స్కెచ్ (ఆంగ్లం: Sketch) ఒక వస్తువు లేదా దృశ్యం యొక్క ముఖ్య లక్షణాలను (అధ్యయనం చేయడమే ప్రధాన ఉద్దేశంగా) వేగంగా, ఎక్కువ వివరాలు లేని చిత్తుప్రతి వలె వేయబడ్డ ఒక సరళమైన రేఖాచిత్రం.[1][2] స్కెచ్ కు తర్వాత మరిన్ని స్పష్టమైన వివరాలను చేర్చి ఒక పరిపూర్ణ రేఖాచిత్రంగానో, చిత్రలేఖనంగానో మలచవచ్చు. కేవలం చిత్రలేఖనం కోసమే కాకుండా మట్టితో చేసే బొమ్మలు, రాతిపై మలిచే శిల్పాలకు, గ్రాఫిక్ డిజైన్ కు సైతం స్కెచింగ్ ఉపయోగపడుతుంది.[3] [4] [5] వేరే ఏ ఇతర కళా మాధ్యమంతో పోల్చినా, స్కెచ్ చాలా చవకైనది.[6] పరిశీలన, భావన, వివరణలు స్కైచింగ్ ప్రక్రియ ప్రధానాంశాలు.[5] దశాబ్దాలుగా స్కెచింగ్, స్కెచ్ బుక్ లు పరిశీలనకు పదును పెడుతూ, సాంకేతికతను పెంపొందిస్తూ, అనుభవాలను నమోదు చేస్తూ, దృశ్యపూర్వక భావవ్యక్తీకరణ యొక్క పరిధిని పెంచుతూ, సృజనాత్మకత స్థాయిని పెంచుతూ, ఆలోచనలను అభివృద్ధి చేస్తూ వస్తున్నవి.[7]

థియో వాన్ డొయ్స్బర్గ్ చే పిల్లనగ్రోవి ఊదుతూ ఉన్న కృష్ణుడి రెండు వేర్వేరు స్కెచ్ లు

ప్రాముఖ్యత మార్చు

అనుభవజ్ఙులు అయిన కళాకారుడికైనా, కార్టూనిస్టుకు అయినా, అప్పుడే కళను అభ్యసించటం మొదలు పెట్టిన వారైనా స్కెచింగ్ తోనే వారి పని మొదలు అవుతుంది.[8] స్కెచింగ్ లో వైఫల్యం ఉండదు. స్కెచ్ యొక్క తుది నిర్ణేత, కేవలం, స్వయానా స్కెచ్ వేసిన కళాకారుడే! స్కెచింగ్ సరళమైనది, చవకైనది, ఎక్కడైనా వేయగలిగేది, వేగవంతమైనది. [9]

అనువర్తనాలు మార్చు

 
లియొనార్డో డా విన్సీ వేసిన పుష్పకవిమానం (Flying Machine) స్కెచ్

సాంప్రదాయిక స్కెచ్ రూపకల్పన, కూర్పు లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేది. ఇటువంటి స్కెచ్ కళాకారుడికి ఇది దిక్సూచిగా వ్యవహరించేది. ప్రధాన చిత్రకారుడు స్కెచ్ లు మాత్రం వేసి, అతని సహచరులు మిగతా వివరాలను చేయటాన్ని మాత్రం బాట్టెగా (bottega) లేదా స్టూడియా షాప్ (studio-shop) అని వ్యవహరిస్తారు.[3]

