సీతారామయ్యగారి మనవరాలు

1991 సినిమా
(సీతారామయ్యగారి మనుమరాలు నుండి దారిమార్పు చెందింది)

సీతారామయ్యగారి మనవరాలు విఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై దొరస్వామి నిర్మాతగా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సినిమా. 1991లో ఈ సినిమా విడుదలైంది. సీతారామయ్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన మనవరాలు సీతగా మీనా నటించారు. రోహిణి హట్టంగడి మరో ముఖ్యపాత్ర ధరించారు. 1991 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పనోరమా విభాగంలో ప్రదర్శితమైంది.[1] సినిమా 3 ఫిలిం ఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు పొందింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే సినిమాగా నిలిచిపోయింది.

సీతారామయ్యగారి మనవరాలు
దర్శకత్వం‌క్రాంతికుమార్
రచనగణేష్ పాత్రో (మాటలు),
మానస (కథ)
నిర్మాతదొరస్వామిరాజు
తారాగణంమీనా ,
అక్కినేని నాగేశ్వరరావు,
రోహిణి హట్టంగడి
తనికెళ్ళ భరణి
రాజా
కోట శ్రీనివాసరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

తారాగణం

మార్చు
నటి లేదా నటుడు పాత్ర
అక్కినేని నాగేశ్వరరావు సీతారామయ్య
మీనా సీత, మనవరాలు
రోహిణి హట్టంగడి జానకమ్మ, భార్య
రాజా శ్రీనివాసమూర్తి, కొడుకు
తనికెళ్ళ భరణి అల్లుడు
దాసరి నారాయణరావు సుబ్బరాజు
కోట శ్రీనివాసరావు వీరభద్రయ్య, వియ్యంకుడు
మాగంటి మురళీమోహన్ శ్రీనివాసమూర్తి స్నేహితుడు
తెలంగాణా శకుంతల వీరభద్రయ్య భార్య
బేతా సుధాకర్ వీరభద్రయ్య కొడుకు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

1985 ప్రాంతంలో ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న చిన్న నవల నవ్వినా కన్నీళ్ళే. ఈ నవలికని స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట హరగోపాల్ తన భార్య మానస పేరును కలంపేరు చేసుకుని రాశారు. ఆయన వ్రాసిన నవలను సినిమా స్క్రిప్ట్‌గా మలిచి పలువురు దర్శకనిర్మాతల వద్దకు తిరిగారు. చివరకు క్రాంతికుమార్‌ స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా కథ ప్రారంభమైంది.[2]

తారాగణం ఎంపిక

మార్చు

చిత్రీకరణ

మార్చు

సినిమాలో సీతారామయ్య పాత్ర పోషించిన అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలోనే తొలిగా విగ్గులేకుండా నటించారు. ఈ పాత్రను పోషించేప్పుడు మొదట విగ్గు పెట్టుకుంటానని నాగేశ్వరరావు, లేదు విగ్ లేకుండానే పాత్రవేయాలని దర్శకుడు క్రాంతికుమార్ అనుకునేవారు. విగ్గుతో షూటింగుకు వస్తే నాకు నా సీతారామయ్య కనిపించడంలేదండీ అంటూ క్రాంతికుమార్ అనేవారు. చివరకు ఈ సినిమా కోసం మళ్ళీ కొత్తగా మేకప్ టెస్ట్ కూడా చేయించుకున్నానని నాగేశ్వరరావు వెల్లడించారు. ఆయన భార్య అన్నపూర్ణ కూడా విగ్గులేకుండానే నటించమని సూచించడం, దర్శకుడి వాదన సహేతుకంగా కనిపించడం వంటి కారణాలతో సమాధానపడి విగ్ లేకుండానే నటించారు.[3]

చిత్రకథ

మార్చు

తూర్పు గోదావరి జిల్లా లోని ఒకానొక పల్లెటూర్లో సీతారామయ్య (అక్కినేని) అనే మోతుబరి ఉంటాడు. ఆయన ఇంట్లో పెళ్ళి జరుగుతున్నపుడు ఒక అమ్మాయి ఆ పెళ్ళికి వస్తుంది. చాలా ఏళ్ళ క్రితం భారతదేశం వదిలివెళ్ళిపోయిన సీతారామయ్య కొడుకు కుమార్తె ఆ అమ్మాయి. తండ్రీకొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదం వల్ల తండ్రి కొడుకుతో మాట్లాడటం మానివేయడంతో అతడు అమెరికా వెళ్ళిపోతాడు. చదువుకొనే రోజుల్లో కూడా తండ్రి సాంగత్యాన్ని వదులుకోలేని కొడుకు రావాలని అనుకొంటూ తండ్రి పిలవని కారణంగా రాడు. ఐనా మనవరాలు పెళ్ళికి వచ్చి, తన తల్లి తండ్రులు పని వత్తిడి వల్ల రాలేక పోయారని చెప్తుంది. మనవరాలి పేరు సీత అని తన పేరే పెట్టీనందుకు తాత పరోక్షంలో మురిసిపోతాడు. తన ఎదురుగా పెరిగే వారు అలవరచుకోని సంగీత సంప్రదాయాలు మనవరాలిలో చూసి గర్విస్తాడు. వచ్చిన మనవరాలు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పెంపొందిస్తూ విడిపోయిన చిన్నత్త తాతయ్యల కుటుంబాలను కలుపుతుంది. ఆమెను విడిచి సీతారామయ్య గడపలేను అనుకొనే సమయంలో ఆయన భార్య మరణిస్తుంది. అప్పుడు కూడా రాని కొడుకు మీద కోపంతో మనవరాలిని కూడా వెళ్ళిపొమ్మంటాడు. ఆమె వెళ్ళాక కొడుకు కోడలు అంతకు మునుపే మరణించారని తమ కోసమే ఆమె కొడుకు బ్రతికున్నట్టు నాటకం ఆడిందని తెలిసి ఆమెను వెనుకకు పిలవడంతో కథ సుఖాంతం అవుతుంది.

