సాక్షి వ్యాసాలు

తెలుగు వ్యాసాలు
(సాక్షి (వ్యాసాలు) నుండి దారిమార్పు చెందింది)

సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడా చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడా అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడా కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన[1] పానుగంటి స్పెక్టేటర్ క్లబ్[2] తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.

2006లో ముద్రింపబడిన సాక్షి వ్యాస సంపుటి పుస్తక ముఖచిత్రం

సాక్షి వ్యాసాల ప్రచురణ, పునర్ముద్రణ

మార్చు

సాక్షి వ్యాసాల రచన 1913లో ప్రారంభమైంది. పానుగంటి లక్ష్మీనరసింహారావు అల్లుడు ద్రోణంరాజు వెంకటరమణారావు తణుకు నుండి నడిపిన "సువర్ణ లేఖ" (1905 - 1907) [3] అనే పత్రికలో సుమారు 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కొంత అంతరాయం తరువాత 1920 సెప్టెంబరు నుండి రెండు సంవత్సరాల పాటు ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధంలో 82 వ్యాసాలను వారం వారం ప్రచురించారు. 1922 సెప్టెంబరు నుండి 1927 సెప్టెంబరు వరకు మళ్ళీ కొంత అంతరాయం కలిగింది. 1927 తరువాత 1928 మార్చి వరకు మరల ఆంధ్ర పత్రికలోనే పది వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 1933 మార్చిలో మళ్ళీ పునఃప్రారంభమై 20 వ్యాసాలు వచ్చాయి. పానుగంటి సాహిత్యంపై విశేష కృషి చేసిన ముదిగొండ వీరభద్రశాస్త్రి మొత్తం 140 వ్యాసాలున్నాయని చెప్పాడు. ... అయితే ప్రస్తుతం సాక్షి వ్యాసాల సంఖ్య 148గా కనిపిస్తున్నది. పత్రికకు సాక్షి వ్యాసాల పునరుద్ధరణకు వ్రాసిన లేఖలను కూడా వ్యాసాలుగా పరిగణించడం వలన, వివిధ సందర్భాలలో పానుగంటివారు స్వయంగా చేసిన ఉపన్యాసాలను కూడా కలపడం వలన వ్యాసాల సంఖ్య 148కి చేరింది.[4]

మొట్టమొదట వీటిని పిఠాపురం రాజా ముద్రింపించాడు. తరువాత వావిళ్ళవారు 1964-66 లలో ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఆ తరువాత, 1990లలో 3 సంపుటాలుగా ఒకసారి, 2 సంపుటాలుగా విజయవాడ అభినందన పబ్లిషర్స్ చే ప్రచురించబడినాయి. మూడు సంపుటాలుగా వెలువడిన సంపుటాలకు ముందుమాట, రచయిత, ఆకాశవాణి కళాకారుడు అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కుమారుడు) వ్రాశాడు. 2006లో విజయవాడ "అభినందన పబ్లిషర్స్" అన్ని వ్యాసాలను ఒకే సంపుటిగా ముద్రించారు. ఈ కంబైన్డ్ ఎడిషన్‌లో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పీఠిక, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వివరణ, నవతరం పాఠకుల కోసం ప్రతి వ్యాసానికి నండూరి రామమోహనరావు పరిచయాలు ఉన్నాయి.

సాక్షి సంఘము

మార్చు

ఊహాజనితమైన ఈ సంఘం సమాజంలోని దురాచారాలను చర్చించి నిశితంగా విమర్శించే సంఘం. దాదాపు వ్యాసాలన్నీ కూడా సాక్షి సంఘ సమావేశాలలో సంఘ సభ్యుడు జంఘాలశాస్త్రి చెప్తూండగా చదువరులకు తెలియుచేయబడుతాయి. కొన్ని సందర్భములలో కాలాచర్యుడో లేక వాణీదాసుడో ఎక్కడీకో వెళ్ళి అక్కడ తాము చూసిన విషయాలను లేఖద్వారా సంఘమునకు తెలియుపరుస్తారు, ఆ లేఖ చదువటం ద్వారా ఆ వ్యాసవిశేషాలు చదువరులకు తెలుస్తాయి.

