తమ్ముడు (సినిమా)

1999 సినిమా

తమ్ముడు 1999 లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బి. శివరామకృష్ణ శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించాడు. రమణ గోగుల ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు.[1]ఈ సినిమా 15 జులై 1999న విడుదలైంది.[2]

తమ్ముడు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం అరుణ్ ప్రసాద్
నిర్మాణం బి.శివరామకృష్ణ
రచన చింతపల్లి రమణ
కథ అరుణ్ ప్రసాద్
చిత్రానువాదం అరుణ్ ప్రసాద్
తారాగణం పవన్ కళ్యాణ్
ప్రీతి జింగానియా
అచ్యుత్
అదితి గోవిత్రికర్
భూపిందర్ సింగ్
చంద్రమోహన్
బ్రహ్మానందం
సంగీతం రమణ గోగుల
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రమణ గోగుల
సునీత
ఛాయాగ్రహణం మధు అంబటి
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ సినిమా అమీర్ ఖాన్ నటించిన జో జీతా వహీ సికందర్ మూలంగా చిత్రీకరించబడింది.[3] హిందీ మూలంలో సైక్లింగ్ ని కథాంశంగా ఎన్నుకోగా, తెలుగులో కిక్ బాక్సింగ్ ను ఎన్నుకున్నారు. అయితే అసలు మూలమైన ఆంగ్ల చిత్రం కిక్ బాక్సర్లో కిక్ బాక్సింగే కథాంశం.

కథ మార్చు

 
"మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్" పాటలో పవన్

సుబ్రహ్మణ్యంని అందరూ సుబ్బు అని పిలుస్తూ ఉంటారు. తాను మాత్రం అందరూ సుభాష్ అని పిలవాలి అనుకుంటూ ఉంటాడు. పొరుగింట్లో ఉంటున్న జానకి (ప్రీతి జింగానియా) సుబ్బుని మౌనంగా ప్రేమిస్తూ ఉంటుంది. సుబ్బు అన్న చక్రి (అచ్యుత్)తన తండ్రి నడిపే క్యాంటీన్ లో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఒక కిక్ బాక్సింగ్ పోటీలో ప్రభుత్వ కళాశాల తరపున పోటీ చేసి మాడల్ కాలేజి అభ్యర్థి రోహిత్ చేతిలో ఓడిపోతాడు చక్రి. మాడల్ కాలేజి నుండి ఎదురయ్యే అవమానాలతో వారికి ఎప్పటికయినా బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు సుబ్బు.

ఓ ధనిక కుటుంబానికి చెందిన వారసుడుగా చెలామణి అయ్యి మాడల్ కాలేజిలో చదివే లవ్లీకి (అదితి గోవిత్రికర్) దగ్గరవుతాడు సుబ్బు. ప్రేమికుల రోజున ఒక వజ్రపుటుంగరాన్ని లవ్లీకి బహుకరించటానికి జానకి దగ్గర డబ్బు అప్పు తీసుకుంటాడు సుబ్బు. ఆ డబ్బుని తిరిగివ్వాలని జానకి తండ్రి (చంద్రమోహన్) సుబ్బుని అడగటంతో, సుబ్బుని తన తండ్రి ఇంట్లో నుండి వెళ్ళగొడతాడు. తమ్ముడిని పరామర్శించి వస్తున్న చక్రిని గాయపరుస్తారు రోహిత్ బృందం. డాక్టర్లు చక్రిని కిక్ బాక్సింగ్ పోటీలకు అనర్హుడిగా నిర్ణయించటంతో తన తండ్రి ఎంతో బాధ పడతాడు.

చక్రి పరిస్థితికి బాధ్యుల గురించి తెలుసుకున్న సుబ్బు రోహిత్ ని కిక్ బాక్సింగ్ పోటీల్లో ఓడించి అందరి హృదయాలని గెలచుకోవటంతో కథ ముగుస్తుంది.

విశేషాలు మార్చు

 
జానకితో సుబ్బు
  • లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాట పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించబడింది. ఇది పూర్తి నిడివి వ్యాయామ గీతం కూడా అవటం గమనార్హం. ఛాతీ పై బరువైన రాతి పలకను సమ్మెటతో పగులగొట్టించుకోవటం, నీటితో నింపిన కుండలని కాలితో బ్రద్దల కొట్టటం, కొబ్బరి కాయని చేతులతో పగులగొట్టటం, చేతి వ్రేళ్ళ పై కారు నడిపించుకోవటం వంటి స్టంట్ లను పవన్ ఇందులో వాస్తవంగా చేసి చూపించారు.
  • నవ్వో నవ్వో వంటి జానపద గీతాలు ఇందులో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. ఇదే గీతం గుడుంబా శంకర్ చిత్రంలో ఐటం సాంగ్ గా కూడా చిత్రీకరించబడింది.

పాటల జాబితా మార్చు

  • మేడిన్ ఆంధ్రా స్టూడెంట్స్ , రచన:చంద్రబోస్ , గానం.రమణ గోగుల
  • పెదవి దాటని , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.రమణ గోగుల
  • ఏదోలా ఉంది, రచన: సురేంద్ర కృష్ణ , గానం.రమణ గోగుల
  • వయ్యారి భామ నీ హంస నడక , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.రమణ గోగుల
  • ట్రావెలింగ్ సోల్డర్ , రచన: రమణ గోగుల , గానం.రమణ గోగుల
  • కళ కళలు కిల కిలలు , రచన : చంద్రబోస్ గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు మార్చు

  1. "Idle Brain". www.idlebrain.com. Retrieved 2020-09-26.
  2. Namasthe Telangana (15 July 2021). "పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ తమ్ముడు సినిమాకు 22 ఏళ్లు". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
  3. "తమ్ముడు చిత్ర సమీక్ష". fullhyderabad.com. Archived from the original on 2019-03-29.