జాంబవతీ కళ్యాణము

సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన సంస్కృత నాటకము జాంబవతీ పరిణయము. దీనికే జాంబవతీ కల్యాణము అనే నామాంతరము కలదు. ఇది అయిదు అంకముల నాటకము. కధాసంగ్రహము భాగవతాది గ్రంధాలలో కనబడే శమంతకమణి హరణ కధయే కధావస్తువు.లీలాపవాదము నివారకముగా వినాయక చతుర్ధినాడు అవశ్య పఠనీయములగా స్కాంద పురాణము లో చెప్పబడిన కధలలో ఇది ప్రధానమైనది. ఈ గ్రంధమును అనేక సంస్కృతాంధ్ర గ్రంధములకు సంపాదకత్వము వహించిన అనుభవజ్ఞలగు డా బిరుదురాజు రామరాజు గారు 1968లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి వారి సౌజన్యంతో ప్రచురించినారు.

నేపధ్యం, ప్రారంభం మార్చు

వాంఛాం వ స్సతతం దేయో
త్త ద్వారణ ముఖం మహః
యచ్చంద్ర మౌళే రానంద నిష్యందం
ప్రధమం విధుః

అనే ప్రధమ నాందీ శ్లోకముతో రాయలు వారు ఈ నాటకమును ప్రారంభించిరి. ఇందులో నాందీ లక్షణము ననుసరించి ద్వాదశపదములున్నవి. చంద్రపద మున్నది. ఆశీర్వచనరూపమైనది. రెండవ నాందీ శ్లోకములోని కమలా నాధుడు, మూడవ దానిలో నీలా రుక్మిణీనాధుడు, నాల్గవ దానిలో వాయుపుత్రుడు సౌఖ్యాదు ఇచ్చుదురు గాక అని ఆశీర్వచనముతో మొదలుపెట్టబడినవి. ఈనాలుగు నాందీ శ్లోకాల పిమ్మట సూత్రధారుడు ప్రవేశించి రామ మహస్సుకు నమస్కరించి పుస్ఫాంజలి సమర్పించును. నటిని రావించి సూత్రధారుడు ఇట్లు నాటక ప్రస్తావన చేయును.

అద్యఖలు భగవత శ్చ రా చరమరోః అపారకరుణాపారావారస్య
సమ దమ ర శిరో మందార కుసుమవాసిత పాదారవిందస్య
విజయనగర నివాస ధీరిత ధనద నగర విహార దోహలస్య హేమకూటగిరి
కటక వాస్తవ్య కుటుంబినః కర్ణాట రాజ్యరక్షామణేః శ్రీ విరూపాక్ష దేవస్య చైత్రోత్సవ లోకనాయ సంజతా పరిషత్!

అని వర్ణింపబడిన సభలో నాటక ప్రదర్సనము జరుగునట్లు ప్రస్తావింపబడుట గమనార్హము. తర్వాత కృష్ణరాయః కవిః అని చెప్పబడినది.

కథాంశాలు మార్చు

నాటక ప్రారంభములోనే నారదుడు ప్రవేశించి, "బిలములో నివసించు జాంబవతికిని ద్వారకలో నివసించు శ్రీ కృష్ణుడు కిని సమావేశము కూర్చమని తనను బ్రహ్మపంపెనని పలికి ఆకార్యము సాధించుటకు ద్వారవతికి పోయివచ్చెదననుచు ప్రారంభించును.కాని అప్పటికే శ్రీకృష్ణుడు బిల్వపరిసరారణ్యమునకు వచ్చియుండెను. నారదుని ప్రయత్నమేమాత్రము లేకుండగనే జాంబవతికిని శ్రీ కృష్ణుకిని సమాగమమై అనురాగము వృద్ధి అవును. వారి కల్యాణమునకు కూడా నారదుడు చేసినదేమీ లేదు. సింహ రూపమున తన శిష్యుని పంపెదనని చెప్పును. వారదుని వలె జాంబవతి హృదయమును తెలుపుటకు కిన్నర మిధునము, గంధర్వుడు, హంసుడు, బ్రహ్మ, సరస్వతి పాత్రలు కలవు. కిన్నర మిధునము చేసిన పని జాంబవతి విఅరహవేదనను శ్రీ కృష్ణునికి వివరించుట. అటుపై జాంబవంతుడు తనకు దొరికిన శమంతకమణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప వీణా విద్వాంసురాలు అని వర్ణనలలో తెలుయును.

సంస్కృత నాటకముల అన్నింటిలో వలె ఇందును సంకృత ప్రాకృతం భాషలు రెండును కలవు. ఈనాటకములో మొత్తం పంక్తులు 2,295. వానిలో ప్రాకృత పంక్తులు 831, సంస్కృత పంక్తులు 1464. సంస్కృతము మాట్లాడు పాత్రల సంఖ్య 12, ప్రాకృతము మాట్లాడు వారు 12.


మూలములు మార్చు

  • 1973 భారతి మాస పత్రిక- వ్యాసము:జాంబవతీ పరిణయము- వ్యాసకర్త: శ్రీ. నోరి నరసింహ శాస్త్రి.