తొలిపొద్దు (సినిమా)

తొలి పొద్దు మాదాల రంగారావు నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. ఈ సినిమా ద్వారా రేణుక అనే నటి, ప్రజా గని అనే గాయకుడు తొలిసారిగా పరిచయమయ్యారు. గ్రామీణ రైతాంగ సమస్యలను ఇతివృత్తంగా కల ఈ సినిమా 1991, మే 1వ తేదీన విడుదలయ్యింది.[1] విప్లవ రచయిత జి.కళ్యాణరావు రచించిన తొలిపొద్దు అనే నాటిక ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

తొలిపొద్దు
(1991 తెలుగు సినిమా)

తొలిపొద్దు సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం మాదాల రంగారావు,
రేణుక(నటి),
రమాప్రభ
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • స్క్రీన్ ప్లే : పి.చంద్రశేఖరరెడ్డి
  • నిర్మాత: పి.కోటయ్య రామరాజు
  • కథ: జి కళ్యాణ రావు
  • మాటలు: జి.కళ్యాణరావు
  • పాటలు: జి.కళ్యాణరావు
  • సంగీతం: వి.శివారెడ్డి
  • ఛాయాగ్రహణం: ఎన్.ఎస్.రాజు
  • నృత్యం: సతీష్
  • కూర్పు:అంకిరెడ్డి

కథ మార్చు

శ్రీరంగపురం అనే గ్రామంలో భుజంగం అనే ధనికస్వామి ఉంటాడు. ఒకప్పుడు భూస్వామిగా ఉండి పేదల రక్తాన్ని జలగలా పీల్చి ఇప్పుడు మంత్రి అయిన రాయుడికి ఈ భుజంగం కుడిభుజం. మంత్రి అండ చూసుకుని విర్రవీగుతూ తన గ్రామస్థులను ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఇతని చర్యలకు సుధాకర్, రైతు రాముడు అడ్డు పడుతుంటాడు. ఒక రోజు గ్రామంలోని గాంధీ విగ్రహం ముందు భుజంగం తొత్తులైన పోలీసులు గ్రామంలోని ఒక యువతిని బలాత్కారం చేయబోతుంటే 'ఎర్రసేన' ప్రత్యక్షమౌతుంది. దళనాయకుడు జనార్ధన్ పోలీసులను తరిమి కొడతాడు. జనార్ధన్ గతంలో ఒక గిరిజన పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవాడు. రాయుడు, షావుకారు సింహాద్రి చేసే ఆగడాలకు, వారి చేతులలో బలయిన గిరిజనుడు కుమరన్నను చూసి జనార్ధన్ ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి తుపాకీ పట్టుకుంటాడు. రైతుకూలీ సంఘాన్ని స్థాపిస్తాడు. తను చనిపోగానే బొట్టు, గాజులు తీయడం కాదనీ, ఎత్తిన ఎర్రజెండాను దించకుండా చూడమని భర్త చెప్పడంతో కుమరన్న భార్య చిన్నమ్మ ఉదర పోషణకు టీ కొట్టు పెట్టుకుని జనార్ధన్ దళానికి సాయం చేస్తూ ఉంటుంది. జనార్ధన్ భార్య శాంతి ఆ గ్రామంలోనే టీచర్‌గా పనిచేస్తూ రాత్రి సమయాల్లో వయోజన పాఠశాల నడుపుతుంటుంది. ఆమెకు సుధాకర్ తోడ్పడుతుంటాడు. ఇది ఇలా ఉంటే జనార్ధన్ దళం దాడిని ఎదుర్కోవడానికి గ్రామంలో పోలీస్ స్టేషన్ అవసరమని భుజంగం చెప్పడంతో మంత్రి రాయుడు శ్రీరంగపురంలో పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తాడు. ఆ స్టేషన్ ఎస్.ఐ. భార్య అరుణ. లెక్చరర్‌గా పనిచేసే ఈమె అభ్యుదయ భావాలు కలది. ఒక దశలో తన అభిప్రాయాలతో ఏకీభవించని భర్తకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. చిన్నమ్మను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అరుణను కిడ్నాప్ చేస్తుంది జనార్ధన్ దళం. రెండు రోజులు నక్సలైట్ల మధ్య గడిపిన అరుణ పెద్ద చదువులు చదివినవారు సైతం దోపిడీ వ్యవస్థ పట్ల విసిగిపోయి తీవ్రవాదులుగా ఎలా మారిపోతారో జనార్ధన్ వల్ల తెలుసుకుని ఎర్రసైనకు సానుభూతిపరురాలు అవుతుంది. ఇలా జనార్ధన్ దళం, పోలీసులకు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండగానే ఎన్నికలు వస్తాయి. నక్సలైట్ల పిలుపుతో ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తారు. దానితో భుజంగం మనుషులు పోలింగ్ బూతులను స్వాధీనం చేసుకుని అన్ని ఓట్లు తమకే వేసుకుంటారు. ఫలితంగా రాయుడు ముఖ్యమంతి అవుతాడు. చివరకు ఎర్రసేన వీళ్ళందరినీ హతమార్చి తరతరాల చీకట్లను తొలగించి తొలిపొద్దును పొడిపించడంతో కథ ముగుస్తుంది.[2]

పాటలు మార్చు

  • పొద్దు పొడుస్తోంది తొలి పొద్దు పొడుస్తోంది
  • నేస్తమా లాల్ సలామ్‌

మూలాలు మార్చు

  1. "TholiPoddhu (1991)". Indiancine.ma. Retrieved 2021-01-28.
  2. వినాయకరావు. "సినిమా రివ్యూ - ఫరవాలేదనిపించిన తొలిపొద్దు". జ్యోతిచిత్ర. Retrieved 27 January 2022.