స్కెచ్ లు మూడు విధాలు. అవి

క్రోకిస్ (Croquis) మార్చు

క్రోకిస్ (ఆంగ్లం: Croquis) అనేది ఒక మనిషి (మాడల్) ను చూస్తూ కేవలం ప్రధానమైన అంశాలను నమోదు చేస్తూ వేగంగా వేయబడే ఒక స్కెచ్.[10][11][12] సాధారణంగా మాడల్ (ఒక్కోమారు ఒకరి కంటే ఎక్కువ మాడల్స్) వివస్త్రలై ఉంటారు. కళాకారులు తమను వివిధ భంగిమలలో చిత్రీకరించేలా మాడళ్ళు త్వరితంగా తమ భంగిమలను మారుస్తూ ఉంటారు. ఒక్కో భంగిమ నిడివి పది నుండి ఇరవై నిముషాలు ఉంటుంది.[13] కొంత వ్యవధి తర్వాత భంగిమ మార్చే సౌలభ్యం ఉండటంతో మాడళ్ళు కూడా క్రోకిస్ లో అసౌకర్యానికి గురి కారు.[14] ఒకే చోట కుదురుగా ఉండ (లే)ని జీవాలను (ఉదా: కీటకాలు, జంతువులు, చిన్నపిల్లలు) చిత్రీకరించటానికి సైతం క్రోకిస్ చక్కగా ఉపయోగపడుతుంది.[14] ఫ్యాషన్ టెక్నాలజీలో సృష్టించబోయే దుస్తులు మాడల్ ఒంటి పై ఎలా ఉంటాయి అని ఊహించటానికి క్రోకిస్ ను ఉపయోగిస్తారు.[14] క్రోకిస్ ను అలాగే వదిలి వేయవచ్చు, లేదా మరింత సొబగులను అద్ది ఒక పరిపూర్ణ చిత్రలేఖనంగా కూడా అభివృద్ధి చేయవచ్చు.[14]

పోషేడ్ (Pochade) మార్చు

ఒక ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ వాతావరణ ప్రభావాలను రంగులలో చిత్రీకరించటం.[3]

పోర్ట్రెయిచర్ (Portraiture) మార్చు

ఒక వ్యక్తి యొక్క ముఖకవళికలను, ఇతర భౌతిక లక్షణాలను చిత్రీకరించటం.[3]

పరికరాలు మార్చు

స్కెచింగ్ కు కావలసిన పరికరాలు

పెన్సిళ్ళు మార్చు

పెన్సిళ్ళు పలురకాలుగా లభ్యం అవుతాయి. కరకుగా గీతలు గీసే పెన్సిళ్ళూ కొన్ని అయితే, మృదువుగా గీసేవి మరికొన్ని. పెన్సిళ్ళలో కరకుదనాన్ని H అక్షరం, మృదుత్వాన్ని B అక్షరం సూచిస్తాయి.[15] ఉదా:4H పెన్సిల్ 2H పెన్సిల్ కంటే కరకుగా గీస్తుంది. 4B పెన్సిల్ 2B పెన్సిల్ కంటే మృదువుగా గీస్తుంది. మధ్యస్తంగా ఉండే HB పెన్సిల్ పై ఒత్తిడిని బట్టి, ఒత్తిడి ఎక్కువ ఉంటే మృదువుగా, తక్కువ ఉంటే కరకుగా గీస్తుంది.[16] అత్యంత కరుకైన పెన్సిల్ 6H అయితే అత్యంత మృదువైన పెన్సిల్ 6B.[17] 0.3 మి.మీ, 0.5 మి.మీ వ్యాసం ఉన్న మెకానికల్ పెన్సిళ్ళు సన్నని గీతలను వేయటానికి ఉపయోగిస్తారు.[18] పెన్సిళ్ళతో బాటు బాల్ పాయింట్ పెన్ లు, మార్కర్లు, చార్కోల్ కూడా స్కెచింగ్ లో వినియోగిస్తారు. [19] [20]

పెన్ లు మార్చు

పెన్లు నాలుగు రకాలు. అవి:

డిప్ పెన్ లు మార్చు

పురాతన శైలిలో సిరా బుడ్డిలో ముంచి, తీసి కాగితం పై గీతలు గీయటానికి ఉపయోగించే పెన్నులు.[18]

ఫౌంటెయిన్ పెన్ లు మార్చు

నిబ్బు వెనుక భాగంలో ఉండే ఖాళీలో సిరా నింపగలిగే సౌలభ్యం ఉన్న పెన్నులు.[18]

