జులేఖా బేగం మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ భార్య. 1892 లో కోల్‌కతా లో జన్మించారు. 7-8 సంవత్సరాల వయస్సులోనే 13 ఏండ్ల వయస్కుడెన అబుల్‌ కలాం ఆజాద్‌తో వివాహం జరిగింది. మౌలానాకు జులేఖా బేగం నిరంతరం తోడ్పాటునందించారు. మౌలానా ఆజాద్‌ 1916లో మూడు సంవత్సరాలు జైలు లో గడిపినప్పుడు ఆమె భర్త నిర్వహిస్తున్న కార్యక్రమాలు కుంటుపడ కుండా చూశారు. మళ్ళీ 1922 ఫిబ్రవరిలో ఏడాది జెలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుచెప్పింది. అప్పుడు జులేఖా బేగం జాతీయోద్యమం పట్ల తన నిబద్ధతను చాటింది.మౌలానాను అరెస్టు చేయటంతో కలకత్తా కేంద్రంగా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాల బాధ్యతలను చేపట్టారు. నా భర్త అరెస్టు వలన బెంగాల్‌ ఖిలాఫత్‌ కమిటీ కార్యక్రమాలను నిర్వహిస్తానని గాంధీజీకి తెలియజేశారు. నా ఆరోగ్యం బాగాలేదు. ఈ నశ్వరమెన శరీరాన్ని ఖిలాఫత్‌ ఉద్యమానికి అంకితం చేస్తానన్నారు.మౌలానా రాజకీయ కార్యకలాపాలలోనూ సాహిత్య వ్యాసంగాలలోనూ ఆమె ఎంతో తోడ్పాటు అందించారు.1941లో జులేఖా బేగం అనారోగ్యం తీవ్రతరమయ్యింది.జులేఖా బేగం కలకత్తా వదలి రాంచీ వెళ్ళారు.ఆరోగ్యం కొంత మెరుగుపడ్డాక 1942 లో తిరిగి కలకత్తా వచ్చారు. ఆమె కలకత్తాకు వచ్చి నాలుగు రోజులు గడవక ముందే అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు బొంబాయి వెళ్ళిన మౌలానాను బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసి నైనిటాల్‌ జెలులో ఉంచింది.బేగం జులేఖా అనారోగ్యం రోజురోజుకు తీవ్రమై చివరకు భర్త కడసారి చూపుకు నోచుకోకుండానే 1943 ఏప్రిల్‌ 19న కలకత్తాలో మరణించారు.

జులేఖా బేగం సమాధి