కందుకూరి రుద్రకవి

తెలుగు కవి
(సుగ్రీవ విజయం నుండి దారిమార్పు చెందింది)

కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. తెలుగులో లభ్యమౌతున్న మొట్టమొదటి యక్షగానపు కర్తగా ప్రసిద్ధుడు. కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి కూడా ఒకడని లోకోక్తి కానీ అందుకు ఆధారాలు లేవు. ఈయన రచనలలో నిరంకుశోపాఖ్యానమనే ప్రబంధ కావ్యము, సుగ్రీవవిజయం యక్షగానము, జనార్ధనాష్టకము ముఖ్యమైనవి. ఈయన కాలం సా.శ. 1480-1560. ప్రకాశం జిల్లా, కందుకూరులోని విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు.[1]

కందుకూరి రుద్రకవి

చారిత్రక ఆధారాలు

మార్చు

కందుకూరి రుద్రకవి, గోల్కొండ నవాబు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సమకాలీకుడు. అప్పటి ఇబ్రాహీం కులీ పరిస్థితి (అన్న జంషీద్ కులీ కుతుబ్ షా వల్ల రాజ్యం వదిలి విజయనగరంలో రామరాయల వద్ద తలదాచుకున్నాడు, ఆ తరువాత గోల్కొండపై దాడిచేసి రాజ్యాధికారం పొందాడు) సుగ్రీవుని కథతో పోలి ఉండటంతో తను కూర్చిన సుగ్రీవ విజయం యక్షగానాన్ని గోల్కొండలో ప్రదర్శించి ఉండవచ్చని ఒక ఊహాగానం.[2] కులీ కుతుబ్షా రుద్రకవికి కందుకూరు సమీపంలో పాలేరు నది ఒడ్డున ఉన్న రెండుచింతల (జరుగుమిల్లి మండలంలోని చింతలపాలెం) గ్రామం జాగీరుగా ఇచ్చినట్టు 1558లో[2] చెక్కించిన శాసనం చెబుతున్నది.[3] రుద్రకవి వంశీయులు ఈ గ్రామమును తరతరాలుగా అగ్రహారంగా అనుభవించి, "కవి గారు" వంశీయులుగా పేరుపొందారని, రుద్రకవి కూడా ఈ గ్రామంలో నివసించి ఉండవచ్చని వేటూరి ప్రభాకరశాస్త్రి తెలిపాడు.[4]

రుద్రకవి చాటు కథలు

మార్చు

కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుండేవారన్న కథ ప్రసిద్ధమే. అది కూడా చాటు కథే కాని దానికి చారిత్రకమైన ఆధారాలు సరైనవేమీ లేవు. ఈ కందుకూరి రుద్రకవి కూడా అష్ట దిగ్గజాలలో ఒకడనీ, అతను ఈశాన్యపు దిక్కునున్న పీఠాన్ని అధిష్టించాడనీ కొందరు పండితులు భావిస్తున్నారు.[5] ఈ రుద్రకవి గురించి చాలా చాటు పద్యాలూ, వాటికితోడుగా కథలూ ప్రచారంలో ఉన్నాయి. ఇతనికి తాతాచార్యులతోనూ అలాగే భద్రకవితోనూ (ఇతను రాయల కొలువులో మరొక కవి అయ్యలరాజు రామభద్ర కవే అని కొందరంటారు) వాదోపవాదాలు జరిగాయని పద్యాలున్నాయి[6].సభకి వచ్చినప్పుడు ఇతనికి కూర్చోడానికి ఆసనమివ్వకుండా అవమానించినప్పుడు యీ పద్యం చెప్పాడట రుద్రకవి:[6]

పండితులైనవారు దిగువం దగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
గొండొక కోతి చెట్టుకొన కొమ్మకు నెక్కిన గ్రింద గండ భే
రుండ మదేభ సింహములు రూఢిగ నంతట నిండియుండవే!

ఇతడు ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. తిట్టు కవిత్వంలో ఉద్దండుడు. మొదట్లో రాయల వారి దర్శనం రుద్రకవికి లభించలేదు. చివరికి రాయల వారికి క్షవరం చేసే కొండోజి వల్ల దర్శనం దొరకడంతో ఈ పద్యం చెప్పాడు...[7]

ఎంగిలి ముచ్చు గులాములు
సంగతిగా గులము జెరుప జనుదెంచిరయా
ఇంగిత మెరిగిన ఘనడీ
మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్

