దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేక ఉద్యమ సారథి. ఈమె మధ్య తరగతికి చెందిన కుటుంబంలో పుట్టింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని దూబగుంట అనే ఓ కుగ్రామం ఈమె స్వగ్రామం. ఈమె అసలు పేరు వర్ధినేని రోశమ్మ. తన స్వగ్రామం దూబగుంట నుండి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం వెల్లువలా విస్తరించడంతో ఈమె పేరు దూబగుంట రోశమ్మగా స్థిరపడింది[1]. ఈమెకు ఇద్దరు కొడుకులు. భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులను కష్టపడి పెంచి పెద్ద చేసింది. వారు ప్రయోజకులు కావాలని ఎన్నో కలలు కన్నది. కాని కొడుకులిద్దరు సారాకు బానిసలవ్వడంతో ఈమె కలలన్నీ కల్లలయ్యాయి. పైగా సారాకు అలవాటు పడ్డ కుటుంబసభ్యుల నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాలు, తను ఎదుర్కొన్న గృహ హింసలు మరే మహిళకు రాకూడదనుకున్నది. అక్షర దీపం కార్యక్రమంలో తాను చదివిన సీతమ్మ కథ ద్వారా స్ఫూర్తి పొంది సారా వ్యతిరేక ఉద్యమానికి నడుం బిగించింది.[2]

దూబగుంట రోశమ్మ
జననంవర్థినేని రోశమ్మ / దూబగుంట రోశమ్మ
మరణం2016, ఆగస్టు 7
ప్రసిద్ధిసారా వ్యతిరేక ఉద్యమ సారథి

ఉద్యమం మార్చు

గ్రామంలో తనకు తోడు వచ్చిన పది మంది మహిళతో ఉద్యమాన్ని ప్రారంభించిన రోశమ్మ. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరింపజేసింది. రాష్ట్రం మొత్తాన్ని కదిలించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సారా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది. రోశమ్మ ఉద్యమానికి స్వాతంత్ర్య సమరయోధులతో పాటు నెల్లూరు జిల్లాలోని ప్రముఖులు, మహిళల మద్దతు లభించడంతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సారా నిర్మూలనకు ఉద్యమించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చి సారా ఉద్యమం కాస్తా సంపూర్ణ మద్యపాన వ్యతిరేకోద్యమంగా మారింది.[3]

ఎన్టీఆర్ చొరవ మార్చు

రోశమ్మ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన సంపూర్ణ మద్యపాన వ్యతిరేక మహోద్యమం నాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్‌ హృదయాన్ని కదిలించింది. ఎన్టీరామారావు తిరిగి అధికారంలో రాగానే మద్యపాన నిషేధం ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. తన ఉద్యమం సఫలం కావడంతో రాష్ర్ట మహిళలకు రోశమ్మ ఆదర్శ మహిళగా మారింది. గ్రామాల నుంచి రాజధాని వరకు ప్రముఖులు రోశమ్మను సన్మానాలతో ముంచెత్తారు. అవార్డులు, బహుమానాలతో సత్కరించారు. రోశమ్మ మహిళా శక్తి అంటూ ప్రశంసలు కురిపించారు.

మరణం మార్చు

ఈమె తన 93వ యేట అనారోగ్యంతో బాధపడుతూ 2016, ఆగస్టు 7వ తేదీన తన నివాసంలో మృతి చెందింది[1]. [4].

మూలాలు మార్చు

  1. 1.0 1.1 విలేఖరి, నెల్లూరు. "సారా వ్యతిరేక ఉద్యమకారిణి రోశమ్మ కన్నుమూత". సాక్షి. Archived from the original on 7 ఆగస్టు 2016. Retrieved 7 August 2016.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. భూమిక పత్రికలో వచ్చిన వ్యాసం
  3. వన్ ఇండియా పత్రికలో దూబగుంట రోశమ్మ పింఛనును రద్దు చేసిన వార్త
  4. ఆంధ్రప్ర‌భ నెల్లూరు: సారా భూతం కోరలు పీకిన రోశమ్మ ఇకలేరు [permanent dead link]