బాల్ పాయింట్ పెన్ లు మార్చు

బాల్ పాయింట్ కలిగిన నిబ్ కు వెనుక భాగంలో ఉన్న ప్లాస్టిక్ గొట్టంలో సిరా నింపబడి ఉన్న పెన్నులు.[18]

స్కెచ్ పెన్ లు మార్చు

ఒకే వెడల్పుతో గీతలు గీయటానికి స్కెచ్ పెన్ లు ఉపయోగ పడతాయి.[21]

కాగితం మార్చు

స్కెచ్ బుక్ లలో పేపరు వివిధ పరిమాణాలలో వస్తుంది. కొన్ని కాగితాలు కరకుగా మరి కొన్ని మృదువుగా ఉంటాయి. సాధారణంగా కరకు కాగితానికి కరకు పెన్సిళ్ళు, మృదువు కాగితానికి మృదువైన పెన్సిళ్ళు వాడబడతాయి. ఏయే కాగితానికి ఏయే పెన్సిళ్ళు నప్పుతాయనేది కాస్త అనుభవం పై తెలుస్తుంది. వివిధ ప్రయోగాలు చేసి ఈ విషయం స్వయంగా తెలుసుకోవాలి.[22]

గాజు ఉత్పత్తులు, నీరు, కుండలు, లోహాలు చిత్రీకరించటానికి మృదువైన కాగితం, చెక్క, రాయి వంటి వాటిని చిత్రీకరించటానికి కరకైన కాగితం ఉపయోగపడతాయి. [23]

షార్పెనర్ మార్చు

షార్పెనర్ లు పెన్సిళ్ళను చెక్కటానికి ఉపయోగిస్తారు. అయితే స్కెచింగ్ లో ప్రావీణ్యులు షార్పెనర్ బదులుగా బ్లేడ్ లేదా కత్తిని వాడమని సూచిస్తారు. ముక్కును ఎంత భాగం ఉంచాలి అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి. [24]

ఉప్పు కాగితం మార్చు

పెన్సుల్ ముక్కును పదునుగా ఉంచటానికి ఉపయోగించబడుతుంది.[25]

పేపర్ స్టంప్ మార్చు

ఒకవైపు పదునుగా ఉండేటట్లు బిగుతుగా చుట్టి ఉన్న కాగితాన్నే పేపర్ స్టంప్ అంటారు.[26] పెన్సిల్, కార్బన్, క్రేయాన్, చార్ కోల్ వంటి వాటితో వేసిన స్కెచ్ లలో టోనింగ్ చేయటానికి దీనిని వాడతారు.

ఎరేజర్ మార్చు

ఎరేజర్ లు వీలైనంత తక్కువగా వాడాలి. కొన్ని ప్రత్యేకమైన ప్రభవాలను తేవటానికి మాత్రమే ఎరేజర్ వాడాలి.[25] సరిగా వేయబడని గీతలను చెరిపేయటానికే కాకుండా, ఎరేజర్ లను టోన్ లను తేలిక చేయటానికి కూడా వినియోగిస్తారు. [18]

పద్ధతి మార్చు

నిశ్చల అంశాల స్కెచ్ లు మార్చు

మొదట స్కెచ్ చేయబోయే చిత్రంలో ప్రధానమైన రేఖలను మాత్రం చిత్రీకరించటం జరుగుతుంది. కచ్చితమైన కొలతల కొరకు పెన్సిల్ ను చేత్తో పట్టుకుని చేతిని పూర్తిగా చాచి దృశ్యం ముందు పెట్టి, దృశ్యంలో ఒక కొలమానాన్ని పెన్సిల్ పొడవులో కొలచి దీనిని మిగతా కొలతలకు ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. కొలతల అనుసారం రేఖలను మార్చుకోవచ్చు. దృక్కోణం కొరకు దృశ్యం లోని అడ్డ గీతలకు, నిలువు గీతలకు మిగతా సరళ రేఖలు ఎంత వాలులో ఉన్నాయో తెలుసుకోవటానికి పెన్సిల్ ని వాటికి సమాంతరంగా పెట్టు తెలుసుకోవచ్చు. అటు తర్వాత దృశ్యంలో ఉన్న ప్రధానాంశాలు రేఖాగణిత అంశాల వలె చిత్రీకరించబడతాయి. మరిన్ని వివరాలు (వెలుగు-నీడలు) చిత్రీకరించి స్కెచ్ ను పూర్తి చేయవచ్చు.[27]