చిత్ర విశేషాలు

మార్చు
  • నాగేశ్వరరావు చిత్రం ఆద్యంతం విగ్గు లేకుండా పంచె కట్టుతో సహజంగా కనిపిస్తారు
  • సీతారామయ్య స్నేహితునిగా దాసరి నారాయణరావు గోదావరి యాసతో మాట్లాడే పెద్దమనిషిగా నటించారు.

ప్రాచుర్యం

మార్చు

సీతారామయ్య గారి మనవరాలు సినిమా తెలుగు సినీరంగంలో నిలిచిపోయే మేటి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రభావం తదనంతర కాలంలోని పలు చిత్రాలపై ఉంది. గోవిందుడు అందరివాడేలే చిత్రంపై పాక్షికంగా సీతారామయ్యగారి మనవరాలు సినిమా స్ఫూర్తి ఉంది.[4] 1991లో మలయాళంలో సాంధ్వనంగా నేదుమూడి వేణు, సురేష్ గోపీ, మీనా, భారతి, జగతి ప్రధానపాత్రధారులుగా, 1993లో బెల్లి మాడగళుగా కన్నడలో దొడ్డన్న, మాలాశ్రీ, రమేష్ అరవింద్ ముఖ్య తారాగణంగా రీమేక్ చేశారు. ఆపైన 1994లో ఈ సినిమా కాజోల్ కథానాయకిగా, జీతేంద్ర సీతారామ్‌గా ఉధార్ కీ జిందగీగా ఈ సినిమాని హిందీలో పునర్నిర్మించారు. అన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా కన్నడ వెర్షన్ మాత్రం సంచలన ఘనవిజయాన్ని సాధించింది.

థీమ్స్

మార్చు

ఈ చిత్రంలో సీత (మీనా), సుబ్బరాజు (దాసరి నారాయణరావు)ని చదరంగం గడుల్లో మొదటి గడిలో రూపాయి, రెండవ గడిలో రెండురూపాయలు, మూడవ దాన్లో నాలుగు రూపాయలు పెట్టుకుంటూ, పెంచుతూ పోతే అరవై నాలుగో గడి వచ్చేసరికి ఎంత పెట్టాల్సివస్తుందన్న చిక్కుప్రశ్న అడుగుతుంది. ఈ ప్రశ్న వెనుక ప్రముఖ కథారచయిత, కథక చక్రవర్తిగా పేరుగడించిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వ్రాసిన వడ్లగింజలు కథ స్ఫూర్తి కనిపిస్తుంది.[5] సమయానికి తగు పాట పాడెనె అనే గీతం సమయానికి తగు మాటలాడెనె అన్న త్యాగరాజ పంచరత్న కృతి నుంచి కొంతవరకూ సాహిత్యాన్ని, మొత్తంగా సంగీతాన్ని స్వీకరించి రూపుదిద్దుకున్న పాట. సినిమాలోని సందర్భానికి అనుగుణంగా పాటలో సాహిత్యాన్ని కొంత మార్చుకుని వ్రాశారు.

పాటలు

మార్చు
పాట పాడినవారు రాసినవారు
కలికి చిలకల కొలికి చిత్ర వేటూరి
పూసింది పూసింది పున్నాగా, కూసింత నవ్వింది నీలాగ బాలు, చిత్ర వేటూరి
వెలుగు రేఖలవారు తెలవారే తామొచ్చి చిత్ర, జిక్కి వేటూరి
భద్దరగిరి రామయ్యా పాదాలు కడగంగా పరవళ్ళూ ఎస్ పి బాలు చిత్ర

ఓ సీత హాల్లొ , ఎస్ పి బాలు

శ్రీసత్యనారాయణ వ్రత శ్లోకం, కె ఎస్ చిత్ర.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-10-06. Retrieved 2015-04-10.
  2. నెమలికన్ను, మురళి. "నవ్వినా కన్నీళ్లే." నెమలికన్ను. మురళి. Retrieved 10 April 2015.[permanent dead link]
  3. "ఎవర్‌గ్రీన్ అక్కినేని". 10tv. Archived from the original on 6 December 2013. Retrieved 10 April 2015.
  4. "ప్రకాశ్‌రాజ్‌ ఈ కాలపు ఎస్వీఆర్‌". ఆంధ్రజ్యోతి. 29 September 2014. Retrieved 30 September 2014.[permanent dead link]
  5. బసాబత్తిన, శ్రీ. "వడ్లగింజలు - కథ పరిచయం". కాలాస్త్రి. శ్రీ బసాబత్తిన. Archived from the original on 3 November 2015. Retrieved 11 April 2015.