ఆచార్య స్థిరమతి సా.శ. 6 వ శతాబ్దానికి చెందిన భారతీయ బౌద్ధ పండితుడు, సన్యాసి.[1] యోగాచార సంప్రదాయకుడు. 'అభిధర్మ' మీద విశేష కృషి చేసాడు. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త 'వసుబందు' యొక్క నలుగురు ప్రధాన శిష్యులలో ఒకనిగా పేర్కొనబడ్డాడు. ఇతను రాసిన వ్యాఖ్యలలో ముఖ్యమైనవి 'త్రింశికాభాష్యం', 'మధ్యాంత విభాగ సూత్రా భాష్య టీక'.

జీవిత విశేషాలు మార్చు

సా.శ. 470-550 ప్రాంతంలో జీవించిన స్థిరమతి గురించిన విశేషాలు ఎక్కువగా తెలియవు.[2] మొదట్లో గుజరాత్‌లోని వల్లభి విశ్వవిద్యాలయంలోను ఆచార్యుడుగా ఎక్కువకాలం గడిపిన స్థిరమతి ఆ తరువాత నలందా విశ్వవిద్యాలయంలోను కొంతకాలం వున్నాడని తెలుస్తుంది.[1] గుణమతి శిష్యుడు. బౌద్ధ వాజ్మయంలో ఇతను యోగాచార తాత్వికుడైన వసుబంధువుకు ఆదర్శ శిష్యుడుగా పేర్కొనబడ్డాడు. అభిధర్మ' మీద అసాధారణ ప్రజ్ఞ కనపరిచిన స్థిరమతి ఈ రంగంలో గురువుని మించిన శిష్యునిగా పేరుపొందాడు. తన గురువు రచించిన గ్రంథాలకు బృహత్ వ్యాఖ్యలు రచించాడు.

స్థిరమతి భారతదేశంలో జన్మించినప్పటికీ, భారతీయ బౌద్ధ సాహిత్యంలో ఇతని ప్రస్తావన ఎక్కువగా కనిపించదు. ఇతని గురించిన విశేషాలు టిబెట్, చైనా ఆధారాల నుండి మాత్రమే తెలుస్తున్నాయి. టిబెటిన్ చరిత్రకారుల ప్రకారం స్థిరమతి భారతదేశంలో దండకారణ్యంలో శూద్రుని కొడుకుగా జన్మించాడని, బౌద్ధ తత్వవేత్త వసుబందు ఇతని గురువని తెలుస్తుంది.[2] భారతదేశంలో పర్యటించిన ప్రసిద్ధ చైనీయ యాత్రికుడు 'హుయాన్ త్సాంగ్', 'ఇత్సింగ్' లు స్థిరమతి ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్తలలో ఒకడని, అతను గుణమతి శిష్యుడని పేర్కొన్నారు.[2] హుయాన్ త్సాంగ్ శిష్యుడైన 'కూజి' (kuji) (632-682) ప్రకారం స్థిరమతి దక్షిణ భారతదేశంలో లాట (గుజరాత్) దేశానికి చెందినవాడని, వయస్సులో కాస్త పెద్ద వాడైనప్పటికి ఆచార్య ధర్మపాలునికి సమకాలికుడని తెలిపాడు.[2] దీనిని బట్టి టిబెటిన్ చరిత్రకారులు పేర్కొన్నవిధంగా స్థిరమతిని వసుబండు శిష్యునిగా భావించడం కన్నా, చైనీయ చరిత్రకారులు పేర్కొన్న ప్రకారం గుణమతి శిష్యునిగా ఎంచడమే సమంజసం.[2] అయితే స్థిరమతిని సాంప్రదాయికంగా వసుబందుని ఆదర్శ శిష్యుడిగా భావిస్తారు.

స్థిరమతి కాలం నిర్ణయించడంలో రెండు అభిప్రాయాలున్నాయి. హకుజు (Ui Hakuju) స్థిరమతి కాలాన్ని సా.శ. 470-550 గా సూచిస్తే, ఎరిక్ ఫ్రావాల్నర్ (Erich Frauwallner) సా.శ. 510-570 గా సూచించాడు.[2] అయితే గుణమతి, ధర్మపాలుని కాలాలు, హుయన్ త్సాంగ్ గణనలు మొదలైనవి పరిగణనలోనికి తీసుకొంటే స్థిరమతి కాలాన్ని సా.శ. 470-550 గా నిర్ణయించడం సమంజసంగా వుంటుంది.[2]

రచనలు మార్చు

ఆచార్య స్థిరమతి మౌలికంగా వ్యాఖ్యాత. అతను స్వతంత్ర రచనలేవీ చేయలేదు.[2] ఇతని వ్యాఖ్యలలో రెండు (త్రింశికాభాష్యం, మధ్యాంత విభాగ సూత్రా భాష్య టీక) మాత్రమే సంస్కృతంలో లభిస్తున్నాయి. మిగిలినవి టిబెటిన్ భాషానువాద రూపంలో లభిస్తున్నాయి.