సంఘం ఆశయాలు

"సాక్షి సంఘ నిర్మాణము" అనే మొదటి వ్యాసంలో ఆ సంఘం ఆశయాలు ఇలా చెప్పబడ్డాయి. రాజకీయ దండనము లేని నేరములకు - మనుజుల మాయాప్రచారములకు - సంఘదూషణ మావశ్యకమై యుండదా? ముఖ్యముగ నుండును. ఉండక తప్పదు. ఇట్టి నేరముల గూర్చియే మేమిక వ్రాయుచుందుము. నేరముల వెల్లడింతుము. వాని స్వభావముల విశదపరతుము. వానివలన సంఘముకు గల్గు హానిని స్పష్టపఱతుము. వానియందు జనుల కసహ్యము గల్గునట్లు సేయుటకై ప్రయత్నింతుము. నేరములనే మేము నిందింతుము . కాని యట్టి నేరములకు లోనయిన వారిని నిందింపము. వారినిఁ దలపట్టనైన దలపెట్టము. మాకు వారితో లేశమును బనిలేదు. ఇంతియేగాక మత విషయములను గూర్చియు, నారోగ్య విషయములను గూర్చియుఁ, గవితాద్యభిరుచి ప్రధానశాస్త్రములను గూర్చియు, సంఘదురాచారముల గూర్చియు, విద్యాభివృద్ధి సాధనముల గూర్చియు, జరిత్రాద్యంశములఁ గూర్చియు, రాజభక్త్యాదులఁ గూర్చియు, నావశకములని మాకు దోచిన యింక గొన్ని యితరాంశములను గూర్చియు వ్రాయుచుందుము. .. నేను, మరి నలుగురుఁ గలసి యొక చిన్న సంఘముగఁ జేరినాము. మీ రైదుగురుఁ జేరి, యిట్టి మహా కార్యము సేయగలరా? యని మీరడుగుదురేమో? ఉడుతలు దధినిఁ బూడ్చినట్లు చేసెదము. ... మేము ప్రతిరాత్రియు నొకచోఁ జేరుదుము. ఇప్పటి వరకు మాకు సొంత భవనము లేకుండుటచే నద్దె యింటిలోఁ జేరుదుము.

