టంగుటూరి ఆదిశేషయ్య

టంగుటూరి ఆదిశేషయ్య అంతగా ప్రాచుర్యం పొందని భక్తకవి.

టంగుటూరి ఆదిశేషయ్య
జననం1880
మరణం1957
వృత్తిఉపాధ్యాయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భక్తకవి
జీవిత భాగస్వామిమహాలక్ష్మమ్మ

విశేషాలు మార్చు

వీరు 1880వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా, వల్లూరు గ్రామంలో జన్మించారు. వీరు ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులుకు దాయాది. వీరు తన 16వ యేటనే ఉపాధ్యాయవృత్తిని చేపట్టి తన స్వగ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను స్థాపించి ఎందరినో ప్రముఖులుగా తీర్చిదిద్దినారు. స్వాంతంత్ర్య సమరయోధుడు పెద్దిభొట్ల రామచంద్రరావు, ప్రముఖ హిందీ కవి వారణాశి రామమూర్తి, ప్రముఖ పత్రికా రచయిత టంగుటూరి సూర్యనారాయణ మొదలైనవారు వీరి శిష్యులు. వీరు పాఠశాలతోపాటు తన గ్రామంలో బ్రాంచి పోస్టాఫీసు, సహకార సంఘం స్థాపించి, నిర్వహించి ప్రజాసేవ చేశారు.వీరు పేదవిద్యార్థులకు ఎందరికో అన్నవస్త్రాలు అందజేసి, విద్యాదానం చేశారు.

రచనలు మార్చు

వీరు తన విద్యార్థుల కొరకు ఎన్నో నాటికలు రచించి వాటిని తన విద్యార్థులచే ప్రదర్శింపజేశారు. హరికథలను, నాటకాలను, వేదాంత గ్రంథాలను రచించాడు. వీరు వ్రాసిన అనేక గ్రంథాలు అముద్రితాలు, అలభ్యాలు.

వీరి రచనలలో కొన్ని:

  1. అంబరీష (నాటిక)
  2. యాగ రక్షణ (నాటిక)
  3. ఏకలవ్య (నాటిక)
  4. సీతాకల్యాణం (నాటకం)
  5. ధృవవిజయం (నాటకం)
  6. తులసీదాస చరిత్రము (హరికథ)
  7. చంద్రహాస (హరికథ)
  8. శ్రీరామ జననం (హరికథ)
  9. సీతారామ కల్యాణం (హరికథ)
  10. జానకీ రఘునాయక వర్ణనము (వచన గ్రంథం)
  11. ముకుందమాల (స్తోత్రము)
  12. శ్రీరామ కృపా పయోనిధీ! (స్తోత్రము)
  13. ప్రశ్నోత్తర రత్నావళి (వేదాంతం) మొదలైనవి

మరణం మార్చు

వీరు తన స్వగ్రామంలో తన 77వయేట 1957 ఫిబ్రవరిలో మరణించారు[1].

మూలాలు మార్చు

  1. రావినూతల, శ్రీరాములు (24 December 1978). "ప్రాచుర్యం లభించని భక్తకవి కీ.శే.శ్రీ టంగుటూరి ఆదిశేషయ్య". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 259. Retrieved 16 January 2018.[permanent dead link]