జూపూడి యజ్ఞనారాయణ

జూపూడి యజ్ఞనారాయణ ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త, కళాకారుడు[1].

జీవిత విశేషాలు మార్చు

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన కఠెవరం అనే గ్రామంలో 1915, డిసెంబరు 26వ తేదీన వెంకాయమ్మ, జగన్నాథరావు దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య తెనాలిలో జరిగింది. తరువాత గుంటూరులో బి.ఎ. చదివాడు. అటు పిమ్మట మద్రాసులో బి.ఎల్‌. పూర్తి చేశాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీలో మూడు పర్యాయాలు సభ్యుడిగా కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. నాటక అకాడమీలో ఉన్నపుడు సైతం నాటకరంగం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి అనేక స్థాయిల్లో చర్చలు జరిపాడు. పేద కళాకారులకు సాయపడటం తన కర్తవ్యంగా భావించాడు. అకాడమీ ద్వారానే కాకుండా ఇతరత్రా వారికి ఆర్థిక, హార్దిక సాయం అందించాడు.

నాటకరంగం మార్చు

గుంటూరులో బి.ఎ. చదువుకునే సమయంలో ఇతనికి నాటకరంగం పట్ల ఆసక్తి కలిగింది. ఇతడికి మొట్టమొదటి సారి 1935లో షేక్‌స్పియర్‌ ఆంగ్ల నాటకం ‘ట్వెల్త్‌ నైట్‌’లో పాత్ర ధరించే అవకాశం వచ్చింది. ఈయన ఆరణాల ఆంధ్రుడే అయినా ఇంగ్లీషును దొరలకి ఏమాత్రం తీసిపోనివిధంగా పలికేవాడు! మంచి జ్ఞాపకశక్తి ఉండడంతో షేక్‌స్పియర్‌ నాటకంతో అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని తన పాత్రకు న్యాయం చేకూర్చాడు. ఇక అప్పట్నించీ నాటకాల జోరు మొదలైంది. డా. ముక్కామల అధ్యక్షుడిగా, ఇతడు కార్యదర్శిగా 1941లో ‘నవజ్యోతి సమితి’ అనే సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో ఆనాటి హేమాహేమీలందరూ సభ్యులుగానే ఉన్నారు. చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, యన్టీరామారావు, శివరావు, కె.వి.ఎన్‌.రావు, ప్రభల, కొంగర జగ్గయ్య వంటివారు సభ్యులుగా ఆ సంస్థ అభ్యున్నతికి దోహదపడ్డారు. నవజ్యోతి సమితి పక్షాన ప్రదర్శితమైన అనేక నాటకాల్లో కొండవీడు, క్షమ, భక్తకబీరు, తెలుగు కోపం, దయ్యాల కొంప మొదలైనవి ఉన్నాయి. అప్పట్లో మాడపాటి రామలింగేశ్వరరావు ఆంధ్ర విజ్ఞాన లలితకళా పరిషత్తును స్థాపించాడు. ఆయన కోరిక మేరకు జూపూడి యజ్ఞానారాయణ ఆ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పుడే కురుక్షేత్రంలో దుర్యోధన పాత్రను, గయోపాఖ్యానంలో బలరాముడు మొదలైన పాత్రలను పోషిస్తూ వాటికి వన్నెతెచ్చాడు. 1958లో ఇతడు ముక్కామల, ఏకా ఆంజనేయులు వంటివారితో కలిసి ‘వైజ్ఞానిక కళాసమితి’ అనే సంస్థను స్థాపించాడు. ఆ సంస్థపక్షాన ప్రతాపరుద్రీయం, తులసీ జలంధర, విప్రనారాయణ, శ్రీకృష్ణతులాభారం, గయోపాఖ్యానం, కురుక్షేత్రం, రామదాసు, గూడుపుఠాణి వంటి పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాల్లో ఎక్కువగా నటించాడు. గుంటూరులో ఎంతో ప్రజాదరణ పొందిన ‘గుంటూరు రిక్రియేషన్‌ క్లబ్‌ నాటకసమితి’కి కూడా యజ్ఞనారాయణ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ సంస్థపక్షాన నాయకురాలు, హరిశ్చంద్ర, శ్రీకృష్ణరాయబారం, నారద సంసారం, బొబ్బిలి యుద్ధం, గయోపాఖ్యానం వంటి నాటకాలను ప్రదర్శించాడు. నలగామరాజుగా ఇతడు నాయకురాలులో ధరించిన పాత్ర, కురుక్షేత్రంలో దుర్యోధనుడి పాత్ర, బొబ్బిలి యుద్ధంలో బుస్సీ... మొదలైన పాత్రలతో ఇతడికి ­ అభిమానులు ఏర్పడ్డారు. కొన్ని నాటకాల్లో రెండు మూడు పాత్రలు కూడా ధరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ‘‘భక్త రామదాసు’’ నాటకంలో తానీషా పాత్ర, ధర్మకర్త రెండూ ఇతడే ధరించేవాడు! ఎంతటి గొప్ప నటులైనా సరే నాటకంలో చిన్న పాత్రల్ని కూడా ధరించడానికి సిద్ధం కావాలన్నది ఇతడి సిద్ధాంతం. 1975లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘ప్రతాపరుద్రీయం’ నాటకం ప్రదర్శించాడు. 1981లో విజయవాడలో జరిగిన సభలో ‘మయసభ’లో తన దుర్యోధన పాత్రకు సత్కారం అందుకున్నాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో దుర్యోధనుడిగా నటించి ప్రవాసాంధ్రుల మన్ననలు పొందాడు.

రాజకీయ రంగం మార్చు

ఇతడు రాజకీయాల పట్ల ఆకర్షితుడై భారతీయ జనసంఘ్ పార్టీలో పనిచేశాడు. జనసంఘ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1971లో గుంటూరు లోక్‌సభకు జనసంఘ్ తరఫున ఎన్నికలలో నిలబడి కొత్త రఘురామయ్య చేతిలో పరాజయం పొంది రెండవస్థానంలో నిలిచాడు.1975లో ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్షను అనుభవించాడు.

ఒక పర్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కీ పట్టభద్రుల స్థానం నుంచీ ఎన్నిక అయ్యారు.

మూలాలు మార్చు

  1. "కళా, రాజకీయ రంగాల్లో ఉన్నతుడైన న్యాయవాది జూపూడి యజ్ఞనారాయణ - చీకోలు సుందరయ్య". Archived from the original on 2016-04-04. Retrieved 2016-04-09.