సాక్షి సంఘ సభ్యులు
  1. కాలాచార్యుడు : ఇతడు శ్రీవైష్ణవుఁడు. సపాదుఁడయ్యు నిష్పాదుఁడు. ఈతని తల పెద్దది. గుండ్రని కన్నులుండుటచే, ముక్కు కొంచెము వెనుకాడుటచే, మొగము గుండ్రముగ నుండుటచే నీతడు నరులలో 'Bull Dog' జాతిలోనివాఁడు ఈతఁడు మాటలాడిన మొరిగినట్లుండును. ఈతడు పొట్టివాఁడు. లంబోదరుఁడు. తారుకంటే నల్లనివాఁడు. ప్రాణమందలి తీపిచే నే కాంతయు నీతని వలచుటకు సాహసింపకపోవుటచేతఁ గాబోలు బ్రహ్మచారిగ నున్నాఁడు. ...... ఈతఁడు ప్రవేశపురుసుమీయలేని హేతువున వెట్టిసభ్యుడుగఁ జేరినవాఁడు.
  2. జంఘాల శాస్త్రి : విశాలమైన నుదురు, దీర్ఘనేత్రములు, లొడితెడు ముక్కును గలవాడు. కాలినడకనే యాసేతుహిమాచలపర్యంత దేశ మంతయు దిరిగినవాడు. .. జమిందారుల యాచించి వారీయకుండు నెడలఁ జెడమడ తిట్టినవాఁడు. ... ..... చీపురుకట్టయే యాయుధముగఁ గలవాఁడై హ్రీం హ్రాంకార సహితుఁడై యనేక కాంతల గడగడ లాడించినవాఁడు. అన్ని యంశముల నింతయో యంతయో తెలిసినవాఁడు. ఈతని తలలో, విప్రవినోది గాని సంచిలోవలె నొక సాలగ్రామము, నొక యుల్లిపాయ, యొకచిలుకబుఱ్ఱ, యొకతేలు, నొకరాధాకృష్ణుని విగ్రహము, నొక బొమ్మజెముడుమట్ట, యొక పుస్తకము, నొక పొగాకు చుట్ట మొదలగునవి చేర్చినవాఁడు. ఈతడు ప్రవేశరుసు మిచ్చినాఁడు.
  3. వాణీదాసు : ఇతడు కవి. ఎడమ చేయి వాటము గలవాఁడు. అడ్డతలవాఁడు సంత పశువు వలె నెఱ్ఱబట్టఁ జూచి బెదరువాఁడు. అంటురోగము కలవానివలె నెవ్వరిదరిఁ జేరఁడు. గ్రుడ్లగూబవలెఁ జీఁకటి నపేక్షించును. .. మిగుల సోమరి. పొట్టివాఁడు. అపాదశిరఃపర్యంత మసూయ గలవాడు. ఆదికవియైన నన్నయభట్టు మొదలుకొని యాధునిక కవియగు నన్నాసాహేబు వఱకందఱను దూషించును. ... పెదవులు నల్లగ నుండుటచే నీతడు చుట్టగాల్చు నలవాటు కలవాఁడై యుండును. ఈఁతడు శూద్రుడు. ఈత డాథునిక పద్ధతి ననుసరించి కవిత్వముఁ జెప్పుటకుఁ బ్రయత్నించు నున్నాఁడు.
  4. బొర్రయ్య శెట్టి : నాల్గవవాఁడు కోమటి. ఈతఁడు వాణిజ్యరహస్యము లెరిగిన వాఁడు. కొంతకాలము క్రిందట వర్తకము బాహుళ్యముగఁ జేసిన వాఁడు. విశేషధన మార్జించినవాఁడు. ఇతఁడు మహైశ్వర్య దినములలో నున్నప్పుడు బయలుదేఱిన తామరతప్ప నిప్పు డీతనికి వెనుకటి ధన మేమియు మిగులలేదు. ఈతఁ డెక్కడకుఁ బోయినను మూఁడు చేతులతోఁ బోవును. (తనకై రెండు చేతులు, తామరకై యిత్తడిచేయి). ఈతఁ డటికయంత తల గలవాఁడు. ఈతనిపేరు బొఱ్ఱయ్య; ఈతఁడు ప్రవేశరుసుము నిచ్చెను.
  5. సాక్షి : నేనయిదవవాఁడను. నేనెవఁడనో నాకుఁ గొంత తెలియునుగాని నేనెవఁడనో మీకు స్పష్టీకరించుటకుఁ దగిన యాత్మజ్ఞానము కలవాడఁను గాను. నా సంగతి మీరు ముందు నా వ్రాతలఁబట్టియే కనిపెట్టఁగలరు. నే నారామ ద్రావిడుఁడను. నా పేరు సాక్షి. మేము ప్రచురించు పత్రికకు నా పేరే యుంచితిని. వారమున కొకటి రెండు దళములఁ బంపెదము. మీరు మీ పత్రికలో వాని నచ్చువేయింపఁ గోరెదము. ... మీ పత్రికావ్యాపారము తిన్నగ నుండకుండునెడల మిమ్ములనుగూడ మా పత్రికలో నధిక్షేపించుచుందుము. పరీధావి సంవత్సర మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి గురువారమునాఁడు లింగోద్భవ కాలమున నీ సభ పుట్టినది.

మాది సత్యపురము. మా సాక్షి స్థానము తపాలకచేరి కెదురుగ.
ఇట్లు విన్నవించు
సభ్యులందఱి బదులు
సాక్షి.

