మహదేవ్ వామన్ సపత్మేకర్

మహదేవ్ వామన్ సపత్మేకర్ అక్కల్ కోటలో నివసిస్తూ ఉండేవాడు . అతడు న్యాయవాది . అతని తండ్రి దినకర్ సపత్నేకర్ దత్తస్వామి భక్తుడు . తరచుగా అతడు గాణ్గాపూర్ దర్శిస్తూ ఉండేవాడు . ఒకసారి అతడు జీవితం పై విరక్తి కలిగి నదిలో దూకాడు . దత్తస్వామి అతనిని రక్షించి అక్కల్ కోట స్వామిని సేవించుకోమని ఆదేశించారు. అప్పటి నుంచి ఆ కుటుంబంలోని వారంతా శ్రీ స్వామి సమర్ధను సేవించుకునేవారు .

మహదేవ్ వామన్ సపత్నేకర్ తన భార్య, ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో చాలా బాధపడ్డాడు . వంశం నిలబెట్టుకోవడం కోసం మరల వివాహం చేసుకున్నా అతనికి పిల్లలు కలుగలేదు . అతని మామగారు అతనిని బాబాను దర్శించమని, ఆ సద్గురువు అతనికి కోరిక తీర్చగలరనీ చెప్పారు . అయినా అతడు సాయిని దర్శించ దలచలేదు . 1913 లో తన తండ్రి ప్రోద్భలంతో బాబాను దర్శించాడు . కానీ బాబాకు నమస్కారం చేసుకోబోతూ ఉండగానే ఆయన సపత్నేకర్ ను బలంగా తోసేసి, "బయటకు ఫో !" అని గర్జించారు . ఆ విసురుకు అతని తలపాగా ఎగిరి దూరాన పడింది . అతడు ఓర్పుగా ఆయన దర్శనం కోసం ప్రయత్నించినా బాబా కోపం తగ్గలేదు . అతడు నిరాశ చెంది తిరిగి అక్కల్ కోట వెళ్ళిపోయాడు .

ఒకరోజు సపత్నేకర్ భార్యకు స్వప్నంలో ఒక ఫకీరు కనిపించారు . ఆమెకు సాయిని దర్శించాలని తీవ్రమైన కోరికగా ఉండేది . అందుకనే ఆ స్వప్నం వచ్చిందని చెప్పి అతని తండ్రి ఆమెను శిరిడీ తీసుకెళ్ళమని చెప్పారు . అతడామెను తీసుకుని శిరిడీ చేరాడు .

శిరిడీ చేరగానే లెండీ తోట దగ్గర వారికి బాబా కనిపించారు . ఆయనను చూడగానే ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది . ఎందుకంటే తనకు కలలో దర్శనమిచ్చిన ఫకీరు బాబాయే ఆమెను చూడగానే, "అమ్మా నా కడుపులోను, నడుములోను చాలా నొప్పిగా ఉంది "అన్నారు . కొంతకాలానికి ఆమెకు కడుపునొప్పి, నడుము నొప్పి వచ్చి తగ్గిపోయాయి . బాబా తన బాధను స్వీకరించి తనను రక్షించారని ఆమెకు అర్ధమైంది . ఆమె హృదయం భక్తి కృతజ్ఞతలతో నిండిపోయింది .

ఈసారి కూడా సపత్నేకర్ ను బాబా మసీదులోనికి రానివ్వలేదు . కానీ అతని భార్యను ఆశీర్వదించి పిడికిలి నిండా ఊదీ ప్రసాదిస్తూ, "తల్లీ నీకెంతమంది బిడ్డలు కావాలంటే అంతమందినిస్తాను "అన్నారు . బాబా కరుణకు వారంతా పులకించారు . తనకు బాబా ఆశీస్సులను యిచ్చేదాకా శిరిడీలోనే ఉండాలని సపత్నేకర్ నిర్ణయించుకున్నాడు .

ఒకరోజు మసీదు ముందటి రాయిమీద సాయి ఒక్కరే కూర్చుని ఉన్నారు . అదే మంచి అవకాశమని తలచి సపత్నేకర్ పరుగున ఆయన దగ్గరకు వెళ్లి ఆయన పాదాలు పట్టుకుని తన తప్పులను క్షమించమని, తనను ఆశీర్వదించమని ప్రార్థించాడు .. అతడి భక్తికి బాబా మనస్సు కరిగింది . ఆయన సపత్నేకర్ తల నిమిరి, ఆశీర్వదించి తమ దగ్గరగా కూర్చోబెట్టుకున్నారు . అక్కడికి వచ్చిన ఒక భక్తురాలికి సపత్నేకర్ ను చూపిస్తూ "చనిపోయిన ఇతను కొడుకును మళ్ళీ ఇతనికే ప్రసాదిస్తాను "అన్నారు . సపత్నేకర్ ఎంతో సంతోషించాడు . ఆరతికి సకుటుంబంగా హాజరయ్యాడు . ఆ తర్వాత నివేదనకు హల్వా చేయించాడు సపత్నేకర్ . ఆరతి తర్వాత ఎన్ని నివేదనలు ఉన్నా వీరి నైవేద్యాన్నే ఎంతో ప్రీతిగా ఆరగించారు బాబా . ఆ తర్వాత వారంతా మరునాడు జరిగిన చావడి ఉత్సవంలో పాల్గొన్నారు .

తర్వాత రోజు వారంతా అక్కల్ కోటకు తిరుగు ప్రయాణమయ్యారు . సపత్నేకర్ తన భార్యతో, "బాబాకు ఒక రూపాయి దక్షిణగా సమర్పిస్తాను . కానీ ఆయన ఎక్కువ దక్షిణ అడిగినట్లయితే నా బంగారు ఉంగరము, నీ గాజులూ అమ్మి ఆయనకు దక్షిణ యిద్దాము "అన్నాడు . బాబాకు నమస్కరించగానే ఆయన రెండు రూపాయలు మాత్రమే దక్షిణగా స్వీకరించి, "దక్షిణ ఇక చాలు, లేకపోతే నీ బంగారు ఉంగరము, నీ భార్య గాజులూ నీవు అమ్ముకోవాలి గదా !"అన్నారు . సాయి సర్వజ్ఞులని వారికి అర్ధమైంది .

బాబా ఆశీర్వచనం ఫలించి వారికి ఒక సంవత్సరంలోనే కొడుకు జన్మించాడు . సపత్నేకర్ దంపతులకు మొత్తం ఎనిమిది మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించారు . వారు మంచి బాబా భక్తులై జీవితాంతం ఆయనను సేవించారు .

"https://te.wikipedia.org/w/index.php?title=సపత్నేకర్&oldid=2622763" నుండి వెలికితీశారు