చలన అంశాల స్కెచ్ లు మార్చు

కదిలే అంశాలను చిత్రీకరించటం స్కెచ్ లో ఒక సవాలు. కదులుతూ ఉన్న అంశాన్ని తీక్షణంగా గమనించి ఒక దృశ్యాన్ని మాత్రం గుర్తు పెట్టుకొని ఆ దృశ్యాన్ని మాత్రం చిత్రీకరించటం ఒక పద్ధతి. [28] ఇలా గమనించటంలో కన్ను, మెదడు కలిసి పని చేయవలసి ఉంటుంది. దీనికి కొంత స్వీయ శిక్షణ, అనుభవం కావలసి వస్తుంది. మొదట ఎటువంటి స్కెచ్ ను వేసే ఉద్దేశం లేకుండా వివరాలలోకి వెళ్ళకుండా అంశం లోని ప్రధాన లక్షణాలను గుర్తించగలగాలి. [18] కదులుతోన్న అంశం ఒక ఆసక్తికరమైన భంగిమకు రాగానే కళ్ళు మూసుకోవడం మరొక పద్ధతి. [29] కళ్ళు మూసుకొన్న తర్వాత చివర చూచిన దృశ్యంలో వివిధ భాగాలు ఎలా అమర్చబడి ఉన్నాయో గుర్తు తెచ్చుకోవటంతో స్కెచ్ కు సర్వం సన్నద్ధం అయినట్టు లెక్క. గుర్తు తెచ్చుకొన్న దృశ్యాన్ని మాత్రం చిత్రీకరించాలి తప్పితే అదనంగా ఏవీ చేర్చకూడదు.

చలన అంశాల స్కెచ్ లన్ వేసే పద్ధతులు నాలుగు.[30] అవి

స్క్రిబుల్ అప్రోచ్ (Scribble Approach) మార్చు

సాధారణ బాల్ పాయింట్ పెన్ (నలుపు రంగు) చవకైన స్కెచ్ పేపరు పై ఈ విధానాన్ని అవలంబించవచ్చు. రెండు ఇంచిల ఎత్తు మించని స్కెచ్ లను వేగంగా పది సెకన్ల వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకట్ వేస్తూ ముందుకు వెళ్ళాలి. హస్తాక్షరం చేసే సమయంలో ఎలా పట్టుకొంటారో ఈ స్కెచ్ లు వేసే సమయంలో కూడా అలానే పట్టుకోవాలి. కేవలం పిడికిలి, వ్రేళ్ళ కదలికలతోనే స్కెచ్ లను పూర్తి చేయాలి. ఈ విధానంలో ఉన్న రెండే రెండు నియమాలు: పెన్ను ఆగకూడదు, పెన్నును ఎత్తకూడదు. [31]

గెస్చరల్ అప్రోచ్ (Gestural Approach) మార్చు

బ్రష్ పెన్, 6B చార్కోల్ పెన్సిల్ లను ఉపయోగించి భుజం, మోచేయిలను కదుపుతూ చలన అంశాన్ని చిత్రీకరించటం.[32] చిత్రీకరించే అంశం యొక్క మధ్యభాగం (మనుషులు, జంతువులు అయితే వారి/వాటి వెన్నెముక గుండా C ఆకారంలో, S ఆకారంలో ఉండే గీతలను గమనిస్తూ వాటి చిత్రీకరణకు తదనుగుణంగా చేతిని కదుపుతూ చిత్రీకరణను మొదలు పెట్టాలి. పెన్సిల్ యొక్క ముక్కు తప్పితే వేరే ఏదీ కాగితాన్ని తాకకూడదు.[32]

