కోగిర జయసీతారాం

కోగిర జయసీతారాం (నవంబర్ 14, 1924 - అక్టోబర్ 9, 2000) [1] అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. కోనపురం, నడింపల్లె, బొంతలపల్లె, కోగిర, రామగిరి మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 - 85 మధ్యకాలంలో పనిచేశాడు.[2] ఆ పల్లెలలో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలిసి తిరుగుతూ ఆ ప్రజాజీవితాన్ని,భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లి ప్రజాకవిగా నిలిచాడు.

కోగిర జయసీతారాం
కోగిర జయసీతారాం
జననంకోగిర జయసీతారాం
నవంబర్ 14, 1924
India కోగిర గ్రామం, రొద్దం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణంఅక్టోబర్ 9, 2000
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి, తబలా, హార్మోనియం వాద్యకారుడు, చిత్రకారుడు
పదవి పేరుకవికాకి
మతంహిందూ
తండ్రిగౌని ఓబులరెడ్డి
తల్లిగౌని చెన్నమ్మ

జీవిత విశేషాలు మార్చు

"తెలుగు సాహిత్యంలో కవికోకిల, కవి వృషభ, కవి సింహ, కవికిశోర మొదలైన బిరుదులు కలవారే ఎక్కువ మంది ఉన్నారు. కవికాకి బిరుదు ఎవరికీ ఉన్నట్లు లేదు. మీకు ఇస్తున్నాం. స్వీకరించగలరా?" అని ఒక నిండు సభలో ఆ సభాధ్యక్షుడు ఇతడిని ప్రశ్నించగా ఈయన నిస్సంకోచంగా ముందుకు వచ్చి "కాకి ప్రజల పక్షి. నిత్యము వాళ్ళను మేల్కొపుతూ వుంటుంది. నేనూ అటువంటి వాడినే. నాకు ఆ బిరుదు తగినదే" అని సభలో పలికి గౌరవాగౌరవాలను సమాన స్థాయిలో స్వీకరించిన సుకవి ఇతడు. అనంతపురం మాండలికాన్ని ఇతడు తన రచనలలో అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతడిని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇచ్చి సత్కరించింది. 1984-85 సంవత్సరానికి రెండవ తరగతి తెలుగువాచకాన్ని అందించాడు. ఇతడు చెయ్యి తిరిగిన రచయితే కాకుండా తబలా, హార్మోనియంలు వాయించడంలో దిట్ట. మంచి చిత్రకారుడు కూడా. ఇతడు 2000, అక్టోబరు 9 తేదీన చనిపోయాడు.

రచనలు మార్చు

  1. నిట్టూర్పులు (పద్యకావ్యం)
  2. విజయప్రభ (బుఱ్ఱకథ)
  3. సుగుణా శతకము (400 పద్యాలు)
  4. మదాంధబరాతము (వ్యంగ్య రచన)
  5. అరణ్యరోదనము (సీసపద్యాలు)
  6. కావ్ కావ్ శతకము
  7. కాకిగోల (గేయాలు)
  8. పండువెన్నెల (పిల్లల పాటలు)
  9. జయభారతి (బుడబుక్కల కథ)
  10. కృష్ణార్జున యుద్ధము (నాటకము)
  11. రామాంజనేయ యుద్ధము (నాటకము)
  12. సీతారామ కళ్యాణము (నాటకము)
  13. మేం పిల్లలం (150 బాలగేయాల సంకలనం)
  14. అక్షరసైన్యం
  15. జైసీతారాం సీసాలు

రచనల నుండి మచ్చుతునకలు మార్చు

ఆడ బెయ్యెదెవ్‌రు? ఆదిగా - "యాలవా"
"అగ్గిపెట్టె వుంద అనుముగా; నితావ?"
"వూను వుందితాలు నేనంటిత్త"
---- ---- ----
"కప్కొనేకి యేడ్డి కప్పడమూ లేదు
దుప్టి గొందమంటె దుడ్లు లేవు
తొలుపుల్యాక వాకిలికి తడకడ్డం బెట్కోని
యేటి బతుకో యేమొ యల్ల కాల్ము"
"-యంగటమ్మా! లేత్వ, యింగా లేదా"
"ఏం, లేశ్ననత్తా! యెసురెంత బెట్టల్ల"
"రొండు జెమ్లు బెట్టు; పిండి వుందొ"
"యాడిదిప్‌డు రాగులిసురల్ల; యెసర్లోకి"
"సందకాడ వురికె సత్తారంద్రు...."
(సలిమంటలు అనే కవిత నుండి)
అక్కా! పెట్టు
చుక్కా బొట్టు!
అవ్వా! నాకు
బువ్వా పెట్టు!
అమ్మా! నాకు
బొమ్మా ఇవ్వు!
నాన్నా! నాకు
పెన్నూ ఇవ్వు!
(మేం పిల్లలం పిల్లల గేయసంపుటి నుండి)

మూలాలు మార్చు

  1. రాయలసీమ రచయితల చరిత్ర - నాలుగవ సంపుటం - కల్లూరు అహోబలరావు
  2. తెలుగు వెలుగు మాసపత్రిక నవంబరు 2013 పేజీలు 50-51 టి.వి.రామకృష్ణ వ్యాసం