సాక్షి అనగా రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావే అని ఒక వాదన. బొఱ్ఱయ్యసెట్టి మరణం తరువాత ఆ స్థానంలో సి. బాలనాగమ్మ అనే ఆమెను సభ్యురాలిగా చేర్చుకొన్నారు కాని ఆమె నామమాత్రపు సభ్యురాలే. మొదట్లో సాక్షి ఆధిక్యం గోచరించినా క్రమంగా సాక్షి ప్రతినిధిగా జంఘాలశాస్త్రి ఎదిగాడు.[4]

సాక్షి సంఘ నియమములు
  1. ప్రార్థన - చక్రవర్తికి, వారి కుటుంబమునకు ఆరోగ్యం కలగాలని (అప్పటికి మనదేశాన్ని ఇంగ్లీషు వారు పరిపాలిస్తున్నారు. రచయిత ఇంగ్లీషువారికి విధేయుడయిన ఒక మహారాజు ఆస్థానంలో ఉండేవాడు), వారి సంఘము చిరకాలము అందరికి ఉపయోగప్రథముగ ఉండాలని దేవుని ప్రార్థించుట.
  2. రాజకీయముల గురించి వ్రాయకూడదు, ముచ్చటించకూడదు.
  3. తప్పులనేకాని మనుషులను నిందింపకూడదు. తప్పులగురించి విశదీకరించుటకు పేరు వ్రాయవలసిన అవసరమైనచో, కల్పితమైన పేరునే వాడాలి, అసలు పేరు వ్రాయరాదు.
  4. సభ జరుగుతున్నంతసేపు, మత్తు పదార్ధములను నోటినుండి గని, ముక్కు నుండి గాని "చప్పుడగునట్టు" పోనీయకూడదు.
  5. వాదములలో తిట్టుకొనరాదు, కొట్టుకొనరాదు. కొట్టుకొనుట అనివార్యమయిన సందర్భములలో, అ విషయంలో కోర్టుకు ఎక్కకూడదు.

పై నియమములను పరిశీలిస్తే, ఈ సంఘము హాస్యమునకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నదని వ్యంగ ప్రధానమైనదని తెలుస్తుంది.

సాక్షి వ్యాసముల జాబితా

మార్చు

సాక్షి వ్యాసాల నుండి ఉదాహరణలు

మార్చు

(స్త్రీ స్వాతంత్ర్యము) -- పదాలు గుప్పించడంలోను, ఒకమాటకు పది మాటలు వాడి వ్యంగ్యాన్ని, వర్ణనను, హాస్యాన్ని రంగరించడంలోను జంఘాలశాస్త్రి ఉద్ధండుడు. మహిళలంతా ఓచోట గుమికూడితే ఎలా ఉంటుందో చెప్పడంలో జంఘాలశాస్త్రి ఇలా రెచ్చిపోయాడు. -- 'ఎక్కడ వినిన గాజుల గలగల, అందెల ఝణఝణ, కాంచీఘంటికల గణగణ, ఎక్కడజూచిన జెక్కుటద్దముల తళతళ, గుబ్బిగుబ్బిల పెళఫెళ, తారాహారముల మిలమిల, వేణీభారముల జలజల, ముద్దుమొగాముల కలకల, ఎక్కడకు బోయిన నగరు ధూపముల గమగమ, చందన చర్చల ఘుమఘుమ, మృగమదలేపముల ఘుమఘుమ... --- కొర్నాటి చీరలవారు, బనారసుకోకలవారు, బరంపురపు పీతాంబరములవారు, సన్నకుసుంబాచీరలవారు, గోచికట్లవారు, గూడకట్లవారు, చుట్టుత్రిప్పులవారు, మేలిముసుగులవారు, వ్రేలుముళ్ళవారు, జడచుట్లవారు, వంకకొప్పులవారు ....