మానికిన్ అప్రోచ్ (Mannequin Approach) మార్చు

చిత్రలేఖనం చేయటానికి ఉపయోగించే మానికిన్ ను పోలినట్టు స్కెచ్ చేయటం. తల ఒక వృత్తాకారం, చాతీ, నడుము భాగాలు చతుర్భుజాలు, కాళ్లు చేతులు కేవలం సన్నని గీతల వలె గీయబడతాయి. తర్వాత, వీటిని ఆధారంగా చేసుకొని కండరాలు, వాటి పై దుస్తులు వేసుకోవచ్చు. మానికిన్ అప్రోచ్ కేవలం మనుషులకే కాక జంతువులకు కూడా అన్వయించుకోవచ్చు. [33]

టోనల్ మాస్ అప్రోచ్ (Tonal Mass Approach) మార్చు

మార్కర్ తో నో, చార్కోల్ పొడి రాయబడ్డ దూది ఉండతో మొదట చిత్రం యొక్క భంగిమను చిత్రీకరించి, అటు తర్వాత సన్నని గీతలతో స్కెచ్ ను పూర్తి చేయటం. [34]

డ్రాయింగ్ , షేడింగ్ మార్చు

స్కెచ్ లో ఉన్న రెండు ప్రధానాంశాలు, లైన్ డ్రాయింగ్, షేడింగ్.

లైన్ డ్రాయింగ్ మార్చు

ఎటువంటి షేడింగు లేకుండా కేవలం గీతలను ఉపయోగించి స్కెచ్ వేయటం. ప్రభావంలో లైన్ డ్రాయింగ్ కు పరిమితులు ఉండవచ్చు, కానీ ప్రమాణం, కదలిక, ఆకారం, మానసిక స్థితి (mood) లను వ్యక్తీకరిస్తుంది.[35]

షేడింగ్ మార్చు

షేడింగు స్కెచ్ కు లోతును ఇస్తుంది. విలువను పెంచుతుంది.[36] షేడింగు కొరకై ఉపయోగించబడే పద్ధతులు:

హ్యాచింగ్ మార్చు

సన్నని గీతలను ఒక దాని ప్రక్కన ఒకటి గీస్తూ, వెలుగు-నీడలను చూపగలగటం.[37]

క్రాస్ హ్యాచింగ్ మార్చు

ఒక దిశలో హ్యచింగ్ తో బాటు, వ్యతిరేక లేదా మరొక దిశలో కూడా హ్యాచింగ్ చేయటం [38]

సాంకేతిక అంశాలు మార్చు

పెన్సిల్ పెయింటింగ్ మార్చు

పెన్సిల్ ను కుంచె వలె ఉపయోగించి ఇతర సాంకేతికలతో సాధ్యం కాని కుంచెతో వేసినట్లే అగుపించే బొమ్మలను వేయటమే పెన్సిల్ పెయింటింగ్.[23]

వాష్ అండ్ బెంజీన్ మార్చు

కొద్దిగా నీటిని లేదా బెంజీన్ ను కుంచెతో బాటు ఉపయోగించి, వాటర్ కలర్ వలె పెన్సిల్ స్కెచ్ లను చిత్రీకరించటాన్ని వాష్ అండ్ బెంజీన్ అంటారు.[39]

దృక్కోణం మార్చు

ఆకాశం, భూమి కలిసే చోటు ఎప్పటికీ కంటి వద్దే ఉండాలి.[40] ఇదే కాక, ఒక మనిషిని, వస్తువును ఏ దృక్కోణం నుండి స్కెచ్ చేస్తున్నాం అన్న విషయం పై కళాకారుడికి స్పష్టత ఉండాలి.[41]

