అన్నాసాహెబ్ దభోల్కర్ (హేమాండ్ పంతు)

బాబా చరిత్రను మొట్టమొదటి సారి రచించినది అన్నాసాహెబ్ దభోల్కర్ అతనిని బాబా "హేమాద్పంత్" అని పిలిచేవారు అతడొక పేద బ్రాహ్మణుడు హేమాద్పంత్ మొదట ఒక చిన్న టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు త్వరలో అతడి సామర్ధ్యం గుర్తించిన పై అధికారులు అతనికి త్వరత్వరగా ప్రమోషన్లు ఇచ్చారు అతడు గ్రామ సేవకుడి స్ధాయి నుంచి గౌరవ మేజిస్ట్రేట్ స్ధాయికి ఎదిగాడు తర్వాత కొంతకాలానికి అతడు బాబాను దర్శించాడు.

కాకాదీక్షిత్ అనే సాయి భక్తుడు అతనికి స్నేహితుడు అతడు బాబా గురించి అన్నా సాహెబ్ దభోల్కర్ చెప్పాడు కాకా దీక్షిత్ బాబా గొప్పతనం గురించి ఎంతగా ఎన్నిసార్లు చెప్పినా అతనికి బాబాను వెంటనే దర్శించాలని బుద్ధి పుట్టలేదు చివరకు ఒకసారి ఎలాగో శిరిడీ చేరాడు అయినా వెంటనే బాబా దర్శనానికి వెళ్ళకుండా బాలాభాటే తో వాదిస్తూ వాడాలో కాలాన్ని వృద్ధా చేశాడు అలా చాలా సేపు గడిచాక వారిద్దరూ బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు వీరేమి చెప్పకముందే బాబా "ఏమిటి వాడాలో వాదించు కుంటున్నారు" అని అడిగారు అంతేకాదు ఆయన అన్నాసాహెబ్ దభోల్కర్ ను చూపించి "ఈ హేమాద్పంత్ ఏమంటున్నాడు ?" అన్నారు ఆ మాటలు విని ఆయన సర్వజ్ఞత్వానికి ఎంతో ఆశ్చర్యపోయాడు దభోల్కర్ అప్పటి నుంచి బాబాపై భక్తి కలిగింది బాబా అతడిని 'హేమాద్పంత్' అని పిలవడం వల్ల అతనికి ఆ పేరే స్ధిరపడి పోయింది.

పూర్వకాలంలో 'హేమాద్పంత్' అనే పేరుగల గొప్ప రాజనీతిజ్ఞుడు, కళాకారుడు, పండితుడు ఉండేవాడు బాబా చమత్కారంగాను మందలింపు గానూ దభోల్కర్ కు 'హేమాద్పంత్' అని పేరు పెట్టారు అంతటి పాండిత్యము లేకపోయినా ఇతరులతో వాదించి గెలవాలనే కోరిక కలవాడని అలా ఉండకూడదని హెచ్చరించ డానికే బాబా అతనికి ఆ పేరు పెట్టారు బాబా ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకుని ఆయన బోధను వినయంగా స్వీకరించాడు హేమాద్పంత్ అంతేకాదు బాబాపట్ల అతని భక్తి రోజు రోజుకూ పెరగసాగింది ఆయన గొప్పతనం గురించి అందరికీ తెలియజెప్పి వారు ఆయనను సేవించు కునేలా చేయాలనే సంకల్పంతో భక్తుల అనుభవాలను సేకరించి "సాయి సచ్చరిత్ర" అనే గ్రంథం వ్రాశాడు హేమాద్పంత్ ఆ గ్రంధానికి బాబా తమ ఆశీస్సులందించారు.

హేమాద్పంత్ ఇలా చెప్పాడు "బాబా పాదాలు మొదటిసారి తాకి నమస్కరించుకున్న క్షణం నుంచీ నా మనస్సు మారిపోయింది కొత్త జీవితం మొదలైంది సమర్ధ సద్గురువైన సాయినాథుని దగ్గరకు నన్ను తీసుకెళ్ళిన కాకాదీక్షిత్ ఋణం నేనెప్పటికీ తీర్చుకోలేను బాబాను దర్శించగానే మన ఆలోచనలన్నీ మారిపోతాయి చెడు ఆలోచనలు ఆగిపోయి మంచి భావాలు మన మనస్సులలో నిండుతాయి ఆయన దర్శనం ఎన్ని జన్మల పుణ్యఫలమో బాబాను దర్శిస్తే ఆయనే ఈ సకల చరాచర సృష్టి అంతా నిండి ఉన్నారని అర్ధమౌతుంది" అలా ఎంతో గొప్ప భక్తుడయ్యాడు హేమాద్పంత్ బాబా సమాధి చెందిన తర్వాత అతడు సాయి సంస్ధానంలో ఎంతో సేవ చేసాడు కొంతకాలం 'సాయి లీల' పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు తర్వాత అతడు వ్రాసిన గ్రంథం "సాయి సచ్చరిత్ర" అనే పేరుతో జగద్విఖ్యాతమైంది అంతటి ధన్యజీవి హేమాద్పంత్.