(తోలు బొమ్మలు) -- తోలుబొమ్మలాటను చూడడంలోకంటే ప్రేక్షకులను పరిశీలించడంలో వాణీదాసునికి ఆసక్తి ఎక్కువ -- ఎన్నియోబొమ్మలను ముగ్గురో నల్వురో తెరలోపల నాడించుచుండ నొక్కబొమ్మను వీరందఱు తెరవెలుపల నాడించుచున్నారు. ఇంత శ్రమపడి బొమ్మలాట నేల చూడవలయు నని మీరు నన్నడుగుదురేమో! జనులు విశేషముగ జేరియుండినచోటికి బోవుటకు నాకు మొదటినుండియు నుత్సాహము. జనుల ముఖభేదముల బరిశీలించుట, కంఠరవములను శోధించుట, మాటలతీరులను గనిపెట్టుట, వానికిగారణములగు హృదయరసములను విమర్శించుట, స్వభావభేదములను గుర్తెఱుగుట-యిట్లు ప్రకృతిజ్ఞానమును సంపాదించుటయే నాముఖ్యోద్దేశము. పందిటిక్రింద నాడింపబడుచున్న నిర్జీవపు దోలుబొమ్మలను జూచుటకై పోయిన వాడ గాను. బయటనాడుచున్న ప్రాణమున్న తోలుబొమ్మలయాట జూడ బోయితిని.

(స్వభాష) - ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. -- మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము.