మెళకువలు మార్చు

  • స్కెచ్ లను అండర్ డ్రాయింగ్ లతో మొదలు పెట్టాలి. అనుభవజ్ఙులు అయిన కళాకారులు దాదాపు అన్ని స్కెచ్ లను అండర్ డ్రాయింగ్ ల తోనే మొదలు పెడతారు.[42]
  • నిటారుగా ఏకరీతిగా ఉండే గీత ఆసక్తికరంగా లేకపోవటమే కాదు, అందులో కళ, జీవం కూడా ఉండవు. అదే వంపులు తిరిగిన, వెడల్పులో హెచ్చుతగ్గులు ఉన్న గీతలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ గీతల వ్యవహారంలో ఆసియాకు చెందిన చిత్రకారులు దిగ్గజాలు. గీతను కేవలం ఒక పరికరంగా కాకుండా, వారు దీనిని ఒక భాషగా పరిగణిస్తారు.[43] వెడల్పాటి గీత ఒక రూపం లోని శక్తిని సూచిస్తే, సన్నగా ఉండే గీత ప్రకృతిలోని సాహిత్యాన్ని రుచి చూపిస్తుంది. [5]
  • స్కేల్ (పరిమాణంలో పోలిక) స్కెచింగ్ లో ఒక ముఖ్యమైన అంశం. ఉదా: చెట్లు, వాటి ప్రక్కన ఉన్న గొర్రెల పరిమాణాలను అంతే వ్యత్యాసంగా స్కెచ్ లో కూడా చూపించగలగటం. [44]

పెన్సిల్ పట్టుకొనే విధానాలు మార్చు

  • జాగ్రత్తగా గీయవలసిన గీతల కొరకు మామూలుగా రాసే సమయంలో పెన్సిల్ ను ఎలా పట్టుకొంటామో అలా పట్టుకొంటే సరిపోతుంది.
  • పెద్దగా గీయవలసిన గీతల కొరకు పెన్సిల్ మొదలు నుండి కనీసం 7.5 సెంటీమీటరుల (3 ఇంచిల) దూరంలో పట్టుకొని (నిటారుగా కాకుండా) కాగితానికి దగ్గరి కోణంలో పట్టుకోవాలి.
  • షేడింగ్ కొరకు పెన్సిల్ ను దాదాపు కాగితానికి ఆన్చి కేవలం బ్రొటన, చూపుడు వ్రేళ్ళతో పెన్సిల్ ను పట్టుకోవాలి.[45]

ప్రయోగాలు మార్చు

స్కెచ్ లతో వివిధ ప్రయోగాలు చేయమని అనుభవజ్ఙులు సూచిస్తారు.[46]

  • ఊహాత్మక స్కెచ్ లను ఎలా వేయాలో చెప్పటం కష్టం. ఈ సృజనాత్మక ప్రక్రియే స్కెచ్ లు వేసే ప్రేరణను అందిస్తాయి.
  • ఒక దృశ్యం, లేదా ఒక శ్రవణం మనకు తెచ్చే పాత జ్ఙాపకాలను స్కెచ్ చేసే ప్రయత్నం చేయాలి
  • ఫలానా స్కెచ్ అని అనుకోకుండా ముందుగా కొన్ని గీతలను వేస్తూ, వాటికి మరిన్ని గీతలను జోడిస్తూ, స్కెచ్ ను వృద్ధి చేయాలి.
  • ఆకారాలలో వక్రీకరణలను తీసుకురావాలి. వ్యంగ్యం కోసం కార్టూనిస్టులు, ప్రయోగాత్మక దుస్తులు ఒద్దికగా అమరటానికి ఫ్యాషన్ డిజైనర్లు ఇలా వక్రీకరణలు చేస్తుంటారు.
  • ఏనుగులకు రెక్కలు కట్టటం, కావలనే టెలిస్కోపును తప్పు వైపు నుండి చూచి కనబడ్డది స్కెచ్ చేయటం, ఒక వస్తువును ఎగిరే పక్షి ఏ విధంగా చూడగలుగుతుందో, లేదా ఒక చీమ ఎలా చూడగలుగుతుందో ఊహించి మనల్ని మనం సవాలు చేసుకొనే స్కెచ్ లను వేయాలి

