చింతామణి పాణిగ్రాహి

భారత రాజకీయనేత

చింతామణి పాణిగ్రాహి (1922 మార్చి 22 - 2000 ఏప్రిల్ 29) ఒడిశాకు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, రాజకీయ, సామాజిక నాయకుడు. అతను 1989 నుండి 1993 వరకు మణిపూర్ గవర్నర్‌గా పనిచేశాడు.

చింతామణి పాణిగ్రాహి
చింతామణి పాణిగ్రాహి

చింతామణి పాణిగ్రాహి


వ్యక్తిగత వివరాలు

ప్రారంభ జీవితం, స్వాతంత్ర్యోద్యమం మార్చు

చింతామణి ఒరిస్సా లోని పూరి జిల్లా బిశ్వనాథ్‌పూర్‌లో గోపీనాథ్ పాణిగ్రాహి, గెలీ దేవిలకు జన్మించాడు. అతను భగవతి చరణ్ పాణిగ్రాహికి (ఒరిస్సాలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు) మొదటి కజిన్. లెజెండరీ ఒరియా రచయిత పద్మభూషణ్ కాళిందీ చరణ్ పాణిగ్రాహికి మొదటి కజిన్. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి నందిని శత్పథి అతని మేనకోడలు. 1946 లో రాధామణి పాణిగ్రాహిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి నలుగు కుమారులు, ఒక కుమార్తె.

అతను "బిచిన్న ఉత్కల్ అబ్కాష్ బాహిని" లో క్రియాశీల సభ్యుడు. ఇది 1938 మే 17 న అప్పటి రావెన్‌షా కాలేజియేట్ స్కూల్ ప్రిన్సిపాల్ సుకాంత రావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉత్కల్ (ఒరిస్సా) నుండి విడిపోయిన ప్రాంతాల్లో ఒరియా భాష, సంస్కృతిని రక్షించడం ఈ సంస్థ లక్ష్యం. వేసవి సెలవుల్లో వారు మేదినీపూర్, బంకురా, సింఘ్భుం, సరాయికేలా, ఖర్సావన్, చైబాసా, చక్రధర్, తరాలా, టికిలీ, మంజూష లను సందర్శించి, అక్కడి స్థానికులతో ఒరియాలో సంభాషించి, జాతీయ సమగ్రత గురించ్ ప్రవచించేవారు.

పాణిగ్రాహి 1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, స్నేహితులతో కలిసి రావెన్‌షా కాలేజీలో భారత జాతీయ జెండాను ఎగురవేశాడు. దాంతో కళాశాల నుండి సెలవు తీసుకోవాల్సి వచ్చింది. ఉన్నత చదువుల పట్ల గల మక్కువ, స్వాతంత్ర్య పోరాటంలో భాగం కావాలనే కోరిక చింతామణిని కోల్‌కతాకు తీసుకెళ్ళాయి. అక్కడ అతను కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న విద్యాసాగర్ కళాశాలలో ఎం.ఏ లో చేరాడు. ఆ కాలంలో పశ్చిమ బంగా కాంగ్రెస్‌లో చేరాడు. రాత్రివేళల్లో బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు, హ్యాండ్‌బిల్స్ వ్రాసేవాడు. 1946 ఆగస్టు 16 న, బెంగాల్‌లో పెద్దయెత్తున హిందూ-ముస్లిం అల్లర్లు జరిగాయి. ఉత్కళ బాహిని ద్వారా పాణిగ్రాహి నేతృత్వంలో శాంతి కవాతు చేసారు. బాధితులకు వైద్య సహాయంతో పాటు ఆహారం అందించారు. "కలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం" అనే మంత్రాన్ని ఉద్బోధించారు.

పాత్రికేయం, రాజకీయాలు మార్చు

చింతామణి పాత్రికేయుడు, రచయిత, కార్మిక నాయకుడు. "డైలీ ప్రజాతంత్ర" (1947-1951), "డైలీ మాతృభూమి" (1951-1956) పత్రికలకు సంపాదకత్వం వహించాడు. అతను ఆల్ ఉత్కల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషనుకు కార్యదర్శిగా పనిచేసాడు. ప్రపంచ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషనుకు ఉపాధ్యక్షుడయ్యాడు. 1957 లో 2 వ లోక్‌సభకు పూరీ నియోజకవర్గం నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. తరువాత, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. భువనేశ్వర్ నియోజకవర్గం నుండి 1967, 1971, 1980, 1984 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1] కేంద్ర ప్రభుత్వంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా (1986-88), రక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా (1988-89) పనిచేసాడు.

1989 జూలై 10 నుండి 1993 మార్చి 19 వరకు మణిపూర్ గవర్నరుగా పనిచేసాడు. మణిపూర్ గవర్నరుగా ఉండగా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆయన చేసిన కృషి కారణంగా వారు అతన్ని "ప్రజల గవర్నరు" అని పిలిచేవారు.

రచనలు మార్చు

పాణిగ్రాహి ఒరియాలో గాంధీ కహానీ, యుగ సాహిత్య, బిజయీ హో-చి-మిన్, పిలాంక మావో సే టుంగ్, చరణ్ సంగీత, నీలి పర్వతం ద్వారా ప్రయాణం, ప్రజలతో మొదలైన రచనలు చేసాడు. ఇంగ్లీషులో ఒరిస్సా స్ఫిక్స్, ది ట్రాజెడీ ఆఫ్ ది ఒరిస్సా ఫ్లడ్స్ రాసాడు.

చింతామణి పాణిగ్రాహి 2000 ఏప్రిల్ 29 న భువనేశ్వర్‌లో, కళింగ ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-10-07. Retrieved 2021-10-07.