పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు

పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు ప్రముఖ రచయిత. ఇతడు డిసెంబర్ 31, 1918వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో జన్మించాడు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్, హైదరాబాద్ నిజాం కాలేజ్, ఆంద్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. తెలుగు భాషా సాహిత్యములందు ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు. ఎం ఏ పట్టా పొందారు. హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో ద్విభాషి గా, గుంటూరు, హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా 1943 నుంచి పనిచేశాడు. నవ్యసాహిత్య పరిషత్తు, ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు.[1]

పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు
పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు
జననంపిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు
1918డిసెంబర్ 31
బ్రాహ్మణ కోడూరు
వృత్తిఅధ్యాపకుడు
ప్రసిద్ధికవి, పండితుడు
పదవి పేరుఆంధ్రా ఆర్నాల్డ్, సాహిత్యాచార్య
మతంహిందూ
భార్య / భర్తసుశీల
తండ్రిపిల్లలమఱ్ఱి వేంకట సుబ్రహ్మణ్యం
తల్లిపుణ్యవతి
సంతకం

కవిగా, కథకునిగా, నాటికాకారుడుగా, విమర్శకుడిగా, సహృదయుడుగా, పాత్రికేయుడిగా, చారిత్రకుడుగా, వక్తగా, దేశికుడుగా, దర్శకుడుగా, నటుడుగా, సంపాదకుడుగా, బహు గ్రంథకర్తగా, ఆధ్యాపకుడుగా, బహుముఖ ప్రతిభా ప్రశస్తిని పొందారు.

సికింద్రాబాద్ లో 'సాధన సమితి'ని వ్యవస్థాపకత్వము చేసి, వాల్తేరు శాఖని నిర్వహించారు. గుంటూరు సరస సారస్వత సమితి, కవితావనము, ఆంద్ర సాహిత్య మండలి, జ్యోత్స్నా సమితుల సంపాదకత్వము; సాహితీ సమితి, హైదరాబాద్ ఆంద్ర సాహిత్య పరిషత్తు, నవ్య సాహిత్య పరిషత్తు, అఖిల భారత ఓరియంటల్ సమావేశనంలో ప్రధాన పాత్ర వహించారు.

జ్యోత్స్నా సమితి సభాపతిగా, శారదా పీఠం కులపతిగా తమ సేవలని అందించారు.

ఇతని భార్య పిల్లలమఱ్ఱి సుశీల కూడా మంచి రచయిత్రి. ఈమె రచనలు పూజాపుష్పాలు అనే పేరుతో సంకలనం చేయబడింది.

రచనలు మార్చు

ఇతని రచనలు భారతి, గృహలక్ష్మి, వినోదిని, చిత్రగుప్త, విద్యార్థి, దీపిక, దివ్యవాణి, ఆంధ్రభూమి, అంజలి, వాణి, కృష్ణాపత్రిక, తెలుగుతల్లి ఇత్యాది పత్రికలలో ప్రచురితమైనాయి. పూజా పుష్పాలు (శ్రీమతి రచనలు), అంబరీష (శ్రావ్య నాటిక), Students' Companion (లక్షణ గ్రంథం) వీరి విశిష్ట రచనలతోపాటు, వెలువరించిన గ్రంథాలు కొన్ని:

  1. శ్రీ పిల్లలమఱ్ఱి కృతులు
  2. సాహిత్య సంపద
  3. మాధురీ మహిమ (వ్యాసములు)
  4. సాహిత్య స్రవంతి
  5. సాహిత్య సమీక్ష (ఉపన్యాసములు)
  6. సాహిత్య సమాలోచనము
  7. శారదా విలాసము (ప్రసంగ వ్యాసములు)
  8. సత్యసుధ
  9. కాలము కొట్టిన గంటలు
  10. సుశీలాస్మృతి (కావ్యము)
  11. మధుకణములు
  12. రాగరేఖలు
  13. చిత్ర
  14. వెలుగు నీడలు
  15. పంచవటి పర్యాలోకనము
  16. వ్యాకరణ దీపిక
  17. వత్సల
  18. నవ్యాంధ్ర సాహిత్య వీధులు
  19. ధూపదీపాలు
  20. ఇష్టాగోష్టి
  21. దీపకళిక
  22. మాకు పనిముట్ల నివ్వండి

రచనల నుండి ఉదాహరణ మార్చు

ఇతని కవితలనుండి ఒకటి మచ్చుకు:

తెల్లని పంచా
సన్నని లాల్చీ
కంటికి 'స్పెక్ట్సూ'
కాళ్ళకు 'ఫ్లెక్సూ'
చేతిలొ 'ఫైలూ'
అమరక పోతే
నవకవి కాడూ!

నోట్లో ఖిల్లీ
చంకలో 'షెల్లీ'
'స్విస్సూ వాచీ'
'సిగరెట్ కేసూ'
అలరక పోతే
నవకవి కాడూ!

'వైతాళికులూ'
'ఎంకి పాటలూ'
'సౌందరనందం'
'రమ్యాలోకం'
చదవక పోతే
నవకవి కాడూ!

'కిన్నెర సాన్నీ'
'హృదయేశ్వరినీ'
'దీపావళినీ'
'కృషీవలుణ్ణీ'
ఎరుగక పోతే
నవకవి కాడూ!

కోకిల గూర్చీ
చంద్రుని గూర్చీ
ప్రేయసి గూర్చీ
ప్రేమను గూర్చీ
వ్రాయక పోతే
నవకవి కాడూ!

చిత్రలేఖనం
గాత్రమార్దవం
నాట్యభంగిమం
శిల్పకౌశలం
భావపేశలం
తెలియక పోతే
నవకవి కాడూ!

("మధుకణములు" ఖండకావ్య సంపుటి నుండి)

బిరుదులు మార్చు

ఇతనికి ఈ క్రింది బిరుదులు లభించాయి.[2]

  1. అక్షరానంద
  2. ఆంధ్రా ఆర్నాల్డు
  3. ఉభయకవిమిత్ర
  4. విద్వన్మణి
  5. విమర్శకచక్రవర్తి
  6. శారదాతనయ
  7. సాహిత్యాచార్య

మూలాలు మార్చు

  1. దరువూరి, వీరయ్య (1964). గుంటూరు మండల సర్వస్వం (ప్రథమ ed.). గుంటూరు: యువకర్షక ప్రచురణలు. pp. 484–485.[permanent dead link]
  2. కోడీహళ్లి, మురళీమోహన్ (2017). ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు (ప్రథమ ed.). హైదరాబాదు: కె.మురళీమోహన్. p. 123.