సూచనలు మార్చు

  • స్కెచ్ లు (మరీ వివరణాత్మకంగా కాకుండా) కేవలం కావలసినన్ని వివరాలతో మాత్రమే సరళంగా ఉండాలి. తొంభై శాతం స్కెచ్ లలో (మితిమించి కష్టించి వివరణలు చేర్చిన రేఖాచిత్రం కంటే) స్వేచ్ఛ గల భావాలు లేదా దృశ్యం యొక్క భావంలో నే సజీవంగా కనబడతాయి.[47]
  • స్కెచ్ లో సాధ్యమైనంత ముఖ్యమైన సమాచారం చేర్చగలగాలి.[48]

మూలాలు మార్చు

  1. మెరియం-వెబ్స్టర్ డిక్షనరీ లో స్కెచ్ కు నిర్వచనం
  2. కేంబ్రిడ్జి డిక్షనరీ లో స్కెచ్ కు నిర్వచనం
  3. 3.0 3.1 3.2 3.3 "Sketch on Britannica". britannica.com. 20 July 1998. Retrieved 30 June 2021.
  4. Crawshaw 1983, p. 6.
  5. 5.0 5.1 5.2 Porter 1977, p. 7.
  6. Alois Fabry 1958, p. 12.
  7. Gurney & Kinkade 1988, p. 2.
  8. Gurney & Kinkade 1988, p. 6.
  9. Gurney & Kinkade 1988, p. 7.
  10. కొలిన్స్ లో క్రోకిస్ నిర్వచనం
  11. మెరియం వెబ్స్టర్ లో క్రోకిస్ నిర్వచనం
  12. ఫ్రీ డిక్షనరీ లో క్రోకిస్ నిర్వచనం
  13. Gregg, Jay (23 November 2016). "What is a croquis? What are the functions and purposes of a croquis?". Quora. Retrieved 25 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. 14.0 14.1 14.2 14.3 "Croquis vs Sketch". askdifference.{{cite web}}: CS1 maint: url-status (link)
  15. Porter 1977, p. 61.
  16. Alois Fabry 1958, p. 12-13.
  17. Gurney & Kinkade 1988, p. 29.
  18. 18.0 18.1 18.2 18.3 18.4 18.5 Gurney & Kinkade 1988, p. 30.
  19. Crawshaw 1983, p. 22.
  20. Crawshaw 1983, p. 24.
  21. Gurney & Kinkade 1988, p. 31.
  22. Alois Fabry 1958, p. 13-15.
  23. 23.0 23.1 Alois Fabry 1958, p. 26.
  24. Alois Fabry 1958, p. 16.
  25. 25.0 25.1 Alois Fabry 1958, p. 15.
  26. Alois Fabry 1958, p. 36.
  27. Gurney & Kinkade 1988, p. 40-46.
  28. Gurney & Kinkade 1988, p. 55.
  29. Gurney & Kinkade 1988, p. 59.
  30. Gurney & Kinkade 1988, p. 60.
  31. Gurney & Kinkade 1988, p. 63.
  32. 32.0 32.1 Gurney & Kinkade 1988, p. 61.
  33. Gurney & Kinkade 1988, p. 62.
  34. Gurney & Kinkade 1988, p. 63-64.
  35. Alois Fabry 1958, p. 18.
  36. Alois Fabry 1958, p. 23.
  37. మెరియం వెబ్స్టర్ లో హ్యాచింగ్ కు నిర్వచనం
  38. డిక్షనరీ.కాం లో క్రాస్ హ్యాచింగ్
  39. Alois Fabry 1958, p. 58.
  40. Crawshaw 1983, p. 14.
  41. Crawshaw 1983, p. 15.
  42. Gurney & Kinkade 1988, p. 38.
  43. Alois Fabry 1958, p. 19.
  44. Crawshaw 1983, p. 11.
  45. Crawshaw 1983, p. 20.
  46. Porter 1977, p. 89.
  47. Alois Fabry 1958, p. 31.
  48. Crawshaw 1983, p. 10.
"https://te.wikipedia.org/w/index.php?title=స్కెచ్&oldid=4076276" నుండి వెలికితీశారు