సమదర్శిని
సమదర్శిని జస్టీస్ పార్టీ ప్రచార పత్రిక. ఇది 1927లో స్థాపించబడింది. ఈ పత్రిక కొంత కాలం ద్వైవార పత్రికగా, మరికొంత కాలం దినపత్రికగా వెలువడింది. పింజల సుబ్రహ్మణ్యము శెట్టి ఈ పత్రికకు ప్రచురణ కర్తగా, సంపాదకుడిగా ఉండేవాడు. ఈ పత్రిక వెల ఒక అణా, వార్షిక చందా 5 రూపాయలు (పోస్టేజీ కలుపుకుని)గా ఉండేది. సమదర్శిని రెండవ ఉగాది సంచిక (1919-20)లో ప్రచురించిన ప్రకటనలో "ప్రతి బుధ శనివారములయందు ప్రకటింపబడు ప్రజాహిత పత్రిక"గా పేర్కొన్నారు.[1] ఇదే ప్రకటనలో ఈ క్రింది విధంగా ఉంది.
రకం | ద్వైవార పత్రిక/దినపత్రిక |
---|---|
ప్రచురణకర్త | పింజల సుబ్రహ్మణ్యము శెట్టి |
ప్రధాన సంపాదకులు | పింజల సుబ్రహ్మణ్యము శెట్టి |
సంపాదకులు | గానాల రామ్మూర్తి, గూడవల్లి రామబ్రహ్మం, మరుపూరు కోదండరామిరెడ్డి, తాపీ ధర్మారావు నాయుడు |
స్థాపించినది | 1927 |
రాజకీయత మొగ్గు | జస్టీస్ పార్టీ |
భాష | తెలుగు |
ముద్రణ నిలిపివేసినది | 1934 (?) |
కేంద్రం | సర్. త్యాగరాయ మెమోరియల్ బిల్డింగ్స్, నెం.14, మౌంటు రోడ్డు, మద్రాసు |
నగరం | మద్రాసు |
దేశం | భారత దేశం |
ఆంధ్ర బ్రాహ్మణేతర సంఘాభ్యుదయము నర్థించి రాజకీయ, మత, సాంఘిక, నైతిక, విద్యా, పారిశ్రామికాది సమస్త విషయములను చర్చించు ద్వైవార పత్రిక.
ఇందు చిత్రములతో గూడిన స్వదేశ వార్తలును, తమాషాలును, చిన్న కథలును మున్నగునవి ప్రచురింపబడుచుండును. వివిధ రాజకీయ పక్షాభిప్రాయముల నిర్మొగమాటముగ నిష్పాక్షికముగ విమర్శించుచు సత్వర స్వరాజ్య సమూపార్జనకు దారిచూపు పత్రికయిదియే.
ఇందలి విషయము లమోఘములు, అభిప్రాయములు నిష్పాక్షికములు, శైలి కడుసులభము. చందా రుసుము అతిస్వల్పము.
వ్యాపారాభివృద్ధి నభిలషించువారీ పత్రికయందు ప్రకటనలను గావించినయెడల మంచి లాభమును పొందగలరు.
విశేషాలు
మార్చుఈ పత్రిక సంపాదకవర్గంలో గానాల రామ్మూర్తి, గూడవల్లి రామబ్రహ్మం, మరుపూరు కోదండరామిరెడ్డి మొదలైనవారు పనిచేశారు. మరుపూరు కోదండరామిరెడ్డి తరువాత 1930 జూన్ నెలలో తాపీ ధర్మారావు నాయుడు ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు.[2] తాపీ ధర్మారావుతో పాటు ఈ పత్రికలో ఎస్.జి.ఆచార్య, ఎమ్.జి. గోపాలనాయుడు తదితరులు పనిచేశారు. ఉగాది సంచికలను వివిధాంశాలతో, ప్రముఖ పండితుల వ్యాసాలతో, ఉన్నత ప్రమాణాలతో ఈ పత్రిక ప్రకటించింది. తాపీ ధర్మారావు సంపాదకునిగా ఉన్న కాలంలో ఈ పత్రికలో దండి సత్యాగ్రహం గురించి చిత్రాలలతో సహా బాగా ప్రచారం కల్పించారు. ఈ పత్రిక గ్రాంథిక భాషను ఉపయోగించేది. తాపీ ధర్మారావు మొదటి గ్రాంథిక భాషనే ఉపయోగించినా నెమ్మదిగా శిష్ట వ్యావహారిక భాషలోనికి ఈ పత్రికను తీసుకువచ్చాడు.
జస్టీస్ పార్టీ ప్రచార వేదికగా ఈ పత్రిక పనిచేసినా సాహిత్య పరమైన మౌలిక రచనలు ఎన్నో దీనిలో అచ్చయ్యాయి. గుడిపాటి వెంకట చలం వ్రాసిన రెడ్డి రంగమ్మ, సామినేని ముద్దుకృష్ణ రచనలు అనేకం, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, పురిపండా అప్పలస్వామి, మంగిపూడి వేంకటశర్మల కవిత్వము, సురవరం ప్రతాపరెడ్డి, చింతా దీక్షితులు, పి.వి.రాజమన్నారుల కథలు, ఉన్నవ లక్ష్మీనారాయణ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గార్ల వ్యాసాలూ ఈ పత్రికలో వచ్చాయి. ఈ పత్రికలో తాపీ ధర్మారావు నాయుడు 1932లో "పారిజాతాపహరణం - భావప్రకాశిక" అనే రచనను ధారావాహికగా ప్రచురించాడు.[2] అనేక విషయాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను కూడా ప్రచురించేవారు.
మూలాలు
మార్చు- ↑ పింజల సుబ్రహ్మణ్యము శెట్టి (1929). "సమదర్శిని రెండవ ఉగాది సంచిక". సమదర్శిని. Retrieved 19 February 2025.
- ↑ 2.0 2.1 ఏటుకూరి ప్రసాద్ (1989). తాపీ ధర్మారావు జీవితం - రచనలు (1 ed.). హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ISBN 81-7098-156-5. Retrieved 19 February 2025.