సమ్మెట ఉమాదేవి ప్రముఖ వర్థమాన కథా రచయిత్రి.

జీవిత విశేషాలుసవరించు

1961 ఆగస్టు 17న వరంగల్‌లో జన్మించారు. తల్లి లక్ష్మీ తులసీబాయి తండ్రి సమ్మెట పోతరాజు, వీరు కూడా మంచి సాహిత్యాభిలాష కలిగిన వాళ్ళు. వారి ఐదుగురు సంతానంలో ఉమాదేవి మూడో బిడ్డ. కార్మికశాఖలో పని చేసే ఈమె తండ్రికి తరచూ బదిలీ అవుతుండేది. దాంతో ఉమాదేవి చదువు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కొనసాగింది. ఇంట్లో మేనమామకు, తల్లిదండ్రులకు తరచూ సాహితీ చర్చలు జరుగుతుండేవి. అలా ఆమెకు సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. వారి చర్చల్లో రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచన, మాలతీ చందూర్‌, సినారే ఇలా ఎందరి రచనల గురించో ఆమె వినేవారు. ఏడో తరగతి చదువుతున్న ఉమాదేవి అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొంత కాలం చదువుమానేశారు. ఆ సమయంలోనే సాహిత్యాన్ని విస్తృతంగా చదివి స్నేహితురాలైన అనురాధతో చర్చించే వారు. టీనేజ్‌లో 'అంపశయ్య' నవల ఆమెను ఎంతో ఆకర్షించింది.

సాహిత్యమే కాదు సంగీతమన్నా తనకు చాలా ఇష్టం. రేడియోలో వచ్చే తెలుగు, హిందీ పాటలు వింటూ, తానూ పాడుతుండేవారు. పాఠశాలలో కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలల్లో పాల్గొని బహుమతులు సాధించేవారు. తర్వాత కొత్తగూడెంలో పదో తరగతి పూర్తి చేసి ఖమ్మం జిల్లా లోని ఆంధ్రా గర్ల్స్‌ కాలేజీలో ఇంటర్‌ చేశారు. ఆ తర్వాత తండ్రికి మంచిర్యాలకు బదిలీ కావడంతో అక్కడే డిగ్రీ పూర్తి చేసారు. అప్పుడే జాతీయ తెలుగు కథానికల పోటీల్లో కూటి కోసం అనే కథకు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఆ తరువాత ఆంధ్ర పత్రికలో పైలం కొడుకో అనే ఆమె కథ ప్రచురించారు. తన తొలి ప్రచురిత కథ ఇదే. ఆ తరువాత అనేక పత్రికల్లో ఆమె కథలు ప్రచురితమయ్యాయి. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఓ ప్రయివేట్‌ ఉద్యోగితో వివాహం అయ్యింది. వెంటనే కవల పిల్లలు, ఆ తర్వాత మరో పాప పుట్టారు. దాంతో దాదాపు నాలుగేండ్ల పాటు ఆమెకు పిల్లల పెంపకంలోనే గడిచి పోయింది . తర్వాత మహబూబ్‌ నగర్‌లో బీఎడ్‌ చేసారు. అయితే మూడో పాప అనారోగ్యం వల్ల వెంటనే ఉపాధ్యాయ వృత్తిలో చేరలేకపోయారు. 

'నడుస్తున్న చరిత్ర' పత్రికకు రెగ్యులర్‌గా రాస్తుండేవారు. అదే సమయంలో అమ్మతల్లి, బతుకమ్మ అనే ఆమె కథలకు పాఠకులు, రచయితల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఆమె ఏమి రాసినా అందులో అంతర్లీనంగా అమ్మ కనిపించేది. ఈ కథలేవి ఆమె పని గట్టుకుని రాసినవి కాదు. ప్రతి కథ అనుకోకఓుండా వచ్చినదే. మన కుటుంబాల్లో అమ్మ ఉన్నంత సహజంగా మరే అనుబంధం ఉండదు. మన సమాజాన్ని అమ్మనే నిలబెడ్తున్నంత వాస్తవంగా అమరి పోయిన రచనలు ఆమెవి. అందుకే ఓ రచయిత ఇచ్చిన సలహాతో అమ్మ కథలు అనే తన తొలి కథల సంకలనం ముద్రించారు. తర్వాత నలుగురు రచయితలు కలిసి ఒక్కొక్కరూ నాలుగు కథలను తీసుకొని మరో పుస్తకం ప్రచురించారు. అమ్మకథలు' పుస్తకంపై ఓ రీసర్చ్‌ స్కాలర్‌ ఎంఫిల్‌ చేశారు. ఇందులోని కొన్ని కథలు హిందీలోకి, మరాఠీలోకి కూడా అనువాదమయ్యాయి.

