12 యాంగ్రీ మెన్ అనే నాటకం ఆధారంగా 1957లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 1954 లో రెజినాల్డ్ రోస్ రాసిన టెలిప్లే ఆధారంగా ఈ సినిమా తీసారు.[1] నిందితుడు నిరపరాధి అని నమ్మిన ఒక జ్యూరీ సభ్యుడు, అతడు నేరస్థుడే అని నమ్మే మిగతా 11 మంది సభ్యులను తన ఆలోచనలతో, తన వాదనాపటిమతో ఎలా మార్చగలిగాడు అన్నది ఈ చిత్ర కథాంశం. హెన్రీ ఫోండా ఈ సినిమాలో నటించడమే కాకుండా దీనికి సహ నిర్మాత కూడా. లీ జె కాబ్, ఎడ్ బెగ్లీ, ఇ.జి. మార్షల్, జాక్ వార్డెన్ ఇతర ప్రముఖ నటులు.

12 యాంగ్రీ మెన్
సినిమా పోస్టరు
దర్శకత్వంసిడ్నీ లూమెట్
రచనరెజినాల్డ్ రోస్
నిర్మాతహెన్రీ ఫోండా
రెజినాల్డ్ రోస్
తారాగణంహెన్రీ ఫోండా
ఛాయాగ్రహణంబోరిస్ కాఫ్‌మన్
కూర్పుకార్ల్ లెమర్
సంగీతంకెన్యన్ హాప్‌కిన్స్
పంపిణీదార్లుయునైటెడ్ ఆర్టిస్ట్స్
విడుదల తేదీs
అమెరికా:
1957 ఏప్రిల్ 13
సినిమా నిడివి
96 నిమిషాలు
భాషఇంగ్లీషు
బడ్జెట్US$340,000 (అంచనా)

కథాంశం

మార్చు

ఒక కుర్రవాడు తన తండ్రిని హత్య చేసాడన్న ఆరోపణ పైన కోర్టులో వాదోపవాదాలు ముగుస్తాయి. అమెరికన్ చట్ట ప్రకారం న్యాయనిర్ణేతలయిన 12 మంది తమలో తాము చర్చించుకొని ఏకగ్రీవంగా ఒప్పుకున్నపుడే దోషిని శిక్షించవచ్చు. ఏ ఒక్కరు ఒప్పుకొనకపోయినా తిరిగి విచారణ మొదలవుతుంది.

12 మంది జ్యూరీ సభ్యులు ఒక గదిలోకి వెళ్ళి, నిజంగా ఆ కుర్రవాడు చేసాడా లేదా అన్న విషయం పైన చర్చించడం మొదలు పెడతారు. కోర్టులో సాక్షులు చెప్పిన దానిని బట్టి, మరి కొన్ని ఆధారాలను బట్టీ ఆ కుర్రవాడు తన తండ్రిని హత్య చేసాడని 11 మంది జ్యూరీ సభ్యులు నిర్ణయిస్తారు. ఒక్క సభ్యుడు మాత్రం ఆ కుర్రవాడు హత్య చేసాడనడానికి ఆధారాలు లేవని, ఆ కుర్రవాడు హత్య చేసి ఉండడనీ అంటాడు.

ఆ ఒక్క సభ్యుడు తన అభిప్రాయాలను తెలియజేసి, పలు సన్నివేశాలను ఊహించి ఆ కుర్రవాడు హత్య చేసి ఉండడు అని ఒక్కొక్క సభ్యుణ్ణే ఒప్పిస్తూ చివరగా మొత్తం 11 మందినీ ఒప్పించడంతో ఆ కుర్రవాడు నిర్దోషి అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు.

నిర్మాణం

మార్చు

ఈ సినిఉమా షూటింగు న్యూయార్కులో చేసారు. $3,37,000 బడ్జెట్టులో (2021 ధరల ప్రకారం ఇది $32,51,000 కు సమానం) ఈ సినిమా తీసారు.[2] ఎంతో శ్రమించి రిహార్సిల్స్ చేయడం వలన కేవలం మూడు వారాలలో సినిమా నిర్మాణం పూర్తి అయింది.

దాదాపు సినిమా అంతటినీ కేవలం ఒకే గది ఉన్న సెట్‌లో తీయడం ఈ సినిమా విశిష్టత. మూడు నిమిషాలు మినహా మొత్తం సినిమా 16 x 24 అడుగుల గదిలో జరుగుతుంది. కథాంతంలో ఇద్దరు జ్యూరీ సభ్యులు తమ పేర్లు ఒకరికొకరు చెప్పుకోవడం మినహా, సినిమా మొత్తంలో ఎవ్వరి పేరూ వినపడదు. సంబోధనలన్నీ 'కుర్రవాడు', 'వృద్దుడు' 'ఎదురింటిలో ఉన్న స్త్రీ' అంటూనే సాగుతాయి.

స్పందన

మార్చు

విడుదల తర్వాత ఈ చిత్రం విమర్శకులనుండి గొప్ప పేరు తెచ్చుకుంది. కానీ అప్పటికే ప్రసిద్ధి పొందుతున్న కలర్ సినిమాల వల్ల బ్లాక్ అండ్ వైట్‌లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన మేరకు కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయింది. 8వ న్యాయనిర్ణేతగా హెన్రీ ఫోండా నటించిన పాత్ర 20వ శతాబ్దపు 50 గొప్ప పాత్రలలో 28వ స్థానంలో నిలిచింది. కోర్టు డ్రామాకు సంబంధించిన చిత్రాలలో ఇది రెండవ అత్యుత్తమ చిత్రంగా పేరుపొందింది. ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో కోర్ట్ రూం డ్రామా విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది.[3]

విడుదలైనపుడు ఘన విజయం సాధించని ఈ చిత్రం, కాలక్రమంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని గొప్ప చిత్రాల జాబితాలో చేరింది. ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకు 'ఆలోచనా ధోరణి ' గురించి బోధించడానికి ఈ చిత్రాన్ని ఉపయోగిస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. "12 Angry Men". Harrison's Reports. March 2, 1957. p. 35. Retrieved June 7, 2019 – via archive.org.
  2. Hollinger, Hy (December 24, 1958). "Telecast and Theatre Film, Looks As If '12 Angry Men' May Reap Most Dough As Legit Play". Variety. p. 5. Retrieved May 21, 2019 – via archive.org.
  3. "AFI's 10 Top 10 Courtroom Drama". American Film Institute. June 17, 2008. Retrieved November 29, 2014.

బయటి లింకులు

మార్చు