రచనలు

మార్చు

రుద్రకవి రచనలలో "సుగ్రీవ విజయం" మొదటిది. ఇది యక్షగానం. ఇది కందుకూరి జనార్ధన దేవునికి అంకితం కావించాడు. "నిరంకుశోపాఖ్యానం" ఇతడి రెండవ రచన. ప్రబంధ గ్రంథమైన నిరంకుశోపాఖ్యానాన్ని సోమేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. రుద్రకవిని చిరస్థాయిగా నిలిపినది అతని "జనార్ధనాష్టకం". ఈయన "కందుకూరి జనార్థనా" అనే మకుటంతో జనార్థనాష్టకాన్ని రచించాడు. తెలుగులో అష్టక రచన చేసినవారిలో మొదటివాడు కందుకూరి రుద్రకవి. అప్పుడప్పుడే ఉద్భవిస్తున్న పదం శైలి పోకడలు జనార్ధనాష్టకంలో కనిపిస్తాయి.[8] రుద్రకవి సరసజన మనోరంజనం అనే మరో కృతిని, స్మరదీపిక అనే శృంగార కావ్యాన్ని కూర్చాడు.[9]

సుగ్రీవ విజయం

మార్చు

సుగ్రీవ విజయం అనే ఈ యక్షగానాన్ని కందుకూరులోని జనార్ధన స్వామికి అంకితంగా కవి రచించెను. ఇది బాగా ప్రాచుర్యం పొంది, తెలుగులో లభ్యమౌతున్న తొట్టతొలి యక్షగానాలలో ఒకటి.[10] సుగ్రీవ విజయం 1565 ప్రాంతంలో వ్రాయబడింది.[11] వీరరస ప్రధానమైన ఈ యక్షగానానికి రుద్రకవి రామాయణంలోని కిష్కింద కాండలోని పూర్వభాగాన్ని ఇతివృత్తంగా ఎన్నుకున్నాడు. రామలక్ష్మణులు పంపాసరోవర ప్రాంతంలో తిరగడంతో మొదలై వాలి వధ తర్వాత సుగ్రీవ పట్టాభిషేకంతో అంతమవుతుంది. సుగ్రీవ విజయం అనే ఈ యక్షగానాన్ని కందుకూరులోని జనార్ధన స్వామికి అంకితంగా కవి రచించెను. రుద్రకవి రామాయణంలోని కిష్కింద కాండలోని పూర్వభాగాన్ని ఇతివృత్తంగా ఎన్నుకున్నాడు. రామలక్ష్మణులు పంపాసరోవర ప్రాంతంలో తిరగడంతో మొదలై వాలి వధ తర్వాత సుగ్రీవ పట్టాభిషేకంతో అంతమవుతుంది.[12] సుగ్రీవ విజయాన్ని 1930లో తొలిసారిగా మద్రాసులో ప్రచురించబడింది. ఆ తర్వాత 1939లో కపిలేశ్వరం జమీందారు బలుసు బుచ్చిసర్వారాయుడు, వేటూరి ప్రభాకరశాస్త్రిచే విశ్లేషణాత్మక ప్రవేశిక వ్రాయించి, కాకినాడలో ప్రచురించాడు.[11]

కొన్ని ఉదాహరణలు

రావణుడు తీసుకొనిపోయిన సీత నగలను చూచి రాముడు విలపించే సన్నివేశం కరుణ రసాత్మకంగా కవి ఇలా పేర్కొన్నాడు:

తరణికులమున బుట్టి శరచాపములు బట్టి
తరుణి గోల్పడుకంటె మరణమే మేలు
నను శౌర్యవంతుడని తనపుత్రి నిడినట్టి
జనకవిభు డీవార్త విని వగవకున్నె
ఒకటి నొచ్చెము లేకయున్న రవివంశమున
కకట నాచే నింత యపకీర్తి వచ్చెనే.

నిరంకుశోపాఖ్యానం

మార్చు

నిరంకుశోపాఖ్యానం, నాలుగు ఆశ్వాసాల ప్రబంధ కావ్యం. ఇందులో తల్లితండ్రులు ఎంతగా వారించిన విలాస భోగజీవితానికి అలవాటు పడి, తన పద్ధతి మార్చుకోని ఒక ప్రజ్ఞావంతుడైన యువకుడి జీవితం వర్ణిస్తుంది. చివరకు దైవహస్తంతో సన్మార్గం చేరటమే ఈ కావ్యపు కథావస్తువు. రుద్రకవి నిరంకుశోపాఖ్యానాన్ని సోమేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. నిరంకుశోపాఖ్యానంలోని నాయకుడు సకలశాస్త్ర పారంగతుడైనా, వ్యసనాలకులోనై తల్లిదండ్రులను లెక్క చేయకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తుంటాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా, ఎన్ని హితోక్తులు చెప్పినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో- "చాలునింక నా పాలికి జచ్చినాడు, కొడుకు గుణనిధి యనువాడు కులవిషంబు" అని తీర్మానించి- "తిలలు దర్భయు నుదకంబుదెత్తుగాక యేనివాపాంజలులు వానికిత్తు నిపుడు" అంటాడు. నిరంకుశోపాఖ్యానం కావ్యానికి ఎంతో విపులమైన పీఠిక రాసి (శ్రీ స్వర్ణసుబ్రహ్మణ్య కవి వ్యాఖ్యానంతో) ఆంధ్ర శిల్ప కళాపరిషత్ తరఫున దర్శనాచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ప్రకటించారు.[13]