సాక్షి వ్యాసాల గురించి అభిప్రాయాలు

మార్చు
  • పానుగంటివారి సాక్షివ్యాసాలు గ్రాంధికశైలిలో ఉన్నాయి గాని అది గొడ్డి గ్రాంధికం కాదు. వ్యావహారానికి దగ్గరగా ఉండే గ్రాంధిక శైలి. చాలా సులభంగాను, సరళంగాను ఉంటుంది. సాక్షి వ్యాసాల శైలి వరద గోదావరిలాగా ఝరీవేగంతో పరుగులెట్టేది. ఆ రోజుల్లో కుర్రకారుతో సహా ఎందరో ఎంతో ఆసక్తిగా సాక్షి వ్యాసాలను చదివేవారు. ... ఆ రోజుల్లో అవి కలిగించిన సంచలనం అంతా యింతా కాదు. "జంఘాలశాస్త్రి" అనే పాత్ర ముఖతః పానుగంటివారు సమకాలిక సాంఘిక దురాచారాలమీద, మూఢ విశ్వాసాలమీద పదునైన విమర్శలు చేసేవారు. ("యువ పాఠకులకు" - నండూరి రామమోహనరావు) [5]
  • 1990లో సాక్షి వ్యాసాల ముద్రణకు మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి "తెలుగువారి బృహత్సంహిత" అనే ముందుమాట వ్రాశాడు. అందులో చెప్పిన కొన్ని విషయాలు - "మృదుమధుర నవార్ధభాసుర వచనరచనా విశారదులైన" మహాకవి ఆధునిక కాలమున ఎవరు అని ప్రశ్నించినచో వా ప్రత్యుత్తరము "పానుగంటి లక్ష్మీనరసింహారావు"గారని. .. నిబ్బరమైన పానుగంటి వచనమునకబ్బురపడని గద్యప్రేమికులుండరు. గద్య సాహిత్య రంగమునకు వారాశించినదెమో తెలియుటకు 1922లో ఆంధ్ర సాహిత్య పరిషత్ 11వ వార్షికోత్సవమునకు వారొసగిన అధ్యక్షోపన్యాసమే నిదర్శనము. .. అధునాతన సంఘమునకు షడ్దర్శనముగా సాక్షి దర్శనమిచ్చినది. ... నాటకములలో కన్యాశుల్కము ఎట్టిదో గద్య రచనములలో సాక్షి అటువంటిది. ఆయన వచన కవిత్వము వ్రాయకపోవచ్చునుగాని వచనమున కవిత్వము వ్రాసినవారు. సాక్షి సంపుటములు అధునాతన కాలమున తెలుగువారికి బృహత్సంహితలు.[5]
  • ఆరోజుల్లో 'సాక్షి' వ్యాసాలను ప్రజలు విరగబడి చదివేవారు. ఆంధ్రప్రత్రిక కోసం రైల్వేస్టేషన్‌లో పడిగాపులు పడేవారట... - పానుగంటి అన్నట్లే తాళం వాయించే సమయంలో- తళుకుబెళుకులు, టింగుటింగులు, గలగలలు, జలజలలు- వంటి శైలి ఇది. చదువరులకు గనుకట్త్టె, వాకట్త్టె, మదిగట్త్టె, తలపులిమినట్లు, శ్వాసయైన సలుపకుండ జేసినట్లు సాగే శైలి ఇది. ప్రతిపాదించిన అంశాలన్నీ 'పరిహాసం'తో కలసి సాగుతాయి. ఒళ్లు గగుర్పొడిచే గాంభీర్యం కనిపిస్తుంది. ఆవేశపూరితాలైన వాక్యనిర్మాణం గుక్కతిప్పుకోనీదు. లాలించి బుజ్జగించే హృదయమార్దవమూ ఉంటుంది. చమత్కారాలకు కొదువలేదు. గట్లను ముంచి ఉక్కిరిబిక్కిరిచేసే వరదగోదావరులే అన్నిలాసాలు. వస్తువు అత్యంత సాధారణమైన దైనా దానిలో విభిన్న కోణాన్ని రచయిత దర్శింపచేస్తారు. చిన్న చిన్న పదాలతో సుదీర్ఘసమాసాలు, అంత్యప్రాసల సమపద పునరావృత్తుల అలరింపు గురించి చెప్పనవసరంలేదు. బహుముఖీనమైన ప్రజ్ఞాపాటవాలు ప్రతివాక్యంలోనూ కనిపిస్తాయి. వాచాలత్వం, దూకుడు, అధిక ప్రసంగం, ఆహ్లాదప్రసంగం అన్నీ కలసి పాఠకులకు మధురానుభూతి కలిగిస్తాయి. ఆయన పొగడినా, తెగడినా, హేళనచేసినా సామాన్యరచయితలు ఊహించలేని దృష్టాంతాలతోనే తన వాక్చిత్రాలను రక్తికట్టించారు.[6]
  • ఒక చిన్న విషయాన్ని చిలవలు పలవలుగా విస్తరించి వ్రాయడం పానుగంటివారి లక్షణం. విశ్వనాధవారి నవలా రచనలో ఈ పోకడ కొంతవరకు కనిపిస్తుంది. సాక్షి వ్యాసాల ప్రేరణతో వచ్చినవే పప్పూరి రామారావు వ్రాసిన వదరుబోతు వ్యాసాలు. ఇవి అంతగా ప్రజాదరణ పొంలేదు. 1917లో ఇవి అనంతపురం నుండి వెలువడినవి. 1932లో పుస్తకరూపంగా వచ్చినపుడు వాటికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ముందుమాట వ్రాశాడు. 1920లో ఆంధ్రపత్రికలో వచ్చేదాకా సాక్షి వ్యాసాలు ప్రసిద్ధం కాలేదని, కనుక "వదరుబోతు" వ్యాసాలకు ప్రేరణ ఎడిసన్ వ్యాసాలేనని శర్మగారి అభిప్రాయం.[4]

ఇవి కూడా చూడండి

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

మార్చు
  1. Encyclopaedia of Indian literature vol. 2 By Amaresh Datta, various పేజీ. 1236 [1]
  2. http://www.classicauthors.net/Steele/SpectatorClub/
  3. The press and the national movement in South India, Andhra, 1905-1932 By K. Subramanyam పేజీ.252 [2]
  4. 4.0 4.1 4.2 శత వసంత సాహితీ మంజీరాలు లో పింగళి వెంకటరావు ఉపన్యాస వ్యాసం - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, నిజయవాడ (2002)
  5. 5.0 5.1 సాక్షి వ్యాసాల సంపూర్ణ సంపుటం - అభినందన పబ్లిషర్స్, విజయవాడ (2006)
  6. "ఈనాడు సాహిత్యంలో చీకోలు సుందరయ్య వ్యాసం". Archived from the original on 2008-02-25. Retrieved 2009-01-08.

బయటి లింకులు

మార్చు
సాక్షి వ్యాసాలు