చిన్నపాప ఆరోగ్యం కాస్త కుదుటపడిన తర్వాత 1998లో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని కాచారం అనే ఓ మారుమూల పల్లెలో ఉపాధ్యాయినిగా చేరారు. కాకులు దూరని కారడవి అది. అక్కడకు వెళ్ళాలంటే ఆరు కిలో మీటర్లు నడవాల్సిందే. దాంతో ఉమాదేవి ఆ పల్లె బడిలోనే నివాసముండేవారు. అక్కడే ఎన్నో జీవితాలను ఆమె దగ్గరగా చూశారు. గర్భిణులు, పిల్లలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలను పోగొట్టుకునేవారు. ఇలా తన కండ్ల ముందే జరిగిన ఎన్నో సంఘటనలు ఆమె మనసుని కలచివేశాయి. ఎటువంటి సదుపాయాలు లేని ఆ పల్లెలో ఉమాదేవి ఎంతో చురుగ్గా పనిచేసేవారు. బడి పిల్లలకోసం ఎన్నో పాటలు రాసేవారు. సారే జహాసే అచ్చా"," హిందూ దేశికీ నివాసి", "హోంగే కామ్‌ యాబ్‌ అనే హిందీ పాటలను తెలుగులోకి అనువదించారు. ఇలా ఎంతో చురుగ్గా పనిచేస్తున్న ఈమెను గమనించిన అధికారులు గర్ల్‌ చైల్డ్‌ ఆఫీసర్‌గా డిప్యుటేషన్‌ పోస్ట్‌ ఇచ్చారు. ఆ సమయంలోనే జిల్లాలోని మారుమూల మండలాలన్నీ పర్యటించారు. అప్పుడే గిరిజనుల జీవితాలకు మరింత దగ్గరయ్యారు. 

ఆ తరువాత మధిర బాలికోన్నత పాఠశాలలో ఎనిమిదేండ్ల పాటు పనిచేసారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో పాపులర్‌ ఛానెల్‌లో న్యూస్‌ రీడర్‌గా కూడా పనిచేసారు. ఉత్తమ న్యూస్‌ రీడర్‌గా అవార్డ్‌ అందుకున్నారు. తర్వాత ముత్యాలంపాడు అనే గిరిజన ప్రాంతానికి వెళ్ళారు. గతంలోని పనిచేసిన చోట ఎదురైన అనుభవాలు, ఇప్పటి అనుభవాలు కలిపి ఓ కథల సంకలనం తెచ్చారు. అదే రేలపూలు. గిరిజనుల స్థితిగతులు, ఆచారాలు, కష్టాలు, కన్నీళ్ళు ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. నా కథలు కల్పితం కాదు. వాస్తవాలు, నేను చూసిన నా అనుభవాలు. మా పిల్లలు, మా తండాలు, మా ఊరి గురించి రాసిందే రేల పూలు అంటారు ఉమాదేవి. శ్రీవసంతగారు 'అమల్‌తాస్కా ఫూల్‌' అనే పేరుతో హిందీలోకి అనువదించారు.

చిన్న పిల్లలంటే ఆమెకు చాలా ఇష్టం. ఇంకా మూడేండ్లల్లో రిటైర్‌ కాబోతున్నారు. ఈ సమయంలో అన్నింటికీ అనుకూలంగా ఉండే మంచి ఉన్నత పాఠశాల‌లో అవకాశం వచ్చినా మారుమూల ప్రాంతంలో ఉంటే అప్పర్‌ ప్రైమరీ పాఠశాల‌ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలంలోని భాసిత్‌నగర్‌లో పనిచేస్తున్నారు. పని చేసేది ఎక్కడైనా ఆమె దృష్టంతా పేద పిల్లలపైనే. పనిచేస్తున్న పాఠశాలల్లో పేద విద్యార్థులకు తన స్నేహితుల సహకారంతో వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నారు.  ఉమాదేవి కొన్ని హాస్య కథలు కూడా రాసి బహుమతులు తెచ్చుకున్నారు. ఇంకా ఆమె బాలసాహిత్యంపై ఐదు కథల పుస్తకాలు రాశారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు