వరుని కడకు మన్మధుడు దండు వెడలుట 8) రతీ మన్మధ సంవాదము 9) కామదహనము 10) మన్మధుడు భస్మ మగుటకు కారణము, భండాసురుడు పుట్టుట 11) కామ ప్రళయ వర్ణనము, భండాసుర విజ్రుంభణ 12 ) మహేశ్వరుడో నర్చిన మహా యాగ విధానము 13) శ్రీ లలితా దేవి యావిర్భావము 14) శ్రీ శివకామేశ్వరి కళ్యాణ ఘట్టము 15) భండాసుర సంహార ఘట్టము 16) శ్రీ లలితాంబ స్తుతి, మన్మధుని తిరిగి దేవి బ్రతికించుట,17) గౌరి కళ్యాణ ఘట్టము, 18) వారాహి శ్యామలా స్తోత్రము,19) శ్రీ మహా కామేశ్వరి కామేశ్వరుల స్తోత్రము,2౦) శ్రీ సూర్యనారాయణ మూర్తి స్తోత్రము నక్షత్ర మాలిక మొదలగు ఘట్టములు ఉన్నాయి. ఈ శ్రీ శివ కామేశ్వరి కళ్యాణము గ్రంథము పై శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు వ్రాసిన గ్రంథ సమీక్ష అంధ్ర పత్రిక తెలుగు దినపత్రికలో ఉంది.

మూలాలు, బయటి లింకులు మార్చు