  • కాశ్యప పరివర్త టీక:
  • సూత్రాలంకార వృత్తి భాష్యం: ఇది వసుబందుని సూత్రాలంకార వృత్తికి చేసిన విస్తృత వ్యాఖ్య. దీనిని సిల్వైన్ లెవి (Sylvain Levi) పండితుడు ప్రకటించాడు.[3]
  • త్రింశికాభాష్యం: ఇది వసుబందుని త్రింశికకు విస్తృత భాష్యం. వసుబందు రాసిన 'విజ్ఞాప్తిమాత్రసిద్ధి' వ్యాఖ్య 'వింశిక', 'త్రింశిక' అనే రెండు పాఠాలలో లభ్యమవుతుంది. స్థిరమతి 30 కారికలు గల 'త్రింశిక'కు వ్యాఖ్య రాసాడు. స్థిరమతి రాసిన భాష్యానికి సిల్వైన్ లెవి నేపాల్-ఫ్రెంచి అనువాదాలతో ప్రకటించాడు.[3] యోగాచార తత్వాన్ని క్రమబద్ధంగా అర్ధం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు త్రింశికాభాష్యంలో ఉన్నాయి.[2]
  • పంచస్కంధ ప్రకరణ విభాష్య: ఇది వసుబందుని అభిధర్మకోశ భాష్యం పై రాయబడిన టీక. టిబెటిన్ అనువాదంలో లభిస్తుంది.
  • మూలమాధ్యమిక కారికావృత్తి: ఇది నాగార్జునుని గ్రంథం మూలమాధ్యమికకారిక పై రాయబడిన వ్యాఖ్య.
  • మధ్యాంత విభాగ సూత్రా భాష్య టీక: మైత్రేయనాథుని మధ్యాంతవిభాగానికి వసుబందు ఒక వ్యాఖ్య రాసాడు. ఈ వసుబందుని వ్యాఖ్యకు టీకగా స్థిరమతి దీనిని రాసాడు.[3]

అంచనా మార్చు

స్థిరమతికి తన సమకాలికుడైన ధర్మపాలునికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. దీనికి కారణం అతని రచనలు చైనా భాషలో అనువాదం కాకపోవడమే. యోగాచారంపై స్థిరమతి యొక్క అభిప్రాయాలకు చైనీయ బౌద్ధులు చేసిన వివరణలు అసంపూర్తిగాను, అసంబద్డంగాను వుండటంతో ఆతను యోగాచార తత్వానికి చేసిన తోడ్పాటు అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.[2] అదేవిధంగా అసంగుడు, వసుబందు లాంటి బౌద్ధ తత్వవేత్తల యోగాచార కృతులపై పెట్టినంత దృష్టిని, ఆధునిక పండితులు స్థిరమతి కృతులపై పెట్టలేదు. దీనికి కారణం స్థిరమతి మౌలికంగా స్వతంత్ర రచనలు చేయకపోవడం.[4] దానితో వారు అతనిని స్వతంత్ర భావాలు లేనివానిగా ఎంచి కేవలం మూల గ్రంథాలపై చేసిన వ్యాఖ్యాత గానే గుర్తించారు. అయితే స్థిరమతి ప్రతిభావంతుడైన తత్వవేత్త. ఇతని రచనలలో యోగాచార తత్వ సంబంధమైన వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి. ఇతను ప్రధానంగా యోగాచార సంబంధిత భావాలను విశిదీకరించడంలో, వాటిని క్రమబద్ధీకరించడంలో తన దృష్టిని కేంద్రీకరించాడు.[2] యోగాచార (విజ్ఞానవాదం) సంప్రదాయంపై ఇతను రచించిన వ్యాఖ్యలు 'మధ్యాంత విభాగ సూత్రా భాష్య టీక', 'సూత్రాలంకార వృత్తి భాష్యం'లు మహాయాన బుద్ధత్వం, సంబోధి, ధర్మదాతు, బుద్ధమార్గానికి లక్ష్య సాధన మొదలగున భావాలను వివరణాత్మకంగా తెలియచేస్తాయి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Chinese Buddhist Encyclopedia.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 Sthiramati & encyclopedia.com.
  3. 3.0 3.1 3.2 Pandita Baladevopadyaya, 2006 & p 209.
  4. Jowita Kramer,. "THE INDIAN YOGĀCĀRA SCHOLAR STHIRAMATI AND THE WORKS ATTRIBUTED TO HIM". Fairbank Center for Chinese Studies. Retrieved 18 August 2017.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  • Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం.
  • "Sthiramati". encyclopedia.com. Retrieved 18 August 2017.
  • "Sthiramati". Chinese Buddhist Encyclopedia. Archived from the original on 22 నవంబర్ 2017. Retrieved 18 August 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)

మూలాలు మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=స్థిరమతి&oldid=4102208" నుండి వెలికితీశారు