సమ్మక్క-సారక్క


నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకునేవారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించేవారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. ఈ సమయములో ఓరుగల్లు రాజధానిగా క్రీ.శ.1083 నుండి క్రీ.శ.1323 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరువూదుడు పరిపాలించాడు. మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అదృశ్యమైనది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు అదే మేడారం [1].మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మలకు ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు. గద్దెలు నిర్మించి, వాటికి ఒక కర్ర నాటి ఉంటుంది. వీటిని ‘సమ్మక్క, సారలమ్మల గద్దెలు’ అంటారు.

  1. సమ్మక్క సారక్క జాతర