హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్)

హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్)

బాబాను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించిన వారిలో కాకాదీక్షిత్ ఒకడు . అతని అసలు పేరు హరిసీతారం దీక్షిత్ . అతడు బొంబాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన న్యాయవాది . స్వాతంత్రోద్యమ సమయంలో మన దేశ నాయకుల తరఫున ఎన్నో న్యాయ విచారణలలో తన ప్రతిభ కనపరచి దేశమంతా మంచి పేరు తెచ్చుకున్నాడు . జాతీయ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగాను ,బొంబాయి నగర్ పాలక్ సంస్ధలో కౌన్సిలర్ గాను పనిచేసి ఇటు ప్రజల అభిమానాన్ని ,తెల్లప్రభుత్వం మన్ననలను పొందగలిగాడు . చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగడం వల్ల అతనికి దైవ చింతన ఎక్కువ . నిరంతరం ఎన్నో తీర్ధ యాత్రలు చేస్తుండేవాడు .

ఒకసారి 1906 సం ॥ లో ఇంగ్లాండు వెళ్ళినప్పుడు అతని కాలుకు దెబ్బ తగిలి అవిటితనం వచ్చింది . ఎన్ని చికిత్సలకూ అవిటితనం తగ్గక పోయేటప్పటికి అతనికి తీవ్రమైన వైరాగ్యం కలిగింది . తనకున్న సిరిసంపదలు ,పేరు ప్రఖ్యాతులు తన కష్టాన్ని తొలగించలేవని అతనికి అర్ధమైంది . తీవ్రమైన ఆధ్యాత్మిక చింతనతో ,వైరాగ్యంతో అతడు జీవితం గడుపుతున్న సమయంలో స్నేహితుడైన నానా చందోర్కర్ ద్వారా బాబా గురించి తెలిసింది .

సం ॥ 1909 లో మొదటిసారి బాబాను దర్శించగానే ఆయనపై తీవ్రమైన భక్తి శ్రద్ధలు కలిగాయి . అతడు తరచుగా శిరిడీ దర్శిస్తూ అక్కడే ఇల్లు కట్టుకుని నివసించసాగాడు . ఆ ఇంటి మేడ మీద సాధన చేసుకోవడానికి తనకోసం ఒక్క గది మాత్రమే ఉంచుకుని మిగిలిన భవన్నాన్నంతా సాయిని దర్శించడానికి వచ్చే భక్తులు నివసించడానికి వదిలేశాడు . అదే 'దీక్షిత్ వాడా '. ఇక అతనికి తన అవిటితనం తొలగించుకోవాలని కూడా అనిపించలేదు . అది చాలా చిన్న సమస్యగా అతని మనస్సుకు తోచింది . బాబా సన్నిధి తప్ప అతనికి ఇంకేమీ కావాలనిపించలేదు . తనకున్నదంతా దాన ధర్మాలు చేసి సాయిసేవలో ఉండిపోయాడు . అతనిలో వచ్చిన మార్పుకు మెచ్చి బాబా "కాకా నీవేమి ఆందోళన పడవలసిన అవసరం లేదు ,నీ బాధ్యత నాది "అన్నారు . బాబా అభయం ఉన్నాక ఇక చింతెందుకు ? హాయిగా సాయి సన్నిధిలో నిరాడంబరంగా జీవించసాగాడు కాకా .

కాకాను తన గదిలో తీవ్ర సాధనలో గడపమని చెప్పారు బాబా . అలా తొమ్మిది నెలల పాటు కాకా తీవ్రమైన సాధనలో గడిపాడు . నిత్యమూ బాబా అతనిని భాగవతము ,భావార్ధ రామాయణమూ పారాయణ చేసి వాటి ప్రకారం జీవించమన్నారు . బాబా ఆజ్ఞను శ్రద్ధతో పాటించి కృతార్ధుడయ్యాడు కాకా .

ఒకసారి కాకాదీక్షిత్కు ధ్యానంలో విఠలుని దర్శనమైంది . అతడు బాబాను దర్శించాగానే ,"నీకు విఠలుని దర్శనమైంది కదూ ! ఒక్క క్షణమైనా విఠలుని మరచిపోకు ,గట్టిగా పట్టుకో!" అన్నారు . అనుకోకుండా అతనికి ఆ రోజు విఠలుని చిత్రపటాలు అమ్ముకునే ఒక వ్యక్తి కనిపించాడు . అతడి దగ్గర ఉన్న చిత్రపటాలు ఒకటి తనకు ఆ ఉదయం దర్శనమిచ్చిన విఠలుని రూపంతో ఉన్నది . దానిని కొని పూజలో పెట్టుకున్నాడు కాకా . ఇలా అతనికి సాయి ఎన్నో అనుభవాలను ప్రసాదించారు.

బాబా మహాసమాధి చెందాక కాకా దీక్షిత్ సాయి సంస్ధానంలో కార్యదర్శిగా సేవచేశాడు . ఏ సమస్య వచ్చినా బాబా ముందు చీట్లు వేసి ఏ సందేశమొచ్చినా బాబా ఆజ్ఞగా పాటించేవాడు కాకా . 'సాయిలీల 'అనే పత్రికకు కాకా దీక్షిత్ సంపాదకుడిగా సేవచేసి బాబా లీలలను ,బోధలను ప్రచారం చేశాడు . అంతటి భక్తి కలిగిన కాకాను ప్రేమతో తనతో కలిసి భోజనం చేయనిచ్చేవారు సాయి . అతని భక్తికి మెచ్చి బాబా కాకాకు తమ కఫ్నీ ప్రసాదంగా యిచ్చారు .

బాబాను అంతటి భక్తి శ్రద్ధలతో సేవించిన కాకాదీక్షిత్ పవిత్రమైన ఏకాదశినాడు 1926 సం ॥ లో బాబా స్మరణ చేస్తూ శరీరం చాలించాడు . తొమ్మిది సంవత్సరాలు బాబాను సేవించి రామాయణం పారాయణ ,భజన పూర్తి చేసుకొని సాయి కృపను సాటి భక్తునితో పంచుకుంటూ శరీరం వదిలి బాబా పాదాలలో ఐక్యమయ్యాడు కాకా . అలా బాబా తమ కృపను ఆ భక్తునిపై కురిపించారు .