చిదిరెమఠం వీరభద్రశర్మ

శ్రీ చిదిరెమఠం వీరభద్రశర్మ ఆధ్యాత్మికవేత్త, వీరశైవ గురుకుల స్థాపకులు, బహుభాషాకోవిదులు, విభూతి అనే సారస్వతపత్రికా స్థాపకులు, శ్రీ జగద్గురు విశ్వారాధ్య పీఠాధ్యక్షులు.

శ్రీ చిదిరెమఠం వీరభద్రశర్మ
చిదిరెమఠం వీరభద్రశర్మ
జననంవీరభద్రశర్మ
1906,
చర్లపల్లి
మరణంజనవరి 25, 1948
ప్రసిద్ధిఆధ్యాత్మికవేత్త,
వీరశైవ గురుకుల స్థాపకులు
,బహుభాషాకోవిదులు,
విభూతి అనే సారస్వతపత్రికా స్థాపకులు,
శ్రీ జగద్గురు విశ్వారాధ్య పీఠాధ్యక్షులు.
మతంహిందూ మతము
తండ్రినాగభూషణ
తల్లిశ్యామలాంబ

బాల్యం,విద్యాభ్యాసం మార్చు

వీరభద్ర శర్మ నల్గొండ జిల్లాలోని చర్లపల్లె గ్రామానికి చెందిన, వీరశైవమతం నందు గురు వర్గానికు చెందిన మహేశ్వర శాఖలో సం.1906లో శ్యామలాంబ, నాగభూషణు దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులకు వీరు ఏకైక పుత్రులు. వీరికొక కనిష్ఠ సోదరిమాత్రము ఉండెను. నల్గొండ జిల్లాలోని 70 గ్రామాలకు చిదిరెమఠము కుటుంబమువారె మఠస్థులుగా ఉండిరి. 14 ఏండ్లు వయస్సు వచ్చులోపలనే తల్లితండ్రులు చనిపోవుటచేతను, జ్ఞాతులు, బంధువులు వీరి ఆస్తులను అపహరించుటచేతను, మరికొంతకాలమునకు వివాహితాయిన సోదరికూడ మరణించుటచేతను ఆదరించువారే లేక చిన్నతనమున బహుకష్టములకు లోనయిన శర్మగారు జన్మస్థలమును విడిచి హైదరాబాదు, నీరడగుంభ, నారాయణపేట మున్నగు తవులకేగి వీరశైవుల ఇండ్లలో భిక్షాటన మొనర్చుచు, సంస్కృత విద్యాభ్యాసము గావించిరి. త్వరలోనే వీరు కావ్యనాటక అలంకార సాహిత్యము సంపాదింపగలిగి వీరి తెలివితేటలకు, నైపుణ్యమునకు సంతసించి హైదరాబాదులో హైకోర్టు వకీలుగా నుండిన శ్రీ దేశ్ ముఖ్ బాబూరావు గారు, శ్రీ మహంతుమఠము చెన్నబసవయ్య అను వారు వీరిని ఆదరించిరి. 18 ఏండ్లకే సంస్కృతముతో పాటు ఆంధ్ర, కర్ణాటక భాషలయందు పాండిత్యమును సంపాదించిరి.

ఆధ్యాత్మిక పరిమళం మార్చు

1922సం. ప్రాంతమున శ్రీ శివకోటి వీరభద్రయ్య అను మహేశ్వరులు- పరమశివభక్తి సంపన్నులు పెక్కుదివ్య క్షేత్రములు సేవించి ద్వాదశజ్యోతిర్లింగములలో ఒకటి అగు వైద్యనాధేశ్వరలింగమును అభిషేకమొనరింపబోవ అచ్చటి బ్రాహ్మణులు ప్రతిఘటించిరట. అందుపై వీరశైవులకు వేదాధికారము కలదా, లేదా అను విషయమున వాదాములు కలిగి అవి న్యాయస్థానముల కూడ నెక్కెనట. ఈ వివాదపరిష్కారవిషయమున నిజాము హైకోర్టువారు 1923-24సం.లో ఒక పండితసభనేర్పరచిరి. అదివరకు కాశీక్షేత్రములో విద్యనభ్యసించి వేదతీర్ధ పట్టము పొంది, ధార్వాడజిల్లాలో చౌడదానపురమఠాధ్యక్షులుగా నుండిన శ్రీ విరూపాక్షఒడయరు మహాస్వాములవారు పండితసభలో వీరశైవపక్షమున ప్రధాన పండితులుగా నుండిరి. అప్పుడు ప్రమాణ గ్రంధపరిశీలనాదికములలో వారికి శ్రీ వీరభద్రశర్మగారు కూడ తోడ్పడుచుండిరి. తుదకు హైకోర్టు వారు వీరికి అనుకూలముగా తీర్పు నిచ్చుట వలన, శ్రీ వీరభద్రయ్య గారు శ్రీ వీరభద్రశర్మ గారి చాకచక్యమునకు మిక్కిలి సంతసించి కాశీ క్షేత్రమునకు పోయి చదువుటకు సంస్కరించిరి. అటుపై వీరు విద్యాభ్యాసమొనర్చి స్మృతితీర్ధ, కావ్యతీర్ధ, ధర్మాచార్య, సాహిత్యవిశారద మున్నగు పట్టపరీక్షలందు కృతార్ధులయిరి. 1929 వ సం.లో వీరు హిమాలయము లకు సుమారు 500 మైళ్ళు కాలినడక సాగించి ఆయా విషయములను వివరించు నొక గ్రంధుము కూడా వ్రాసిరి. వీరు బ్రాహ్మీ లిపియందు అనేక దుర్గమ శాసనములను వీరు పఠించి ప్రకటింపగలిగిరి.

హిమాలయము నుండి తిరిగి రాగానే, కొంతకాలము యాదగిరి అందలి శంకరసంస్కృత కళాశాల అధ్యక్షులుగా పనిచేసిరి. అటు తరువాత శ్రీమటికె నాగయ్య అను భక్తవరులు దానపూర్వకముగ నొసగిన ధర్మనిలయమున వీరు వీరశైవగురుకులమున, శైవభారతీభవనమును సికింద్రాబాదులో నెలకొల్పి వీరశైవ విద్యార్ధులకు ఉచితముగా విద్య చెప్పుచుండిరి. అందే శివధర్మ గ్రంధమాలికను కూడ స్థాపించి వీరశైవ మహాత్ములు, రేణుక విజయము, శ్రీకరభాష్యము, శివపంచస్తని మున్నగు గ్రంధములు పదకొండు ప్రకటించిరి. బహుధాన్య సంవత్సర మహాశివరాత్రి దినమున విభూతి అను పేరుతో ఒక సారస్వతపత్రికను ప్రారంభించి రమారమి 4 సం. నిర్వహించి శైవమతసేవచేసిరి. వీరు బ్రహ్మ చర్యమును చేపట్టిరి.

జీవితకాలములో ఆహారవిహారములయందు వీరు పెక్కు నియమములు పాటించిరి.నెలకొక దినము మౌన వ్రతము పాటించుచుండిరి.ఆరోగ్యము చెడిన చివరి 8 కొద్ది నెలలు ఆహారమును విసర్జించిరి గాని స్నాన జప పత పాద్యనుష్ఠానముల నొక్కింతయు విరమింపరయిరి.