జనార్ధనాష్టకం

మార్చు

రుద్రకవి రచనలలో అన్నిటికన్నా ప్రసిద్ధి పొందిన రచన జనార్దనాష్టకము. "కందుకూరి జనార్దనా" అనే మకుటంతో ఉన్న ఎనిమిది పద్యాలు అష్టవిధ నాయికలను వర్ణిస్తుంది. అందమైన మధురమైన శృంగార రసవంతమైన పద్యాలివి. ఇవన్నీ మాత్రా ఛందస్సులో సొగసైన నడకతో సాగే పద్యాలు. యతి ప్రాసలు వీటికి అదనపు నిగనిగలు. మత్తకోకిల నడకలా సాగే ఈ పద్యాలు పాడుకోడానికి కూడా బావుంటాయి. ఈ జనార్దనాష్టకంలోని పద్యాలకు రాగం కట్టి పూర్వం దేవదాసీలు నృత్యం చేసేవారట. ఇవి కొన్నాళ్ళ క్రితం అందమైన బాపూ బొమ్మలతో ఒక పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఆ తర్వాత పుస్తకంగా కూడా వచ్చాయి.

ఉదాహరణ

బిత్తరంబున మొలకకెంపులు పెదవినెవ్వతె ఉంచెరా

గుత్తమైన మిటారిగుబ్బల గుమ్మయెవ్వతె మెచ్చెరా

చిత్తగించక జీరువారను చెక్కిలెవ్వతె నొక్కెరా

కత్తిగోరుల దనుజమర్దన కందుకూరి జనార్ధనా!

సూచికలు

మార్చు
  1. Mukherjee, Sujit (1999). A Dictionary of Indian Literature: Beginnings-1850 Volume 1 (1. publ. ed.). Hyderabad: Orient Longman. p. 334. ISBN 9788125014539.
  2. 2.0 2.1 Najat Haidar, Navina; Sardar, Marika (Jan 1, 2011). Sultans of the South: Arts of India's Deccan Courts, 1323-1687. Metropolitan Museum of Art.
  3. Naqvī, Ṣādiq (1993). Muslim Religious Institutions and Their Role Under the Qutb Shahs. Golconda (India): Bab-ul-ilm Society. p. 54.
  4. కందుకూరి, రుద్రకవి (జూలై 1973). సుగ్రీవ విజయము (యక్షగానము). హైదరాబాదు: మాధవి బుక్ సెంటర్. p. xxiii.
  5. Datta, Amaresh (Jan 1, 2006). The Encyclopaedia Of Indian Literature (Volume One (A To Devo). Sahitya Akademi. p. 247. ISBN 9788126018031.
  6. 6.0 6.1 "తెలుగు పద్యం..కందుకూరి జనార్థనా!!". Archived from the original on 2016-03-06. Retrieved 2013-08-02.
  7. తెలుగు దనం ... మన కవులు
  8. A. K., Ramanujan; Velcheru, Narayana Rao; Shulman, David Dean (1994). When God is a Customer: Telugu Courtesan Songs. University of California Press. p. Preface 5. ISBN 9780520080690.
  9. Kolapelli, Buchenna (2005). Rajamahendri Ramayana Paintings: Nayanābhirāmānusēlana. Drusya Kala Deepika.
  10. K., Ayyappapanicker (Jan 1, 1997). Medieval Indian Literature: Surveys and selections. Sahitya Akademi. p. 579. ISBN 9788126003655.
  11. 11.0 11.1 Lal, Mohan (Jan 1, 2006). The Encyclopaedia Of Indian Literature (Volume Five (Sasay To Zorgot). Sahitya Akademi. p. 4212. ISBN 9788126012213.
  12. రుద్రకవి - సుగ్రీవ విజయం, డా. ఆర్. అనంత పద్మనాభరావు, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి.
  13. అడపా, రామకృష్ణ. "చిరస్మరణీయ సాహితీవేత్త కొండూరు". ఆంధ్రభూమి. No. 19/01/2014. Retrieved 14 December 2014.[permanent dead link]
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


యితర లింకులు

మార్చు